సినిమా శాస్త్రజ్ఞుడు 

  • 166 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చందలూరి నారాయణరావు

  • అద్దంకి

‘సినిమాలు రాత్రి బడులు’ అంటారు బీ.ఎన్‌.రెడ్డి. సినిమాకి ఆ శక్తి ఉంది. అజ్ఞానపు చీకట్లను తరిమేసే తపన ఉంది. సినిమా ముమ్మాటికీ వినోద సాధనమే. కానీ లోతుగా పరిశీలించి, పరిశోధించగలిగితే ఓ శాస్త్రం... ఓ చరిత్ర పాఠం. ఏ శాస్త్రానికైనా ఓ ‘ఆది’ అంటూ ఉంటుంది. పరిణామక్రమ దశ ఉంటుంది. దాన్ని అవగాహనకు తెచ్చుకుంటే, ఆ లోతుల్లోకి వెళ్లగలిగితే అది సమూలంగా అర్థం అవుతుంది. అలా  సినిమాని ప్రేమించి, ఓ శాస్త్రంగా భావించి, దానిపై విశేషమైన అధ్యయనం చేసిన వ్యక్తి... నందగోపాల్‌. ఓ సినిమా చూసి ‘బాగుంది, బాగోలేదు’ అని చిటికెలో చెప్పేయడం వేరు. ఎందుకు బాగుందో, ఎందుకు బాగోలేదో... లోతైన విశ్లేషణ చేయడం వేరు. అది విమర్శకుల గుణం. పరిశోధకులు అలా కాదు. ఆ సినిమాకి సంబంధించిన సాంకేతికతని, ఆ సాంకేతికత పుట్టుకొచ్చిన విధానాన్ని కూడా సమూలంగా అధ్యయనం చేస్తారు. ఆ విజ్ఞానాన్ని పదిమందికీ పంచిపెడతారు. నందగోపాల్‌ అలాంటి విమర్శకులే. ‘థియేటర్లో సినిమా చూడడం ధ్యానం చేయడంతో సమానం’ అంటుండేవారాయన. చలన చిత్రానికి ఆయన ఇచ్చిన స్థానం అలాంటిది. సినీ పాత్రికేయుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నందగోపాల్‌ ఎల్వీ ప్రసాద్‌, బి.నాగిరెడ్డి, చక్రపాణిలకు అత్యంత ఆప్తుడు. ఎన్టీఆర్‌తోనూ సన్నిహితంగా మెలిగారు. నందగోపాల్‌ సినిమా చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాల్ని సేకరించారు. అ అంశాలన్నీ గుదిగుచ్చి సినీ ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో విశదీకరించారు. అందుకే ఉత్తమ సినీ విమర్శకుడిగా, సినీ రచయితగా ఎన్నో పురస్కారాల్ని అందుకున్నారు. ‘సినిమాగా సినిమా’ అనే పుస్తకం నందగోపాల్‌ కృషికి, కష్టానికి గుర్తింపు. ఈ పుస్తకం 61వ సినీ జాతీయ అవార్డుల్లో ఉత్తమ సినీ విమర్శ పురస్కారాన్ని అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది పురస్కారంతో సత్కరించింది. నందగోపాల్‌ పదేళ్ల పాటు ‘తెలుగుతెర’, ‘కినిమా’ పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. ఈ ‘సినిమా శాస్త్రజ్ఞుడు’ జూన్‌ 22న హైదరాబాద్‌లో పరమపదించారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం