కళాతపస్వి

  • 222 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అంబేకర్‌ గోపీకృష్ణ

  • ఆదిలాబాదు
  • 8008618881
అంబేకర్‌ గోపీకృష్ణ

ఆనాటి భారతీయ గ్రామీణ వ్యవస్థకు అదో ప్రతిబింబం. అంతరించిపోతున్న మన ప్రాచీన కళలను కాపుగాస్తున్న విజ్ఞాన భాండాగారం. అక్కడి వాతావరణం మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. మనసు లోతులను తడుముతుంది. అదే.. ఖండాంతర ఖ్యాతిగాంచిన ఆదిలాబాదు రవీంద్రశర్మ ఆశ్రమం. ‘గురూజీ’గా ప్రసిద్ధులైన శర్మ దివంగతులైనప్పటికీ అక్కడి కళాకృతులు ఇప్పటితరానికి ఓ దిక్సూచే. 
      రవీంద్రశర్మ పూర్వికులది పంజాబ్‌. నైజాం కాలంలో ఆయన తాత ఆదిలాబాదులో స్థిరపడ్డారు. అలా రవీంద్రశర్మ ఈ గడ్డ మీదే జన్మించారు. ఆదిలాబాదు, హైదరాబాదుల్లో చదువుకున్నారు. జేఎన్‌టీయూలో శిల్పశాస్త్రంలో డిప్లొమా, బరోడాలోని మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయం నుంచి లోహపు పోత (మెటల్‌ కాస్టింగ్‌)లో పోస్టుడిప్లొమా పట్టాలు అందుకున్నారు. భారతీయ గ్రామీణ కళల మీద చాలా ఆసక్తి ఉన్న శర్మ, ప్రభుత్వ అధ్యాపక వృత్తిని వదులుకుని మరీ కళాశ్రమాన్ని స్థాపించారు. శిల్పకళ, నాట్యం, చిత్రలేఖనం లాంటి వాటితో పాటు జానపద కళలను నవతరాలకు చేరువ చేయడంలో విశేషకృషి చేశారాయన. 1986-87 ప్రాంతంలో రవీంద్రశర్మ కళాశ్రమం కోసం అప్పటి ప్రభుత్వం ఆదిలాబాదు ఇందిరా ప్రియదర్శిని మైదానం సమీపంలో దాదాపుగా మూడెకరాల స్థలాన్ని కేటాయించింది. అప్పటి నుంచి శర్మ కళాసేవ మరింత ఊపందుకుంది. రవీంద్రశర్మ స్వయంగా 16 రకాల కళల్లో నిష్ణాతులు. రాతిశిల్పాలు చెక్కడం, నగిషీలను తయారు చేయడం, చిత్రాలు వేయడం, సూక్ష్మచిత్రాలకు ప్రాణంపోయడం, ఇత్తడి, మట్టి కళాఖండాలను సృజించడం, కర్ర, వెదురు సహా వ్యర్థ సామగ్రితో ఉపయోగపడే వస్తువులను తయారు చేయడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. సంప్రదాయకతకు, ఆధునిక శైలిని జోడించి రూపుదిద్దిన కళాకృతులు ఆయనకు మంచిపేరు తెచ్చాయి. వాటితో కొలువుదీరిన కళాశ్రమంలోకి అడుగుపెట్టగానే గ్రామీణ జీవన పరిమళాలు మన ముక్కుపుటాలను తాకుతాయి. కుమ్మరి గూనలు, రాగి, ఇత్తడి వస్తువులు, వ్యవసాయ పరికరాలు ఒకనాటి పల్లె జీవినవిధానాలను కళ్లకు కడతాయి. ఉదయం, సాయంత్రం మాటామంతి, రాగాలాపనలతో సందర్శకుల మనసు ఉత్తేజితమవుతుంది.   
      ఏటా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కళాశ్రమంలో ‘మిత్రమిలన్‌’ నిర్వహించడం రవీంద్రశర్మకు అలవాటు. ఈ సమ్మేళనానికి రాష్ట్రం, దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచీ కళాకారులు, సాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు వచ్చేవారు. అయిదు రోజుల పాటు అక్కడే ఉండేవారు.  ముంబాయి, దిల్లీ, ఖరగ్‌పూర్‌, భోపాల్‌ ఐఐటీల్లో విద్యార్థులకు సంప్రదాయ విజ్ఞానం మీద పాఠాలు బోధించిన అనుభవం శర్మ సొంతం. దాంతో పాటు హైదరాబాదు నిఫ్ట్‌ విద్యార్థులకు గ్రామీణ వ్యవస్థ, కులవృత్తులు, భారతీయ జీవన విధానం మీద దిశానిర్దేశం చేయడం, ఆయనకు దేశవ్యాప్తంగా శిష్యులను ఇచ్చింది. శర్మ కృషికి గుర్తింపు గా 2010లో రాష్ట్ర ప్రభుత్వం ‘కళారత్న’ పురస్కారాన్ని ఇచ్చింది. దిల్లీ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో, తెలంగాణ ప్రభుత్వం 2015 ఉగాది పురస్కారంతో శర్మను గౌరవించాయి. రవీంద్రశర్మ, రాజశ్రీ దంపతులకు ఇద్దరు పిల్లలు.. అపూర్వ శర్మ, దివ్య. జీవితాంతం సాంప్రదాయ కళలకు ఆధునిక వన్నెలద్దే ప్రయత్నం చేసిన రవీంద్రశర్మ... తన జ్ఞాపకంగా కళాశ్రమాన్ని వదిలి ఏప్రిల్‌ 29న స్వర్గస్థులయ్యారు. 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం