సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు

  • 1585 Views
  • 9Likes
  • Like
  • Article Share

సమాజ రూపురేఖలు మార్చి దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించడానికి మార్గం సివిల్స్‌. ఈ పరీక్షకు విపరీతమైన పోటీ ఉంటుంది. ఈసారి కూడా పది లక్షల మంది రాస్తే 990 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఆంగ్లంలో గట్టి పట్టున్నవాళ్లే ఇందులో విజయం సాధిస్తారనే అపోహ ఒకటుంది. అయితే ప్రభుత్వ బడుల్లో, అమ్మభాషలో చదివిన కొందరు తెలుగు తేజాలు తాజా సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటారు. అమ్మభాషే పునాదిగా విజయతీరాలకు చేరిన వాళ్ల అనుభవాలు వారి మాటల్లోనే..
తెలుగులోనూ అధ్యయన సామగ్రి

తొలి ప్రయత్నంలోనే ఆరో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది.  మా సొంతూరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లి. రావినూతల ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించాను. ఆరు నుంచి ఆంగ్ల మాధ్యమానికి మారాను. రెండు మూడు నెలలు ఆంగ్లం అర్థం కాక బాగా ఇబ్బంది పడ్డాను. మా అమ్మానాన్నలు సందేహాలను నివృత్తి చేసేవారు. పదో తరగతిలో 553, ఇంటర్లో 92.2 శాతం మార్కులు సాధించా. అమ్మ సులోచన, నాన్న నాగేశ్వరరావు ఇద్దరూ ఉపాధ్యాయులే. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డారు. 
జంషెడ్‌పూర్‌ ఎన్‌ఐటీలో బీటెక్‌ చదివాను. 2012లో ప్రాంగణ నియామకాల్లో ‘సిగ్నోడ్‌ ఇండియా’ అనే ప్రైవేటు సంస్థ ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీర్‌గా ఎంపిక చేసింది. బెంగళూరులో ఉద్యోగం. ఆ సంస్థ తరఫున బ్రెజిల్‌, జపాన్‌ లాంటి దేశాలకు వెళ్లాను. 
జపాన్‌లో సంస్థల నిర్వహణ, పరిపాలన నన్ను ఆకర్షించాయి. అదే విధానాన్ని మన దేశంలో అమలు చేస్తే ఎలా ఉంటుంది? అందుకేం చేయాలి? లాంటి ఆలోచనలు నాలో మొదలయ్యాయి. వాటన్నింటికీ మార్గం... ఐఏఎస్‌ అని అర్థమైంది. నా ఆలోచనను అమ్మానాన్నలకు చెప్పాను. వాళ్లు సరేనన్నారు. 2016లో ఉద్యోగానికి రాజీనామా చేసి దిల్లీ వెళ్లి ఓ శిక్షణ సంస్థలో చేరాను. 
      అక్కడ శిక్షణ పొందుతున్నప్పుడే ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రకటన వెలువడింది. అందులో తొమ్మిదో ర్యాంకు సాధించాను. రిజిస్ట్రార్‌ ఉద్యోగం లభించింది. అయితే సివిల్స్‌ లక్ష్యంగా ఆ ఉద్యోగాన్నీ వదులుకున్నాను. సివిల్స్‌ కోసం రోజూ దాదాపు 14 గంటలు చదివేవాణ్ని. శారీరక, మానసిక ఉల్లాసం కోసం రోజూ టేబుల్‌ టెన్నిస్‌ ఆడేవాణ్ని. దిల్లీలో ఉన్నప్పుడు బయట తినేవాణ్ని. దాంతో ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. పరీక్ష సమయానికి టైఫాయిడ్‌, డెంగ్యూ బారినపడ్డాను. హాజరు కాలేనేమో అనుకున్నా. ధైర్యంగా పరీక్ష రాశాను. ఆంత్రోపాలజీ ఐచ్ఛికంగా ఎంచుకున్నాను. ఆరో ర్యాంకు వచ్చింది. 
ఏకాగ్రత అవసరం
సివిల్స్‌ ముఖాముఖికి ఆంగ్లం ఎంచుకున్నాను కానీ తెలుగులోనూ సమాధానాలివ్వొచ్చు. మనం తెలుగులో చెబితే అక్కడ అధికారులు ఆంగ్లంలో అనువాదం చేస్తారు. మనవాళ్లు ఎక్కువమంది తెలుగు ఐచ్ఛికంగా తీసుకోకపోవడానికి కారణం.. సరైన అధ్యయన సామగ్రి దొరక్కపోవడమే. కానీ రెండేళ్లుగా తెలుగులో అధ్యయన సామగ్రి బాగానే దొరుకుతోంది. హైదరాబాదులో కొన్ని శిక్షణ కేంద్రాలు తెలుగులోనే అధ్యయన సామగ్రి అందిస్తున్నాయి. 
సివిల్స్‌ కోసం ప్రణాళికాబద్ధంగా, ఏకాగ్రత, క్రమశిక్షణతో చదవాలి. సామాజికాంశాల మీద బాగా దృష్టి సారించాలి. ప్రస్తుతం విద్య, ఉద్యోగాల్లో పోటీతత్వం ఎక్కువగా ఉంది. అందుకు అనుగుణంగా విద్యా బోధన ఉండాలి. - కోయ శ్రీహర్ష, ఆరో ర్యాంకు
ప్రాథమిక విద్యంతా తెలుగులోనే

‘‘నువ్వు పెద్దయ్యాక గొప్పస్థాయికి ఎదగాలి. పదిమందికీ సేవ చేసే స్థితికి చేరుకోవాలి’’ అని అమ్మ చెప్పిన మాటలు నా హృదయంలో నాటుకుపోయాయి. అవే సివిల్స్‌ వైపు నడిపించాయి. మా స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల. అమ్మ రాణి గృహిణి. నాన్న శ్రీనివాసరావు గతంలో కిరాణా దుకాణం నడిపేవారు. ప్రస్తుతం బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. నా ప్రాథమిక విద్యంతా తెలుగు మాధ్యమంలోనే జరిగింది. బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. 2015లో సామ్‌సంగ్‌లో (దక్షిణ కొరియా) ఉద్యోగం వచ్చింది. ఏడాదికి కోటి రూపాయల జీతం. 
అమ్మ భాష వాళ్లకు ప్రధానం
దక్షిణ కొరియాలో వాళ్ల మాతృభాష కొరియన్‌ తప్ప ఇంకే భాష మాట్లాడరు. అమ్మ భాషంటే వాళ్లకి అంత అభిమానం. ఆఫీసులో ఇంగ్లీషులో మాట్లాడినా, నిత్య వ్యవహారాలకు కొరియన్‌ తెలిసుండటం తప్పనిసరి. అందుకే 3-4 నెలలు శిక్షణ తీసుకుని కొరియన్‌ నేర్చుకున్నా. దక్షిణ కొరియాలో చదువు, ఉద్యోగాల కోసం వచ్చిన తెలుగువాళ్లు చాలా మంది ఉన్నారు. మన దేశీయులందరికీ కలిపి ‘ఐఐటీ ఇండియన్స్‌’ అనే సమూహం ఏర్పాటు చేశారు. అలానే తెలుగు సమాఖ్య కూడా ఉంది. ఉగాది సంబరాలు లాంటివీ సందడిగా నిర్వహిస్తుంటారు.
దక్షిణ కొరియాలో ఏడాది పాటు పని చేసి సివిల్స్‌ లక్ష్యంగా ఉద్యోగాన్ని వదలి దిల్లీ చేరుకున్నాను. 
      ప్రాథమిక పరీక్ష కోసం రెండున్నర నెలలు శిక్షణ తీసుకున్నా. అందులో గట్టెక్కేశాను. మెయిన్‌కు ప్రత్యేక శిక్షణకు వెళ్లకుండా గదిలోని సీనియర్లు, స్నేహితుల సలహాలు తీసుకుని రోజూ పద్నాలుగు గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి గణితమంటే మక్కువ. కళాశాలలో కూడా గణితానికి సంబంధించిన కొన్ని కోర్సులు చేశాను. దాన్నే ఐచ్ఛికంగా తీసుకున్నాను. సివిల్స్‌ కోసం సిద్ధమయ్యేవాళ్లు సాధించేవరకూ గురిపెట్టి చదవాలి. ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. మననం చేసుకోవాలి.
మైదానం చదువుతున్నా..
పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవాళ్లు మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే రోజూ అరగంట వ్యాయామానికి కేటాయించాను. ఆహార నియమాలు పాటించాను. అవకాశం లేక అప్పుడు తెలుగు సాహిత్యం చదవలేకపోయాను. ప్రస్తుతం చలం ‘మైదానం’ చదువుతున్నా. ఈమధ్య తెలిసినవాళ్లొకరు ‘మహాభారతం’ బహుమానంగా ఇచ్చారు. చిన్నప్పుడు భారత కథలు చదివా. ఇప్పుడు మళ్లీ చదువుతాను. చిన్నప్పుడు తెలుగు పుస్తకాలు చాలా చదివేవాణ్ని. మా తెలుగు ఉపాధ్యాయురాలంటే చాలా ఇష్టం. విద్య, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండటం, అక్కడ తెలుగు మాట్లాడేవాళ్లు లేకపోవడం వల్ల ఇప్పుడు తెలుగు అనర్గళంగా మాట్లాడలేకపోతున్నా. ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది.  
       ఇప్పటి పిల్లలకు ఒత్తిడిలేని విద్య అవసరం. చిన్నప్పటి నుంచే ఐఐటీ లాంటి లక్ష్యాలు పెట్టి చదివిస్తున్నారు. అలా కాకుండా అన్ని అంశాల్లో అవగాహన ఉండేలా చూసుకోవాలి. చిన్నప్పుడు సామాజిక శాస్త్రం సరిగా చదివి ఉండకపోతే ఇప్పుడు నాకా అంశాలు అర్థమయ్యేవి కావు. ఈ స్థాయిలో ఉండేవాణ్నీ కాదు. ప్రతి ఒక్కరూ మంచి పౌరుడిగా ఉండాలంటే మన దేశ ఆర్థిక స్థితి, ప్రజలు, భాష వంటి వాటిమీద అవగాహన ఉండాలి.

 - యిమ్మడి పృథ్వీతేజ, 24వ ర్యాంకు


పది వరకు ప్రభుత్వ బళ్లోనే
సివిల్స్‌కు ఎంపికయ్యేవాళ్లలో ప్రభుత్వ పాఠశాలలో చదివినవాళ్లు, పేదరికం నుంచి వచ్చినవాళ్లూ ఉంటారు. ఒకట్రెండు సార్లు ప్రయత్నించినా రాకపోతే నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి. వైఫల్యాలను విశ్లేషించుకొని, ధైర్యంగా ముందడుగేయాలి. ఇంటర్వ్యూ దాకా వెళ్లి రెండు సార్లు తిరుగుముఖం పట్టాను. పట్టుదలతో మూడోసారి రాసి గెలిచాను.
 మా అమ్మ శారదాదేవి, నాన్న మంగాచారి (ఫొటోగ్రాఫర్‌). పదో తరగతి దాకా ప్రకాశం జిల్లా మార్టూరు ప్రభుత్వ పాఠశాలలో చదివాను. తర్వాత చిలకలూరిపేటలో స్థిరపడ్డాం. మన దేశంలో రవాణా వ్యవస్థ సరిగా ఉండదు. ఎన్నికలప్పుడు డబ్బులు తీసుకొని ఓటు వేయడం లాంటివి అవగాహన లేక చేస్తుంటారు. పోలీసు అధికారినైతే ఈ సమస్యలను పరిష్కరించొచ్చని అనుకున్నా. అప్పటికి బీటెక్‌ పూర్తయ్యి ఏలూరు రైల్వేమెన్‌ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. ఓ రోజు స్థానిక గ్రంథాలయానికి వెళ్లినప్పుడు అద్దంకి శ్రీధర్‌బాబు రచనలు చదివాను. అవే నాలో స్ఫూర్తి నింపాయి.
      సివిల్స్‌ కోసం 6-12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు బాగా చదివాను. వాటినే పునశ్చరణ చేసుకున్నాను. అలాగే చరిత్ర, భూగోళం, రాజనీతి శాస్త్రాలకు సంబంధించి ప్రామాణిక గ్రంథాలు అధ్యయనం చేశాను. అభ్యసన పరీక్షలు రాశాను. ఈనాడు, హిందూ పత్రికలు చదివేవాణ్ని. ఇతర భాషల్లో ప్రావీణ్యం సంపాదించాలంటే అమ్మభాష మీద అవగాహన తప్పనిసరి. ఆంగ్లపత్రికలు చదువుతూ కొత్తగా వచ్చే పదాలకు తెలుగు అర్థాలు రాసుకుని ఆంగ్లంలో పట్టుసాధించా. తెలుగు పాటలంటే చాలా ఇష్టం. వింటాను, పాడతాను. నృత్యమంటే ప్రాణం. తెలుగు మీద యువత ఆసక్తి చూపకపోవడానికి కారణం మన వ్యవస్థే. తెలుగులో ఉద్యోగావకాశాలు అంతగా లేవు కాబట్టి యువత వేరేవైపు వెళ్లడంలో తప్పు లేదు. అందుకే మన వ్యవస్థలో మార్పు రావాలి. కొన్ని పాఠశాలల్లో ఆంగ్లం మాట్లాడకపోతే జరిమానా విధించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వాటిని తల్లిదండ్రులే అడ్డుకోవాలి.

 - చందోలు నాగ వెంకట మణికంఠ, 206వ ర్యాంకు


మహాప్రస్థానం ఇష్టం
తెలుగు ఐచ్ఛికంగా తీసుకుని విజయం సాధించాను. మా స్వస్థలం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం కాపులపల్లి. అమ్మానాన్నలు సింగారెడ్డి, భాగ్యలక్ష్మి. వ్యవసాయ కుటుంబం. మా ఊరికి రోడ్డు, బస్సు సౌకర్యం కూడా లేవు. అనారోగ్యమొస్తే జమ్మికుంటకు తీసుకెళ్లాల్సిందే. నా వంతు సమాజానికి సేవ చేయాలని అనిపించేది. సివిల్స్‌ను దానికి మార్గంగా ఎంచుకున్నా.
ఒకట్రెండు తరగతులు మా ఊళ్లోనే చదివాను. తర్వాత పది వరకూ జమ్మికుంటలోని కాకతీయ హైస్కూల్లో తెలుగు మాధ్యమంలో చదివాను. 2012లో బీటెక్‌ పూర్తయ్యాక సివిల్స్‌పై దృష్టి సారించాను. 
మొదట ప్రభుత్వ పాలన శాస్త్రం ఐచ్ఛికంగా తీసుకున్నాను. 2015లో తెలుగుకు మారాను. ముఖాముఖి వరకూ వెళ్లాను కానీ ఎంపిక కాలేదు. 2017లో ఆరో ప్రయత్నంలో 480వ ర్యాంకు వచ్చింది.
మార్కులు కలిసొస్తాయి
తెలుగుకి సంబంధించి పాతూరి నాగరాజు గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. తెలుగు ఐచ్ఛికంగా తీసుకుంటే మార్కులు కలిసొస్తాయి. అయితే చిన్నప్పటి నుంచి చదివిన తెలుగే... సంధులు, సమాసాలు, లఘువులు, గురువులే కదాని చాలామంది తేలిగ్గా తీసిపడేస్తారు. కానీ అధ్యయనం చేస్తే అదో మహాసముద్రమే. శ్రీశ్రీ మహాప్రస్థానమంటే చాలా ఇష్టం. 
 సివిల్స్‌ కోసం తరగతి నోట్సు, హైదరాబాదు స్టడీ సర్కిల్‌ అధ్యయన సామగ్రి చదివాను. వాటితో పాటు అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలు, తెలుగులో అన్ని పాఠాలు, పద్యాలు, రచయితల గురించి చదివాను. 
సివిల్స్‌ అభ్యర్థులు పాఠ్యపుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి. తర్వాత ఇతర పుస్తకాలేవైనా చదవాలి. దాంతో పాటు సమాజంపై పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే విజయం సాధించడానికి అవకాశాలెక్కువ. ప్రస్తుతం  ఎఫ్‌సీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నా.

 - పోరెడ్డి సాయినాథ్‌ రెడ్డి, 480వ ర్యాంక్‌


ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం రావాలి
అయిదో తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదివాను. తర్వాత ఆంగ్లానికి మారాను. అయినా ఇప్పటికీ ఆంగ్లం మాట్లాడటమంటే కొంచెం కష్టమే. నిజానికి అమ్మ భాషలో భావాలు వ్యక్తపర్చినట్లు ఇతర భాషల్లో చెప్పలేం కదా! 
మా స్వస్థలం నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలం కొరుటూరు. అమ్మ సంపూర్ణమ్మ, నాన్న రమణయ్య కూలి పనులు చేస్తుంటారు. మా బాబాయి గ్రూప్‌-2 అధికారి. మా కుటుంబంలో ఎవరో ఒకరం సివిల్స్‌ సాధించాలనేది ఆయన కోరిక. హైదరాబాదులో శిక్షణ తీసుకున్నాను. రోజూ ఆరేడు గంటలు, పరీక్షలు దగ్గర పడుతుంటే 12 గంటలు చదివేవాణ్ని. ప్రస్తుతం ఐపీఎస్‌ శిక్షణ పొందుతున్నాను. మళ్లీ ఐపీఎస్సే వచ్చింది.  
ఇప్పుడు పేదవాళ్లే ప్రభుత్వ బడుల్లో చదువుతారన్న దుస్థితి వచ్చింది. దీన్ని చూస్తే చాలా బాధేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇప్పుడు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. దీని గురించి సమాజంలో బాగా అవగాహన కల్పించాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిలకు మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. నిజం చెప్పాలంటే ప్రభుత్వ బడుల్లో సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులుంటారు. ఇప్పుడు పెద్దపెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవాళ్లే. ప్రభుత్వ బడులకు మళ్లీ అలాంటి వైభవం తీసుకురావాలి. ఉద్యోగం చేసే ఊళ్లోనే ఉపాధ్యాయుడు ఉండాలన్న నియమాన్ని ఒకప్పుడు చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారు. దానివల్ల మా ఉపాధ్యాయులు ఎప్పుడూ మా కళ్లముందే కనిపించేవారు. పిల్లల్లో భయం, క్రమశిక్షణ ఉండేవి. అప్పట్లో ఉపాధ్యాయులు విద్యార్థుల్ని తమ సొంత పిల్లల్లా భావించేవాళ్లు. ఇప్పుడు ఎంతమంది అలా ఉన్నారు? చాలా మంది ఎప్పుడు టైం అయిపోతుందా? ఎప్పుడింటికి వెళ్లిపోదామా అన్న ధోరణిలోనే ఉంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. సివిల్స్‌కు సన్నద్ధమవ్వడం సుదీర్ఘ ప్రక్రియ. ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగేయాలి.

- అద్దూరు శ్రీనివాసులు, 743వ ర్యాంకు


తెలుగులోనే మౌఖిక పరీక్ష 
సివిల్స్‌ మౌఖిక పరీక్షలో ఆంగ్లంలో ప్రశ్నలు వేస్తే అన్నింటికీ నేను తెలుగులోనే సమాధానాలు చెప్పాను. అక్కడ ఆ అవకాశం ఉంది. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే.. ఆ భాష మీద బాగా పట్టు ఉంటేనే సివిల్స్‌ సాధిస్తామనడం అపోహ. కష్టపడితే ఎవరైనా రాయొచ్చు. ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తే సివిల్స్‌లో విజయం సాధించవచ్చు. దానికి నా అనుభవమే ఓ ఉదాహరణ.
మాది నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం గౌతంపల్లి. అమ్మానాన్నలు వెంకటమ్మ, బుచ్చయ్య వ్యవసాయ కూలీలు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. మా ఊళ్లోనే పదో తరగతి వరకూ చదువుకున్నాను. పై చదువులకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా 1999-02లో బీఎస్సీ పూర్తి చేశాను. 
తర్వాత హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ (గణితం) చేశాను. ఖరగ్‌పూర్‌లో ఎం.టెక్‌ చదివాను. 2007-15 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర విభాగంలో సహాయాచార్యునిగా చేశాను. ఈ మధ్యలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాను. ఇన్ని చేస్తున్నా ఐపీఎస్‌ కావాలన్న లక్ష్యం ఉండేది. ఉద్యోగం చేస్తూనే రోజూ అయిదు నుంచి ఎనిమిది గంటల పాటు ప్రణాళికాబద్ధంగా చదివేవాణ్ని. 
2015లో తొలిసారి సివిల్స్‌ రాశాను. ఆదాయపుపన్ను శాఖలో ఉద్యోగం వచ్చింది. తర్వాత ఏడాది రాస్తే ఐఆర్‌ఎస్‌ కస్టమ్స్‌ విభాగానికి ఎంపికయ్యాను. మూడో ప్రయత్నంలో 749వ ర్యాంకు సాధించాను. 

- బొంత బాలస్వామి, 749వ ర్యాంకు


నృత్యకారిణి... సేవాభిలాషిణి
ఒకవైపు శాస్త్రీయ నృత్యకారిణిగా రాణిస్తూనే, ప్రజా సేవలో కూడా తనవంతు పాత్ర పోషించాలని సివిల్స్‌ వైపు అడుగులు వేశారు అలేఖ్య బల్ల. ఈమె సొంతూరు పెద్దపల్లి. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో 12వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం డీఎస్పీగా శిక్షణ పొందుతున్నారు. తర్వాత యూపీఎస్సీ గ్రూప్‌ - బి సర్వీసు ఫలితాల్లో ‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హెడ్‌క్వార్టర్‌’లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. రెండోసారి రాసినప్పుడు 1188 ర్యాంకు వచ్చింది. మూడో ప్రయత్నంలో 721 ర్యాంకు సాధించారు. అలేఖ్య తల్లి రమాదేవి గృహిణి. నాన్న సత్తయ్య కరీంనగర్‌ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌. అలేఖ్య ఎం.ఫార్మసీ చదివారు. శాస్త్రీయ నృత్యమంటే చాలా ఇష్టం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంపీఏ (మాస్టర్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌) పూర్తి చేశారు. 80 శాతం మార్కులతో స్వర్ణపతకం సాధించిన తొలి విద్యార్థిగా గుర్తింపు పొందారు. ప్రముఖ నాట్యాచార్యులు రత్నకుమార్‌ దగ్గర ఆంధ్రనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. పలు పుణ్యక్షేత్రాల్లో, ప్రభుత్వ వేడుకల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలిచ్చారు. 
నేపథ్యం మీదే ప్రశ్నలు
ఇంటర్వ్యూలో తాను చదివిన ఫార్మసీ రంగం నుంచి అలేఖ్యకు ప్రశ్నలు ఎదురయ్యాయి. అలాగే ఆంధ్రనాట్యం గురించి, ఆ కళలో గురుశిష్య పరంపర గురించి ప్రశ్నలు అడిగారు. తనకు బాగా పట్టున్న అంశం కాబట్టి చక్కగా చెప్పగలిగానని అలేఖ్య చెప్పారు. ‘‘ఎంతో ఇష్టంగా నేర్చుకున్న నృత్యం ఇలా కూడా మేలు చేసింద’’ని ఆవిడ ఆనందం వ్యక్తం చేశారు. 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం