తెలుగు మాటల మాగాణం తెలంగాణం

  • 1596 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। నలిమెల భాస్కర్‌

  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
  • కరీంనగర్‌
  • 9704374081
డా।। నలిమెల భాస్కర్‌

 కమ్మనైన అమ్మనుడుల మడులూ ఎన్నెన్నో ఉన్నాయి. ఈ మళ్లలోకి తేటతెలుగు పలుకుల జాళువా కాలువలు జాలువారుతున్నాయి. ఆ బిలాలతో తెలుగుమాటల పొలాల్లా పంటలే పంటలు. మధురాతిమధురమైన మాతృభాషావాక్కుల తెలంగాణను చూస్తే ఎవరైనా అచ్చెరువొందాల్సిందే!
నీళ్లు జోడుకునే (చేదుకునే) బావిని తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బాయి అంటారు. బా‘వి’లోని వకారం పోయి ‘యి’ మిగిలింది. జానపదుల మాట తీరిది. అయితే ఈ బావిని ఆదిలాబాదులో ‘నూతి’ అని పిలుస్తారు. ఇది నుయ్యిలోంచి వచ్చిన ఔపవిభక్తిక రూపం. నుయ్యి, నూతి పదాలు సైతం బావి లాంటి తెలుగు పదాలే! ఇక ఆ బావి లేదా నూతిలోంచి నీళ్లు పైకి చేదుకునే సాధనం బొక్కెన. దీన్ని ఆదిలాబాదు జిల్లాలో ‘కోర’ అంటారు. ఇది సహజత్వాన్నీ, ప్రాంతీయ ముద్రనూ నిలుపుకున్న ఆ ప్రాంత నుడి. మరి ‘కోర’కు నిఘంటువులు ఏమని అర్థవివరణ చేశాయి? ‘గిన్నె, కల్లు తాగెడు గిన్నె, తట్ట’ అని చెప్పాయి. బావిలోంచి నీళ్లు పైకి తోడుకునే పనిముట్టు.. ఓ గిన్నె లేదా తట్ట లాంటి పనిముట్టే కదా!
తెలంగాణలో కోలలు ఏసుడు, కోలాటం ఆడుడు అని రెండు రకాల ఆటలున్నాయి. ఈ రెండింటిలోనూ ఆటా పాటా ఉంటాయి. మరి తేడా ఏంటి? ఆడవాళ్లు కోలలు వేస్తారు. మగవాళ్లు కోలాటం ఆడతారు. ‘కోల’ అంటే దండం. సన్నని ఒకింత నిడుపాటి కర్ర. కోలాటం పదానికి మాతృక తమిళ భాషలోని ‘కోలాట్టం’. కోల్‌, ఆట్టం అనే రెండు పదాల కలయిక ఇది. కోల్‌ అంటే కోల. ఆట్టం అంటే ఆట. తమిళ తోట్టం తెలుగులో తోట అయినట్లూ, కోట్టం కోటగా నిర్మితమైనట్లూ జరిగిన మార్పు ఇది. అయితే కోలాటంలో తమిళ ఆట్టం ఏ రకమైన మార్పూ లేక నిలిచి ఉండటం విశేషం (ఒత్తు తప్ప). ఇక తెలంగాణలో ‘కోలె’ అనే అవ్యయమూ ఉంది. నిజానికిది చివర్లో ద్రుతం ఉన్న ‘కోలెన్‌’ అనే రూపంలో ఉండాలి. అయితే భాషలో ఈ ద్రుతం జారిపోవడం సర్వసాధారణం. ఈ ‘కోలె’ అవ్యయం చాలా ప్రాచీనమైంది. అయినప్పటికీ ఈనాటికీ తెలంగాణలో ముఖ్యంగా పల్లెవాసుల పలుకుల్లో నిక్షిప్తమై ఉంది. ‘‘ఏమో! శిమాంట పండుగ్గోలె వచ్చినవు ఏందయ్యా?’’ లాంటి వాక్య విన్యాసాల్లాగా ఇది పదిలంగా ఉంది. ఇందులోని ‘గోలె’ పదమే పాతకాలంనాటి కోలె. నన్నయ ఆదిపర్వంలో ‘దాని వత్సంబు నిన్నట గోలె నుడుగక యఱచుచునున్న యదియు’ అన్నాడు. దీనికి ‘నుంచి, మొదలు, సమయం’ తదితర అర్థాలు చెప్పుకోవచ్చు.
కయ్యలూ కైనీడలూ
శబ్దరత్నాకర నిఘంటువులో ‘కయ్య’ అనే పదానికి మడి అనే నుడిని అర్థంగా చూపించినా, ఇంకొకచోట ‘క్రయ్య’కు కాలువ అనే అర్థాన్ని ఇచ్చారు సీతారామాచార్యులు. తెలంగాణలో ఈ పదం మరో అర్థంలో బాగా వాడుకలో ఉంది. వాగుల్లో అక్కడక్కడా నీళ్లు లోతుగా నిలిచిన కయ్యలుంటాయి. ఇవి మడుగుల్లాంటివి. వీటిలో ఈతలు కొడుతుంటారు సాధారణంగా. కాబట్టి నైఘంటికార్థానికి అంటే కాలువ అనే అర్థానికి సమానంగా ఉన్న నీటి సంబంధిత పదమే తెలంగాణలో ఉంది. ఇంకా తిండిపోతుల్ని చూసి ‘వానిది కడుపా కయ్యా?’ అని ప్రశ్నిస్తారు, ‘‘కడుపా కళ్లేపల్లి చెరువా?’’ అనే అర్థంలో. వర్షకాలంలో ప్రవాహ ఉధృతి వల్ల సైతం వాగుల్లో కయ్యలు కోస్తాయి ఎడనెడ.
      విద్యుత్తు సౌకర్యం లేని ఆ రోజుల్లో వెలిగించిన దీపాలే గతి. ఈ దీపాల కిందే కొంత చీకటి ఉండేది. ఆ ఇరులు దీపం తాలూకు నీడలు. ఈ నీడను మామూలుగా ‘‘క్రీనీడ’’ అని వ్యవహరిస్తే, తెలంగాణలో దీన్ని ‘కైనీడ’ అంటారు. క్రీనీడలోని క్రి అంటే క్రింద అని అర్థం. ఈ క్రి అక్షరమే కై అయిపోతుంది తెలంగాణలో. అస్తమయ సమయాన్ని చెప్పడానికి ‘పొద్దు గుంకింది’ అంటారు ఇక్కడ. సూర్యుడికి, సమయానికీ ‘పొద్దు’ ముద్దుగా ఉన్న తెలుగు మాట. ఇక గుంకింది గురించి... ఇది ‘కుంకింది’ నిజానికి! క్రుంకు అంటే మునుగు అని అర్థం. పడమటి కొండల చాటున మునగడం, పశ్చిమ సముద్రాలకు ఆవల మునగడం ఈ పొద్దు కుంకడం.
కొత్తంత పండగ లేదు...
తెలుగు వాళ్లందరికీ నూతన సంవత్సరాది గొప్ప పర్వదినం. దీన్నే ‘ఉగాది’గా పిలుస్తాం. నిజానికిది యుగాది. యుగం అంటే ఇక్కడ సంవత్సరం అని. యుగాది పదమే ఉగాదిగా స్థిరపడింది, తెలుగులో. అయితే ఇలాంటి కొత్త సంవత్సరం తాలూకు పండగే మరొకటి తెలంగాణలో ఉంది. దాని పేరే ‘కొత్త పండగ’. కొత్తగా పంటలు పండి ఇంటికి వచ్చిన సందర్భంలో ఈ పబ్బం అబ్బురపడేలా చేసుకుంటారు. ఆ రోజు కొత్త బియ్యాన్ని వండుకుంటారు. ఇంటిలో ఉన్న కుందెన, కుదురు, రోలు, రోకలి లాంటి ఉపకరణాల్ని సున్నమూ, జాజులతో చక్కగా అలంకరిస్తారు. గొప్పగా వాటిని పూజిస్తారు. ఇంటిల్లిపాదీ కష్టసుఖాలు చెప్పుకుంటూ కలిసి భోంచేస్తారు. ఇది తెలంగాణలో ఎంత గొప్ప పర్వదినం అంటే ‘కొత్తంత పండగ లేదు- అల్లుడంత చుట్టము లేడు’ అనే సామెత చెప్పుకునేదాకా వచ్చింది. ‘కొత్త’ పదం ఉత్తమమైన తెలుగు పదం కాదూ మరి!
      ఇక ‘‘పుల్లంగొయ్య’’ చరిత్ర. ఏంటిది? పిల్లంగ్రోవి. ఇదే అంటే ఈ పిల్లంగ్రోవే పిల్లనగ్రోవి రూపంలో ఉంది. ఇప్పుడందరూ అదే అంటున్నారు. తెలంగాణలో వినిపించే పదం మాత్రం ‘పుల్లంగొయ్య’. ‘క్రోవి’ అంటే గొట్టం. పిల్లనగ్రోవిలో రంధ్రాలతో ఉన్న గొట్టమే కదా ఉండేది. మరి ‘పుల్లంగొయ్య’ మాట ఏంటి? కొయ్యతోనే తయారైంది కాబట్టి సంధిగతంగా గొయ్య. క్రోవి సైతం కొయ్యగా మారొచ్చు. వాస్తవానికి పిల్లనగ్రోవి, పుల్లంగొయ్య అనే పిల్లపదాలకు తల్లిపదం తమిళంలో ఉంది. అది ‘పుల్లాంగుళల్‌’. కుళల్‌ అంటే గొట్టమే! పుల్లాంగుళల్‌ లాగే పుల్లంగొయ్య వినిపించడం లేదూ! అంటే తమిళానికీ, తెలంగాణకూ అంత దగ్గరి సంబంధం ఉంది మరి!!
గండు... గచ్చు
తెలుగులోని రేనుపండ్లను వర్ణవ్యత్యయం చేసి తెలంగాణలో నేరిపండ్లు అంటారు. కొందరు రేగుపండ్లనీ, రేనుపండ్లనీ పిలవడం కద్దు. పెద్దగా ఉన్న పండ్లను గంగరేనుపండ్లని వ్యవహరిస్తారు. ఈ సమాసంలోని ‘గంగ’ అంటే అర్థం పెద్ద అని. మరొక పదం ‘గంజు’ పరిశీలనార్హం. దీనికి అర్థాలు ‘అంగడి వీధి, మార్కెట్టు, బజారు’ అని. తెలంగాణలో ‘గంజులకు పోయిండా?’ అంటే షావుకార్ల వ్యాపారస్థలమనే భావం ఉంది. మరి ‘గండ్ర’ అంటే ఏంటి? ‘పెద్దది’ అని అర్థం. గండ్రచీమలు అందుకనే మామూలు చీమలకన్నా పెద్దగా ఉంటాయి. తెలంగాణలో ఇవి ‘గండుచీమలు’గా వ్యవహృతం అవుతున్నాయి. గండ్ర గొడ్డలిలోని గండ్రకు పెద్ద అనే అర్థం. అయితే ఈ పదం తెలంగాణ వాడుకలో లేదు. కానీ ‘గండు మొకం’ లాంటి సమాసాల్లో గండ్ర కనిపిస్తున్నది. గండుపిల్లి కూడా ఇలాంటిదే! ఇక ‘గగ్గోలు’ అంటే కలత, దోషం అని అర్థాలు. చాలా చిత్రంగా ఈ పదం ‘గగ్గోడు’గా మారి వ్యవహారంలో ఉంది. కారణాంతరాల వల్ల తొడలూ, చంకల సందుల్లో దిగిన వాపును తెలంగాణీయులు గగ్గోడు వచ్చింది అంటారు. గజ్జల్లో దిగిన ఈ ఉబ్బూ, వాపూ ఆందోళనకు గురి చేస్తుంది కాబట్టి, క్షోభ పెడుతుంది కాబట్టి దీన్ని గగ్గోడు అన్నారు. ఇది మంచి తెలుగుతనం ఉన్న పదం.
      ఈరోజుల్లో అంటే ఇళ్లలో మార్బుళ్లు వేసుకుంటున్నారు కానీ పూర్వం ‘గచ్చు’ చేయించుకునేవాళ్లు. కొందరు నాపరాళ్లు వేయించుకునేవారు. పేదలు పాపం నేలతోనే సరిపెట్టుకుంటారు. ఈ గచ్చుకు అర్థం సిమెంటుపూత అని. నిజానికి నిఘంటువులు ఈ పదానికి ‘పూత’, ‘గారపూత’ అనే అర్థాల్ని ‘కాంతి’తోపాటు ఇచ్చాయి. సిమెంటు ఆధునిక కాలంలోది కాబట్టి దీన్ని గచ్చుకు అన్వయింపచేశారు తెలుగువాళ్లు. ఏది ఏమైనా అచ్చమైన దేశిపదం ‘గచ్చు’. అది అచ్చుపోసినట్లు అచ్చంగా తెలంగాణ వ్యవహారంలో ఉంది. పశువుల్ని తరమడం అనే అర్థంలో తెలంగాణలో ‘గెదుముడు’ అనే పదప్రయోగమూ వినపడుతుంది. అప్పుడప్పుడు మనుషులకు కూడా దీన్ని అన్వర్తింపచేస్తారు. ఈ ‘గెదుము’ క్రియకు మూలరూపం ‘గదుము’. గద్దించు అనే అర్థంలో ఉన్న సకర్మక క్రియ ఇది. పశువుల్ని గద్దిస్తేనే కదా వాటిని తరమగలిగేది!
పదాల గమగమలు
పశువుల కొట్టాల నుంచీ, గొర్రెలు మేకల మందల నుంచి ఒక రకం దుర్గంధం వస్తుంది. దీన్ని ‘గెదరు’ వాసన అంటారు. ఈ గెదరు వాస్తవానికి తెలుగులోని ‘‘గదరు’ పదం. చిన్నచిన్న మార్పులతో అచ్చమైన తెలుగు పదాలు తెలంగాణలో ఇలా వినిపించడం సహజం. తెలుగులో వాసనలకు ధ్వన్యనుకరణలు గుమగుమ, గమగమ అని రెండున్నాయి. తెలంగాణలో సుగంధద్రవ్యాలు వేసి రుచికరంగా వంటలు చేస్తున్నప్పుడు ‘‘అబ్బా! ఎంత మంచిగ గమగమ వాసనలు వస్తున్నై. ఎప్పుడు వడ్డన చేస్తరో మరి!’’ అంటుంటారు. ఈ గమగమ గమ్మత్తయిన కమ్మని తెలుగు మాట. అలా వాసనలు గుమాయిస్తున్న, గుబాళిస్తున్న వంటలు మరింత రుచికరంగా ఉండవా? ఉంటాయుంటాయి.

 తెలుగులో ‘గాలి’ పదానికి సమానార్థకంగా ‘గాడుపు’ పదం కూడా ఉంది. ఇవి రెండూ తెలుగు నుడులు. వీటికి సంస్కృతంలో వాయువు, పవనం, మారుతం, సమీరం మొదలైన బోలెడు పదాలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతాంశం ఏంటంటే తెలంగాణలో బాగా చదువురాని మంది గాలికి మారుగా ‘గాడ్పు’ అనే పేర్కొంటారు. ఇది మంచి అమ్మ నుడి. అలాగే, ‘గావు’... గమనించదగిన మరొక మాట. సాధారణంగా దేవతలకు బలిచ్చే సందర్భాల్లో ఈ పదాన్ని వాడుతుంటారు. పోతురాజులు తమ దంతాలతో మేకపోతుల్నీ, గొర్రెపోతుల్నీ కొరికి గావు పడతారు. ‘గావు’ అంటే మరేంటో కాదు, బలి అని అర్థం. ‘‘గొప్ప చింబోతు కదుపుల గూర్చి నీకు, గావు వెట్టింతు జుమ్మి యో గంగనమ్మ’’ అని నీలాసుందరి పరిణయ గ్రంథం తేటగీతి పంక్తుల్ని అందిస్తోంది. గావుపట్టు అంటే చంపు, నాశము చేయు అనే అర్థాలున్నాయి. ఒకవిధంగా ‘చావు’ (మరణం) పదమే ‘‘గావు’’ కావచ్చు. ఇది విలోమ తాలవ్యీకరణం.
గిడ్డుగాడు.. గిర్వి
చెవులు రింగుమనడం మనం విన్నదే! శంకరంబాడి రాసి పాడిన ‘తెలుగుతల్లి గీతం’లో ‘‘మా చెవులు రింగుమని మారుమోగేదాక’’ ఉన్నదే!! అయితే ఈ రింగుమనడం దాదాపు తెలంగాణలో ‘గింగురుమనడం’. వింటినారి నుంచి బాణము వెలువడటానికి సంబంధించిన ధ్వన్యనుకరణం ‘గింగురు’మనడం. తెలంగాణ వ్యవహారంలో పెద్దగా శబ్దాలు వినిపించే వేళల్లో ‘‘అబ్బా! నా చెవులన్ని గింగురుమంటున్నై!’’ అని మాట్లాడుతుంటారు. ‘‘వాడు గిడ్డుగాడు’’ లాంటి మాటలూ తెలంగాణలో వినిపిస్తుంటాయి. పొట్టివాడు, మరుగుజ్జు అనే అర్థంలో ఈ పదాన్ని ప్రయోగిస్తారు. ఈ గిడ్డు మాట నూటికి నూరుపాళ్లు తెలుగే! అయితే అది ‘గిడ్డ’ అనే రూపంలో ఉంది. పొట్టి, వామనుడు అని అర్థాలు ఈ గిడ్డకు. గిడ్డ, గిడ్డు దాదాపు శబ్దసామ్యమూ, అర్థసామ్యమూ కలిగిన తెలుగు పదాలు. ఇక ‘తాకట్టు’ అనే అర్థంలో తెలుగులో ‘గిరవు’ అనే పదం వుంది. ఇది తెలంగాణలో ‘గిర్వి’ అయ్యింది. ఇదే అర్థంలో తెలుగులో ‘కుదువ’ పదమూ వుంది. ఇది కొంత మార్పునకు గురై తెలంగాణలో ‘కుద’ అయ్యింది. ‘ఎక్కడ కుద పెట్టి రావాలె?’ లాంటి వాక్య ప్రయోగాలున్నాయి తెలంగాణ సీమలో.
      ‘‘ఇప్పుడే పెరుగుల నీళ్లు పోసి కుండల పోసిన. జెర్రసేపు ఆగు. ఆయింత గిలకొట్టి వస్త’’ అంటుంటారు తెలంగాణలో. పాడి సమృద్ధిగా కలిగిన ఇళ్లలో పెరుగును కుండలో పోసి, అందులో కవ్వంతో చిలికి వెన్న తీయడం ఓ పద్ధతి. పాలూ పెరుగు తక్కువగా ఉన్నప్పుడు కొందరు పెరుగును పాత్రలో వేసి చేతివేళ్లతోనే చిలుకుతారు. దీన్నే ‘గిలకొట్టుడు’ అంటారు. బహుశ! చేతి మునివేళ్లతో ‘చిలకడం’ ఈ ‘గిలకొట్టుడు’గా మారి వుంటుంది. ఇదీ తాలవ్యీకరణం ఉల్టా జరిగిన రూపం. ‘చి’ అక్షరం ‘గి’గా పల్టీ కొట్టిన బాపతు. ఇక ‘గిలిగింత, చక్కలిగింత, గిలిగిలి, గిలిగిలింత’ అనే మాటలకు అర్థాలు అందరికీ తెలుసు. మరి తెలంగాణలో ఏమంటారు? ‘చక్కిలిగులగుల’ అనేది వీటికి సమానమైన చక్కని పదం. చక్కిలిగింతలోని ‘చక్కిలీ’, ‘గిలిగిలి’ అనే పదం సాంతమూ కలిసి మొదట చక్కిలిగిలిగిలిగా మారి, ఆ తర్వాత అది చక్కిలిగులగులగా పర్యవసించింది. అసలు ఆ మాట అనగానే మనకు నవ్వు రావడం సహజం. చిన్నపిల్లల్ని నవ్వించడానికి చంకల్లో వేళ్లుపెట్టి చక్కిలిగులగుల చేయడం సాజం. అలా నవ్వించేటప్పుడు చంకల్లో కొంత గులగుల దురదలా ఓ అనుభూతి కలగడం కూడా సర్వసాధారణమే! ఇక ఈ చక్కిలికి తమిళ ‘కైక్కుళి’ (చేతి చంకగుంత) అని కాదూ మూలం!

అదంతా జాను తెలుగు
‘చేను’ అనే అర్థం కలిగిన ‘గుడ్డము’ పదం ఓ దొడ్డమాట. పల్లెల్లో ఇప్పటికీ వరి పొలాలు కానటువంటి చేనులూ, చెలకలకు ‘గుడ్డాలు’ అనే వాడుతుంటారు. కన్నడంలోని ‘గుడ్డ’కీ, ఈ ‘గుడ్డము’కూ సంబంధం ఉంది. మెట్టపంటల భూముల్ని గుడ్డాలంటారు. అలాగే, ‘‘ఏ... నాకు మస్తు బుగులు బుగులుగ వున్నది. నా కడుపుల భయం జొచ్చింది’’ లాంటి వాక్కుల్లోని బుగులు ఏంటో కాదు. తెలుగులోని ‘గుబులు’ పదానికి ఏ భయం వేసిందో కాని తెలంగాణలో అది వర్ణ వ్యత్యయంతో బుగులు అయ్యింది. బుగులు అంటే భయం అనే భావం. మరి ‘‘వాడు నా వీపు మీద గిపుకుగిపుకున గుద్దిండు’’ అనే వాక్యంలోని ‘గిపుకు’ ఏమిటి? అది పొడవడానికీ, గుద్దేందుకూ సంబంధం ఉన్న ధ్వన్యనుకరణ పదంలా తోస్తుంది. నిజానికి తెలుగులో ఓ పదం ‘గుముకు’ అని ఉంది. దాని అర్థం ‘పిడికిటితో పొడుచు’ అని. పిడికిలి గట్టిగా బిగించి కడుపులోగానీ, వీపుపైగానీ గుద్దుతూ ఉండటమే తెలంగాణలో ‘గిపుకుగిపుకున’’. ఇప్పుడు ‘గుముకు’ పదమే ‘గిపుకు’గా మారిందని తట్టడంలేదూ చటుక్కున. అన్నట్టు.. ఈ చటుక్కున పదం తెలుగే కానీ, మరాఠీ ‘సట్‌కన్‌’ను గుర్తుచేస్తుంది. ఆ భాషలోనూ ‘సట్‌కన్‌’ అంటే మన చటుక్కున అనే!
      ఇలా ఇప్పటికీ తెలంగాణలో వందలు, వేలాది పదాలు తెలుగుతనంతో తొణికిసలాడుతున్నాయి. పైగా అవి పల్లెజనాల రసనల్లోంచి జారిపడే అనల్పార్థ రచనలు. వాళ్లు వాడేవి అల్పాక్షరాలే కావచ్చు. సోమన చెప్పినట్టు వాటిని ‘కొలదిమాటలు అనంగవలదు’. ఉరుతర పద్యోక్తులు కాకున్నప్పటికీ అవి సరసమై పరగిన జానపదుల జానుతెలుగు పలుకులు. ఆ వాక్కులు వాకలై పారుతూ, తీగలై సాగుతూ తెలంగాణలో నిలిచి ఉండటమే ఓ ప్రత్యేకత!


వెనక్కి ...

మీ అభిప్రాయం