తెలుగుతోనే తేజస్సు

  • 1048 Views
  • 5Likes
  • Like
  • Article Share

తెలుగు భాష - మనుగడ.. ఇటీవల చర్చల్లో నలుగుతున్న అంశం. ఈ విషయంలో ఆందోళన కొందరిదైతే, భరోసా ఇచ్చేవారు కొందరు. ప్రపంచ తెలుగు మహాసభల్లో నిగ్గు తేలింది ఏంటంటే.. 18 కోట్లమంది మాట్లాడే భాషకు ఏ సమస్యా రాదనీ, భాషామృతాన్ని భావి తరాలకు అందమైన కలశంలో అందించడమే మిగిలుందని...!
డిసెంబరు 19న తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన భాషా సదస్సు ఉత్సాహభరితంగా సాగింది. ఆచార్య ఎస్‌.లక్ష్మణమూర్తి అధ్యక్షులుగా తెలంగాణలో తెలుగుభాష గురించి, గతంలో అణచివేతకు లోనైన సందర్భాల గురించి వక్తలు ప్రసంగించారు. భాషా వికాసం గురించి తమ సూచనలూ సందేశాలూ అందించారు. ముఖ్య అతిథిగా విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ‘ఇది నా తెలంగాణ సంజీవ దీవిరా../ ఇది నా తెలంగాణ పుణ్యాల దీవిరా.. ’ అంటూ లక్ష్మీ శేషాచార్య ఆలపించిన గీతంతో సదస్సు ప్రారంభమైంది. వ్యాఖ్యాత ఆర్‌.సదాశివ, సమన్వయకర్త దత్తు, సమావేశకర్త గీతావాణి.  
      తెలంగాణ భాష ఎంత ప్రాచీనమైందో, ఎంత వైవిధ్యమైందో తెలియజేయడానికి ఈ వేదిక ఉపకరిస్తుందని చెబుతూ అధ్యక్షులు ఆచార్య ఎస్‌.లక్ష్మణమూర్తి తన తొలి పలుకులు వినిపించారు. ఈ ప్రపంచంలో భాష అనేది లేకపోతే అంతా చీకటే ఉండేది అని చెబుతూ అలాంటి భాషకు విశిష్టత సహజం అన్నారు. ‘‘అయితే తెలంగాణలో భాష ప్రత్యేకం.. ఇక్కడ మహారాష్ట్రులు, కన్నడిగులు, ఉర్దూ మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. పండితులు ఉన్నారు, శ్రామికులు ఉన్నారు. అందరికీ ఇతర భాషలతో సాంగత్యం ఉండటం వల్ల ఇక్కడి తెలుగులో ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. భాష, సంస్కృతీ సంప్రదాయాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ ప్రభావం చాలా ఉంది. అందుకే తెలంగాణ భాషకు అంత విశిష్టత. కాల క్రమంలో భాషలో మార్పులూ చేర్పులూ ఎలా వచ్చాయి.. ఎలాంటి సొబగులు చేరాయి అనే సంగతుల మీద ఈ చర్చలు సాగుతాయి, శ్రామిక గేయాల్లో భాషా సౌందర్యం, బతుకమ్మ, హోలీ, స్త్రీల పాటల్లో భాష, భాషా పత్రికలు, నిఘంటువుల అవసరాలు, భాష వర్తమాన స్థితి వంటి అంశాలమీద వక్తలు మాట్లాడతారు’’ అంటూ అధ్యక్షులు సదస్సును రెండో అంకంలోకి తీసుకెళ్లారు.
ఎంత చక్కటి భాషో!
తెలంగాణ భాషకు పట్టం కట్టడానికి రాష్ట్రప్రభుత్వ ప్రణాళికల్లో ఒకటిగా ఈ సభలు నిలుస్తాయని డా।। కె.ముత్యం అభిప్రాయపడ్డారు. ‘‘ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆందోళన నుంచే భాష గురించి చర్యలు మొదలయ్యాయి. వీటి వెనక నలిమెల భాస్కర్‌ వంటి వారు ఉన్నారు. ఉత్తర తెలంగాణ చరిత్ర అనే పుస్తకం వేశారు. ఒక పదకోశం కూడా తీసుకొచ్చారు. తెలంగాణ వచ్చాక ఒక ప్రామాణిక భాష తీసుకురావాలని సదస్సులు నిర్వహించార’’ని చెప్పారు. తెలంగాణ నుడికారాల గురించి చర్చలు జరగాల్సి ఉందన్నారు. నిజామాబాదులో 36 మండలాల్లో సామెతలు, జాతీయాల సేకరణ గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన తెలంగాణ శాస్త్రాలు అన్న పుస్తకాన్ని ప్రస్తావించారు. 350 ఏళ్లపాటు అసఫ్‌జాహీలు, కుతుబ్‌షాహీల  ఉర్దూ పాలన ఉండటంతో తెలుగుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పారు. ‘‘అయితే ఇలాంటి సందర్భాల్లోనూ తెలుగుదనం పరిఢవిల్లుతూనే ఉంది. అదీ మౌఖికంగా. తెలంగాణలో కావ్యభాష చాలావరకూ దక్కలేదు. తర్వాతి కాలంలో తెలంగాణలో వ్యవహార తెలుగు, నానుడులు, సామెతలు పట్టించుకోలేదు. ఫలితమే ఇప్పటి పరిస్థితి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. భాషలోని మాధుర్యం గురించి చెబుతూ.. సంగీతానికి అనువైంది తెలంగాణలో తెలుగని కొన్ని ఉదాహరణలిచ్చారు. పద అనుస్వరాల వల్ల ఈ లక్షణం వచ్చిందని అంటూ నాగుపామును నాగుంబాము, ఆబోతును ఆంబోతు, తాబేలును తాంబేలు అని పలుకుతారని.. అలా అనుస్వరాన్ని వేయడం వల్ల పాటలకు, స్వరకల్పనలకు సులువన్న భావాన్ని వెలిబుచ్చారు. భాషలో లయ, యతి గురించి కూడా చెబుతూ భళ్లున తెల్లవారింది.. బెక్కన బెంగటిల్లుండు.. పిటాన ఫిరాయించిండు.. చెట్టన చెంపదెబ్బ.. అతలాకుతలం.. ఇచ్చుకం పుచ్చుకం.. కలగం పులగం లాంటి పదబంధాలను ఉట్టంకించారు ముత్యం. అలాగే గ్యాసు నూనెను గ్యాంసునూనె అనడం.. మేనేజరును మేనేంజరు అని పలకడం ఇక్కడ కనిపిస్తుందని ఉదాహరించారు. పదాలకు ద్విత్వం తెలంగాణలో ప్రత్యేకంగా కనిపిస్తుందన్నారు. తటతటా గింజుకున్నాడు అనడానికి తెట్టతెట్ట గింజుకున్నడు అంటారు. దయగల్ల తల్లి అంటూ ద్విత్వానికి ప్రాముఖ్యత ఇస్తారని చెప్పారు. ఇంకా కొన్ని పదాలకు వ్యుత్పత్తులూ చెప్పారు.  
విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ భాషా సమస్యలకు మూలం ప్రపంచీకరణే అని అన్నారు. భావితరాలకు భాషా సంస్కృతిని వారసత్వంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అంటే గుర్తొచ్చేవి శ్రామిక గేయాలు. వాటిల్లోని భాషను గుర్తించాలన్నారు. ఇవ్వాళ భాషను బతికించే అవకాశం తెలంగాణకు వచ్చింది. అందుకు గర్వించాలని పిలుపునిచ్చారు.
పాటల్లో పదనిధులు
శ్రామిక గేయాల్లోని పదసౌందర్యం గురించి మాస్టార్జీ మాట్లాడారు. భాషలో వస్తున్న మార్పులు చేర్పులు పాటల్లో కనిపిస్తాయని చెబుతూ వ్యవసాయదారుల పాటలను పాడి వినిపించారు. రైతుల పరిస్థితుల్లో 1950 నుంచి ఇప్పటికి మార్పు లేదని అన్నారు. వాళ్ల పాటల్లో ఆర్తి దుఃఖం కష్టం ప్రతిబింబిస్తాయంటూ ఉదాహరణగా ఓ పాట పాడారు. ‘వెయ్యివెయ్యిక జొన్న సేనంత వేసితే/ మొల్క మొలవక ముందె కోళ్లొచ్చి కొరికె.. నేనేమి సేతు.. ’- ఇక్కడ కోళ్లంటే దోపిడీదారులు.. అప్పటికీ ఇప్పటికీ ఉన్నారని వాపోయారు. 1960 నాటికి దాశరథి అన్నట్లు ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండినా ఎన్నడూ మెతుకెరుగరన్నా.. అన్న పాటను ఉట్టంకిస్తూ.. అందులో వచ్చే కాకి.. దోపిడీదారులకు సూచిక అని చెప్పారు. మరోవైపు విప్లవ వామపక్ష ఉద్యమాల్లో పాటలొచ్చాయి. జీతాలకూ జీవితాలకూ సంబంధించిన పాటలూ వచ్చాయన్నారు. సుద్దాల హనుమంతు, గద్దర్‌, అంజయ్య లాంటి వారు ఆ తరహా పాటలు రాశారు. వాటిలో భాష గొప్పదని పేర్కొన్నారు. ‘పచ్చసిట్టీ చేతబట్టి/ నున్నంగ తలదువ్వి/ కట్టమీద నడుస్తుంటేరో../ నా కొడుకో కోనంగిరెడ్డీ/ నువు కలకటేరు వనుకొంటిరో.. ఇలాంటి పాటల్లో నానుడులు సామెతలు చాలా ఉన్నాయని అన్నారు. వెతలతో పాటు మరోవైపు చమత్కారాలూ చోటుచేసుకున్న సందర్భాలను ఉట్టంకిస్తూ.. ‘నిన్ను చీరెలు తెమ్మన్నగానీ చిక్కుల పడమన్ననా.. నా నాయన్నదొర నిన్నేమన్నన్ననా..’, ‘బాయి ఎనక బంతితోట.. నాగమణి’ లాంటి పాటలు జానపదాల్లో మాధుర్యాన్నీ సౌందర్యాన్నీ పొదివి పట్టుకున్నాయని అభిప్రాయపడ్డారు. 
బతుకమ్మ పాటల్లో భాషా సౌందర్యం
తెలంగాణలో బతుకమ్మ, హోలీ, స్త్రీల పాటల్లోనూ ఒక రకమైన భాషా సౌందర్యం ఒదిగి ఉంది. వాటి గురించి బండారు సుజాత శేఖర్‌ మాట్లాడారు. ‘‘అమ్మమ్మలు తాతమ్మల కాలంనుంచీ మౌఖికంగా ఈ పాట నేటి తరం వరకూ నిలిచింది. ఇందులో సాహిత్యం స్త్రీలకు ఉపయుక్తంగా ఉండేలా ప్రాంతాలకు అనుగుణంగా చాలా వరసలు రూపుదిద్దు కున్నాయి. సంస్కృతీ సాంప్రదాయాలను వారసత్వంగా అందించుకునే ప్రక్రియకు ఇది ఆదిగా నిలిచింది, ప్రేరణ కలిగించింది. ‘ఆరో నెలలో ఉయ్యాలో.. వెలగాపండు కోరె ఉయ్యాలో..’ అంటూ శిశువు కోసం ఏం తినాలో బతుకమ్మ పాటలో చేర్చి చెబుతారు’’ అంటూ ఆ పాటను ఆలపించారు. అలాగే మనిషి పుట్టుకనుంచీ చావు, తదనంతర పరిస్థితుల మీదా పాటలు వచ్చాయి. కుటుంబ గేయాలు, పారమార్థిక పాటలు, హోలీ పాటలు, వ్యవసాయదారుల పాటలు.. వీటన్నిట్లోనూ తెలంగాణ భాషా సౌందర్యం నిలిచి ఉందని చెప్పారావిడ.
మహానిఘంటువును నిర్మించుకుందాం
భాష కాలక్రమంలో ఎన్నో కొత్త పదాలను చేర్చుకోవాల్సి ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా పదాలు తయారు కాకపోతే పరభాషాపదాలు చొచ్చుకు వస్తాయి. భాషా విస్తృతి తగ్గిపోతుంది. కనుక పద రూపకల్పనలకు భాషావేత్తల సమీకరణ అవసరం.. అనువాదాలకు విజ్ఞుల సూచనలు కావాలి. ప్రత్యేక నిఘంటువులు కావాలి. ఈ విషయాల గురించి రామోజీ ఫౌండేషన్‌ విభాగాధిపతి, ‘తెలుగువెలుగు, బాలభారతం’ పత్రికల సారథి జాస్తి విష్ణుచైతన్య ప్రసంగించారు. తెలుగు భాషాభివృద్ధికి ‘రామోజీ ఫౌండేషన్‌’ చేస్తున్న కృషిని ఆయన వివరించారు. రామోజీ ఫౌండేషన్‌ చేపట్టిన బృహత్‌నిఘంటువు నిర్మాణానికి గత రెండేళ్లుగా జరుగుతున్న పని వెనక ఉన్న సాధక బాధకాలను చర్చించారు. ఇంగ్లిష్‌ పదాలను తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలను సభికుల ముందు ప్రస్తావించారు. గత నాలుగు దశాబ్దాల్లో ‘ఈనాడు’ వేల పదాలను వెలికి తీసి ఉపయోగిస్తోంది. వాటితో కొత్త పదాలను రూపొందించటం.. సమానార్థకాలుగా వాడటం ద్వారా ఆంగ్ల పదాలకు ప్రత్యామ్నాయాలను తీసుకొచ్చిందన్నారు. అలాంటి కొన్ని పదాలను ఉట్టంకించారు. బెలూన్‌కు గుమ్మటం, క్రిమీలేయర్‌కు సంపన్నశ్రేణి, డిటెక్టర్‌కు శోధకం, బ్రెయిన్‌డెడ్‌కు జీవన్మృతి లాంటి పదాలను ‘ఈనాడు’ విరివిగా వాడుకలోకి తెచ్చిందని చెప్పారు.  
      కొత్తగా పదాలను కల్పించడానికి కూడా విష్ణుచైతన్య కొన్ని ఉదాహరణలు అందించారు. డ్రిప్‌ఇరిగేషన్‌కు చుక్కల సేద్యం /బిందుసేద్యం అని, డ్రెడ్జర్‌కు తవ్వోడ, ఫ్లైఓవర్‌కు పైదారి/ పైవంతెన.. అన్నవి జనమే సృష్టించారు. ఇలా సృజనకు పదును పెడితే కొన్ని ఆవిష్కరణలు అద్భుతంగా వస్తాయని, అందుకు భాషాభిమానులు, భాషావేత్తల సహకారం కావాలని అభిలషించారు. ‘‘ఫ్లాట్‌కి పొత్తిల్లు (పొత్తులో ఉండే ఇల్లు), పాస్‌వర్డ్‌కు తారక (తారకమంత్రం అంటాం కదా) అనవచ్చు. ఎస్కలేటర్‌కు మరమెట్లు అని ‘బాలభారతం’లో రాస్తే చక్కటి స్పందన వచ్చింది. తూపు అంటే బాణం కొన. దాన్ని కర్సర్‌కి ఎందుకు వాడకూడదు? ఇదే క్రమంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు బాహ్య వలయ రహదారి అని రాస్తే కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. కానీ, తప్పదు. ప్రయోగాలు జరగకపోతే ఆవిష్కరణలు ఎలా సాధ్యం? మనం ఎంత పెద్దవైనా ఆంగ్ల పదాలను వాడతాం. కానీ, తెలుగు పదాలు అనగానే మనకో విముఖత. మన భాషను, సంస్కృతిని మనం గౌరవించుకోవాలి. హిబ్రూ భాషను పునః సృష్టించుకున్న ఇజ్రాయిల్‌, సొంత భాషలో అవసరాలను తీర్చుకుంటున్న జపాన్‌, చైనా, ఫ్రాన్స్‌లను స్ఫూర్తిగా తీసుకోవాలి. కన్నడ, తమిళ, మరాఠీయుల దారిలోనే నడవాల్సిన అవసరం ఉంది. భాషకు సంబంధించి సమకాలీన, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే మహానిఘంటువును తయారు చేస్తున్నాం’’ అంటూ రామోజీ ఫౌండేషన్‌ భవిష్యత్తు కార్యాచరణను వివరించారాయన.  
ఉద్యోగాలను ప్రత్యేకించాలి
‘భాష వర్తమానం’ అనే అంశం మీద సామల రమేశ్‌బాబు మాట్లాడారు. తెలంగాణ వచ్చాకే తెలుగు భాష పునరుద్ధరణ జరుగుతోందని అభిప్రాయ పడుతూ, కేవలం భాషగా మాత్రమే తెలుగును నేర్చుకునే ప్రక్రియ ఉండకూడదని, ఆ చదువును బి.టి. విత్తనంతో పోల్చారు. ఒకటి నుంచి పన్నెండు తరగతుల వరకూ తెలుగు తప్పనిసరి బోధన కావాలన్నారు. దీనికోసం ఒక ప్రాధికార సంఘం ఏర్పాటుచేయాలని కోరారు. అంతే కాకుండా తమిళనాడు తరహాలో 20 శాతం ఉద్యోగాలు మాతృభాషా మాధ్యమానికి కేటాయిస్తే తప్పేంటని ప్రశ్నించారు.  
 ప్రముఖ పండితులు కోవెల సుప్రసన్నాచార్య సన్మానం స్వీకరించి మాట్లాడారు. హైదరాబాదులో ఉర్దూలో మాత్రమే బోధన సాగుతున్న రోజుల్లో చందా కాంతయ్య లాంటివారు తెలుగు పాఠశాల ఏర్పాటు చేయాలని లక్ష రూపాయలు విరాళం ఇచ్చారని ప్రస్తుతించారు. నాగులపల్లి కోదండ రామారావు వంటివాళ్లు తెలంగాణలో తెలుగు భాషా సేవకు ఎనలేని మేలుచేశారని కొనియాడారు. దేశభాష లందు తెలుగు లెస్స అంటాం కానీ.. లెస్స అనే పదం అంతగా వాడుకలో లేదన్నారు. అయితే ఇప్పటికీ ‘లెస్సగుంటివా’ అని పలకరించే తెలుగువాళ్లు ఉన్నారని గుర్తుచేసుకున్నారు. తంజావూరులోని ఓ ముసలామె తనను అలా పలకరించారని చెప్పారు. సదస్సు ఆద్యంతమూ తెలుగు భాషా వికాసానికి ఏంచేయాలన్న వాదన వినిపించడంతో మహాసభల ప్రధాన ఉద్దేశం వేదిక మీద ప్రతిధ్వనించింది.


తెలుగు భాషలో రెండునుంచీ ఆరు లక్షల పదాలు ఉండొచ్చని భావిస్తున్న తరుణంలో వాటిని ఒకచోటికి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. రామోజీ ఫౌండేషన్‌ తరఫున కనీసం రెండు లక్షల పదాలతో ఆంగ్లం-తెలుగు నిఘంటువు తీసుకువస్తాం. రంగాల వారీగా వివిధ పరిమాణాల్లో నిఘంటువులు తీసుకురావటం, తెలుగు పదనిధి, నిఘంటువులను వెబ్‌సైట్లు, యాప్‌లలో అందరికీ అందుబాటులోకి తీసుకురావటమే మా కర్తవ్యం. ఈ నిఘంటు నిర్మాణంలో సామాన్యుల్ని సైతం భాగస్వాములుగా చేయాలన్నది ఈనాడు, ఈటీవీ ప్రధాన సంపాదకులు, రామోజీ గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీరావు ఆకాంక్ష. అమ్మభాషకు కొత్త ఊపిరులూదడానికి తలపెట్టిన ఈ కార్యక్రమాల్లో భాషా పండితులు, సాహితీవేత్తలు, భాషా పరిశోధకులు, అన్ని రంగాల నిపుణులూ పాలుపంచుకోవాలని కోరుతున్నాం. - జాస్తి విష్ణుచైతన్య 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం