వంద భాషల్లో ఘనాపాఠీ

  • 838 Views
  • 2Likes
  • Like
  • Article Share

తెలుగును మర్చిపోతే తప్ప పిల్లలకు ఆంగ్లం రాదు... తెలుగునాట ప్రబలిపోయిన ఓ దురభిప్రాయమిది. మొదట అమ్మభాష మీద పట్టు సాధిస్తే తర్వాత ఎన్ని భాషలనైనా సులువుగా నేర్చుకోవచ్చు అని నిపుణులు ఎంతగా మొత్తుకుంటున్నా ఎవరూ తలకెక్కించుకోవట్లేదు. ఆ విషయం అలా ఉంచితే.. ఇటలీకి చెందిని రికార్డో బెర్టానీ మాత్రం తన మాతృభాషే సోపానంగా వంద భాషలను కరతలామలకం చేసుకున్నారు.  
ఇటలీలో రెగ్గియో ఎమిలియాలోని కాప్రరాలో ఒక రైతు కుటుంబంలో రికార్డో జన్మించారు. లెక్కలు అంటే భయంతో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత బడి మానేశారు. పొలం పనుల్లో కుదురుకున్నారు. అయితే ఏదో వెలితిగా ఉండేది. అప్పుడే తనకు ఎంతో ఇష్టమైన పుస్తక పఠనం, ఇతర భాషలు నేర్చుకోవడం మీద దృష్టి కేంద్రీకరించారు. బెర్టానీ తండ్రి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. ఆ ఊరి మాజీ మేయర్‌ కూడా. ఇంట్లో బోలెడు పుస్తకాలుండేవి. కానీ చాలా భాగం రష్యన్‌ భాషలో ఉండటంతో అర్థమయ్యేవి కాదు. ముందుగా ఇటాలియన్‌ భాషలో లభించే టాల్‌స్టాయ్‌ లాంటి రచయితల పుస్తకాలను బెర్టానీ చదవడం ప్రారంభించారు. ఆ తర్వాత రష్యన్‌ నిఘంటువు సాయంతో మూల రచనలను చదివేవారు. ఎందుకోగానీ ఆయనకి రష్యా, ఉక్రెయిన్‌ లాంటి తూర్పు దేశాల మీద ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత 18 ఏళ్లపాటు ఆ దేశాలకు సంబంధించి ఏ పుస్తకం దొరికితే దాన్ని అనువాదం చెయ్యడం పనిగా పెట్టుకున్నారు. ఆయా సంస్కృతులతో మమేకం అయ్యేకొద్దీ సైబీరియన్‌, మంగోలియన్‌, ఎస్కిమోల గురించి తెలిసింది. అంతరించిపోయే భాషల మీద ఆసక్తి పెరిగింది. రష్యన్‌, ఉక్రేనియన్‌తో మొదలైన ఆయన ఆసక్తి వందకి పైగా భాషలు నేర్చుకునే స్థాయికి చేరింది. వాటిలో ఎస్కిమో, యాకుత్‌, యుకాఘిర్‌, రుతుల్‌, ఎత్రుస్కాన్‌, ప్రుసియన్‌, బాస్క్యూ లాంటి అరుదైన భాషలూ ఉన్నాయి. 
      తన 70 ఏళ్ల అనుభవాలను చక్క గా భద్రపరిచారు బెర్టానీ. వేర్వేరు భాషలకు చెందిన వేలాది పదాల వివరణలు, భాషా శాస్త్ర సంబంధమైన ఉచ్చారణలను వెయ్యికి పైగా పుస్తకాల్లో గుదిగుచ్చారు. 18 ఏళ్లప్పుడు మొదలైన బెర్టానీ భాషా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. 
      ఈ ప్రపంచంలో బహుభాషా కోవిదులు చాలామందే ఉన్నారు. కానీ, అరుదైన- అంతరించిపోతున్న భాషలను ఏరికోరి నేర్చుకుని.. వాటి విశేషాలను చక్కగా నమోదుచేసే బెర్టానీ లాంటి వాళ్లు చాలా అరుదు.  అది అలా ఉంచితే, అమ్మభాష మీద మంచి అవగాహన ఉంటే ఏ భాషనైనా తేలిగ్గా నేర్చుకోవచ్చు అనడానికి బెర్టానీ జీవితం ఓ తాజా ఉదాహరణ... కాదంటారా!
 


వెనక్కి ...

మీ అభిప్రాయం