హరికథా దిగ్గజం

  • 209 Views
  • 0Likes
  • Like
  • Article Share

    గంగవరపు శ్రీనివాసరావు

  • సికింద్రాబాదు
  • 8008573363
గంగవరపు శ్రీనివాసరావు

హరికథను ఆధ్యాత్మిక ప్రచార సాధనంగా మలచుకుని పదిహేను వందలకు పైగా హరికథా కాలక్షేపాలు చేసిన అరుదైన వ్యక్తి బ్రహ్మశ్రీ గుండు వెంకట్రామశర్మ. తెలంగాణలో సుప్రసిద్ధ హరికథా విద్వాంసులైన ఆయన 1924లో సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం దామరకుంటలో జన్మించారు. తల్లిదండ్రులు రత్నమ్మ, గుండు రామచంద్రయ్య. యుక్త వయసు నుంచే వంశపారంపర్యంగా ఆధ్యాత్మికతను అలవర్చుకున్న ఆయన శాస్త్రాలు, పురాణాలు చదివారు. శ్రీకృష్ణ తులాభారం, గయోపాఖ్యానం వంటి భారత, భాగవత గ్రంథాల్లోని ఎన్నో ఘట్టాలను ఆపోసన పట్టారు. ఐదు దశాబ్దాలపాటు ప్రసిద్ధ పుణ్యకేత్రాలైన వేములవాడ, యాదగిరిగుట్ట, ఇతర దేవాలయాల్లో హరికథా కాలక్షేపంతో పాటు ప్రవచనాలు చేశారు. నాచగిరి అలియాబాద్‌ రామాలయం, కీసరగుట్ట ఉత్సవాలప్పుడు కూడా హరికథా కాలక్షేపం చేసేవారు. తన స్వగ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండురంగ ఆశ్రమాన్ని ఆయన గురుస్థానంగా భావించేవారు. ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా అక్కడి పాండురంగడిని దర్శించుకునేవారు. అక్కడ కూడా ఎన్నో హరికథా కాలక్షేపాలు చేశారు. హరికథా పితామహులుగా ప్రసిద్ధి చెందిన ఆదిభట్ల నారాయణదాసు వద్ద శిష్యరికం చేసిన వెంకట్రామశర్మ, అష్టాదశ పురాణాలను వివిధ నృత్యభంగిమల్లో ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు వివరించేవారు. కాలక్రమంలో హరికథకు ఆదరణ తగ్గాక యజ్ఞయాగాలు, వేద పూజలు చేసేవారు. వయోభారం వల్ల హరికథా ప్రదర్శనలు ఇచ్చే శక్తి సన్నగిల్లడంతో ఒకటిన్నర దశాబ్దం కిందట రుగ్మాబత్తుల నరసింహశాస్త్రికి తన స్వర్ణకంకణం, చిడతలను బహుమతిగా ఇచ్చారు. 1978లో హైదరాబాదు నగరానికి వచ్చిన ఆయన సికింద్రాబాదు ఓల్డ్‌ ఘాస్‌మండీలో నివాసం ఏర్పరచుకున్నారు. ఇరవై ఏళ్ల వయసులోనే వెంకట్రామశర్మకు జయలక్ష్మితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. రమేష్‌, లలిత, జానకి. 21 ఏళ్ల క్రితమే ఆయన భార్య కన్నుమూశారు. కుమారుడి వద్దనే ఉంటున్న వెంకట్రామశర్మ మే 14న తన స్వగృహంలో స్వర్గస్థులయ్యారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం