అమ్మభాష మా ఆరోప్రాణం

  • 783 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। నాగశేషు

  • నెల్లూరు
  • 9985509053

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ఫిబ్రవరి 21వ తేదీని గుర్తించడానికి, ఆ రోజు అన్ని దేశాల వారూ తమ తమ భాషల అభివృద్ధికి కట్టుబాటు ప్రకటించడానికి స్ఫూర్తి బంగ్లాదేశ్‌ వాసులే. పాకిస్థాన్‌ పాలకుల ధాటికి తల్లడిల్లిపోతున్న తమ తల్లిభాషను కాపాడుకోవడానికి ఉద్యమించిన వారిలో పదిమందికి పైగా ప్రాణత్యాగం చేశారు. ఆ తర్వాత భారతదేశం సాయంతో వాళ్లు స్వతంత్రం సముపార్జించుకున్నారు. నాటి అమరవీరుల ప్రేరణతో బంగ్లా భాషాభివృద్ధికి అక్కడి నేతలు చాలా ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో మాతృభాష పట్ల తన ప్రేమాభిమానాలను మరోసారి చాటుకున్నారు ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా. బంగ్లా భాష ప్రపంచంలోని సుసంపన్నమైన భాషల్లో ఒకటని, ఎందరో త్యాగధనుల ప్రాణత్యాగంతో ఈరోజు తాము బంగ్లా భాషను స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నామని అన్నారావిడ. అందుకే మాతృభాష వినియోగం అనే అంశానికి తాము అత్యంత ప్రాధాన్యమిస్తామని ఉద్ఘాటించారు. ఢాకాలోని అంతర్జాతీయ మాతృభాషా సంస్థ (ఇంటర్నేషనల్‌ మదర్‌ లాంగ్వేజ్‌ ఇన్‌స్టిట్యూట్‌)లో ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు జరిగిన అమర్‌ ఎకుషీ కార్యక్రమంలో పాల్గొన్న హసీనా ప్రారంభోపన్యాసం చేశారు. 
      ‘‘బంగ్లా భాషతో మనకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. మనకు ఇంత ఖ్యాతిని సాధించి పెట్టిన ఈ భాషను, సంస్కృతిని కాపాడుకోవడానికి మనం రక్తం ధారపోయడానికి అయినా సిద్ధంగా ఉండాలి. మన భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి సర్వసన్నద్ధులం కావాలి. ఒక దేశాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నేవారు దాని భాషా సాహిత్యాలను, సంస్కృతిని నాశనం చేయాలనుకుంటారు. తద్వారా ఆ దేశపు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తారు. పాకిస్తానీ పాలకులు బంగ్లాదేశ్‌ విషయంలో ఇలాగే చేశారు. అయితే ఆ కుట్రను తిప్పికొట్టి మనం స్వేచ్ఛాయుద్ధంలో గెలిచాం. విశ్వయవనికపై బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్థానం కల్పించుకున్నాం’’ అని చెప్పారు హసీనా. బంగ్లాదేశ్‌ జాతిపిత, బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ 1952లో బంగ్లా భాషోద్యమాన్ని ఎలా నిర్మించారో, ప్రజల్లో మాతృభాష పట్ల అభిమానాన్ని ఎలా పాదుకొల్పారో హసీనా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బంగ్లా భాషాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు హసీనా స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాతృభాషా సంస్థ ద్వారా దేశవిదేశాల నుంచి వచ్చే పరిశోధకులు బంగ్లా భాష మీద అధ్యయనాలు చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ కల్పించామన్నారు. మంచి విషయమే! మరి మన భాష కోసం తెలుగునాట ఇలాంటి చొరవ తీసుకునే వారు ఎవరైనా ఉన్నారా? 


వెనక్కి ...

మీ అభిప్రాయం