పెళ్లివారమండీ.... మగపెళ్లివారమండీ

  • 1610 Views
  • 0Likes
  • Like
  • Article Share

    భాను.వి

  • హైదరాబాదు
భాను.వి

‘‘ఆకు కదిలినా పాటే, గాలి వీచినా పాటే’’ అంటారు సంగీతవేత్తలు. గీతం, సంగీతం కలిస్తే శ్రవణానందమే. మానవ జీవితమే చైతన్యగీతం. మన నిత్య జీవితంలో కష్టసుఖాలను కలబోసుకుంటూ అనుక్షణం మనతో ఉంటూ సాంత్వనపరిచేది పాటే. అలాంటి పాట ఒకనాడు తెలుగునాట ఇంటింటా మారుమోగేది. జీవితంలోని ప్రతి సందర్భంలోనూ నేనున్నానంటూ పలకరించేది!
తెలుగు లోగిళ్లలో
బిడ్డ పుడితే ఎన్నో జోలపాటలు, లాలి పాటలు. ఇళ్లలో చెంగున గెంతే ఆడపిల్లలు ఉంటే గొబ్బి, అట్లతద్ది, బొమ్మల కొలువు పాటలు. ఇలా ఆయా సందర్భాల్లో తెలుగువారి నోట పాటలు మార్మోగుతుండేవి. 
      పిల్లలకి స్నానం చేయించి అలంకరించాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది. అప్పుడు అమ్మలు ‘చెలువైన, జవకట్లు చంద్రహారాలు/ మురిడీలు, గొలుసులు, ముద్దుటుంగ్రాలు/ పచ్చల పోగులు హెచ్చు తాళీలు/ బొమ్మంచు పంచెలు బొంచైన పాగ/జలతారు వోణీలు జాలు రుమాళ్లు/ అంగీలు నడికట్లు అమరగానగలు/ తొడిగితిమి, ముస్తాబు తోడ గిలకలను’ పాట పాడుతూ అలంకరిస్తారు. ఆ పాటలోని మాధుర్యానికి పరవశించిపోతూ చక్కగా లాల పోయించుకుంటారు బుజ్జాయిలు. పిల్లల్ని నిద్రపుచ్చేందుకు, వాళ్లని మోకాలి మీద ఊగిస్తూ ‘ఊగాడమ్మా ఊగాడూ’, ‘లాలనుచు పాడరమ్మా! ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా’, ‘జో అచ్యుతానంద! జోజో ముకుందా లాలి పరమానంద! రామగోవిందా!’ వంటి జోలపాటల్ని పాడతారు. 
      అలాగే సంక్రాంతి వేళ భోగిపళ్లు పోసేటప్పుడు ‘శశిముఖులారా! రండి/ పసిపాపలకు భోగిపండ్లను పోద్దాం’ అంటూ అందరినీ ఆహ్వానిస్తారు. ఈ పండగ రోజుల్లోనే ‘గొబ్బియళ్లో సఖియా వినవే!/ గొబ్బియళ్లో! గొబ్బియళ్లో/ రాజావారి తోటలో జామపండు కాసిందంట/అవునటే అక్కలారా! చంద్రగిరి భామలారా!/ గొబ్బియళ్లో! గొబ్బియళ్లో/ గొబ్బి సుబ్బమ్మా సుబ్బణ్ణియ్యవే/ చేమంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే!/ తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యవే!/ మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే!’ అని పాడుతూ సందె గొబ్బెలను తడుతూ ఆడపిల్లలు ఆడుకోవటం సరదా!
వియ్యాలవారి విందు
ఒకప్పుడు పెళ్లిచూపులకు వచ్చిన మగపెళ్లివారు అమ్మాయిని పాట పాడమనేవారు. అమ్మాయి గొంతు వినడం ఇందులోని అంతరార్థం. పెళ్లి నిశ్చయమైందంటే ఇరువైపులా సందడే సందడి. పెళ్లిళ్లల్లో ఒకరినొకరు పరాచికాలు ఆడుకుంటూ వంటలు, వడ్డనల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటూ నవ్వుల పువ్వులు పూయించేవారు. ఇప్పుడైతే పెళ్లికి ముందు ‘సంగీత్‌’ మారుమోగుతోంది. ఇక వధూవరులకు మంగళహారతి ఇచ్చేటప్పుడు ఆనాడు ముత్తయిదువలు చక్కటి పాటలు పాడేవారు. ఇప్పుడు ఆ పాటలు వచ్చిన వాళ్లకోసం పందిట్లో వెతుక్కోవాల్సిన పరిస్థితి! ఇక పెళ్లి జరిగేటప్పుడు వినపడే పాటలకైతే లెక్కేలేదు. ‘పెళ్లివారమండి, మగ పెళ్లివారమండి’ అంటూ పెళ్లికొడుకు బంధువులు అంటుంటే ‘పెళ్లివారమండి, ఆడపెళ్లివారమండీ... అడిగినవన్నీ ఇవ్వాలి, వారి అడుగులకు మడుగులు వత్తాలి’ అంటూ పెళ్లికూతురి బంధువులు అందుకునేవారు. ‘విందు చేసినారు వియ్యాలవారు, విందు చేసినారు... పప్పులో పప్పు తక్కువాయె.. కూరలో ముక్కలే తక్కువాయె... గడ్డ పెరుగు చూస్తే చితక్కొట్టినా చితకటం లేదాయె... విందూ చేసినారు, వియ్యాలవారు’ అని సరదాగా పాడుతూ ఒకరిమీద ఒకరు చమత్కార బాణాలు విసురుకునేవారు. రెండు కుటుంబాల మధ్య అనుబంధాలను పెంచడానికి ఇవి సాయపడేవి. 
దీనికంటే ముందు పెళ్లిచూపులప్పుడు ఇలా పాడుకునేవారట... ‘ఆంధ్రుల జానపద విజ్ఞానం’ ఉదహరించిన పాట...
...పిలిపించు నీ సీత పిలుపు చూతాము
పిలుపేమి సూసేవు చిలుక పలుకుల్లూ
పిలిపించు నీ సీత నడక చూతాము
నడకేమి సూసేవు అంస నడకల్లూ
మీ సిరిబాల సీత ఉందని
మా అయోధ్య రామునికి అడగనొస్తిని
మా సీత సిన్నాది మేమియ్యలేదు
సీతకన్న సిన్నోడె అయోధ్య రాముడు.... 

      జానపదుల దృష్టిలో అమ్మాయిలంతా సీతమ్మకు ప్రతిరూపాలు. అబ్బాయిలంతా రామయ్యకు మారురూపాలు. ఆ దంపతులంత అన్యోన్యంగా వీళ్లూ ఉండాలన్నది అంతరార్థం. ఇలా ఎన్నో పాటలు... పెళ్లి తంతు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేదాకా! అమ్మాయిని అత్తగారింటికి పంపే ముందు అప్పగింతల పాటలు పాడి మరీ సాగనంపేవారు.
మము కరుణించమ్మా!
వేదాంతులకు ఆధ్యాత్మిక కీర్తనలు, భక్తికి భజనగీతాలు, స్త్రీలకు పూజ పాటలు, యువతకు ఉత్సాహం పుట్టించే సరదా పాటల వరకు అంతా గానమయమే. మన జీవన స్రవంతిలో పాటలు అంతర్భాగమైపోయాయి. మంత్రాలు, పూజావిధానం తెలియకపోయినా పాటలు పాడుకుంటూ ఆధ్యాత్మిక చింతన అవలంబించేవారూ ఉన్నారు. పూజ పాట, గంధం పాట, హారతి పాట, నైవేద్యం పెట్టేటప్పుడు వండిన పదార్థాల రుచి తెలియచేస్తూ ఆరగింపు పాటపాడి మంగళహారతులతో పూజ ముగిస్తారు. ఇంకా ‘‘షోడశ కళానిధికి షోడశోపచారములు సమర్పయామి’’ అని అనుకుంటూ వింజామరసేవ, పవళింపుసేవ, ఉయ్యాలసేవతో పూజ చేస్తారు.
పూజచేతము రారే మహాలక్ష్మీ దేవికి
బంగారుపూలతో పూజలు చేతము రారే
మహాలక్ష్మీదేవికి..
. అంటూ పూజ మొదలుపెట్టేవారు.
గంధము పూయరుగా, పన్నీటి గంధము పూయరుగా
తిలకము దిద్దరుగా, కస్తూరి తిలకము దిద్దరుగా
తిలకము దిద్దిన దేవికి పన్నీరు చిలకరుగా
హారతులీయరుగా కర్పూర హారతులీయరుగా
అని పాడుతూ ఆ తల్లికి షోడశోపచార పూజ చేసేవాళ్లు. 
పానకం, వడపప్పు, తీయనైన అరటిపళ్లు బెల్లం, కొబ్బరితో ప్రేమతో నైవేద్యము పెట్టెదమమ్మా
మంగళం జయమంగళం హాలక్ష్మీదేవి కర్పూరహారతి గైకొనమ్మా 

      అని పాడుతూ అవన్నీ అమ్మకు సమర్పించేవారు. ‘ఆకు, వక్క, పచ్చకర్పూరంతో నీకు/ తాంబూలం ఇత్తుమమ్మా/ బంగారు తూగుటుయ్యాలలో/ వింజామరలు వీవనతో నిదురించి/ మము కరుణించవమ్మా/ రేపు నీకు మేల్కొలుపులతో నీ సేవలు/ చేతుమమ్మా మహాలక్ష్మీ తల్లీ! సెలవా మాకు’ అని ముగించేవారు.
పనీపాటల్లో...
మనవాళ్ల పాటలు శుభకార్యాలకు మాత్రమే పరిమితం కాలేదు. శ్రామికులు రోజంతా పనిచేసుకుంటూ అలసట తెలియకుండా ఉండటానికీ పాటలు పాడుకునేవారు. ఇవి పొలం పనుల్లో ఎక్కువగా వినిపించేవి. ఒకరు ‘ఏరువాకమ్మకూ ఏమికావాలి/ ఎర్ర ఎర్రన పూలమాల కావాలి...’ అని పాట అందుకోగానే మిగిలినవారంతా వంతపాడేవారు. ‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే/ అలుపూ సొలుపూ లేదులే’ అనుకుంటూ ‘పొద్దెల్లి పోతాదిరా, చురుకుగా పనిచేయరా/ పదం పాడితే పరవొశం వొత్తదిరా’ అంటూ చకచకా పని ముగించుకుని ఇళ్లకు చేరేవారు. 
      పడవ నడుపుతున్నప్పుడు ‘హైలెస్సో యవ్వారి యవ్వా/ లాగరోరీ లంగరు తాడు/ పీకరోరి పిళ్లారి జుత్తు/ అన్నలారా, తమ్మూలారా/ లాగరోరీ లంగరు తాడు....’ అని పాడుకుంటూ జాలరి ప్రయాణికులను భద్రంగా ఒడ్డుకు చేరుస్తాడు.
      అలానే స్త్రీలు బియ్యం దంచేటప్పుడు.. ‘దంపు దంపనియేరు అది యెంత దంపు / ధాన్యరాశుల మీద చెయ్యేసినట్లు/ వంట వంటనియేరు అది యెంత వంట/ వదినె తో మరదళ్లు వాదాడినట్లు’ అంటూ పాడు కునేవారు. ‘అత్తలేని కోడలుత్తమురాలు ఓలమ్మా.. కోడల్లేనియత్త గుణవంతురాలు’ లాంటి సరదాగీతాలూ వినిపించేవారు. 
      నాగలిని పూజిస్తూ ‘మంగళమమ్మా! మా పూజలు గైకొమ్మా!/ మంగళమమ్మా! నాగలి నీకు/కష్టమనక భూమిదున్ని కరవు మాపి కడుపు నింపి/ సకల జీవరాసినీ, చాలున పోషింతువమ్మా’ రైతులను కరుణించి కాపాడాలని కోరుకుంటారు. విత్తనాలేసినప్పటి నుంచి పంట నూర్పిళ్ల దాకా అందమైన జానపద గీతాల సాగు అలవోకగా సాగిపోయేది. జానపదులు తమదైన బాణీలో వరుసలు కట్టుకొని చెవికింపుగా ఉండేలా పాడేవారు. పదుగురికీ ఆనందాన్ని పంచేవాళ్లు. 
      ఇలా తెలుగువాళ్లు తరతమ భేదం లేకుండా పాటలతో అవినాభావ సంబంధాన్ని పెంచుకున్నారు. ఒకప్పుడు ప్రతి మనిషి జీవనగమనంలో జానపదంతో ఆనందం, మానసిక ప్రశాంతత పొందేవాడు. అలాంటి జానపదాలు నేడు కరవయ్యాయి. వాటితో పాటే అమ్మభాష మీద ప్రేమ కూడా కనుమరుగవుతోంది. చిన్నారులకు భాష మీద శ్రద్ధాసక్తులు పెరగాలంటే తెలుగిళ్లలో పాటకు మళ్లీ పట్టంకట్టాలి. మనవైన పాటలను మనం ప్రేమించినప్పుడే ఇది సాధ్యం.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం