భవితకు ‘భాషా’ బాట

  • 1642 Views
  • 5Likes
  • Like
  • Article Share

    సేగు వేంకటేశ్వర్లు‌

  • విశ్రాంత గ్రంథాలయాధికారి
  • కర్నూలు
  • 9849488851
సేగు వేంకటేశ్వర్లు‌

నవంబరు 2018ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10,351 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తలపోస్తోంది. వాటిలో 2061 పాఠశాల సహాయకులు, 251 భాషా పండితుల పోస్టులున్నాయి. ఈ పోస్టుల  తెలుగు పరీక్షల్లో భాషా సాహిత్యాలకు సంబంధించి అభ్యర్థులు అధ్యయనం చేయాల్సిన కీలక అంశాలేంటో చూద్దాం.
భాషా పండితుల తెలుగు పరీక్షకి ఎనిమిదో తరగతి వరకు గల పాఠ్యాంశాలను అధ్యయనం చేయాలి. వాటితోపాటు పదజాలం, ఇతర భాషాంశాలు, తెలుగు భాష, సాహిత్య చరిత్రలు, సాహిత్య విమర్శ, బాలవ్యాకరణాలనూ ఆపోశన పట్టాలి. పాఠశాల సహాయకుల పరీక్షకి అదనంగా ఇంటర్మీడియట్‌ వరకు తెలుగు వాచకాల్లోని పాఠ్యాంశాలను క్షుణ్ణంగా చదవాలి. ప్రశ్నలసరళి తరగతి గదికి, నిత్యజీవితానికి అన్వయించేలా ఉంటుంది. పదజాలం, భాషాంశాలకు ప్రాధాన్యమిస్తూ.. నిత్యజీవిత ప్రయోగాలకు అనుగుణంగా వ్యాకరణాంశాల మీద ప్రశ్నలు ఇస్తారు. కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాకుండా అవగాహన, నైపుణ్యం, వినియోగాన్ని పరీక్షించే ప్రశ్నలూ ఎదురుపడతాయి.
      తెలుగు సాహిత్య చరిత్రలో అధ్యయనం చేయాల్సిన అంశాల్లో ఆధునిక కవిత్వ ధోరణులు, ఉద్యమాలు అత్యంత కీలకమైనవి. అందులోనూ ప్రముఖుల వ్యాఖ్యలు (కొటేషన్స్‌) ఎక్కువగా తారసపడే అవకాశం ఉంది. కాబట్టి కవిత్వానికి భాష్యం చెప్పిన కొంతమంది ఆధునిక కవులను చూద్దాం.
      ‘కప్పి చెప్పేది కవిత్వం’ అన్నారు సినారె. ‘కవిత్వమొక తీరని దాహం’ అని చెప్పారు శ్రీశ్రీ. ‘కవిత్వం ఒక ఆల్కెమీ’ అన్నది తిలక్‌ మాట. ఇక చలం మాటల్లో చెప్పాలంటే.. ‘తనకీ ప్రపంచానికి సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్‌ బహిర్‌ యుద్ధారవమే కవిత్వం’! ‘అందమైన పోయెమ్‌ అంటే దానికొక గుండె కావాలి’ అన్నారు గుంటూరు శేషేంద్రశర్మ. ‘‘రోజూ కనబడే నక్షత్రాల్లోనే, రోజూ కనపడని కొత్తదనం చూచి రోజూ పొందని ఆనందానుభూతి పొందడం అంటేనే కవిత్వం’’ అని నిర్వచించారు దాశరథి. ఆధునిక కవిత్వానికి సంబంధించి ముఖ్యమైన ఉట్టంకింపులివి...
* ‘‘ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే ఆధునిక జీవితమే అర్థం కాలేదన్నమాట - శ్రీశ్రీ
* ‘‘దేశక్షేమానికి భాషా క్షేమం పునాది’’ - వేదం వేంకటరాయశాస్త్రి
* ‘‘గుత్తునా ముత్యాల సరములు/ కూర్చుకొని తేటైన మాటల/ క్రొత్తపాతల మేలు కలయిక/ క్రొమ్మెరుంగులు చిమ్మగా’’- గురజాడ
* ‘‘ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో/ జనియించినాడ వీ స్వర్గఖండమున’’ - రాయప్రోలు
* ‘‘నా కావ్యకళ నవీనం నా ఇతివృత్తాలు భారతీయం’’ - గురజాడ
* ‘‘సైరికా! నీవు భారతక్ష్మాతలాత్మ/ గౌరవ పవిత్రమూర్తివి! శూరమణివి’’ - దువ్వూరి రామిరెడ్డి
* ‘‘యెల్ల లోకము వొక్కయిల్లై/ వర్ణభేదము లెల్ల కల్లై/ వేల నెరగని ప్రేమబంధము/ వేడుకల కురియ’’ - గురజాడ
* ‘‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’’ - గురజాడ
* ‘‘శ్రీ గాంధినామం - మరువాం మరువాం/ సిద్ధము జైలుకు వెరువాం వెరువాం’’ - దామరాజు పుండరీకాక్షుడు
* ‘‘మేలుకొనుమీ! భరత పుత్రుడ/ మేలుకొనుమీ! సచ్చరిత్రుడ/ మేలుకొనవయ్యా! వత్సా మేలుకో’’ - మంగిపూడి వెంకటశర్మ
* ‘‘చూపుతో మాటాడి ఊపిరితో తెనిగించిన మహాకవి’’ - నండూరి సుబ్బారావు
* ‘‘వేదాద్రి శిఖరాన వెలిగొన్న జ్యోతి/ మినుకుమని కాసేపు కునికిపోయింది/ కాపురమ్మొచ్చిన కన్నె పాపాయి/ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు’’ - బసవరాజు అప్పారావు
* ‘‘యెంకెవ్వరని లోకమెప్పుడైన కదిపితే/ యెలుగు నీడలవైపు యేలు సూచింతు’’ - నండూరి సుబ్బారావు
* మ్రెక్కిన కొలందిఁ గాలితో ద్రొక్కుచున్న/ యీ కఠిన లోకమ్మెల్ల బహిష్కృతమ్ము’’ - వేదుల సత్యనారాయణ శాస్త్రి
* ‘‘తెప్పవోలిక చంద్రబింబం తేలిపోతోంది నింగిని/ అందులో నా ప్రేయసి ఉంది కాబోలు’’ - మల్లవరపు విశ్వేశ్వరరావు
* ‘‘శ్రీ ఉషసి చరణ మంజీరాల విడివడిన చిన్ని బంగరు గంటలారా/ గలగలను చిట్టి బంగరు పిచుకలారా’’- పిలకా గణపతిశాస్త్రి
* ‘‘సృష్టిలో తియ్యనిది స్నేహమే’’ - ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
* ‘‘ఒక ముసలిదోనె యిది పడియున్నదిచట/ ఊడిగము సేత సత్తువలుడిగి యుడిగి/ తనకు దామృత స్మృతులు కల్పనముసేసి/ కొనుచు తన పయిదా జాలిగొనుచు నిట్లు’’ - కొంపెల్ల జనార్దనరావు
* ‘‘అందాలు తానే చూసింది, నీటిలో చందాలు తానె చెప్పింది నాతోటి/ వొడ్డున్న మందార వొంగి బొట్టెట్టుకుని అందాలు తానె చూసింది’’ - చావలి బంగారమ్మ
* ‘‘కన్నె కాటుక కళ్లు, చిన్నినాథుని చూచి/ కదలు వాడిన వేళ, కందళించిన వేళ/ ఆకాశమధ్యాన, అటునొక్క మబ్బు/ మెరపులా మెరిసిందిలే, వెలుగులో వొరిసిందిలే’’ - విశ్వనాథ
* ‘‘ఎడమచేత నీ కొంగును ఒడిచి పట్టుకొంటి చెలీ/ తడిచేతను కొంగులేక తడబడితిని ప్రియురాలా!/ ఓహో కిన్నెరసానీ’’ - విశ్వనాథ
*‘‘శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో’’ - కొడాలి సుబ్బారావు
* ‘‘కారుమొయిలు వచ్చి కాల్దువ్వి గర్జించి/ రైతు గుండెకాయ ఱాయి చేసె’’ - ఏటుకూరి వేంకట నరసయ్య
* ‘‘రాణి విడిచిపోయె రాజునొంటరి జేసి/ రాజు విడిచిపోయె రాజ్యరమను’’ - జాషువా
* ‘‘ఎవరి నించి దొంగిలించామో వాళ్లని క్షమించడం కష్టం’’ - చలం
* ‘‘మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం’’ - శ్రీశ్రీ
* ‘‘కైత చేత మేల్కొల్పకున్న/ కాళోజీ కాయము చాలింక’’ - కాళోజీ
* ‘‘నిర్దేశించిన భావాలను వాక్యాలు బట్వాడా చెయ్యవు’’ - ఆరుద్ర
* ‘‘దేశ పటాన్ని కొరికేసినై సామంతుల చిట్టెలుకలు’’ - కుందుర్తి
* ‘‘పగలేయి నిజాంకోట ఎగరేయి ఎర్రబావుటా’’ - రెంటాల గోపాలకృష్ణ
* ‘‘విశ్వమంతా ప్రాణవిభుని మందిరమే/ వీధి వాకిలి యేది చెల్లెలా’’ - కృష్ణశాస్త్రి
* ‘‘ఆకాశపు నీలి నికుంజం వెండిపూలు పూచింది’’ - గుంటూరు శేషేంద్రశర్మ
* ‘‘ఒక నాట్యకత్తె రొమ్ము కుదింపుగని బిగిం/ చిన వీణవోలె స్పందించిపోయితిగాని/ ఆమె గుత్తపు రవిక యందు అణగారి పడు/ మాతృభావన లేశమాత్ర మ్మెరుగనైతి’’ - సి.నారాయణరెడ్డి
* ‘‘తిక్క కొంత లేక తెలుగువాడెటులౌను’’ - నార్ల వెంకటేశ్వరరావు
* ‘‘గడ్డిపువ్వు సుఖము నీకు కలదా మానవుడా’’ అని ప్రశ్నించింది - బాలాంత్రపు రజనీకాంతరావు
* ‘‘నాదు జన్మభూమికంటే నాక మెక్కడుందీ’’ - ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
* ‘‘అచటనొకనాడు పండె ముత్యాల చాలు/ అటనొకప్పుడు నిండె కావ్యాల జాలు’’ - విద్వాన్‌ విశ్వం
* ‘‘జీవితం అసిధారా వ్రతం, నూలుపోగు మీద సాము/ మరణంపై తిరుగుబాటు’’ - గంగినేని వెంకటేశ్వరరావు
* ‘‘జీవితం మసిపూసిన వదనం/ జీవితం అఖండ భయసదనం/ జీవితం గాలి వీచని సాయంతనం’’ - కె.వి.రమణారెడ్డి
* ‘‘కత్తిరించిన ఒత్తులే వెలుగుతాయి దివ్యంగా/ బాధా దగ్ధకంఠాలే పలుకుతాయి శ్రావ్యంగా’’ - అలూరి బైరాగి
* ‘‘జీవితం కరిగిపోయే మంచు/ ఉన్నదాంట్లో నలుగురికీ పంచు’’ - గోపాల చక్రవర్తి
* ‘‘మనిషిని మించిన మహాశక్తి లేదని మనిషినే/ ఆరాధిస్తున్న మనిషిని నేను’’ - బాపురెడ్డి
* ‘‘కాలమొక తుది మొదలు లేని ఎడారి’’ - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు
* ‘‘జీవితం చివర తెలియని చీకటి వంతెన’’ - మాదిరాజు రంగారావు
* ‘‘నా తరానికి కావలసింది తెల్లని కిరణాలు ప్రసరించే ఎర్రని కాంతి’’ - నూతలపాటి గంగాధరం
* ‘‘నా పాట భవిష్యత్తుకు పిలుపు’’ - ఎల్లోరా
* ‘‘దేశమేదైతేనేం మట్టంతా ఒక్కటే/ అమ్మ యెవరైతేనేం చనుబాల తీపంతా ఒక్కటే’’ - చెరబండ రాజు
*  ‘‘కష్టజీవులం మేము కమ్యూనిస్టులం/ ఔనన్నా కాదన్నా అదే యిష్టులం’’ - సుబ్బారావు పాణిగ్రాహి
*  ‘‘కవీ! గాలిని గురించీ రాయి/ గాలిని మాత్రం నీ గీతాల్లో నింపకు’’ - నగ్నముని
*  ‘‘ఈ శరీరం మూగవోయిన శతతంత్రుల రసవీణ’’ - రేవతీదేవి
*  ‘‘రంగులు వెలసి రాగాలు వినిపించని వేళ’’ - శివలెంక రాజేశ్వరీదేవి

 


వెనక్కి ...

మీ అభిప్రాయం