జ్ఞానశిఖల వెలుగు... తెలుగు

  • 643 Views
  • 0Likes
  • Like
  • Article Share

సోదర, సోదరీమణులకు నమస్కారం. దేశభాషలందు తెలుగు లెస్స. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఈ మహాసభలకు హాజరయ్యేందుకే తెలంగాణ రాష్ట్రానికి వచ్చాను. ప్రపంచంలోని 42 దేశాల నుంచి తెలుగువారు ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి వచ్చారు. వారందరినీ అభినందిస్తున్నా. అయిదు రోజులుగా జరిగిన మహాసభలు తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాయి. దేశంలో అత్యధిక మంది మాట్లాడే రెండో భాష తెలుగు. సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుకు 2008లో ప్రాచీన భాషగా గుర్తింపు లభించింది. రాష్ట్రపతులుగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వి.వి.గిరి, నీలం సంజీవరెడ్డి ముగ్గురూ తెలుగువారే. మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలే కాదు.. బహుభాషా కోవిదుడు కూడా. వెయ్యేళ్ల కిందటే నన్నయ్య తెలుగు వ్యాకరణాన్ని పరిచయం చేయడంతోపాటు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. తిక్కన దీన్ని కొనసాగించారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు తెలుగుభాషకు చేసిన కృషి ఎనలేనిది. 19వ శతాబ్దంలో గురజాడ అప్పారావు గేయాలు జాతి నిర్మాణానికి దోహదపడ్డాయి. సామాన్య ప్రజల పోరాటాలకు శ్రీశ్రీ అక్షర రూపం ఇచ్చారు. కవి, రచయిత, ఉద్యమకారుడైన వట్టికోట ఆళ్వారుస్వామి తనతో ఏకీభవించని వారిని కూడా గౌరవించారు. దాశరథి పద్యాలు, పాటలు నేటికీ పాడుకుంటున్నారు. త్యాగరాజ కీర్తనలు, అన్నమాచార్య సంకీర్తనలు విశ్వాసం, సంప్రదాయాలకు నేటికీ నిలువెత్తు నిదర్శనం. గిరిజనుల హక్కులపై పోరాడిన కొమురం భీంనూ ఈ గడ్డ మరువదు. వెనుకబడిన వర్గాల్లో జన్మించిన పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ, వందేళ్ల కిందటే అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన భాగ్యరెడ్డివర్మ త్యాగాలూ చిరస్మరణీయమే. స్వాతంత్రోద్యమంలో తెలుగువారి సేవలను మరువలేం. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య,  బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు తెలుగువారు కావడం గర్వకారణం. స్వామి రామానంద తీర్థ సామాజిక ఉద్యమాన్ని నడపడమే కాదు, సామాజిక, రాజకీయ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడి హైదరాబాదు మన దేశంలో విలీనం కావడానికి కృషి చేశారు. ఇలా కొద్దిమంది మహానుభావుల పేర్లను మాత్రమే ప్రస్తావిస్తున్నా మరెందరో గొప్పవారు ఈ తెలుగునేలపై జన్మించారు. 
      దేశం గర్వించదగ్గది.. ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే వారధి తెలుగు భాష. స్వేచ్ఛను కోరుకుంటూ నిరసన గళం వినిపించగలిగిన భాష ఇది. ఖండాంతరాల్లో తెలుగు మాట్లాడుతున్నారు, చదువుతున్నారు. అందుకే నేడు తెలుగు ప్రపంచ భాష అయ్యింది. జ్ఞాన సంపన్నమై, సార్వజనీన విలువలున్న ఈ భాషను సులువుగా నేర్చుకోవచ్చు. విదేశాల్లోని తెలుగువారు దేశ ఖ్యాతిని వ్యాపింపజేస్తున్నారు. దక్షిణాఫ్రికా నుంచి దక్షిణాసియా వరకూ తెలుగువారు అనేక రంగాల్లో గుర్తింపు పొందారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మాతృభాషపై ఉన్న మమకారం తెలుగు సంస్కృతిని పటిష్టంగా ఉంచుతోంది. తెలుగు సంస్కృతి, సాహిత్యం దేశానికి, నాగరికతకు ఎంతో తోడ్పాటును అందించాయి. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును, ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు. నూతన సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని కోరుకుంటున్నా. చివరగా రాయప్రోలు సుబ్బారావు అన్నట్టు.. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవం!   

- ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో భారత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌


సామాన్యులతో కలిసి...
రాజ్యం సురాజ్యం సామ్రాజ్యం/ విలసిల్లి విస్తరించే కాకతీయ సామ్రాజ్యం/ గణపతిదేవుడు, రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుల పాలనాసౌరభం/ జనహితం అభిమతంగా లాలనగా సాగింది పరిపాలనం... కాకతీయుల మీద తానో గేయకావ్యం రాస్తున్నాని చెబుతూ, ఆ రచనలోంచి కొన్ని పంక్తులను మహాసభల వేదిక మీది నుంచి ఇలా వినిపించారు తెలంగాణ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి. అమ్మభాషను అమితంగా అభిమానించే ఆయన, తన నియోజకవర్గం (భూపాలపల్లి) నుంచి వంద మంది బడుగు బలహీనవర్గాల వారిని వెంట తీసుకుని ప్రపంచ మహాసభలకు వచ్చారు. ఇప్పటి వరకూ హైదరాబాదు అంటే ఏంటో తెలియని వాళ్లని ప్రత్యేక బస్సుల్లో తనే దగ్గరుండి తీసుకొచ్చారాయన. సభల మొదటి రోజు ఉదయం వాళ్లకు నగరంలోని పలు చారిత్రక, పర్యాటక ప్రాంతాలను చూపించారు. సాయంత్రం మహాసభలకు తీసుకెళ్లారు. ఆ తర్వాత తన అధికారిక నివాసంలో వాళ్లందరికీ విందు భోజనాలు ఏర్పాటుచేశారు. 


అమ్మభాష కోసం...
2200 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేశాడో యువకుడు. 6 రోజుల్లో ఇలా తెలంగాణ లోని 31 జిల్లాలనూ చుట్టేసి వచ్చాడు. దేనికోసమేంటే... తెలుగు మహాసభలకు తరలిరావాలనే సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి! ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తిచేసిన ఆ యువకుడు కొత్తపల్లి నాగరాజు. జనగామ జిల్లా తరిగొప్పల వాసి. డిసెంబరు 10న తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయం నుంచి యాత్ర ప్రారంభించాడు. ప్రతి 60 గంటలకు ఓసారి స్వల్ప విరామం తీసుకుంటూ పల్లెపల్లెకూ తన సందేశానికి చేరవేశాడు.


శుభాభినందనలు
‘తెలుగుతల్లి’ సైకత శిల్పం అందంగా ఉంది కదా! తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు అమ్మభాషాభివృద్ధికి తోడ్పాడాలని ఆశిస్తూ 16 అడుగుల ఈ శిల్పానికి ప్రాణంపోశారు దేవిన శ్రీనివాస్‌. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ఈయన.. కాకినాడ సాగర తీరంలో తన సృజనను ఇలా ఆవిష్కరించారు. తెలుగుతల్లి రూపంతో పాటు శ్రీకృష్ణదేవరాయలు, గురజాడ, గిడుగు, సీపీ బ్రౌన్‌, దాశరథి రంగాచార్యుల చిత్రాలనూ ఈ సైకతశిల్పంలో తీర్చిదిద్దారాయన. 
తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా ట్విట్టర్‌లో జనం హ్యాష్‌ట్యాగ్‌ జోడించి తెలుగు భాష మీద అభిమానాన్ని చాటుకున్నారు. అయిదు రోజులపాటు చి తెలుగుమహాసభలు అన్న పదం ట్రెండింగ్‌లో జోరు చూపించింది. పన్నెండు వేల ట్వీట్లు, రీట్వీట్లు, షేర్లతో సామాజిక మాధ్యమంలో ఉత్సాహభరిత వాతావరణం తీసుకొచ్చింది. కవితలు, అవధానాలపై చర్చోపచర్చలు, నృత్యాలు, బాలల ప్రదర్శనల విషయాలతో ట్విట్టర్‌లో తెలుగు వెలిగింది. 


ఇది ఆరంభమే!
ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంత మయ్యాయి. భాషాభిమానులు, తెలుగు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అన్ని వేదికలపైనా కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయి. ప్రపంచ తెలుగు మహాసభల లక్ష్యాలన్నింటినీ అందుకోగలిగాం. తెలుగు సాహిత్య వికాసంలో తెలంగాణ పాత్రను నిరూపించగలిగాం. అన్ని వేదికల మీదుగా ఈ విషయాన్ని చాటిచెప్పాం. తెలంగాణ మహనీయుల్ని గొప్పగా స్మరించుకున్నాం. పాటలు, నృత్యరూపకాలు, ప్రసంగాలు, కవితలు, తోరణాలు, హోర్డింగులన్నింటి రూపంలో మహనీయుల్ని స్మరించుకున్నాం. అలాగే మహనీయుల కృషిని వర్తమానానికి చేరవేశాం. 
భావకవిత్వానికి సంబంధించిన సంకలనాన్ని వెలువరించడం ద్వారా తెలంగాణలో భావకవిత్వమే లేదన్నవారికి సమాధానం ఇవ్వగలిగాం. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు కేవలం ఆరంభం మాత్రమే. తెలుగు భాషాభివృద్ధికి తెలంగాణ సాహిత్య అకాడమీ ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకుంటుంది. ఏటా రాష్ట్రస్థాయి తెలుగు మహాసభలు నిర్వహిస్తాం, వీలును బట్టి జిల్లాల్లోనూ భాషాభివృద్ధి కోసం సభలు నిర్వహిస్తాం. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిరంతరం ప్రచురణలు జరుగుతాయి. 2018 మార్చిలోగా 16 నుంచి 20 వరకు ప్రచురణలు తీసుకొస్తున్నాం. వచన కవితా వికాసంపై త్వరలో పుస్తకం వెలువడుతుంది. తెలుగు భాషపై నూతన అధ్యాయాన్ని ప్రోత్సహిస్తాం. వర్తమాన రచయితలకు శిక్షణ కోసం మార్చిలోగా రెండు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. భాషా పండితుల నుంచి సూచనలు తీసుకుంటాం. 

- డా।। నందిని సిధారెడ్డి, 
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహక సంఘం అధ్యక్షులు


 


వెనక్కి ...

మీ అభిప్రాయం