మర్చిపోలేని ఆచార్యుడు

  • 161 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మాధురి

నన్నయాదులకు నమస్కరించకుండా ఒక్కరోజు కూడా ఉండనని, సాహిత్యం తనకు దైవమని ఎప్పుడూ చెబుతుండేవారు ఆచార్య దేవళ్ల చిన్నికృష్ణయ్య. విశిష్ట సాహిత్య పరిశోధనకు, అద్భుత బోధనారీతికి ఆయన పెట్టిందిపేరు. తెలుగు, సంస్కృత, తమిళ, ఆంగ్ల భాషల్లో ప్రవీణులు. చెన్నై నగరంతో ఆయనది 65 సంవత్సరాల అనుబంధం. 1953లో ప్రెసిడెన్సీ కళాశాలలో బీఏ ఆనర్స్‌లో చేరారు. 1956లో డిగ్రీ పూర్తికాగానే అక్కడే సహాయ ఆచార్యులుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. పదవీ విరమణ వరకు అక్కడే కొనసాగారు. తెనాలి రామకృష్ణుడి పాండురంగ మాహాత్మ్యంపై ఎం.లిట్‌ చేశారు. రామకృష్ణుడి ఉద్భటారాధ్య చరిత్ర, పాండురంగ మాహాత్మ్యం, ఘటికాచల మాహాత్మ్యం గ్రంథాల సారాన్ని ఆంగ్లంలో రాశారు. హరిభట్టు వరాహపురాణం తాళపత్ర ప్రబంధ గ్రంథాన్ని పరిష్కరించి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 1988 నుంచి తెలుగు శాఖాధిపతిగా సేవలందించారు. పరవస్తు చిన్నయసూరి, కందుకూరి, కొక్కొండ, వావిలికొలను తదితరులు అలంకరించిన ఆ పదవిని ఎంతో గౌరవనీయమైందిగా, ఆ కళాశాలను పవిత్ర దేవాలయంగా చిన్నికృష్ణయ్య భావించేవారు. 1994లో పదవీ విరమణ తర్వాత కూడా ఎంతో మంది విద్యార్థులకు సహాయసహకారాలు అందించారు. మధుర వక్తగా పేరుపొందిన ఆయన, సాహితీ అంశాల మీద అనేక ప్రసంగాలిచ్చారు. వందకుపైగా రేడియో ప్రసంగాలు, పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో అనేక పత్ర సమర్పణలు కూడా చేశారు. స్వయంగా అనేక సదస్సులకు సారథ్యం వహించారు. తాను రచించిన వ్యాసాలు, పీఠికలను 2015 జులై 4న ‘సాహితీ సుషమ’ పేరుతో సంకలనంగా ప్రచురించారు. ఆ గ్రంథాన్ని సాహితీప్రియులకు ఉచితంగా అందించారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ఆయన ఈ మార్చి 5న అనారోగ్యంతో కన్నుమూశారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం