‘సమ్మోహనం’,  ‘ఈ నగరానికి ఏమైంది?’ -  వెండితెర వెన్నెల

  • 214 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చందలూరి నారాయణరావు

  • అద్దంకి

కోట్లాది మందిని ప్రభావితం చేసే చలనచిత్ర మాధ్యమంలో తెలుగు భాషకు సముచిత గౌరవం దక్కట్లేదన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అయితే.. గత కొంతకాలంగా ఆ ధోరణి మారుతోంది. తెలుగువాళ్లందరికీ సంతోషం కలిగించేలా చిత్రాల పేర్ల దగ్గరి నుంచి సంభాషణలు, పాటల వరకూ అన్నిచోట్లా చక్కటి తెలుగు వినిపిస్తోంది. ఈమధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో చాలా మటుకు కమ్మని తెలుగు పేర్లతో అలరించాయి. అజ్ఞాతవాసి, జైసింహా, రంగుల రాట్నం, భాగమతి, గాయత్రి, తొలిప్రేమ, ఆఁ, మనసుకు నచ్చింది, చల్‌ మోహన్‌రంగ, కణం, అమ్మమ్మగారిల్లు, నా నువ్వే, పంతం.. లాంటి పేర్లే అందుకు ఉదాహరణ. 
ఇక ఇటీవల వచ్చిన ఓ రెండు చిత్రాలు కురిపించిన అచ్చ తెలుగు వెన్నెల ఇది...

మధురస మోహనం
కథా నాయకుడు చిత్రకారుడు, భావుకుడు. కథానాయిక తెలుగురాని ఓ ‘హీరోయిన్‌’! వారి మధ్య ప్రేమ.. విభిన్న నేపథ్యాల కారణంగా వచ్చిన కలతలను దాటి నిలవడమే ‘సమ్మోహనం’ చిత్రం. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కథ, మాటలు కూడా రాసుకున్నారు. కథానాయికకు తెలుగు నేర్పే పని నాయకుడిది. ఇందులోంచే మంచి హాస్యం కూడా పుట్టింది. ‘మనిషికో మూట.. గుడ్డకో దెబ్బ’ అని కొత్తలో మాట్లాడి అభాసు పాలైన నాయిక, పంతంతో తెలుగు నేర్చుకుంటుంది. తెలుగు భాష మీద ప్రేమను నటుడు నరేశ్‌ పాత్రతో సందర్భోచితంగా వ్యక్తీకరించారు. జీవితంలో ఒక్కసారైనా సినిమాలో నటించాలని తపన పడే నరేశ్‌ పాత్రతో కొత్తతరం నటులు పలికే సంభాషణలమీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఆ హీరోకి కాస్త తెలుగు నేర్పించరా.. బందం.. సంబందం.. అంటున్నాడు. బొత్తిగా ఒత్తులు లేని నటన..’’ అంటూ ఎద్దేవాచేసే సన్నివేశం నవ్వులు పూయిస్తుంది. 
      ‘‘ఊహలు ఊరేగే గాలంతా.. ఇది తారలు దిగి వచ్చే వేళంటా..’’ అంటూ సాగే పాట ప్రత్యేకం. ఇందులో పొదిగిన భావాలను కవితాత్మకంగా రాయాల్సిన చోట సరళ వచనం కనిపిస్తుంది. ‘‘..చాలా పద్ధతిగా భావం తెలిపి ఏదో అనడం కంటే, సాగే కబుర్లతో కాలం గడిపి సరదా పడదామంతే..’’ అంటూ పాటలో ఇంతకు మందు చూడని వాక్య నిర్మాణ పంథా తీసుకున్నారు సిరివెన్నెల. కావాల్సిన ప్రేమ చిగురంతైనా చాలు అన్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పాట ‘‘మనసైనదేదో వరించిందిలా.. తలపే తరంగమై తరిమిందిలా.. వలపో.. పిలుపో.. మురుపో.. ఏమో.. అంతా వింతే అందేదెంతో..’’ అంటూ సుమధురంగా సాగిపోతుంది. రామజోగయ్యశాస్త్రి రాసిన ‘‘ఓ చెలితార నా మనసారా.. మరలా మరలా నిను రమ్మని.. వెలుగే తెమ్మని.. మరోసారి నీతో అంటున్నా..’’ పాట ఓ తెలుగు తెమ్మెర. ఆయనదే మరో పాట ‘‘కనులలో తడిగా.. నీతో విడిగా.. ఒంటిగా మిగిలా..’’ అంటూ ఉద్వేగాన్ని పండించింది. 


మిత్రదళం కథ..
యువత ఒక చోటచేరితే.. కాలక్షేపానికి కొదవే ఉండదు. అలాంటి ఓ నలుగురు యువకుల కథ ‘ఈ నగరానికి ఏమైంది?’
      నలుగురి కథ సమాంతరంగా సాగుతుంది. లఘుచిత్రాలు తీసే నేస్తాలు ఏకాభిప్రాయం కుదరక తలోదిక్కు పోతారు. మళ్లీ కలిశాక ఏంచేశారన్నది కథ. చిత్రం ఆసాంతం దృశ్య ప్రధాన హాస్యంతో నడుస్తుంది. ‘‘ఆగి ఆగి సాగె మేఘమేదో.. నన్ను తాకెనా ఒక్కసారి..’’ అనే పాట ఆకట్టుకుంటుంది. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటలో ‘‘నిశీధి దారిలోన ఎండే.. ముఖాన్ని తాకుతూనే ఉందే. ముందే రాగరూపం.. నా పైన ఓ పూలవాన.. ఆ చూపేనా.. ఆపేనా నే తీసుకోగ ఊపిరైన..’’ అంటూ భిన్నమైన అంత్యప్రాసలు వినిపిస్తాయి.
      ‘‘పరదా జరుపుకొని పిలిచే సంద్రం.. సరిగా నీ నా కథల్లే.. లోలో ఊహలే కదిలే..’’ అంటూ కిట్టూ విస్సాప్రగడ పాట సరదాగా సాగిపోతుంది.. వివేక్‌ ఆత్రేయ రాసిన పాట ‘‘వీడిపోనిది ఒకటేలే.. మనకోసం మనమేలే.. ఏరోజుకైన వాడిపోనిదే.. ఈ మాటే ఓ పాటై పాడేనా కోయిలా..’’ కూడా స్నేహితుల బాంధవ్యాలను గుర్తుచేసుకునేలా చక్కటి భావుకతతో ఇంపుగా ఉంది.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం