భాషాభివృద్ధికి నిబద్దులం!

  • 1132 Views
  • 1Likes
  • Like
  • Article Share

‘‘తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పండించిన మాగాణం. పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, కీర్తనలు రచించి ఖ్యాతికెక్కిన రామదాసు, తెలంగాణ సాహిత్య వైభవాన్ని చాటిన సురవరం ప్రతాపరెడ్డి, సుకవితా శరథి దాశరథి, జ్ఞానపీఠ అవార్డు పురస్కార గ్రహీత డా।। సి.నారాయణరెడ్డి, ప్రజాకవి కాళోజీ, వానమామలై వరదాచార్యులు, సుద్దాల హనుమంతు ఆనాటి తరంలో వికసించిన సాహితీ కుసుమాలు. కోవెల సుప్రసన్నాచార్యులు, తిరుమల శ్రీనివాసాచార్య, గొప్ప పండితులుగా ప్రసిద్ధిగాంచిన ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య ఎన్‌.గోపి, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజ్‌, అశోక్‌తేజ, నవలాసాహిత్యంలో సుప్రసిద్ధులు అంపశయ్య నవీన్‌, ముదిగంటి సుజాతారెడ్డి, పెద్దింటి అశోక్‌కుమార్‌ వీరందరూ నేటి తరంలో తెలుగు భాషలో అద్భుత రచనలు చేస్తూ తెలుగు భాషా ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న తెలంగాణ బిడ్డలే. ఎంత గొప్పవారికైనా సరే అమ్మఒడే మొదటి బడి. అమ్మ ఒడి నుంచే మన జీవిత ఒరవడి, మన నడవడి ప్రారంభమవుతుంది. ఆ సమయంలోనే చనుబాలను తాగిస్తూనే తల్లి జో అచ్యుతానంద జోజో ముకుంద, రామ పరమానంద లాలి గోవింద అని పాడుతుంది. కొడుకా నువ్వొక అచ్యుతునివి కావాలి, నువ్వొక గోవిందునివి కావాలి, నువ్వొక రామునివి కావాలి. నీ నడవడి నీ జీవిత గమనం ఒక ఆదర్శపురుషునిగా కొనసాగాలని చెప్పి తల్లి చనుబాలతోనే జోలపాటతోనే ఇలాంటి స్వభావాన్ని అలవాటు చేస్తుంది. తన బిడ్డను ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు, ప్రపంచాన్ని కూడా తన బిడ్డకు నేర్పేది మొదటి గురువు తల్లి. ఆ తదనంతరం భక్తిభావన, చక్కటి సంస్కారయుతమైన జీవనం కోసం పద్యాలు నేర్పిస్తా ఉంటారు. ఆ పద్యాలు సంస్కారం నేర్పిస్తాయి. ఆ తర్వాత అక్షరాభ్యాసం చేయిస్తారు. బడికి వెళ్లినప్పటి నుంచి గురువుల ప్రాపకం, వారు నేర్పించే విద్య ప్రారంభమవుతుంది. నేను చిన్నతనంలో అయ్యవారి బడిలో చదువుకునేటప్పుడు పద్యాలు చెప్పేవారు. శతకసాహిత్యం ఎక్కువగా చెప్పేవారు. దానిలో నీతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి చెప్పేవారు. సరళమైన కమ్మనైన మన అమ్మభాషలో, తేటతెలుగు భాషలో సాహిత్య పరమార్థాన్ని విప్పి చెప్పే అద్భుతమైన ప్రక్రియ అక్కడి నుంచి ప్రారంభమయ్యేది. 
      నేను పుట్టింది సిద్ధిపేట ప్రాంతం. అదొక సాహితీ సౌరభాలు విరజిల్లే అద్భుతమైన సాహితీ క్షేత్రం. గుమ్మనగారి లక్ష్మీ నరసింహశర్మ గారు పద్యం చదువుతుంటే గుమ్మపాలు తాగుతున్నట్టే ఉంది. వేముగంటి నరసింహాచార్యులు, కాపు రాజయ్య, కనపర్తి రామచంద్రాచారి, నా సహాధ్యాయి నందిని సిధారెడ్డి, ఎందరో  సాహితీ కుసుమాలు వికసించిన నేల సిద్ధిపేట ప్రాంతం. ఆ వాసనలు నాక్కూడా అంటుకున్నాయి. నేను కళాశాలకు వచ్చేనాటికి కళాశాలలో గోపాలకృష్ణమూర్తి గారు, ముదిగొండ వీరభద్రయ్య, తంగిరాల సుబ్రహ్మణ్యశర్మ అనేకమంది ఉద్దండ పండితులైన వారు గురువులుగా ఉన్నారు. ఇక్కడో సంగతి చెప్పాలి. ఆ రోజు ముదిగొండ వీరభద్రయ్య గారు పాఠం చెబుతున్నారు. అంతకుముందు రోజు శోభన్‌బాబు సిన్మా చూసిన. అందులో ఒక పాట ఉంది. దాని చరణంలో పూతరేకుల లేతసొగసు అని వస్తుంది. పూతరేకులు అంటే అర్థం కాలేదు. ఆ రోజుల్లో సినిమా పాటల పుస్తకాలు దొరికేవి థియేటర్ల బయట. ఉచ్చారణ దోషమా, రాత దోషమా కనుక్కుందామని ఆ పుస్తకాన్ని కొనుక్కున్నాను. అందులో కూడా పూతరేకుల లేతసొగసు అని ఉంది. తర్వాత రోజు క్లాసుకు వెళ్లినప్పుడు గురువుగారిని అడిగాను. పూతరేకులే పూలరేకులనుకో అన్నారాయన. కాదేమోసార్‌ అన్నా. నీ సందేహానికి సమాధానం తెప్పిస్తానులేరా అని చెప్పారు గురువుగారు. విజయవాడలో ఉండే వారి మిత్రులకు లేఖ రాశారు. మా శిష్యకోటిలో ఒకరికి ఇలాంటి అనుమానం వచ్చింది. మీకేమైనా తెలుసా అని రాశారు. ఆ విజయవాడ లెక్చరర్‌గారు మా ముదిగొండ వీరభద్రయ్య గారికి లేఖ రాశారు. ‘నిక్కచ్చిగా మీ శిష్యకోటికి వచ్చిన సందేహం నిజమే. ఎందుకంటే పూతరేకులు అనేది ఒక తీపి పదార్థం పేరు. అదిప్పటికీ తెలంగాణ ప్రాంతంలో లేదు’ అన్నారు. ఈ మాట 1972 ఆ ప్రాంతంలోనిది. అప్పటికి పూతరేకులు తెలంగాణలోకి రాలేదు. ఇప్పుడు హైదరాబాదులో మనకు ఏ మిఠాయి దుకాణంలోకెళ్లినా దొరుకుతుంది. కానీ ఆ రోజుల్లో ఉండేది కాదు. దాంతో మా లెక్చరర్‌గారు నన్ను పిలిపించి ‘ఒరేయ్‌ నాక్కూడా తెలియని ఈ విషయం నీ వల్ల తెలిసింది’ అని వెన్నుతట్టి అభినందించారు. అలాంటి గురువులు ఉన్నారు కాబట్టే తెలుగు భాష నిలబడింది. అలాంటి వాళ్లని మనం గౌరవించుకోవాలి. 
      తెలుగును తెలంగాణ వేదికగా చాలా గొప్పగా విలసిల్లజేయాలని, వికసింపజేయాలనే ఒక దృఢ సంకల్పానికి జరుగుతున్న నాందీ ప్రస్తావనే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. భాషకు ఎల్లలు లేవు, భాషకు అవధులు లేవు. కాబట్టి విశ్వవ్యాప్తంగా ఉన్న వారికి మనవి చేస్తా ఉన్నా... ఒక భాషా పండితుడు మరొక భాషావేత్తను తయారుచేసేలా సంకల్పం తీసుకోవాలి. ఒక కవి మరొక కవిని తయారు చేయాలి. భాషాభిమానులందరూ కూడా ఈ భాషా వికాస యజ్ఞానికి నడుంకట్టాలి.  
      తెలుగు మహాసభలకు హాజరైన మీ అందరికీ వందనం. అభివందనం.. శుభాభివందనం. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా గురుపూజతో సంస్కారవంతంగా ఈ సభలను ప్రారంభించాం. ఈ రోజు ముగింపు సమావేశానికి వచ్చిన రాష్ట్రపతికి ధన్యవాదాలు. మహాసభల నిర్వహణతో తెలంగాణ భాషాభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికున్న నిబద్ధత వెల్లడైంది. మన భాషను గౌరవించుకోవడమే కాకుండా, అన్ని భాషల ఉద్దండ పిండాలను, పండితులను, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలను గొప్పగా సన్మానించుకున్నాం. తెలుగు భాషను బతికించుకోవాలనే మాటలు విన్నాం. ప్రారంభ సమావేశంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ తెలుగు భాషను బతికించుకుందాం. ఇది మృతభాష కాకూడదు అని చెప్పారు. మన గడ్డమీద మన భాషనే మృతభాష అని, దాన్ని బతికించుకోవాలి అనిపించుకోవడం వేదన కలిగించింది. ఆ పరిస్థితి తెలుగుకు రాకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో సంపూర్ణంగా కృషి కొనసాగిస్తుంది.
      తెలుగు మహాసభలు, సంబరాలు జరిపి వదిలేయడమే కాకుండా తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ఈ కృషిని కొనసాగిస్తాం. ఏటా డిసెంబరులో రెండు రోజుల పాటు తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహిస్తాం. ఈ గడ్డమీద చదువుకునే ప్రతి విద్యార్థి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ కచ్చితంగా తెలుగును ఒక సబ్జెక్టుగా చదవాల్సిందేనని ఆదేశాలిచ్చాం. కచ్చితంగా అమలు చేస్తాం. భాషా పండితుల సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించాం. దీనిలో చిన్న న్యాయపరమైన సమస్య ఉంది. త్వరలోనే దాన్ని పరిష్కరిస్తాం. పదవీ విరమణ చేసిన భాషా పండితులకు పింఛన్‌లో కోత పెడుతున్నారని తెలిసింది. ఈ కోతను రద్దు చేస్తాం.
      తెలుగు అభివృద్ధి కోసం మహాసభల ముగింపు సమావేశంలోనే ప్రకటనలు చేయాలని తలచాను. ఎంతోమంది కొన్ని వందల సూచనలు పంపారు. వాటిని చూస్తే ఇప్పటికిప్పుడు అర్థంతరంగా ప్రకటనలు చేయడం తగదనిపించింది. వచ్చే నెల మొదటివారంలో తెలుగు భాషా సాహితీవేత్తలతో ప్రత్యేకంగా సదస్సు ఏర్పాటు చేసి వారి నుంచి సూచనలు తీసుకుని జనవరిలో ప్రకటిస్తానని హామీ ఇస్తున్నాను.
      ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించే సామర్థ్యాలు తెలంగాణ వారికి ఉన్నాయో లేదో, ఎలా జరుగుతుందో, ఎలా ఉంటుందో అనే అనుమానాల మధ్య అద్భుతంగా నిర్వహించాం. మహాసభల విజయవంతానికి కృషి చేసిన సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి, రమణాచారి, దేశపతి శ్రీనివాస్‌, బుర్రా వెంకటేశం, ఇతర అధికారులందరికీ హృదయపూర్వక అభినందనలు. దేశంలోని 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఈ సభలను సుసంపన్నం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. తెలుగు మహాసభలను సంతోషంగా నిర్వహించుకొని గొప్పగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఎదురైన సమస్యలను వచ్చే సభల్లో రానీయం’. 
       సభల ప్రారంభం రోజు ఒకటి రెండు పద్యాలు చెప్పాను. చాలా మంది అభినందించారు. ఈ మహాసభల సందర్భంగా అందరూ సంతోషమైన హృదయంతో, నవ్వుతూ ఉన్నాం. కాబట్టి నా ప్రసంగాన్ని నవ్వుల పద్యంతో ముగిస్తాను
నవ్వవు జంతువుల్‌ నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికిన్‌
దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్‌
పువ్వులవోలె ప్రేమరసమున్‌ వెలిగ్రక్కు విశుద్ధమైన లే
నవ్వులు సర్వదుఃఖ దమనంబులు వ్యాధులకున్‌ మహౌషధుల్‌’’

                    - ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ, ముగింపు వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు


తెలుగు సభలు ఇంత బ్రహ్మాండంగా అవుతాయని ఊహించలేదు. ఎప్పుడైనా, ఎన్నడైనా తెలంగాణ నడిబొడ్డున జరిగితే బాగుండునని కల మాత్రం కన్నాను. ఇక్కడికి రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు వచ్చారు. తమిళనాడు, కర్ణాటక, ముంబయి, షోలాపూర్‌లో ఎక్కడ చూసినా తెలుగు వారున్నారు. వారిని చూస్తుంటే ఎంతో సంతోషం. దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడేది ఈ భాషనే. ఇంట్లో తెలుగు, పాఠశాలల్లో ఆంగ్లంలో మాట్లాడితే వైరుధ్యం ఉంటుంది. దీనివల్ల పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోతుంది. తల్లిదండ్రులకు మనవి చేస్తున్నాను... ఆరేళ్ల వరకైనా తెలుగులోనే పిల్లలకు నేర్పాలి. తెలుగు నేర్చుకుంటే అన్ని భాషలు నేర్చుకోవచ్చు. ఇంత పెద]్ద కార్యక్రమం నిర్వహించిన తర్వాత ప్రపంచమంతా మీ వైపు చూస్తుంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర అనేక రాష్ట్రాల్లో తెలుగు వారికి సమస్యలున్నాయి. సీఎం కేసీఆర్‌ ఒకసారి ఆ రాష్ట్రాలకు వెళ్లి తెలుగువారి సమస్యలను పరిష్కరించాలి.  - మహాసభల ప్రారంభ సభలో  మహారాష్ట్ర గవర్నరు చెన్నమనేని విద్యాసాగరరావు


 


వెనక్కి ...

మీ అభిప్రాయం