తెలంగానం... తెలుగు నీరాజనం!

  • 627 Views
  • 0Likes
  • Like
  • Article Share

భాషా సాహిత్య చర్చలకు వేదికలు నిండిపోవడం ఈమధ్య కాలంలో ఎప్పుడైనా చూశారా? అవధానాలను ఆస్వాదించడానికి యువతరం ఉరకలెత్తిన సందర్భాలేమైనా మీకు తటస్థించాయా? కంప్యూటర్లతో కుస్తీ పట్టే కుర్రాళ్లు కమ్మటి కవితలు వినిపించడం ఎక్కడైనా మీ దృష్టిలోకి వచ్చిందా? ఇలాంటి అరుదైన సన్నివేశాలెన్నో తళుక్కుమన్నాయి ప్రపంచ తెలుగు మహాసభల్లో! ఆత్మీయ పలకరింపులు... కమ్మటి విందు భోజనాలు... కట్టిపడేసే ఆటపాటలతో ఈ అయిదు రోజులూ అచ్చంగా పర్వదినాలే అయ్యాయి.  
‘తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం’ అన్న బలమైన పూనికతో భాగ్యనగరం వేదికగా అయిదు రోజుల తెలుగు సభల మహా సంరంభానికి తెర లేచింది. మాతృభాషకు పూర్ణకలశంతో మహావైభవంగా స్వాగత సత్కారాలు నిర్వహించి, ఆమె యశోకౌముదులతో నీరాజనాలు సమర్పించాలన్న సదాశయంతో ఈ మహాసభలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ వేడుకలు అలనాటి సభలకు కొనసాగింపు కాదని, రాష్ట్ర ఆవిర్భావం జరిగాక నిర్వహిస్తున్న తొలి తెలుగు మహాసభలని ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించింది. ఈ వేడుకలను తెలంగాణ భాషా సాహిత్య కళా సాంస్కృతిక వైభవాల కీర్తి గానంగా ప్రభుత్వం అభివర్ణించింది. ‘తెలంగాణ గుండె నిండుగా తెలుగు పండగ’ అనే రీతిలో నేల నలు చెరగులా విస్తరించిన తెలుగు వారందరినీ ఒక్కచోట చేర్చి కనీ విని ఎరుగని రీతిలో తెలుగు భాషకు ఈ మహాసభల ద్వారా పట్టాభిషేకం జరిపింది.  
      తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సత్సంకల్పంతో తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహణలో ప్రభుత్వం ఈ మహాసభలను 2017, డిసెంబరు 15 నుంచి 19 వరకు ఘనంగా నిర్వహించింది. 42 దేశాల నుంచి తెలుగు ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సభల ద్వారా తెలంగాణ ఖ్యాతి ప్రపంచ దేశాలకు విదితమవ్వాలని; తెలంగాణ సాహిత్యమూర్తుల కృషిని ప్రపంచానికి చాటాలని; వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు భాషాభిమానులతో సుహృద్భావ సంబంధాలు నెలకొల్పాలని; ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి పరచేందుకు ఈ సభలు మార్గనిర్దేశనం చేయాలనే లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. తెలంగాణ వైతాళికుల జీవిత విశేషాలతో పుస్తకాలు ముద్రించి సభికులకు పంచారు. చర్చాగోష్టులు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. భాషా పండితులను, అవధానులను, కవులను, కళాకారులను, సాహిత్య అకాడమి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలను సన్మానించారు. అత్యంత వైభవోపేతంగా ఈ మహాసభలను నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి ఏడాది డిసెంబరు మొదటి వారంలో రెండు రోజులపాటు తెలంగాణ తెలుగు మహాసభలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేసి, ఆ నిబంధనను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  
మహాసభల సంరంభం
లాల్‌బహదూర్‌ మైదానంలోని పాల్కురికి సోమన ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ మహాసభలతో బమ్మెర పోతన వేదిక పరవశించింది. ప్రారంభ వేడుకలకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పూర్ణకుంభ స్వాగతం అందుకున్నారు. మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగరరావు, ఉభయ రాష్ట్రాల గవర్నరు నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, మంత్రులు వేదికనలంకరించారు. ఇక సోమన ప్రాంగణం ప్రజాప్రతినిధులు, కవులు, రచయితలు, భాషాభిమానులతో పోటెత్తింది. ప్రాంగణాన్ని, వేదికను అద్భుత రీతిలో అలంకరించారు. తెలంగాణ చిహ్నాలైన పాలపిట్ట, కాకతీయ తోరణం, సంస్కృతీ సంప్రదాయాలతో వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదిక మీద ఏర్పాటైన భారీ యవనిక మీద తెలంగాణ లఘుచిత్రాలు, పర్యాటక, సాంస్కృతిక వార్తాచిత్రాల ప్రదర్శన జరిగింది. లేజర్‌ ప్రదర్శన కనువిందు చేసింది. ఉపరాష్ట్రపతి జ్యోతిప్రజ్వలన అనంతరం పేరిణి నృత్యంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
      సాహిత్య అకాడమి అధ్యక్షులు నందిని సిధారెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడేందుకు ఉపక్రమించే ముందు తన చిన్ననాటి గురువైన మృత్యుంజయశర్మకు గురుసత్కారం నిర్వహించారు. కవితలు, సామెతలు, పద్యాలతో సాగిన ముఖ్యమంత్రి ప్రసంగానికి అడుగడుగునా కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ఉపరాష్ట్రపతి ప్రసంగం ఉవ్వెత్తు తరంగంలా సాగింది. తెలుగు రాష్ట్రాలతో అనుబంధం, అమ్మభాష కమ్మదనం, కవితలు మొదలైన సందర్భోచిత అంశాలతో ప్రసంగం ధారాళంగా సాగింది. మహాసభలను ప్రారంభిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి ప్రకటించగానే బాణసంచా పేలుళ్లు, లేజర్‌ ప్రదర్శన ఊపందుకున్నాయి. ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సందర్శకుల కోసం స్టేడియంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలంగాణ రుచులతో ఆహార ప్రదర్శన కూడా ఏర్పాటైంది.  
రెండోరోజూ అంతే ఉత్సాహం
వివిధ వేదికల మీద జరిగిన అవధానాలు ఆహూతులను అలరించాయి. సభా ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో చాలా మంది నిలుచునే కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన పద్య, వచన కవితా సదస్సులు లోతైన చర్చలకు వేదికలయ్యాయి. వక్తలు వస్తు వైవిధ్యం, కవితా శిల్పం, ఆధునిక వచన కవిత్వంపై ప్రసంగించారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సీతాకాంత్‌ మహాపాత్ర కవులందరినీ అభినందించారు. దేశంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా వచన కవత్వం కూడా మార్పులకు లోనైందని, భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు లోనవుతుందో చెప్పజాలమని ప్రముఖ కవి కె.శివారెడ్డి అన్నారు. శ్రీశ్రీ కంటే ముందే తెలంగాణలో వచన కవిత్వం రాసినవారున్నారని సుంకిరెడ్డి నారాయణరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్‌ కవి సమ్మేళనం కవితాప్రియులకు కమ్మని విందు భోజనంలా తోచింది. ఇక తెలుగుదనం విషయానికొస్తే అమ్మ భాషలోని కమ్మదనం అందరికీ గుర్తొచ్చింది. సదస్సులు, చిత్రప్రదర్శన, పుస్తకావిష్కరణలు ఇలా ఒకటేమిటి అన్నింటా తెలుగుదనం ఉట్టిపడింది. పెద్ద ఎత్తున కవులు, రచయితలు, సాహితీవేత్తలతో పాటు నగర ప్రజలు కూడా భారీగా విచ్చేశారు.  ఇక ప్రధాన వేదిక మీద రాత్రి పది గంటల తర్వాత కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉండటం విశేషం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 92 లఘు గ్రంథాలను ముద్రించి ఆవిష్కరించింది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రధాన వేదిక వద్ద జరిగిన ‘తెలంగాణలో తెలుగు భాషా వికాసం’ అనే సాహిత్య సభలో పాల్గొన్నారు. పద్య కవితా సౌరభ కార్యక్రమానికి మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. వివిధ సాహితీ ప్రక్రియల్లో ఉద్దండులైన వారిని సన్మానించారు. అమరేశం రాజేశ్వరశర్మ, దుర్భల విశ్వనాథశర్మ, డా।। కూరెళ్ల విఠలాచార్య, మాదిరాజు రంగారావులను సత్కరించారు. సమాజాన్ని చైతన్యవంతం చేసి రుగ్మతల్ని రూపుమాపే శక్తి వచన కవిత్వానికి ఉందని, యువ కవులు సామాజిక అంశాలపై తమ కలాన్ని, గళాన్ని విప్పాలని ప్రముఖ కవులు పిలుపునిచ్చారు. ఒక వేదిక నుంచి మరో వేదిక దగ్గరికి ప్రతినిధులను తీసుకెళ్లడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేశారు. ఆయా మార్గాలను ‘అ’, ‘ఆ’.. ఇలా వర్ణాల పేరిట పిలవడం విశేషం.
కొనసాగిన కోలాహలం
మూడోరోజు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో అంపశయ్య నవీన్‌ అధ్యక్షతన తెలంగాణ నవలా సాహిత్యంపై సదస్సు జరిగింది. నవలలో వర్తమాన సమాజ జీవితాన్ని మాత్రమే చిత్రించాలని గౌరవ అతిథిగా హాజరైన కొలకలూరి ఇనాక్‌ పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని తన నవల ‘ప్రజల మనిషి’లో కళ్లకు కట్టినట్లు రచన చేసిన వట్టికోట ఆళ్వారు స్వామిని అభినందించారు. తెలుగు భాష నిలబడాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి జోగు రామన్న సూచించారు.  
      ప్లాజా హోటల్లో ‘డిజిటల్‌ తెలుగు’ అంశంపై సదస్సు జరిగింది. అంతర్జాలంలో తెలుగు వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ఐ.టి.శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తెలిపారు. రవీంద్రభారతి సమావేశంలో తెలుగు కీర్తిని చాటిచెప్పే తెలంగాణ చరిత్ర, సంస్థానాలు, బౌద్ధం, ఆధునిక చరిత్ర తదితర అంశాలపై చర్చావేదిక నిర్వహించారు. ఆ తర్వాత రోజు ప్రధాన వేదిక మీద పాటలు విరుజల్లులు కురిశాయి. జానపద గీతాల లోతుపాతులపై చర్చలు సాగాయి. ఆ రోజు ప్రముఖ చలనచిత్ర నటులు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం తరఫున సన్మానాలు చేశారు. మలేసియా తెలుగువారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలూ అందరినీ ఆకర్షించాయి. అలాగే, తెలంగాణ శతక- సంకీర్తనా సాహిత్యాలు, విమర్శ- పరిశోధనల మీద తెలుగు విశ్వవిద్యాలయంలో సాగిన సదస్సులు అనేక కొత్త అంశాలను చర్చకు పెట్టాయి.
ముగింపు కార్యక్రమాలు
ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో భాగంగా పేరిణి నృత్యం, తెలుగు భాష, సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. ఇక తెలుగు భాషాభివృద్ధి విషయానికొస్తే, తెలుగును కాపాడుకుందామంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చిన భాషాభిమానుల మదిలో ప్రపంచ తెలుగు మహాసభలు ఆశలు రేకెత్తించాయి. పాలనా భాషగా తెలుగుకు సముచిత స్థానం కల్పిస్తేగానీ ఈ మహాసభల లక్ష్యం నెరవేరదని వారు అభిప్రాయపడ్డారు. మన పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో అధికార కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలోనే సాగుతుండటాన్ని స్ఫూర్తిగా తీసుకునైనా మనం తెలుగును అధికార కార్యకలాపాలకు విస్తరింపజేయాలి. అలాగే, విద్య, న్యాయరంగాల్లోనూ మన భాషను నిలబెట్టుకోవాలి. వివిధ ప్రాంతాల పలుకుబడులను నమోదు చేయాలి. చక్కటి ఈ నుడికార భాషావ్యక్తీకరణలను భావితరాలకోసం పదిలపరిచే ప్రయత్నం చేయాలి. ప్రపంచ తెలుగు మహాసభలు సాహిత్యం పట్ల, భాషపట్ల, ఆసక్తిని పెంచడంతోనే సరిపెట్టకుండా, తెలుగు ప్రజల మధ్య సంఘీభావాన్ని, ఐక్యతను పెంపొందించాలి. అప్పుడే ఈ మహాసభలకు సార్థకత చేకూరుతుందని ఈ మహాసభలకు హాజరైన సాహిత్యాభిమానులు అభిలషించారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం