బాబోయ్‌ వాడో పరికికంప

  • 1493 Views
  • 14Likes
  • Like
  • Article Share

ఒకటి, రెండు పదాలతో అనంత భావాన్ని, అంతులేని విషయ వివరణను అందిస్తాయి జాతీయాలు. భాషకు నూతన సొబగులద్దుతాయివి. పౌరాణిక పాత్రలు, నిత్యజీవిత వ్యవహారాలు, ఆచారాలు, అనుభవాలు, చరిత్ర, ప్రకృతి పరిశీలన ఇలా ఎన్నో అంశాల నుంచి ఇవి ఉద్భవించాయి. గ్రామీణ సంస్కృతికీ, మానవ మనస్తత్త్వ విశ్లేషణకూ గీటురాళ్లు లాంటి జాతీయాలు తెలుగులో కోకొల్లలు. వాటిలో కొన్నింటిని చూద్దాం. 

తంజావూరు సత్రం
తమిళనాడులో కావేరీ తీరంలో ఉంటుంది తంజావూరు. నాదబ్రహ్మ త్యాగరాజు జన్మస్థలం తిరువాయూరు ఇక్కడికి చాలా దగ్గర. ప్రసిద్ధ బృహదీశ్వరాలయం కూడా తంజావూరులో ఉంది. అయితే ఇక్కడ నాయక రాజుల కాలంలో కట్టించిన సత్రంలో అందరికీ ఉచితంగా భోజనం పెట్టేవారు. దాంతో క్రమేణా ఆ సత్రం సోమరులకు నిలయంగా మారింది. ఇంట్లో కుటుంబ పెద్ద ఒక్కడే కష్టపడి పనిచేసి సంపాదిస్తుంటే, ఇంటిల్లిపాదీ సుష్టుగా భోంచేసి, హాయిగా కునుకు తీస్తుంటే, ‘ఇల్లంతా తంజావూరు సత్రం’ అయ్యిందనడం రివాజు.


దొరపాలేరు
స్వేచ్ఛలేని బానిస జీవి గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయం ఉపయోగిస్తుంటారు. పాలేరుకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉండవు. తాను ఏది చూసినా, ఏది విన్నా దొర చెప్పిందే చెప్పాలి, చెయ్యాలి. దొర అన్యాయం చేసినా, దొర చెప్పింది సరికాదని తెలిసినా పాలేరుకు దొర పలుకే వేదం కదా!


పైలాపచ్చీస్‌
ఉర్దూ నుంచి ఎన్నో పదాలు తెలుగులో చేరినట్లుగానే, జాతీయాలు కూడా వచ్చాయి అలాంటిదే ఇది. ‘పైలాపచ్చీస్‌’లోని పైలా అనేది పెహలా పదానికి రూపాంతరం. అంటే మొదటిదని అర్థం. ఇక ‘పచ్చీస్‌’ అంటే ఇరవై అయిదు. కోడెవయసు, ఇరవై అయిదేళ్ల జోరు వయసు అని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. 


నక్షత్రకుడు
హరిశ్చంద్రుడి కథ నుంచి వచ్చిందీ జాతీయం. విశ్వామిత్రుడి శిష్యుడు నక్షత్రకుడు. వాగ్దానం ప్రకారం హరిశ్చంద్రుడు ఇవ్వాల్సిన డబ్బును రాబట్టేందుకు తన శిష్యుణ్ని అతని వెంట పంపిస్తాడు విశ్వామిత్రుడు. దార్లో హరిశ్చంద్రుణ్ని నానా తిప్పలూ పెడతాడు నక్షత్రకుడు. ఆ సత్యవాక్పరిపాలకుడితో అబద్ధం ఆడించాలని కూడా ప్రయత్నిస్తాడు. సాటివారిని ఇలా వేధించుకు తినేవాళ్లను ఉద్దేశించి ‘నక్షత్రకుడిలా దాపురించాడు’ అనడం పరిపాటి.


పిల్లినడక
పిల్లి చప్పుడు చేయకుండా నడుస్తుంది. అది పరుగులు తీసినప్పుడు కూడా మనకు ఎలాంటి శబ్దమూ వినిపించదు. ఈ లక్షణం వేటాడటంలో పిల్లికి చాలా సాయపడుతుంది. మనుషుల్లో కూడా ఇలాగే ఎలాంటి చప్పుడూ చేయకుండా అడుగు తీసి అడుగు జాగ్రత్తగా వేస్తూ నడిచేవారుంటారు. అలాంటి వ్యక్తులనే ‘అబ్బో వాడిది పిల్లినడక’ అని సరదాగా ఎగతాళి చేస్తుంటారు. 


కాళ్లలో కట్టెవెట్టు
ఎవరైనా మంచి పని చేస్తుంటే కొంతమంది ఓర్చుకోలేరు. ఏదో ఒకటి చేసి ఆ పనిని చెడగొట్టాలనుకుంటారు. అలాంటి వాళ్లనుద్దేశించే ఈ జాతీయం పుట్టుకొచ్చింది. నడుస్తున్న వ్యక్తుల కాళ్ల మధ్యలో కర్ర పెడితే వెంటనే కింద పడిపోతారు. ఎదుటి వాళ్లు చేసే పనికి అవాంతరాలు సృష్టించే వాళ్లని ‘వాడు కాళ్లలో కట్టెపెట్టే రకం’ అని అంటుంటారు మన ఊళ్లలో.


పరికికంప
సందు దొరికితే చాలు తమ మాటలతో ఎదుటివాళ్ల బుర్రల్లోని గుజ్జునంతా జుర్రేసే వాళ్లనుద్దేశించి ఈ జాతీయం పుట్టుకొచ్చింది. పరికికంప అనేది ఓ ముళ్లపొద. దీనికి వస్త్రం చిక్కుకుందంటే తొలగించడం చాలా కష్టం. ఒక వేళ కష్టపడి తీసినా చిరగడం ఖాయం. ఒక్కసారి పట్టుకున్నారంటే.. అంత సులువుగా వదలిపెట్టని వ్యక్తి గురించి ‘బాబోయ్‌.. వాడో పరికికంప’ అని భయపడుతూ చెబుతుంటారు. 


గడ్డిలో సూది
ప్రయోజనం లేని పనులు చేసేవాళ్ల గురించి చెప్పే మాట ఇది. పెద్ద వస్తువుల మధ్యలో చిన్నవాటి ఉనికి తెలియదు. గడ్డివామిలో సూది పడిపోతే దొరకడం దాదాపు అసాధ్యం. ఆ విషయం తెలిసి కూడా సూది కోసం వెతకడం మూర్ఖత్వమే. ఉపయోగంలేని పనులు చేసేవాళ్లని ‘వాడు గడ్డివామిలో సూది వెతుకుతుంటాడు’ అంటుంటారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం