ఇంటికిని వింటికిని ప్రాణమేది

  • 1017 Views
  • 6Likes
  • Like
  • Article Share

    లక్కరాజు శ్రీనివాసరావు

  • అద్దంకి, ప్రకాశం
  • 9849166951
లక్కరాజు శ్రీనివాసరావు

సామాన్యుల సృజనాత్మక శక్తికి, నిశిత పరిశీలనా సామర్థ్యానికి నిలువెత్తు సాక్ష్యాలు పొడుపుకథలు. వస్తు స్వభావాన్ని ఆకళింపు చేసుకొని, దానికి అనుగుణమైన పోలికలు, వర్ణనలతో విసిరే పొడుపుకథలు ఎదుటివాళ్ల ఆలోచనా శక్తికి పరీక్ష పెడతాయి. అయితే.. చాటువుల రూపంలో కూడా పొడుపుకథలు కనిపిస్తాయి. సరళ పదాలు, లోతైన భావంతో అవి అలరిస్తాయి. అలాంటి కొన్నింటిని చూద్దాం.
కరయుగంబు గలదు చరణంబులా లేవు/ కడుపు, నడుము, వీపు, మెడయు గలవు/ శిరములేదు గాని నరులపట్టుక మ్రింగి/ సొగసు గూర్చు దీని సొగసు గనుడి..  రెండు చేతులున్నాయి గానీ కాళ్లు లేవట. కడుపు, నడుము, వీపు, మెడ ఉన్నాయి గానీ తల లేదు. అయినా మనుషులను పట్టుకొని మింగేస్తుంది. ఇంత ఘోరం చేసి కూడా మనుషులకు అందం ఇస్తుందట. ఇంతకీ అదేంటో తెలుసా..? ‘చొక్కా’. ఇలాంటిదే మరో చాటుపద్యం.. ముక్కున పైన నడుచును/ ప్రక్కన నోరుండు గాలి పారణ సేయున్‌/ గ్రక్కున వేసిన కూయును/ మక్కువతో దీనితెలియు మనుజులు గలరే? ముక్కుపైన నడుస్తుందట! పక్కన నోరుంటుందట. గాలిని తింటుందట. వెంటనే వదిలేస్తే కూస్తుందట! ‘బొంగరం’ ముక్కు(చీల)తో తిరుగుతుందని తెలిసిందే. దాని చుట్టూ ఉండే గాడులని నోటితో పోల్చారు. గిరగిర తిరిగే సమయంలో గాలి సుడులు తిరుగుతుంది కదా. దాన్నే గాలి పారణగా చెప్పారు. తాడు చుట్టి వేగంగా విసిరగానే బొంగరం ‘బమ్‌’ శబ్దం చేయడమూ సహజమే.   
      ప్రశ్నల రూపంలో సాగే పొడుపు కథల పద్యాలు ఎదుటివారి ప్రజ్ఞను, సమయస్ఫూర్తిని పరీక్షకు పెడతాయి. ఇంటికిని వింటికిని ప్రాణమేది చెపుమ?/ కంట మింటను మనమేమి కాంచగలము?/ నవ్వు పువ్వు దేనిని గూడి మవ్వమొందు/ ఒకటే రెండేసి ప్రశ్నలకుత్తరంబు.. ఇంటికి, వింటి (ధనస్సు)కి ప్రాణం ఏది? ‘నారి’; కంటిలో, ఆకాశంలో మనం దేన్ని చూస్తాం? ‘తార’; నవ్వుకు, పువ్వుకు అందమైంది ఏది? ‘వలపు’ (దీనికి ప్రేమ, వాసన అనే అర్థాలున్నాయి). రెండు పదాలకు ఒకే అర్థం ఉండేలా సాగడం దీని మరో ప్రత్యేకత. కొన్ని చాటు పద్యాలు సంకేతార్థంతో చాలా తమాషాగా ఉంటాయి. ఉదాహరణకు చవితిన్‌ షష్ఠజుడేగి పంచమపతి స్థానంబు లంఘించి, యే/ డవ వాడేలిన వీడు జేరి పదిలుండై యష్టమస్యంద నో/ ద్భవ వీక్షించి, తృతీయు చెంతకు చతుర్థ శ్రేణినంపించి యా/ ది విరోధిన్‌ బెదిరించి యప్పురి ద్వితీయున్నిల్పివ చ్చెన్వెసన్‌.. ఇందులో సంఖ్యావాచక పదాలకు అష్టదిక్పాలకులతో అర్థం చెప్పుకోవాలి. షష్ఠజుడు అంటే ఆరో దిక్పాలకుడైన వాయువు పుత్రుడు హనుమంతుడు, పంచమ పతిస్థానంబు అంటే.. అయిదో దిక్కుకు అధిపతి అయిన వరుణుడి స్థానం సముద్రాన్ని దాటి, ఏడో  దిక్పాలకుడైన కుబేరుడు పాలించిన లంకను చేరాడు. ఎనిమిదో దిక్పాలకుడైన శివుడికి రథంగా మారిన అవని పుత్రిక సీతాదేవిని చూశాడు. రాక్షస సమూహాన్ని మూడో దిక్పాలకుడైన యముడి దగ్గరకి పంపాడు. మొదటి దిక్పాలకుడైన ఇంద్రుడి శత్రువు రావణుణ్ని బెదిరించి, అతని పట్టణాన్ని రెండో దిక్పాలకుడైన అగ్నికి ఆహుతి చేసి తిరిగి వచ్చాడని భావం!! ఇలాంటి చాటువులు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయి. మరి వీటిని నేటితరానికి ఎందుకు పరిచయం చేయకూడదూ!? 


వెనక్కి ...

మీ అభిప్రాయం