జముకులేవి ఆ కథాగానాలేవి

  • 2156 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బద్రి కూర్మారావు

  • ఉపాధ్యాయులు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ జూనియర్ కళాశాల
  • సబ్బవరం, విశాఖపట్నం
  • 9704798643
బద్రి కూర్మారావు

‘జముకుల కథ’ గతమెంత ఘనమో.. వర్తమానమంత వ్యథాభరితం! కొన్నేళ్ల కిందటి వరకూ కళింగాంధ్రలోని ప్రతి పల్లెలో మారుమోగిన ‘జముకు’ జతులు నేడు నిశ్శబ్దమైపోతున్నాయి. గుక్కతిప్పుకోని కథాగానంతో ఆనాడు ఆబాలగోపాలాన్నీ కట్టిపడేసిన కళాకారులు ఇప్పుడు బతుకుతెరువు వేటలో బక్కచిక్కిపోతున్నారు. మారిన కాలమాన పరిస్థితుల్లో కొండెక్కుతున్న ఈ జముకుల కథాజ్యోతి దీప్తిధార ఇది..!!
తోలుబొమ్మలాట, ఒగ్గుకథ, డప్పునృత్యం, గొల్లసుద్దులు, తప్పెటగుళ్లు, చెక్కభజనలు... ఇలా తెలుగువారికి నూటయాభైకి పైగా జానపద కళారూపాలున్నాయి. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిన ఈ కళలు సినిమా, టీవీ, కంప్యూటర్ల రాకతో చెల్లాచెదురయ్యాయి. కాలగమనంలో కనుమరుగైపోతున్న అలాంటి కళారూపాల్లో జముకుల కథ ఒకటి. ఇది సామాన్యులకు ఇతిహాసాలను ఎంతగా దగ్గర చేసిందో.. అంతగా వారికి చైతన్యోద్యమాలనూ చేరువచేసింది.
      శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర- ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఒకప్పుడు జముకుల కథ విరివిగా ప్రచారంలో ఉండేది. ‘జముకు’ (జమిడిక) అనే వాద్యాన్ని ఉపయోగిస్తూ ప్రదర్శించే కళ కాబట్టి దీనికి జముకుల కథ అనే పేరు వచ్చింది. ఈ జముకుల కళాకారులను ఉత్తరాంధ్రలో ‘బుడికిపాట వారు’, ‘బోనెలపాట వారు’ అనీ వ్యవహరిస్తారు. తెలంగాణలో అయితే ‘బైండ్లవారు, బవనీలు’ అని పిలుస్తారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ‘బైనీడువారు, పంబలవారు’, రాయలసీమలో ‘బైండ్లకథ వారు’ అని అంటారు. వీళ్లు ఉపయోగించే జముకును కంచు, ఇత్తడి, రేకు, కర్రల్లో ఏదో ఒకదాంతో తయారు చేస్తారు. కుంచం (సిలిండర్‌) ఆకారంలో ఉన్న డొక్కుని ఒకపక్క జంతు చర్మంతో మూస్తారు. మధ్య భాగంలో చిన్నరంధ్రం చేసి దారాన్ని (నరాన్ని) పోనిచ్చి చివరన ముడేస్తారు. రెండవ పక్క ఒక కర్ర ముక్కకు ఆ దారాన్ని కట్టి.. ఎడమ చేత్తో దాన్ని బిగుతుగా లాగి పట్టుకుని కుడిచేత్తో డొక్కు లోపలి భాగంలో వేళ్లతో దరువేస్తారు.  
‘గిరడ’ నాటి...
కళింగాంధ్ర జముకుల కథాగానంలో  రెండు పద్ధతులు కనిపిస్తాయి. వేషధారణ చేసుకుని రాత్రిపూట గ్రామాల్లో ప్రదర్శనలిస్తారు కొంతమంది కళాకారులు. మరికొంతమంది  అమ్మతల్లుల పండగలు, జాతర్లలో మరిడమ్మ, నూకాలమ్మ, అశిరమ్మ, పైడితల్లెమ్మ లాంటి గ్రామదేవతల కథలు చెబుతారు. ‘జముకులోడు వచ్చాక జాతరాగుతుందా?’ లాంటి సామెతలు పల్లె సంబరాల్లో వీరి ప్రాధాన్యాన్ని స్పష్టంచేస్తాయి. ఇక రాత్రిపూట ప్రదర్శనలకు వీధి నడిబొడ్డే రంగస్థలం. ఇందులో ముగ్గురు వ్యక్తులు పాల్గొంటారు. వాళ్లలో పాటకుడు/ కథకుడు స్త్రీ వేషంలో (భామాకలాపంలో సత్యభామ మాదిరిగా పెద్ద వాలుజడ, కిరీటం, వడ్డాణం, దండకడియాలు) ఉంటాడు. మిగతా ఇద్దరూ పంచెలు, తలపాగాలు ధరిస్తారు. వీళ్లలో ఒకరు వ్యాఖ్యానం చెబితే, మరొకరు హాస్యపు చెణుకులు విసురుతుంటారు. ఈ ఇద్దరూ జముకులను చంకలకు తగిలించుకొని కథకుడికి వంత పాడతారు. అంతేకాదు.. కథకు అనుగుణంగా వివిధ పాత్రలనూ పోషిస్తారు.  
గ్రామస్థులందరూ భోజనాలు ముగించి రాగానే కథ ప్రారంభమవుతుంది. తెల్లార్లూ సాగుతుంది. దానికి ముందు తమ ప్రదర్శనా స్థలంలో కళాకారులు ఓ దీపపు స్తంభాన్ని పాతుతారు. దాన్ని ‘గిరడ’ అంటారు. (కాలానుగుణంగా ఈ గిరడ స్థానంలో పెట్రోమాక్సు, విద్యుద్దీపాలు వచ్చాయి) ప్రార్థనానంతరం ఈ గిరడ చుట్టూ వలయాకారంగా తిరుగుతూ, పాడుతూ, ఆడుతూ కథాగానం చేస్తారు. విరాటపర్వం, సుభద్రా కల్యాణం, కురుక్షేత్రం, సీతావనవాసం, లవకుశ, మహిరావణయుద్ధం తదితర పౌరాణిక గాథలతో పాటు రెక్కల రంభ, ఆళియాదేవి కథ, రేణుకా ఎల్లమ్మ కథ, పరశురాముడి యుద్ధం, కాంభోజరాజు కథ, బాలనాగమ్మ, సారంగధర చరిత్ర, అపూర్వ చింతామణి, జలగన్ని పార్వతి లాంటి జానపద కథలూ చెబుతారు. ఇలా నెలలు కొద్దీ గ్రామాల్లో ఉండి.. స్థానికులు ఇచ్చే కట్నకానుకలు, భత్యాలు స్వీకరించి స్వగ్రామాలకు చేరుకుంటారు.
పల్లె తెలుగులో పసందైన పాటలు
జముకుల కథలో సుమారు ఇరవై బాణీల్లో పాటలు పాడతారు. భారతంలోని కథ చెప్పేటప్పుడు ‘‘ఇంద్ర ప్రస్తాపురం/ ఏలానీవారేమి/ రాజులకు రారాజు/ రాజు దుర్యోధన/....... / పాండురాజు కొమరలు/ వాలుపంచపాండవులు/ పేరుకు పెద్దోడు/ ఆడు ధర్మరాజండి/ బలరాం చెల్లెలా/ చాలరో సుభద్రా/ ద్వారకానగరంబు ఏలిన శ్రీకృష్ణ.. ’’ అంటూ పాత్రలను పరిచయం చేస్తారు.  ‘‘గగన మార్గము వెల్లమ్మ/ రథమెల్లూతున్నాది/ ఉల్లి తోటలు దాటి/ ఊళ్లన్నీ దాటింది/ పసుపు తోటలు దాటి/ పట్నాలే దాటింది/ ఏ తీరుగున్నాడమ్మ/ పాండవా అర్జునుడు’’ అంటూ సన్నివేశాలను కళ్ల ముందు నిలబెట్టేస్తారు. ‘‘చిన్న చిన్న మేఘాలు/ చిన్నన్న నువ్వు రారా/     పెద్ద పెద్ద మేఘాలు/ పెద్దన్న నువ్వు రారా/ పడ్డాది కొండా మీద/ పడ్డాదిరా వానజల్లు’’ అంటూ విషయాన్ని అలతి పదాలతో అందంగా చెబుతారు. చివర్లో ‘‘దిమిత కుందరి తక తదిగినత’’ అంటూ ముక్తాయింపులు ఇస్తారు. అశోకవనంలో సీత శోకాన్ని వర్ణించేటప్పుడైతే వారి స్వరాల్లో శోకరసం కట్టలు తెగుతుంది. ‘‘అన్నికరి దేవుడా/ దేవుడా ఓరి/ పాపిష్టి జన్మంబు/ దేవుడా ఓరి/ ఏల ఇచ్చినావు/ దేవుడా ఓరి/     ఆడ బుట్టుగ కంటె/ దేవుడా ఓరి/ అడవిలోన నేను/ దేవుడా ఓరి/ రుచ్చమై పుట్టు/ దేవుడా ఓరి/ గోలుమని సీతమ్మ/ సీతమ్మ ఓలి అది గోసపెడతాది’’ అంటూ ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తారు.
      తమ పాటలు నచ్చి ఎవరైనా కానుకలు ఇస్తే... ఫలానా వారు సభలో పది రూపాయలు చదివించారని చెప్పి పొగుడుతారు. ‘‘ధన ధాన్య సంపదలు కలిగే ఉండాలి/ తాళవే బంగారు మేడలుండాలి/ పాలు ఇచ్చిన పాడి ఆవులుండాలి/ ఎప్పటికి వారింట లక్ష్మీ ఉండాలి/ అష్ట ఐశ్వర్యములు కలిగి/ ఇష్టదేవుని భోగం కలిగి/ కోటికి వారిల్లు కొనసాగవలెనన్నా ఓయీ’’ అని దీవిస్తారు. కథకు మధ్యమధ్యలో అమ్మవారి గీతాలు, మందులోడి పాట, దువ్వందొర పాట లాంటివి పాడి నవరసాలొలికిస్తారు. వీటిలో దువ్వందొర వృత్తాంతం చాలా ఆసక్తికరం. ఈ ‘దొర’ నిజానికి ఓ దొంగ. ధనవంతులకు, రక్షకభటులకు సవాళ్లు విసిరి మరీ దొంగతనాలు చేసేవాడట. అలా కొల్లగొట్టిన సొమ్మును పేదలకు, వికలాంగులకు పంచేవాడట. ‘‘పొద్దంత మంచోడుర దువ్వందొర/ పొద్దుబోతె దొంగోడురా దువ్వందొర/ పెద్దోల్లను కొడతాడు దువ్వందొర/ పేదోళ్లకు పంచుతాడు ద్వువందొర’’.. అంటూ కళాకారులు అతని సాహసాలను వినిపిస్తుంటే ప్రేక్షకులు మైమరచిపోతారు.
ఆ ఇద్దరితో పాటు...
తమదైన శైలిలో జముకుల కథ చెబుతూ ప్రజల ఆదరాభిమానాలు పొందిన కళాకారులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి దివంగత టంప రాములు. ఒడిశాలోని పర్లాకిమిడి దరి జంగాలపాడుకు చెందిన ఆయన ‘బోనెల రామన్న’గా సుప్రసిద్ధులు. తన గురువు భట్టు లక్ష్మయ్య దగ్గర ఒకటి రెండు కథలు నేర్చుకుని.. తనకున్న కొద్దిపాటి అక్షర జ్ఞానంతో అనేక కథలకు బాణీలు కట్టారు రాములు. శశిరేఖ పరిణయం, విరాటపర్వం, పురూరవ చరిత్ర, జలగన్ని పార్వతి, బాలనాగమ్మ, అళియాదేవి, కాంభోజరాజు కథ, రెక్కల రంభ, అపూర్వ చింతామణి, సారంగధర, రేణుకా ఎల్లమ్మాదేవి కథలు చెబుతూనే, సమకాలీన సంఘటనల మీద అల్లిన పాటలనూ వినిపించేవారు. స్త్రీ పాత్ర పోషణను బాగా రక్తి కట్టించేవారు. అప్పట్లో ఉద్దానం ప్రాంతంలో రాములు పాటకు విపరీతమైన గిరాకీ ఉండేది. ఆయన ప్రదర్శన కోసం గ్రామాల వారీగా పోటీపడి మరీ బయానా కట్టేవారు. కోల్‌కతా, భిలాయి, పారాదీప్‌ల్లో కూడా రాములు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన శిష్యుడు బత్తుల విశ్వనాథం కొనఊపిరితో ఉన్న ఈ కళను అడపాదడపా ప్రదర్శిస్తున్నారు. 
      విజయనగరం జిల్లా కుమరాం గ్రామానికి చెందిన ఎద్దు పైడితల్లి మరో ప్రఖ్యాత కళాకారుడు. అన్న చినరాములు దగ్గర జముకు పాట నేర్చుకున్నారు. పైడితల్లెమ్మ, జామి ఎల్లారమ్మ, అనకాపల్లి నూకాలమ్మ జాతర్లలో ఈయన పాట తప్పనిసరి. కుటుంబసభ్యులతో కలిసి బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో కూడా కథాగానం చేశారు. గ్రామదేవతల పుట్టు పూర్వోత్తరాలతోపాటు బ్రహ్మంగారి తత్త్వాలు, కీర్తనలు, జావళీలు పాడేవారు. గాంధీజీ మీద కూడా పాట కూర్చి ఆలపించారు. పైడితల్లి కీర్తిశేషులైన తర్వాత స్వగ్రామంలో ఆయన విగ్రహం నెలకొల్పడం కళకు దక్కిన గౌరవం. అలాగే, తండ్రి నుంచి ఈ కళావారసత్వాన్ని అందిపుచ్చుకున్న లక్కిడాం సన్యాసమ్మ (విజయనగరం) కూడా యాభై ఏళ్ల పాటు ప్రదర్శనలు ఇచ్చారు. పార్వతీపురం ప్రాంతానికి చెందిన పైడయ్య, తూర్పుగోదావరి జిల్లా కరవ గ్రామవాసి వేమగిరి సుందరరావు కూడా అనేకచోట్ల తమ కళాకౌశలాన్ని ప్రదర్శించారు.
చైతన్యోద్యమాలకు బాసటగా...
శ్రీకాకుళం గిరిజన రైతాంగ ఉద్యమం ప్రజలకు చేరువకావడంలో జముకుల కథ పాత్ర కూడా ఉంది. ముఖ్యంగా బోనెల పాటల బాణీల్లో సుబ్బారావు పాణిగ్రాహి పాడిన పాటలు సామాన్యులను చాలా ప్రభావితం చేశాయి. సుబ్బారావు స్వయంగా పాటలు రాసి, తానే జముకు వాయించుకుంటూ వంతలతో కలిసి వందలాది ప్రదర్శనలిచ్చారు. ‘‘తెలుగుదేశం మనది తెలుగువారం మనం/ ముక్కోటి ఆంధ్రులము ఒక్కటై నిలవాలి’’ అంటూ జాతి వైభవాన్ని కీర్తించారాయన. ‘‘దక్షిణదిశనా మన తెలుగు దేశానా/ పేరు శ్రీకాకుళము’’ అంటూ ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని, గిరిజనుల కష్టాలను ఏకరవు పెట్టారు. అలాగే, పీసా లక్ష్మణరావు ‘కన్యక’ కథను జముకుల పాటల ద్వారా సామాన్యుల చెంతకు తీసుకెళ్లారు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, గరికిపాటి రాజారావు, కర్నాటి లక్ష్మీనర్సయ్య తదితర ప్రజానాట్యమండలి కళాకారులు జముకుల పాటలను ఆధునికీకరించి ప్రజా సమస్యలను విడమరిచారు. మరెంతోమంది ఆధునిక జముకుల కథలను రాసి పాడారు. అదంతా ఓ చరిత్ర! 
       ప్రస్తుతం జముకుల కథ వేగంగా కనుమరుగవుతోంది. కళింగాంధ్రలో ఈ కళాకారుల బృందాలు యాభై దాకా ఉన్నా,  వాళ్లలో చాలామంది తమ వృత్తిని కోల్పోయారు. మరికొంతమంది గ్రామాలు, రైళ్లలో భిక్షాటన బాటపట్టారు. రాత్రిపూట ప్రదర్శనలు దాదాపుగా ఆగిపోవడంతో లక్కిడాం సన్యాసమ్మ, వేమగిరి సుందరరావు, బత్తుల విశ్వనాథం, గుంట కృష్ణమూర్తి, భూతాల జ్యోతి, మరడాన సోములు లాంటి కళాకారులు ఉపాధిని కోల్పోయారు. అమ్మవారి పండగల్లో, జాతర్లలో మాత్రమే ఒకటీ అరా కనిపిస్తున్నారు. మరికొన్ని కుటుంబాల్లో విద్యాధికులైన కొత్తతరం ఈ కళను వారసత్వంగా స్వీకరించట్లేదు. భిన్న వేదికల ద్వారా కళాకారులను ప్రోత్సహించడంతో పాటు వాళ్ల పాటలను శాస్త్రీయంగా నమోదు చేయడం తక్షణ అవసరం. ఉపాధికి భరోసా దొరికితే యువత ఈ కళను అభ్యసిస్తుంది. అలాంటి నమ్మకం వాళ్లకి కలిగినప్పుడే ఈ కళ బతుకుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం