రంగస్థలం, కృష్ణార్జునయుద్ధం, నీది నాది ఒకే కథ, భరత్ అను నేను, మహానటి

  • 654 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ప్రవాహి

కోట్లాది మందిని ప్రభావితం చేసే చలనచిత్ర మాధ్యమంలో తెలుగు భాషకు సముచిత గౌరవం దక్కట్లేదన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అయితే.. గత కొంతకాలంగా ఆ ధోరణి మారుతోంది. తెలుగువాళ్లందరికీ సంతోషం కలిగించేలా చిత్రాల పేర్ల దగ్గరి నుంచి సంభాషణలు, పాటల వరకూ అన్నిచోట్లా చక్కటి తెలుగు వినిపిస్తోంది. ఈమధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో చాలా మటుకు కమ్మని తెలుగు పేర్లతో అలరించాయి. అజ్ఞాతవాసి, జైసింహా, రంగుల రాట్నం, భాగమతి, గాయత్రి, తొలిప్రేమ, ఆఁ, మనసుకు నచ్చింది, చల్‌ మోహన్‌రంగ, కణం.. లాంటి పేర్లే అందుకు ఉదాహరణ. 
ఇక ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు కురిపించిన అచ్చ తెలుగు వెన్నెల ఇది...

అచ్చ తెలుగు రంగస్థలం!
సినిమా నేపథ్యమే నాలుగు దశాబ్దాల కిందటి కాలం. ఇదే సినిమా మొత్తం తెలుగు పూత పూయించడానికి కారణం అయింది. పాటల్లో అయితే కొత్త కొత్త ఉపమాన ప్రయోగాలు కట్టిపడేసేలా వినిపించాయి. కథ కొత్తది కాదు. చూసేవాళ్లూ చేసేవాళ్లూ కొత్త! అదే బలమైంది. దర్శకుడు సుకుమార్‌ గ్రామీణ పెత్తందారీ వ్యవస్థను చూపించే ప్రయత్నం చేశారు. అన్నదమ్ముల అనుబంధం, ఓ ప్రేమకథ, ప్రతినాయకుడితో వైరం.. వెరసి ఓ ఊరి కథగా దీన్ని తీర్చిదిద్దారు. చిట్టిబాబు, కుమార్‌బాబు, రామలక్ష్మి, ప్రెసిడెంట్‌, రంగమ్మత్త.. ఇవే ప్రధాన పాత్రలు. మాటలు అందించేందుకు తోట శ్రీనివాస్‌, కాశీవిశాల్‌, బుచ్చిబాబు, శ్రీనివాస్‌ రంగోలీలు రంగస్థలం నాలుగు దిక్కులా నిలబడ్డారు. వల వేసిన ప్రతిసారీ పులసే పడినట్లు సినిమాలో ప్రతి పాటా సంబరాన్ని అందించింది.
గోదారి యాసలో ఆద్యంతమూ ఆకట్టుకుంది ఈ చిత్రం. ‘‘ఎదురు సూడ్డం కూడా పేమేనంట’’ అంటూ సాగే నాయిక సంభాషణలు రక్తికట్టించాయి. రంగమ్మా మంగమ్మా పాటకు ‘స్ఫురణ గీతాలు’ (స్పూఫ్‌/కవర్‌/పేరడీలు) లెక్కలేనన్ని వచ్చాయి. ఎంతసక్కగున్నవే అంటూ చెప్పడానికి వాడిన ఉపమానాలు తాజాగా ఉన్నాయి. లంకెబిందె.. మల్లెపూల మధ్య బంతిపూవు.. ముత్తయిదువ మెళ్లో పసుపుకొమ్ము.. రెండు కాళ్ల చినుకు.. ఎంకిపాటలో తెలుగుమాట.. లాంటి ప్రయోగాలు అలరించాయి.
ఆ పాటే సినిమాకి రప్పించింది   
సాదాగా సాగిపోతున్న సినీ గీతాల ఒరవడిని ‘దారిసూడు దుమ్మూ సూడూ మామా.. దున్నపోతుల బేరే సూడూ..’ అంటూ ఓ దుమ్ము దులిపిందో జానపదం. కృష్ణార్జునయుద్ధం సినిమా ద్వారా పెంచలదాస్‌ పంచిన ఈ పాట చాలామందిని థియేటర్లకు రప్పించింది. జానపదం దమ్ము అది. ఈ పాటలోనే కాదు.. సినిమా ఆద్యంతమూ కథానాయకుడి నోట చిత్తూరు మాండలికం చిందులేయించింది. మరుగున పడ్డ పదాలను కొత్తతరం వింతగా చెవులింతలు చేసుకుని వింది. మేర్లపాక గాంధీ దీనికి దర్శకుడు. నాని ప్రధానపాత్రధారి. పల్లె నేపథ్యం ఉండటం వల్ల మంచిమంచి సంభాషణలు సినిమాలో వినిపించాయి. ‘‘నాట్లేసే సమయానికి రారా అంటే.. కోతలు కోసే సమయానికి వచ్చావు..’’, ‘‘ఊరికి స్వర్గం నుంచి బస్సేసేరా ఏందీ?.. లేకపోతే బస్సులోకి దేవకన్యలెలా వచ్చార్రా?’’, ‘‘రామాయణం రాసింది పరుచూరిబ్రదర్స్‌ అని నేనూ, కాదు.. విజయేంద్రప్రసాద్‌ అని వాడూ పందెం కాసుకున్నాం..’’, ‘‘చాపలకు సలి లేనట్టు.. మన ఊరోళ్లకి బుద్ధి లేదు’’, ‘‘అమ్మాయిలు పూల మీదో, వర్షంలో నడిసినప్పుడు కాదురా... ఎవరినైనా ఇలా కొట్టినప్పుడే అసలైన అందం బయటపడుతుంది’’, ‘‘పంటంతా మనుషులే తొంటే.. పాపం గోవులేం తినాలి. అవి మాత్రం బతకద్దా ఏంది? అందుకే వాటి స్వాతంత్య్రం ఇచ్చిన’’ లాంటి సంభాషణలు హాస్యాన్ని చిలకరించాయి.
శ్రమజీవన సౌందర్యం
నీదీ నాదీ ఒకే కథ.. తెలుగు మాటల్లో పదును చూపించిన ఓ మంచి చిత్రం. వేణు ఉడుగుల దర్శకత్వంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా వచ్చిందిది. విద్యా వ్యవస్థలోని లోపాన్ని సూటిగా ఎత్తిచూపింది. ర్యాంకులే పరమావధిగా సాగుతున్న చదువుల్లో తల్లిదండ్రులు ఎంత మూర్ఖంగా ఒకోసారి ఆలోచిస్తారో, అందుకు సాధారణ విద్యార్థి/ వెనకబడిన విద్యార్థి ఎంత గుంజాటన పడి విలవిల్లాడతాడు అన్న విషయాన్ని ముక్కుసూటి కథనంతో రక్తికట్టించారు. ‘‘నవ్వురావడం, కోపం రావడం బాధ కలగడం ఇవన్నీ మనిషి ప్రాథమిక భావోద్వేగాలే కదా.. అస్తమానం పాజిటివ్‌ థింకింగ్‌ అంటే ఎలా కుదురుతుంది?.. భావోద్వేగాలను నియంత్రించుకుని రోబోల్లా బతకమంటే.. మనిషి తన స్వేచ్ఛను తానే చంపుకున్నట్లు కదా..’’ అంటూ ఆలోచింపజేసే సంభాషణలు ఈ చిత్రానికి ఆయువుపట్టు. చదువులోనూ డబ్బు సంపాదనలోనే కాదు.. చేసే ప్రతి పనిలోనూ ఆనందాన్ని చూడాలని చెప్పారు. ‘‘డబ్బు సంపాదనలోనే ఆనందం ఉంటే.. డాక్టర్లూ ఇంజినీర్లూ డిప్రెషన్‌కు గురై ఎందుకు నాన్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?’’ అన్న ప్రశ్న.. ప్రత్యేకంగా టీనేజీ పిల్లలున్న తల్లిదండ్రులకే! ‘శ్రమజీవన సౌందర్యాన్ని’ గుర్తించాలని ఉద్వేగభరితంగా కొడుకు పాత్రతో చెప్పించిన ప్రయత్నం విమర్శకుల మెప్పు పొందింది.
పాటల్లోని ‘నాలోని నువ్వూ.. నీలోని నేనూ.. మోసేటి నేలకు కనులైనామూ..’ లాంటి భావాలు (శ్రీనివాస్‌ జిలుకర) కొత్తగా ఉన్నాయి. సినిమా చివర్లో ‘హృదయమెంత తపిస్తే..’ అంటూ ఆర్ద్రంగా సాగిపోయే గజల్‌ (డా.శ్యామల) ఈ కథను అద్దంలో చూపించింది.
కావాల్సినంత అంతఃకరణ శుద్ధి..
కథానాయకుడు మహేశ్‌బాబు చిన్నప్పుడే విదేశాలకు వెళ్లిపోవడంతో.. తెలుగుకు కాస్తంత దూరమవుతాడు. అతడు అనుకోకుండా ముఖ్యమంత్రి అవుతాడు. ప్రమాణ స్వీకారంలో అంతఃకరణశుద్ధితో అన్న పదం ఉచ్చరిస్తూ తడబడితే.. ఓ వార్తాపత్రిక ఆ విషయాన్ని ఎద్దేవా చేస్తూ రాస్తుంది. భాషను సరిచేసుకుంటాడు నాయకుడు. మర్నాడు ఆ పత్రికా విలేకరి ఫలానా నిర్ణయం ఎలా తీసుకున్నారని పదిమందిలోనూ అడిగితే.. ‘‘అంతఃకరణ శుద్ధితో’’ అని జవాబిస్తాడు. చిత్రంలో.. ఇదొక ఈల సన్నివేశం!
విద్యావ్యవస్థలో తెలుగు వల్ల నష్టపోతున్నారన్న కోణం ఓ సన్నివేశంలో కనిపిస్తుంది. ఆంగ్ల మాధ్యమమే గొప్ప అన్న వాదనను సమర్థించడం అవగాహనారాహిత్యమే.  అమ్మభాషలో బోధనే పిల్లల్ని సమున్నతంగా తీర్చిదిద్దుతుందని పరిశోధకులు నిగ్గుదేల్చారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను కూలదోసిన పాలనాపరమైన లోపాలను అర్థం చేసుకోకుండా, తెలుగు వైపు వేలు చూపించడం భాషాభిమానులకు రుచించదు. రామజోగయ్యశాస్త్రి అందించిన పాటల్లో ‘నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి..’ అన్న వాక్యాలు కొత్తగా ఉన్నాయి. సినిమా ఆద్యంతమూ కథానాయకుడు ఇంగ్లీషు పదాలకు తెలుగు అర్థాలేంటో తెలుసుకుంటూ ఉంటాడు.. ఇదీ ఆలోచింపజేసేదే!
సావిత్రమ్మ జీవితమే కథగా..
మహానటి సావిత్రి జీవిత కథను సినిమాగా తీసుకొచ్చారు నాగ్‌అశ్విన్‌. కీర్తిసురేశ్‌ నాయిక. ఇలాంటి కథలో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, ఎస్వీయార్‌ ఇలాంటి హేమాహేమీలు ఎవరనే ఆసక్తికి వీలైనంత న్యాయం చేశారు. 1940 దశకం నుంచి 1980 మధ్య సాగిన కథనానికి తగిన వనరులు లభించాయి. అభిమానులకు సైతం తెలియని ఘట్టాలు ఈ సినిమాకు అదనపు బలం.
బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందించారు. ‘నీ కలలను కూడా నేనే కన్నాను కదే..’ అంటూ ముగిసే చౌదరి పాత్ర (రాజేంద్రప్రసాద్‌) గుర్తుండిపోతుంది. చక్రపాణి (ప్రకాశ్‌రాజ్‌) చెప్పే సంభాషణలు.. ‘‘నీకు అవసరం అయినప్పుడు సినిమా ఉంది.. ఇప్పుడు సినిమాకు నీ అవసరం ఉంది.. ఉండవా..’’ లాంటివి ఆకట్టుకుంటాయి.
అంత్య ప్రాసలతో సాగే మహానటి శీర్షికాగీతం (రామజోగయ్యశాస్త్రి) అలరిస్తుంది. ‘‘ఆగిపో బాల్యమా.. తొందరగా నను పెంచేసి నువ్వేమో చినబోకుమా..’’ అంటూ బాల్యాన్ని అడిగే సిరివెన్నెల ప్రశ్న చిత్రంలో అందంగా ఒదిగిపోయింది. ‘‘చివరకు మిగిలేదీ.. విన్నావా మహానటీ.. మా చెంపల మీదుగా.. ప్రవహించే మహానదీ..’’ అంటూ నివాళి వాక్యంగానూ సిరివెన్నెల కలం అంజలి ఘటించింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం