గౌతమీ గాథలు... సాహితీ సుమగంధాలు

  • 1143 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సిద్ధార్థ

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి అనగానే ‘గౌతమీ గాథలు’ గుర్తొస్తాయి. ఒకానొక సాహితీజగత్తు కళ్లముందు కదలాడుతుంది. గోదావరి తీరంమీది సాహితీ సుమాలన్నీ పరిమళిస్తాయి. ఇంద్రగంటే అన్నట్టు ‘‘గౌతమీ గాథలు... రచయిత ఉద్రేకాలు. ఉద్యమ గాథలు. ఒక తరం రచయితల చైతన్య యాత్రకు చెరిగిపోని గుర్తులు’’ అందుకే ఈ పుస్తకంలోని ఒక్కొక్క గాథా ఒక్కొక్క గాఢమైన అనుభూతిని కలిగిస్తుంది. 
గోదావరి
తీర కవులూ, వారివారి కావ్యాలూ, ఆలోచనలూ, వెనకటి జీవితాలు, వారి అలవాట్లు, వారి అనుభూతులు ఎలాంటివీ? ఎలాంటి ప్రభావాలకి లోనయ్యారూ..? ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించారు? ఏ ఆనందాలకోసం ఆరాటపడ్డారు? ఇవన్నీ తానెరిగిన రీతిలో, తనకు తట్టిన విధానంలో ‘గౌతమీ గాథలు’లో ఆవిష్కరించారు ఇంద్రగంటి. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు, పిలకా గణపతిశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడివి బాపిరాజు.. ఇలా ఆనాటి కవుల ఛలోక్తులూ, సరదా సన్నివేశాలూ, వారి సాన్నిహిత్యాలూ చాలా సరదాగా సాగిపోతాయి ఈ గాథల్లో. ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ... ‘‘నాకు ఆత్మకథలు రాసుకోదగినంత అవసరము గానీ ఆధిక్యము గానీ లేవని నాకు తెలుసు. కానీ నా రచనలలో నాకొక లక్ష్యం ఉంది. సుమారు యాభై ఏళ్ల కిందట నా ఉదీయమానవేళల్లో ఈ దేశపు అంతరంగాలు, ఆవేశాలు, ఆకాంక్షలు, ఎట్లా ఉండేవి...? ఎట్లా నడిచాయి..? వాటి వెనకాల రకరకాల ఉద్యమ ప్రభావాలు ఎట్లా పనిచేశాయి? ఈనాడు కథావశిష్టులైన పెద్దలు ఎలా ఆలోచించారు...? అనే బొమ్మ ఈతరం వారికి చూపడమే నా ముఖ్యోద్దేశం’’ అన్నారు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. ఈ పొత్తంలోని మొత్తం 39 గాథలు ఆ కాలపు కవిత్వాన్నే కాదు, ఆనాటి కవుల వెనక ఉండే ఆహ్లాదకరమైన, ఆశయపరమైన వ్యక్తిత్వాలని పాఠకుల కళ్ల ముందు నిలుపుతాయి. 
      తన బాల్యంలో కొంత భాగాన్ని విద్యాభ్యాసం నిమిత్తం కోనసీమలోనూ, యవ్వనాన్ని ఉద్యోగం నిమిత్తం రాజమహేంద్రవరం, రామచంద్రాపురాల్లోనూ గడిపారు శాస్త్రి. అప్పటి తన అనుభవాలని ‘గౌతమీ గాథల’ పేరిట అక్షరబద్ధం చేశారు. సుతిమెత్తని హాస్యం, లలిత శృంగారం మేళవించిన ఈ గాథల్లో చదివించే గుణం పుష్కలంగా ఉంటుంది. అలాగని ఇవి కథలు కావు. వాస్తవాల బరువుతో సాగిన ఒకప్పటి జీవనదులు. కొన్ని గాథలు మాత్రం కథలాగా సాగుతూ కొసమెరుపుతో ముగుస్తాయి. శాస్త్రి వచనశైలి సరళంగా, అనుభూతి ప్రధానంగా సాగడంతో ఏ కథా విసుగు కలిగించదు. ఆనాటి కాలాన్ని చాలా దగ్గరగా చూసి రాసిన గాథలేమో...! అంత త్వరగా మరపున పడవు.
ఆ కాలంలోకి ప్రయాణం
‘వేయిపడగలు’ చదువుతున్నంత సేపూ పాఠకులు తమను తాము ధర్మారావుగా ఊహించుకోవడం సహజం. అలాగే, ‘గౌతమీ గాథలు’ చదువుతున్నప్పుడు శాస్త్రి చిటికెనవేలు పట్టుకుని ఆ కాలంనాటి మమతల్లోకి, మంచితనాల్లోకి, కోనసీమ అగ్రహారపు మండువా లోగిళ్లలోకి, రాజమహేంద్రవరం పురవీధుల్లోకి, దాక్షారామ క్షేత్రవైభవంలోకి, టీబోటు షికారులోకి, విశ్వేశ్వరునిరేవు సాయంకాలపు నీడల్లోకి వెళ్లిపోతారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గురించి చెబుతూ ‘‘తగిన సమయం చూసి వెడితే ప్రాణం పెట్టేవారు. పనిలో ఉంటే ఇంగితం కనిపెట్టి వెళ్లకపోవడమే మంచిది. లేకపోతే ఆయన ముఖం ముడుచుకున్న మందారపువ్వులాగా ఉండేది’’ అంటారు ఇంద్రగంటి. ఇలా తన సన్నిహిత సాహితీమూర్తుల రూపాలను చిక్కటి మాటలతో బొమ్మకడతారాయన. మరో గాథలో కనిపించే- ‘‘ఇది సాహిత్యసభ అనుకున్నాను. పొరపాటు, సంగీతసభ అని ఇప్పుడే తెలిసింది. దాని ముందు మా ప్రసంగాలు మంగళవాయిద్యాలు అనుకోలేదు. క్షమించండి..’’ అనేసి వేదిక మీదినుంచి దిగిపోయిన కాటూరి వారి భంగపాటు ఈనాటి సాహిత్యసభల తీరుని గుర్తుకుతెస్తుంది. 
      దాదాపు నాలుగు దశాబ్దాల నాటి విషయం, శాస్త్రి భద్రాచలం నుంచి పాల్వంచ మీదుగా ప్రయాణం చేస్తున్నారు. శుష్కించిన కిన్నెరసానిని చూశారు. అప్రయత్నంగానే విశ్వనాథ కిన్నెరసాని పాటల ఉరవళ్లను జ్ఞప్తికి తెచ్చుకుని పాడుకుంటుంటే పాఠకులకీ కళ్లు తడిబారతాయి. ‘‘ఓహో కిన్నెరసాని ఓహో కిన్నెరసాని/ తెలుగు సత్కవిరాజు పలుకందుకోలేని/ చవులూరి చవులూరి సాగిందని/ తెలుగుదైవమ్ము భద్రాద్రిపై నెలకొన్న/ రామయ్య అతని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెర’’- విశ్వనాథ పాటల్లోని ఆ హొయలూ, వయ్యారాలూ ఇప్పటి కిన్నెరసానికి లేకపోయేనెందుకో..! అని ఇంద్రగంటి దిగులుపడిపోతారు. ‘‘ఇక్కడ కాలు పెట్టగ అదేమి మాహాత్మ్యమొగాని... ఊహకున్‌ రెక్కలు వచ్చినట్టు చననేరని పూర్వయుగాల వ్రాలుదున్‌’’ అంటూ దక్షారామక్షేత్రం మీద తనకి కలిగిన అనుభూతిని ఇంకో గాథలో నివేదిస్తారు. ‘ఏరుపొంగింది’ గాథలో గిడుగు రామ్ముర్తి పంతులు సప్తతి వేడుకలో ఆయనచేసిన ప్రసంగాన్ని హృద్యంగా వినిపిస్తారు. ‘‘ఈనాడు ఇవతల ఒడ్డున... నన్నయ్య భారతం రాసినచోట నేను భరించలేనంత సన్మానం చేస్తున్నారు. ఎవరిదీ సన్మానం...! తెలుగువాళ్ల జీవద్భాషది. నావెంట ఇంతమంది యువరచయితలున్నారంటే నా మనసు పొంగిపోతున్నది....’’ ఇలా పిడుగుల ఉధృతిలా సాగే గిడుగు ప్రసంగం చెవిలో గింగురుమంటుంది.
ఈ గాథల ప్రత్యేకత అదే
‘విశ్వేశ్వరుడి రేవు, లంకలో లేడిపిల్ల, జీవితసత్యాలు’ లాంటి కథలు లలితమైన భావావేశాన్ని కలిగిస్తాయి. వెన్నెల రాత్రులలో విహారాలు, టీబోటులో సాహిత్య చర్చలు, అవధానం చేయడంలో పండితులు పడే అవస్థలు.. ఇలా ఒకటేంటీ సామాన్య విషయాలని కూడా కవిత్వీకరించి అసామాన్యంగా రచన చేశారు ఇంద్రగంటి. ‘‘దేశంలో ఎన్ని నదులులేవు...? ఏమిటీ హృదయబంధం...!/ గోదావరి ఇసుక తిన్నెలు ...పాపికొండలు... భద్రాద్రి సీతారాములు/ గట్టెక్కిన తర్వాత... కడచిన స్నేహవియోగాల సలపరింపులు/ సభలూ సాహిత్యాలు వియ్యాల్లో కయ్యాలూ/ కయ్యాల్లో వియ్యాలు/ రక్తంలో ప్రతీ అణువూ ఒక కథగా తయారౌతుంది’’ అంటూ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ఓ కథలో ప్రస్తావించినట్టుగా.. ఇంగువ కట్టిన గుడ్డలా ఆనాటి సాహితీమూర్తుల ఆహ్లాదకర సాహిత్య పోహళింపు చదువరులను ఉత్తేజపరుస్తుంది.
      గోదావరి పేరుతో చాలా కథలు వెలువడ్డాయి. గోదావరి కథలు, గోదావరిగాథలు, మా దిగువ గోదావరి కథలు.. అవన్నీ గోదావరి ప్రజల అమాయకత్వాన్నీ, వారి జీవన విధానాన్ని చిత్రించడమే లక్ష్యంగా వచ్చినవి. అయితే నన్నయాదుల నుంచి నేటి కాలం వరకు వెలువడిన కవితా మాధుర్యాన్నీ, సమకాలీన కవుల జీవనరేఖలనూ, వారితో తనకు గల అనుబంధాలని మాత్రమే వ్యక్తం చేసేవి ఈ గౌతమీ గాథలు. ఇవి మొదట్లో ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి. 1981 ఏప్రిల్‌లో తొలిసారి పుస్తకరూపం దాల్చాయి. ఈ పొత్తాన్ని చదవడం పూర్తయ్యేసరికి.. పటికబెల్లాన్ని చప్పరిస్తున్నట్టు- తీయటి అనుభూతిని గొంతులోకి జార్చే ఈ కథలు సారవంతమైనవనీ, ఇలాంటి కథా సంవిధానం అనితరసాధ్యమనే ఆలోచనా తడుతుంది. ఇంద్రగంటి ఇతర రచనల మీదకు మనసు వెళ్లిపోతుంది. ‘హనుమచ్ఛాస్త్రి కథలు’, ‘మౌన సుందరి- ఇతర కథలు’ పేరిట ఆయనవి ఇతర కథా రచనలు వెలువడినా అవి పాఠకుల స్మృతిపథంలో ఎక్కువకాలం నిలువలేకపోయాయి. ‘ఆరుయుగాల ఆంధ్రకవిత’ అనే విమర్శనా గ్రంథంలో మాత్రం ఇంద్రగంటి వచనశైలి ముచ్చటగొల్పుతుంది.
      ఇంద్రగంటి సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేసినా సనాతన సంప్రదాయాన్ని నెత్తినెక్కించుకోలేదు. నవ్యసాహిత్యానికి ద్వారాలు తెరిచారు. పాతలోనూ కొత్తదనాన్ని అన్వేషించారు. బ్రహ్మసమాజం ద్వారా ఉత్తేజితులయ్యారు. విభిన్నమైన రచనాశైలిని, సమ్మోహనపరిచే శిల్ప చాతుర్యాన్ని అలవర్చుకున్నారు.  సరళ వచన రచనతో పాఠకులకు దగ్గరయ్యారు. ఆయన గౌతమీ గాథలన్నీ సుతిమెత్తని భావప్రకంపనలే. కాకపోతే గతకాలపు స్మృతుల గాఢత పట్టి కుదుపుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం