అనువాదంలో అందెవేసిన చెయ్యి

  • 321 Views
  • 0Likes
  • Like
  • Article Share

వాడ్రేవు పాండురంగారావు (1936- 2018).. నవలాకారుడు, కథా రచయిత, అనువాదకులు. ఆంగ్లంలో ఎక్కువ రచనలు చేసిన ఈయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం. ఆంగ్లంలో పట్టుసాధించి టెలిగ్రాఫిస్టుగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత రంగారావు తను అభిమానించే ఆర్‌.కె.నారాయణ్‌ సాహిత్యం మీద పరిశోధన చేసి డాక్టరేటు పొందారు. 1964లో దిల్లీలో వేంకటేశ్వర కళాశాలలో ఆంగ్ల ఆచార్యులుగా చేరారు. 
       రంగారావుకు ఎంతో పేరు తెచ్చిన నవల ‘ఫౌల్‌ ఫిల్చర్‌’. ఇందులో తెలుగు పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించారు. 1989లో ఆయన రాసిన కథలు ‘ది ఇండియన్‌ ఇడిల్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌’ పేరిట అచ్చయ్యాయి. 1994లో ‘డ్రంక్‌తంత్ర’ నవల తీసుకొచ్చారు. ఇందులో విద్యావ్యవస్థలోని విపరీత ధోరణుల గురించి వ్యంగ్యంగా రాశారు. కృష్ణా గోదావరి నదీ ప్రాంతాల్లోని చారిత్రక పరిణామాలను వివరిస్తూ ‘ది రివర్‌ ఈజ్‌ త్రీ క్వార్టర్స్‌ ఫుల్‌’ పేరిట నవలలు మూడు భాగాలు రాశారు. 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ కోసం ‘భారత సాహితీ నిర్మాతలు’ పుస్తకాల కోసం.. ఆర్‌.కె.నారాయణ్‌ మోనోగ్రాఫ్‌ రాశారు. రంగారావు పరిశోధన గ్రంథం గత ఏడాది ‘ఆర్‌.కె.నారాయణ్‌ - ది నావెలిస్ట్‌ అండ్‌ హిజ్‌ ఆర్ట్‌’ పేరిట ప్రచురితమైంది..
       రంగారావు ‘క్లాసిక్‌ తెలుగు షార్ట్‌ స్టోరీస్‌’ పేరిట ఓ కథా సంకలనం తీసుకొచ్చారు. ఇందులో చాసో, శ్రీపాద, చలం, చింతా దీక్షితులు, వేలూరి, విశ్వనాథ, బుచ్చిబాబు, కొడవటిగంటి తదితరులు రాసిన కథలను ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ఈయన సంపాదకత్వంలో వచ్చిన మరో సంకలనం ‘దట్‌ మాన్‌ ఆన్‌ రోడ్‌’. బోయ జంగయ్య, ఇనాక్‌, కారా, మధురాంతకం, మునిపల్లె రాజు, శ్రీపతి తదితరుల కథల అనువాదాలు ఇందులో ఉన్నాయి. నిరంతరం సాహితీ కృషి చేసిన రంగారావు పదవీవిరమణ తర్వాత పుట్టపర్తిలో స్థిరపడ్డారు. అక్కడే 2018 మార్చి 12న తుదిశ్వాస విడిచారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం