గురుకుల పరీక్షకు సిద్ధమా

  • 1758 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డా।। నాగశేషు

  • నెల్లూరు
  • 9985509053

గురుకుల విద్యాలయాలకు సంబంధించి 2932 పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), ట్రైన్స్‌గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. పీజీటీ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. టీజీటీ పోస్టులకు రాతపరీక్షకి 80, టెట్‌ వెయిటేజీకి 20 మార్కులు కేటాయించారు. ఈ పరీక్షలకు సంబంధించి ‘తెలుగు’ పరంగా అభ్యర్థులు దృష్టిపెట్టాల్సిన అంశాలేంటో పరిశీలిద్దాం.
పీజీటీ, టీజీటీ పరీక్షలకు మూడు పేపర్లున్నాయి. పేపర్‌-2లో భాషాబోధన శాస్త్రం, తెలుగు బోధన పద్ధతులు, పేపర్‌-3లో తెలుగు భాషా సాహిత్యాలు ఉంటాయి. మూడో పేపర్‌కు సంబంధించి టీజీటీ, పీజీటీ సిలబస్‌ ఒకటే. కవులు- రచయితలు, వాళ్ల రచనలు, సాహిత్య ప్రక్రియలు, ఆధునిక సాహిత్య ధోరణులు, తెలుగు భాషా సాహిత్యాల మీద ఇతర భాషల ప్రభావం, భాషా రూపాలు, భాషా శాస్త్రం, వ్యాకరణం, జానపద సాహిత్యం మీద ప్రత్యేక దృష్టి సారించాలి.
      ‘జనపదం’ అంటే గ్రామం. జనపదంలో నివసించేవారు జానపదులు. వీళ్లకు సంబంధించింది జానపద సాహిత్యం. మానవుడు తరతరాలుగా సంపాదించిన, అనుభవించిన సాంప్రదాయిక నిధి జానపద విజ్ఞానం. జానపద విజ్ఞానానికి, జానపద సంస్కృతి, జానపద జీవనం పర్యాయ పదాలు. ‘జానపద విజ్ఞాన సంబంధి’ అంశాల అవలోకన ఇది...
* ‘‘జానపదుల్‌ పురీజనులు సంతసముంబ్రమదం...’’ అన్న పద్యకర్త ఎర్రన.
* జానపద వాఙ్మయాన్ని ప్రజావాఙ్మయమని పిలిచింది ఖండవల్లి లక్ష్మీరంజనం. దాన్నే ‘పదవాఙ్మయం’ అని పేర్కొన్నవారు అడిదం రామారావు, తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి. ‘అనాదృత వాఙ్మయం’గా చెప్పింది మల్లంపల్లి సోమశేఖరశర్మ. ‘దేశి సారస్వతం’గా పేర్కొంది శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
* ‘జానపద సాహిత్య స్వరూపం’ గ్రంథకర్త ఆర్‌.వి.యస్‌.సుందరం
* వాగ్రూప జానపద విజ్ఞానంలోని విభాగాలు ఆరు. అవి.. జానపదాఖ్యానం, ఆఖ్యాన జానపద కవిత్వం, జానపదేతిహాసం, సామెతలు, సామెతలను పోలిన వ్యక్తీకరణలు, పొడుపు కథలు, జానపదుల భాష.
* జానపద కళలు విభాగంలో చేరే అంశాలు.. జానపద నాటకం, జానపద సంగీతం, జానపద నృత్యం
* ‘ఆంధ్రపదములు- పాటలు’ కర్త టేకుమళ్ల అచ్యుతరావు 1924లో పదాలు, పాటల్ని నాలుగు తరగతులుగా విభజించారు. శ్రీహరి ఆదిశేషుము జానపద వాఙ్మయాన్ని 9 రీతులుగా గుర్తించారు. .
* ‘తెలుగు జానపద గేయ సాహిత్యం’ కర్త బిరుదురాజు రామరాజు. ఈయన గేయ సాహిత్యాన్ని 11 విధాలుగా విభజించారు.
* ‘జానపద సాహిత్యము - వీరగాథలు’ కర్త తంగిరాల వెంకట సుబ్బారావు. జానపద సాహిత్యాన్ని 5 రకాలుగా విభజించారీయన.
జానపద గేయాలకు కొంతమంది ఇచ్చిన నిర్వచనాలను చూద్దాం!
* ‘‘సంగీత సాహిత్యాలతో కూడిన నిరక్షరా స్యుని భావగీతమే జానపద గేయం’’ - క్రాప్టే
* ‘‘జనపదాల్లో గంధవహుని వలె విహరించి ఆ నోటి నుంచి ఈ నోటికి ఎగిరిపోయేది జానపద గేయం’’ - శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
* ‘‘గేయరూపంలో భావ ప్రధానంగా వెలువడే ఆశు రచన జానపద గేయం’’ - డా।। ఆర్వీయస్‌ సుందరం
* ‘‘సంచారగాయక భిక్షువులచే పాడబడు సరళ కథా గేయమే వీరగాథ’’ - తంగిరాల వెంకట సుబ్బారావు
      జానపద కథా మూలాన్ని అన్వేషించటానికి ప్రథమంగా ప్రయత్నించిన వారు గ్రిమ్‌ సోదరులు. వీళ్లు 1979లో kinder and hansmarchen - అనే గ్రంథాన్ని ప్రకటించారు. జానపద కథల మూలాన్ని కనుగొనటానికి ‘స్వప్నమూల సిద్ధాంతం’ ఉపయోగిస్తారు. ఈ సిద్ధాంత ప్రతిపాదకులు లుడ్విగ్‌ లైస్ట్నర్‌. ఇక ‘పుక్కిటి పురాణాన్నే దైవత కథ’గా పేర్కొన్నవారు.. దుర్గా భాగవత్‌. ఈవిడ ఐతిహాసిక కథను ‘దంతకథ’గా చెప్పారు.
* ఆర్వీయస్‌ సుందరం ‘జానపద సాహిత్య స్వరూపం’లో జానపద సాహిత్యాన్ని నాలుగు విధాలుగా విభజించారు. అవి... జానపద కవిత్వం, గద్యాఖ్యానాలు, సామెతలు, పొడుపు కథలు.
* జానపద కథలను కిన్నెర, దైనందిన, జంతువుల కథలని మూడు రకాలుగా వర్గీకరించింది? - మిల్లర్‌
* ‘ఫోక్‌లోర్‌ అండ్‌ ఫోక్‌ లైఫ్‌’ గ్రంథంలో కథలను సంకీర్ణ, సరళ కథలుగా విడదీసింది? - లిండాడే
* 1900 సం।।లో తెనాలి రామలింగని కథలను సేకరించింది? - పండిత నటేశశాస్త్రి
* ‘తెలుగు జానపద గేయకథలు’ కర్త నాయని కృష్ణకుమారి. ‘తెలుగు హరికథా సర్వస్వం’ కర్త తూమాటి దొణప్ప. ‘కాశీ రామేశ్వర మజిలీ కథలు’ కర్త మద్దూరి శ్రీరామమూర్తి. ‘ఫోక్‌టేల్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ రచయిత బిరుదురాజు రామరాజు. ‘తెలుగు ఫోక్‌ టేల్స్‌ రీటోల్డ్‌ ఇన్‌ ఇంగ్లిష్‌’ అన్న గ్రంథాన్ని ప్రచురించిన వారు.. కర్ణరాజు శేషగిరిరావు. ‘తెలుగు జాతీయముల కథలు’ ప్రచురణ కర్త ముసునూరి వెంకటశాస్త్రి. ‘ఆంధ్రదేశీయ కథావళి’ ప్రచురణకారుడు టేకుమళ్ల రాజగోపాల రావు. ‘తెలుగు జానపద కథలు’ సంకలనకర్త జి.యస్‌.మోహన్‌. ‘జానపద కథా స్రవంతి’ పేరుతో డా।। కె.సుమతి కథా సంకలనం తెచ్చారు.
సామెతల ఆమెతలు
సామెతకు ‘నానుడి, లోకోక్తి, శాస్త్రం, జనశ్రుతి’ అన్నవి పర్యాయ పదాలు. సామెతను హిందీలో ‘కహావత్‌’ అనీ, కన్నడ, తుళు భాషల్లో ‘గాదె’, తమిళంలో ‘పళమొళి’, మలయాళంలో ‘పళింబొల్‌’ అని వ్యవహరిస్తారు. సంగ్రహంగా ఒక అప్రియమైన సత్యాన్ని చెప్పే సారభూతమైన వాక్యం ‘సామెత’ అన్నది దుర్గా భగవత్‌ నిర్వచనం. ఆర్‌.ఎస్‌.బాగ్స్‌ సామెతలను ఆరు విధాలుగా విభజించారు.
‘‘కందువ మాటలు సామెత లందముగ గూర్చి చెప్పినది తెలుగునకు’’ అంది మొల్ల. అలాంటి తెలుగు సామెతల్లోని రకాలను చూద్దాం..
* ‘పులిని చూసి నక్క వాతపెట్టుకుందట’ - నీతి బోధక సామెత
* ‘ఆడలేక అంగణం వంకర అన్నట్లు’ - ఉపమాన రూపక సామెత
* ‘రాత్రంతా రామాయణం విని రామునికి సీత ఏమి కావాలని అడిగాడట’ - పౌరాణిక సామెత
* ‘ఆవు నలుపైతే పాలు నలుపా?’ - ప్రశ్నార్థరూపక సామెత
* ‘తాతా! పెండ్లాడతావా అంటే నాకెవరిస్తారురా అబ్బాయి! అన్నాడట’ - ప్రశ్నోత్తర సామెత
* ‘కతికిదే అతకదు’ - సాంఘికాచారాలు, విశ్వాసాలు, నమ్మకాలకు చెందిన సామెత
* ‘దేవుడు వరమిచ్చినా పూజారి వరమీయడు’ - హాస్య సామెత
* ‘రైతు దున్నితేనే రాజులకు అన్నం’ - వ్యవసాయ సంబంధ సామెత
* ‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’ - శబ్దాలంకార సామెత
* ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’  - వైద్య సామెత
* సుమారు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే లోకోక్తుల్ని సేకరించడానికి ఉపక్రమించిన వారిలో ప్రథముడు అరిస్టాటిల్‌.
* 1868లో తెలుగు సామెతలు కొన్నింటిని ‘ఆంధ్ర లోకోక్తి చంద్రిక’ పేరుతో ప్రకటించిన ఆంగ్లేయుడు కెప్టెన్‌ యం.డబ్ల్యూ.కార్‌.
* లక్షకు పైగా సామెతలను సేకరించిన వ్యక్తి చిలుకూరి నారాయణరావు.
* ‘రిడ్డిల్స్‌’ను ‘పొడుపు కథలు’ అంటారు. ‘మారు కథ, అడ్డుకథ, అడ్డుకత, అడ్డకత’ అనే పేర్లతోనూ వ్యవహరిస్తారు.‘పసిడి పలుకులు’ పేరుతో 2,077 జాతీయాలను నేదునూరి గంగాధరం సంకలనం చేశారు.
* ‘తెలుగు జాతీయము’లనే కోశాన్ని కూర్చింది నాళం కృష్ణారావు.
* ‘తెలుగులో తిట్టు కవిత్వం’ గ్రంథకర్త రావూరి దొరస్వామిశర్మ.
* ‘తెలుగులో కొత్తవెలుగులు’ కర్త తూమాటి దొణప్ప.
* తెలుగులో ప్రప్రథమంగా 1984లో ‘జానపదుల తిట్లు’ పేరుతో గ్రంథాన్ని వెలువరించింది జి.యస్‌.మోహన్‌.
* ‘స్త్రీల రామాయణపు పాటలు, స్త్రీల పౌరాణిక పాటలు’ సేకరించింది శ్రీపాద గోపాలకృష్ణమూర్తి. ‘కృష్ణశ్రీ’గా ఈయన ప్రఖ్యాతులు.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం