నాటకానికి అడుగుజాడ కందుకూరి

  • 2016 Views
  • 5Likes
  • Like
  • Article Share

    డా।। కందిమళ్ల సాంబశివరావు

  • చిలకలూరిపేట, గుంటూరు
  • 9848351517
డా।। కందిమళ్ల సాంబశివరావు

చిటికెడు అపార్థం... పిడికెడు అభిమానం... చారెడు విషాదం... దోసెడు ఆనందం... వీటన్నింటి కలబోతే జీవితం. ఆ జీవిత రంగంపై చీకటి వెలుగుల తారంగం; వెలుగు నీడల సయ్యాట నాటకం. అనేక రుచులున్న జనానికి వండి ఒకే పళ్లెంలో వడ్డించేది నాటకం. అది కన్నీళ్లను చిందిస్తుంది. నవ్వుల పువ్వులను పూయిస్తుంది. చెర్నాకోలాతో ఛెళ్లున చరుస్తుంది. మొద్దు నిద్దురను వదిలిస్తుంది. కళ్లలో ఎర్ర జీరల్నీ తెప్పిస్తుంది. గుప్పిళ్లను బిగింపజేస్తుంది. కదిలి కదిలిస్తుంది. నడిచి నడిపిస్తుంది. మంచిదారులను చూపిస్తుంది. మనిషిని మనీషిగా చేస్తుంది. మాటతో మంత్రం వేస్తుంది. కళ్లతో యజ్ఞాన్నీ చేయిస్తుంది. అలాంటి నాటకం తెలుగు నాట ఎప్పుడు పుట్టింది?
నాటకం... అది అందమైన దృశ్యకావ్యం. కావ్యం, కథ, నవల వంటి ప్రక్రియల రాత ప్రతినో... ముద్రణనో చదువుకుంటే సరిపోతుంది. మరి నాటకానికి అది కుదరదు. పాత్రల నోటి వెంట వచ్చే మాటల్ని వినాలి. దానికి తోడుగా వచ్చే హావభావాలను కదలికలను ఏకకాలంలో చూడాలి. ఎందుకంటే ఇది ప్రదర్శన యోగ్యమైంది కాబట్టి. మరి ఇంత గొప్పదైన తెలుగు నాటకం పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి. తెలుగు నాటక రంగస్థల తెర ఎప్పుడు తొలగింది. తెలుగు కావ్యం 11వ శతాబ్దంలో పుడితే తెలుగు నాటకం 19వ శతాబ్దం వరకూ రాకపోవటం గమనార్హం. ఎందరో కవులు సంస్కృత నాటకాలను కావ్యాలుగా రాశారు. ఆంగ్ల భాషా ప్రభావంతో కథ, నవల వంటి ప్రక్రియలతోపాటు తెలుగు నాటకం కూడా పురుడు పోసుకుంది. 1857లో బొంబాయి, కలకత్తా, మద్రాసు నగరాల్లో మూడు విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆంగ్ల భాషపై సంస్కృత పండితులకు కూడా మోజు కలిగింది. ఆంగ్ల భాషలోని సారాన్ని జీర్ణించుకున్న ఉపాధ్యాయులు తెలుగులో నాటక రచన చేయడానికి ఉత్సాహం చూపారు. అటువంటి వారిలో కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వేంకట రంగాచార్యులు, వావిలాల వాసుదేవ శాస్త్రి వంటి వారున్నారు.
తొలి తెలుగు నాటక రచనకు కోరాడ రామచంద్రశాస్త్రితో అంకురార్పణ జరిగినట్లు, దాని పేరు ‘మంజరీ మధుకరీయము’ అనీ డాక్టర్‌ పి.ఎస్‌.ఆర్‌.అప్పారావు పేర్కొన్నారు. ఉత్తరరామ చరితము ఆంధ్రీకరణకు 9.11.1883న రాసిన పీఠికలో వావిలాల వాసుదేవశాస్త్రి తొలితెలుగు రూపక రచన చేసింది కోరాడ రామచంద్రశాస్త్రి అని పేర్కొన్నారు. కోరాడ ఈ నాటికను 1860 ప్రాంతంలో రచించి ఉండవచ్చునని ఘనవృత్త పీఠికలో కోరాడ రామకృష్ణయ్య రాశారు.
ఇది నాలుగు అంకాల నాటిక. మధుకరుడనే రాజ పరమేశ్వరుడు మంజరి అనే రాజకన్యకను పెళ్లి చేసుకోవడం ఇందులోని కథా సారాంశం. ఆచార్య మొదలి నాగభూషణ శర్మ ‘మంజరీ మధుకరీయము’ మొదటి నాటక రచన కాదని సోపపత్తికంగా త్వరలో పరిశోధన వ్యాసాన్ని వెలుగులోకి తీసుకొని రాబోతున్నట్లు చెప్పారు. ఆ పరిశోధన వివరాలు వెలుగులోకి వస్తే ఈ నిర్ధారణలో మార్పు ఉండొచ్చు. అంతవరకూ తెలుగులో తొలినాటకం ‘మంజరీ మధుకరీయము’ అనే భావించాలి.
      1872 మహామహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం పంతులు ‘నరకాసుర విజయ వ్యాయోగా’న్ని రచించారు. ముద్రణకు నోచుకున్న తొలి సంస్కృతాంధ్రీకరణ రూపకమిది. వారణాశి ధర్మసూరి రచించిన సంస్కృత రచనకు కొక్కొండ అనువాదం చేశారు. 1871లో మొదలుపెట్టి 1872లో దీనిని ప్రకటించారు. ‘‘ఆంధ్రమున రూపకకావ్యమిది’’ అని కొక్కొండ ‘నరకాసుర విజయ వ్యాయోగ’ ప్రస్తావనలో సూత్రధారుని ద్వారా చెప్పించారు.
      వావిలాల వాసుదేవశాస్త్రి రాసిన ‘నందక రాజ్యం’ నాటకం 1880లో ముద్రితమైంది. తెలుగు స్వతంత్ర రూపకాలలో నందక రాజ్యం రెండోది. తొలి తెలుగు సాంఘిక నాటకంగా, ముద్రణకు నోచుకున్న తొలి తెలుగు నాటకంగా ‘నందక రాజ్యం’ నాటక రంగ చరిత్రలో నిలిచిపోయింది. ఈ నాటకంలో నందకుడు అనే జమీందారు ఏలుబడిలో ఉద్యోగులు ప్రజలను పీడించసాగారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించిన నందకుడు వారిని శిక్షించి మంచి పాలన అందించడం ఈ నాటక ఇతివృత్తం. వావిలాల వారే షేక్స్‌పియర్‌ రచించిన ‘జూలియస్‌ సీజర్‌’ నాటకాన్ని ‘సీజరు చరిత్రము’ పేరుతో నాటకంగా అనువదించారు. 1874లో తెనిగించి 1876లో ప్రకటించారు. ఇది తొలితెలుగు ఆంగ్లానువాద నాటకం. అయితే ఈ నాటకాలేవీ ప్రదర్శనలకు నోచుకోకపోవడం గమనార్హం.
      తొలి తెలుగు నాటక ప్రదర్శనకు అంకురార్పణ చేసిన నాటక వైతాళికుడు కందుకూరి. ఈయన 1880లో ‘బ్రహ్మవివాహము’ అనే ప్రహసనాన్ని రచించి ‘హాస్య సంజీవని’ పత్రికలో ప్రచురించారు. ‘‘బ్రహ్మవివాహము వెలువడిన కొన్ని దినముల వరకు జనులు గుంపులు గుంపులుగా గూడి వీధి యరుగుల మీద గూర్చుండి దానిని చదివి పకపక నవ్వు చుండిరి. దీనిని జనులు పెద్దయ్య గారి పెండ్లి పుస్తకమనెడి వారట’’ అని కందుకూరి స్వీయ చరిత్రలో (రెండోభాగం, పుట 175) పేర్కొన్నారు. 
      ‘హాస్య సంజీవని’లో ‘బ్రహ్మవివాహ’ ప్రహసనానికి కొనసాగింపుగా కందుకూరి ‘వ్యవహార ధర్మబోధిని’ ప్రహసనాన్ని ప్రచురించారు. దీనిని పాఠకులు ప్లీడరు నాటకంగా పిలుచుకున్నారు. దీనిని రాజమహేంద్రవరంలోని శ్రీవిజయనగరం మహారాజా బాలికా పాఠశాలలో 1880లో కందుకూరి ప్రదర్శించారు. ఇది తెలుగులో తొలినాటక ప్రదర్శన. విద్యార్థులతో ఒక నాటక సమాజాన్ని నెలకొల్పి దీనిని ప్రదర్శించారు.
      నాటక రచన 1860లో మొదలైనా అవి ప్రదర్శనలకు నోచుకోలేదు. ప్రదర్శన కళ కావడం మూలంగా ప్రదర్శన యోగ్యత పొందిన కందుకూరి వారి ‘వ్యవహార ధర్మబోధిని’ని తొలి తెలుగు ప్రదర్శిత నాటకంగా నిర్ధరించారు. ‘వ్యవహార ధర్మబోధిని’ నాటక ప్రదర్శన విజయవంతం కావడంతో నాటక రచన చేయడంతోపాటు నాటక సమాజాన్ని కూడా స్థాపించడానికి కందుకూరి మరింత ముందడుగు వేశారు. 
      1881లో ధార్వాడ నాటక సమాజము తెలుగునాట ముఖ్య పట్టణాల్లో నాటక ప్రదర్శనలు ఇస్తూ రాజమహేంద్రవరానికి వచ్చి నాటకాలను ప్రదర్శించింది. ఈ నాటక ప్రదర్శనలు ఎంతో విజయవంతమయ్యాయి. ‘వ్యవహార ధర్మబోధిని’ ప్రదర్శన  విజయవంతమైన స్ఫూర్తితో కందుకూరి సంస్కృత ‘రత్నావళి’ నాటకాన్ని అదేపేరుతో; షేక్స్‌పియర్‌ ‘కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌’ నాటకాన్ని ‘చమత్కార రత్నావళి’ పేరుతో ఆంధ్రీకరించారు. కందుకూరి ఒక  నాటక సమాజాన్ని స్థాపించి ధార్వాడ నాటక సమాజము వారు విడిచి వెళ్లిన పాకలలో ‘రత్నావళి’, ‘చమత్కార రత్నావళి’ నాటకాలను 1880లోనే ప్రదర్శించారు. 
      కందుకూరి ‘తిర్యగ్విద్వన్మహాసభ’ (1887), ‘మహారణ్య పురాధిపత్యము’ (1889) అనే ప్రహసనాలను, ‘అభిజ్ఞాన శాకుంతలము’ (1875-83), ‘మాళవికాగ్ని మిత్రము’ (1885), ‘ప్రబోధ చంద్రోదయము’ (1885) అనే సంస్కృతానువాద నాటకాలను, ‘వెనీజు వర్తక చరిత్రము’ (1880), ‘రాజమంజరి’ (1886), ‘కల్యాణ కల్పవల్లి’ (1894) అనే ఆంగ్లానువాదాలను, ‘ప్రహ్లాద’ (1885), ‘దక్షిణ గోగ్రహణం’ (1885), ‘సత్యహరిశ్చంద్ర’ (1886) అనే నాటకాలను రచించారు.
తొలి తెలుగు నాటక ప్రదర్శనయోగ్యమైన రచయిత, ప్రయోక్త కందుకూరి జన్మదినమైన ఏప్రిల్‌ 16వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు రంగస్థల దినోత్సవంగా ప్రకటించి జిల్లా, రాష్ట్రస్థాయిలో కళాకారులకు కందుకూరి పురస్కారాలను ప్రదానం చేస్తోంది. తొలి తెలుగునాటక ప్రదర్శనగా గుర్తింపు పొందిన ‘వ్యవహార ధర్మబోధిని’ ప్రదర్శన తేదీని నిర్ధరించడానికి  పరిశోధనలు సాగుతున్నాయి. ఫలితాలు కోసం ఎదురుచూద్దాం.
      అప్పటి వరకు 1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రాసిన ‘మంజరీ మధుకరీయము’ తొలి తెలుగు నాటక రచనగాను, 1880లో కందుకూరి వీరేశలింగం పంతులు రాసి ప్రదర్శించిన ‘వ్యవహార ధర్మబోధిని తొలిసారి ప్రదర్శించిన నాటకంగానూ భావించవచ్చు. ఏది ఏమైనా నాటి నుంచి తెలుగు నాటకం అభివృద్ధి చెందుతూనే ఉంది. 1894లో ప్రదర్శితమైన గురజాడ వారి ‘కన్యాశుల్కం’నాటకం వందేళ్లుగా తెలుగు జీవితాలతో పెనవేసుకుపోయింది. ఇటీవలే దాదాపు ఎనిమిది గంటలు సాగే ‘కన్యాశుల్కం’ పూర్తినాటకాన్ని విశాఖ, విజయనగరం, హైదరాబాదు ప్రాంతాల్లో ప్రదర్శించారు. అనేక ప్రయోగాత్మక నాటకాలు, (ఎన్‌.ఆర్‌.నంది ‘మరో మొహంజదారో’ వంటివి) ప్రయోజనాత్మక నాటకాలతో తెలుగునాటక రంగం విరాజిల్లుతోంది. 
       ఓసారి ఈ విషయంలో పక్క రాష్ట్రాల వైపు తొంగిచూస్తే కన్నడంలో వెంకట రమణశాస్త్రి సూరి రాసిన ‘ఇగ్గప్పహెగ్డే వివాహ ప్రహసన’ (1887), మరాఠీలో విష్ణుదాస్‌ భావే రాసిన ‘సీతా స్వయంవరం’ (1843), హిందీలో హరిశ్చంద్ర రాసిన ‘ప్రవాస’ (1868), బెంగాలీలో తారాచంద్‌ సిక్డర్‌ రాసిన ‘భద్రార్జున్‌’, జి.సి. గుప్తా రచించిన ‘కీర్తిబిలాస్‌’ (1852) తమిళంలో రామస్వామి రాజు రచించిన ‘ప్రతాప చంద్రవిలాసం’ (1878) తొలి నాటకాలుగా చరిత్రలో నిలిచాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం