అమ్మ భాషతోనే సామాన్యుడికి ‘న్యాయం’!

  • 1729 Views
  • 3Likes
  • Like
  • Article Share

    మన్నం వేణుబాబు

  • బళ్లారి
  • 8074215783
మన్నం వేణుబాబు

న్యాయ, పాలన రంగాల్లో తెలుగు ఎందుకు అమలు కావడం లేదు? అందులో ఎలాంటి సమస్యలున్నాయి? వాటి పరిష్కారానికి ఏం చేయాలి?... ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సంబంధించి లోతైన విశ్లేషణలు, ఆచరణయోగ్యమైన సూచనలను రవీంద్రభారతిలో ‘న్యాయ, పరిపాలన రంగాల్లో తెలుగు’ అంశంపై నిర్వహించిన సదస్సు అందించింది. 
ఇద్దరు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు, ఓ న్యాయనిపుణుడు, న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్న ఈ సభలో న్యాయ, పాలన రంగాల్లో తెలుగు అమలుకు సంబంధించి కూలంకషమైన చర్చ జరిగింది. వ్యవస్థలో మార్పు దిశగా తీసుకోవాల్సిన చర్యల మీద వీళ్లంతా తమ అనుభవాలే భూమికగా విశ్లేషణాత్మకంగా మాట్లాడారు.  
      రవీంద్రభారతి సమావేశ మందిరంలో డిసెంబరు 18న మధ్యాహ్నం ఈ సదస్సు నిర్వహించారు. కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ అధ్యక్షత వహించగా, విశ్రాంత నాయమూర్తి జస్టిస్‌ జి.చంద్రయ్యను సత్కరించారు. రాష్ట్ర న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి మంగారి రాజేందర్‌, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి పార్థసారథి, ఐపీఎస్‌ అధికారి మల్లారెడ్డి వక్తలుగా పాల్గొన్నారు. 
న్యాయానికే అన్యాయం
మన భాషలో మన న్యాయస్థానాలు వ్యవహరించకపోతే, మన చట్టాలు మన భాషలో లేకపోతే తెలుగు మాత్రమే వచ్చిన వ్యక్తి పరిస్థితేంటని మాడభూషి శ్రీధర్‌ అధ్యక్షోపన్యాసంలో ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో సాక్షులు చెప్పే వాంగ్మూలాన్ని ఇంగ్లీషులోకి అనువదించే, టైపు చేసే క్రమంలో ఏ చిన్న పొరపాటు దొర్లినా మొత్తంగా న్యాయానికే తీరని అన్యాయం జరుగుతుందని కుండ బద్దలుకొట్టారు. నిజానికి ఇంగ్లీషులో ఇచ్చిన తీర్పును కేసు వేసిన వాడు అర్థం చేసుకునే పరిస్థితి ఉండదని, దాన్ని చదివి తెలుగులో వివరించే తీరిక న్యాయవాదికి కూడా ఉండదని, మొత్తంగా తీర్పును ఎవ్వరూ చదవని స్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అప్పీలుకు వెళ్లాల్సిన కేసు అయితే, ఆ న్యాయవాది సాధారణంగా వాడే రొడ్డకొట్టుడు పదాలను రాసి పంపిస్తాడని, నిజంగా కింది న్యాయస్థానం న్యాయమూర్తి ఆ వ్యాజ్యాన్ని గురించి ఏమన్నారో, నిజం ఎలా రుజువైందని, ఎందుకు రుజువు కాలేదని తీర్పు ప్రతిలో చెప్పారో చదివే తీరిక లాయరుకు ఉండదని, దాన్ని అర్థం చేసుకోవాల్సిన క్లయింటుకు అర్థం కాని భాషలో తీర్పు ఇస్తున్నారని ప్రస్తుత పరిస్థితిని కళ్లకుకట్టారు. ముందుగా తెలుగులో చెప్పిన సాక్ష్యాన్ని తెలుగులోనే నమోదు చేసే ఏర్పాట్లు చేసి, ఆ తర్వాత న్యాయమూర్తి తెలుగులో తీర్పు ఇవ్వడానికి ఏం చెయ్యాలి? పరికరాలు, వ్యక్తుల సాయం ఎలా ఉండాలి? వారికి శిక్షణ ఏ విధంగా ఇవ్వాలి? అనే దాని గురించి ఆలోచించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో న్యాయమూర్తులకు తెలుగు నుంచి ఇంగ్లీషులోకి, ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేసే శిక్షణ ఏ న్యాయ విద్యా పరిషత్తు అయినా ఇచ్చిన చరిత్ర ఇప్పటి వరకూ లేదని, ఇక వాళ్లు అనువాదం ఎలా చేస్తారని ప్రశ్నించారు. న్యాయమూర్తి తెలుగులో తీర్పు చెబుతుంటే, తెలుగులో నమోదు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇవన్నీ చేయకుండా తెలుగులో తీర్పులు రావాలని మనం నినాదాలు, నిరాహారదీక్షలు చేస్తే ఫలితం ఉండదని తేల్చిచెప్పారు. 
      కర్ణాటకలో కన్నడలో తీర్పు ఇస్తే 1.5 మార్కులు ఇస్తారని, అలాంటి మార్కులు 17 వస్తే ‘కనీసం’, 25 వస్తే ‘మంచిది’, 32 వస్తే ‘అద్భుతం’ అని పరిగణిస్తారని, మార్కులు తగ్గితే ప్రశ్నిస్తారని, తెలుగులో తీర్పులు ఇచ్చే వారికి కూడా మార్కులిచ్చే వ్యవస్థను ప్రవేశపెట్టొచ్చుకదా? అని శ్రీధర్‌ సూచించారు. ఈ సందర్భంగా ‘తెలుగువెలుగు’ డిసెంబరు (ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేకం) సంచికలో  జస్టిస్‌ రామలింగేశ్వరరావు రాసిన ‘తీర్పులు తెలుగులో ఇవ్వొచ్చా?’ వ్యాసాన్ని ప్రస్తావించారు. అందులో ఉట్టంకించిన సురవరం ప్రతాపరెడ్డి మాటలను విశ్లేషించారు. ఈ దేశంలో మొత్తం చట్టం, న్యాయశాస్త్రం ఇంగ్లీషులో ఉన్నాయని, అందువల్ల ప్రజలు కూడా ఇంగ్లీషులోనే న్యాయం ఉందని అనుకోవడం వల్లే తీవ్ర అన్యాయం జరుగుతోందనే అసలు సత్యాన్ని శ్రీధర్‌ తెలియజెప్పారు. తెలుగులో న్యాయం ఉందా? లేదా? అంటే.. తెలుగులో శాస్త్రం ఉంటేనే ఆ విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 
సమస్యలను అధిగమించాలి
న్యాయ వ్యవస్థలో తెలుగు అమలు కాకపోవడానికి పలు కారణాలున్నాయని ఈ సదస్సు సత్కార గ్రహీత, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జి.చంద్రయ్య అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో భాష ఆంగ్లంలో ఉండాలని అధికరణం 348 నిర్దేశిస్తుందని, కింది స్థాయి న్యాయస్థానాల్లో స్థానిక భాష వాడొచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ భాషాధికార చట్టం 1966ను పురస్కరించుకొని, జీవో నం.420 ప్రకారం 2005 నుంచి కింది స్థాయి న్యాయస్థానాల్లో తెలుగును అమలుచేయాల్సి ఉందని, 2006లో రాష్ట్ర హైకోర్టు ప్రత్యేక ఆదేశాలను జారీ చేసిందని, వాటి ప్రకారం జిల్లా న్యాయమూర్తులు మొదలుకుని, కిందిస్థాయి న్యాయమూర్తి వరకూ తెలుగులో తీర్పులు రాయాలి, చెప్పాలనే అంశం ప్రస్ఫుటంగా ఉందని అన్నారు. అయితే మనకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న సమస్యల వల్ల అది సాధ్యంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంశాల వారీగా ఆ సమస్యలను ఆయన తెలియజేశారు.  న్యాయశాస్త్ర గ్రంథాలు తెలుగులో అందుబాటులో లేకపోవటం, తెలుగులోకి అనువదించిన న్యాయశాస్త్ర గ్రంథాలు న్యాయమూర్తులకు అందుబాటులో లేకపోవటం,  న్యాయమూర్తులకు తెలుగులో సరైన శిక్షణ తరగతులు నిర్వహించకపోవడం, న్యాయవాదుల్లో తెలుగులో దావాలు రాసే పద్ధతి అలవడకపోవడం, పదకోశాలు ఉనికిలోకి రాకపోవడం, నిరంతర పరిశోధనా ప్రక్రియ జరగకపోవడం ... ఈ సమస్యల మీద దృష్టిసారిస్తే రానున్న రోజుల్లో తప్పకుండా కిందిస్థాయి న్యాయ వ్యవస్థలో తెలుగులో న్యాయ పాలన జరిగే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇందుకోసం చొరవ తీసుకోవాలని సూచించారు. 
మార్పులకు శ్రీకారం చుట్టాలి
ప్రజల భాషలో పాలన సాగితేనే ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత వెల్లివిరుస్తుందని, అది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. న్యాయస్థానాల్లో మాతృభాష ప్రధాన మాధ్యమమైతే కక్షిదారుకు తన కేసు విషయమై ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుందని, ముఖ్యంగా సామాన్యులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని, న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న అపోహలు కూడా తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు. అనుకున్నదే తడవుగా తెలుగులో న్యాయపాలన సాధ్యపడకపోవచ్చుగానీ అందుకోసం అనేక అంశాల్లో మార్పులకు శ్రీకారం చుట్టాల్సి ఉందన్నారు. తెలుగులో న్యాయ పద సంపద సృష్టిలో న్యాయ విద్యాపరిషత్‌, అధికార భాషా సంఘంతోపాటు, తెలుగు అకాడమీ, మేధావులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థలో తెలుగు అమలుకు సంబంధించి స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. చట్టాలను తెలుగులోకి అనువదించే విషయమై హైకోర్టును సంప్రదించి ఒక కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు తెలుగులోనే శాసనాలను రూపొందించుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు నుంచి సమస్యలు, అభ్యంతరాలు ఎదురుకాకుండా అనువాదం సాగాలని, అందుకోసం సుశిక్షితులైన న్యాయాధికారులను నియమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలుగులో తీర్పు వెలువరించి మంగారి రాజేందర్‌ అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తెలుగులో సాంకేతిక పరికరాలను కూడా విస్తృతంగా రూపొందించుకోవాలని చెప్పారు.  
మనది తెలుగు భాష... కానీ, మన శాసనాలు, ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లీషులో ఉంటాయి. అన్నీ ఇంగ్లీషులో ఉన్నప్పుడు న్యాయమూర్తులు మాత్రం ఏం చేస్తారు? అని విశ్రాంత న్యాయమూర్తి మంగారి రాజేందర్‌ ప్రశ్నించారు. నిజానికి దేశంలో ఒక్క న్యాయ వ్యవస్థ మాత్రమే బహిరంగంగా పనిచేస్తుందని, అక్కడ పారదర్శకత ఉంటుందని, అనువాదం సక్రమంగా ఉందో లేదో ప్రజలతో పాటు, న్యాయవాదులు కూడా కూర్చొని చూస్తుంటారని, సరిగా లేకుంటే అప్పటికప్పుడే సరిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఏ దస్త్రంలో ఏం రాస్తున్నారో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. తెలుగులో న్యాయ శాస్త్ర గ్రంథాలు రావాలన్నారు. ఈ కృషిని ఒకరో ఇద్దరో కాకుండా కొన్ని సంస్థలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాలన, న్యాయ పాలన ప్రజల భాషలో జరిగితే ఆయా వ్యవస్థలు ప్రజలకు మరింత చేరువవుతాయని అభిప్రాయపడ్డారు. 
పాలనలో తెలుగు కోసం
అధికార భాషగా తెలుగు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలకు సంకల్పం లేకపోవడమేనని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి పార్థసారథి అన్నారు. ‘‘నిజానికి క్షేత్ర స్థాయిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను గమనిస్తే చాలా వరకు తెలుగు తెలిసిన వారు, తెలుగు భాషలో ప్రావీణ్యం ఉన్నవారు లేరు. తెలుగు తెలిసిన అధికారులు సైతం తెలుగు మాట్లాడితే చులకనగా చూస్తారేమో, తెలుగులో రాస్తే తెలివితక్కువ వాళ్లు అనుకుంటారేమో అనే భావనలో ఉన్నారు. ఒక కార్యాలయ అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండేలా మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వహించే, పర్యవేక్షించే వ్యవస్థ ఉండి కొరడా ఝుళిపిస్తేగానీ పూర్తిస్థాయి ఫలితం రాదు. ఈ సభల అనంతరం ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారులందరినీ ఒక వేదిక మీదకి చేర్చి తెలుగు అమలును తాను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని, మన తెలంగాణ రాష్ట్రంలో పాలన తెలుగులోనే జరగాలని చెబుతారని భావిస్తున్నాను’’ అని చెప్పారాయన. పాలన, న్యాయ వ్యవస్థలతో పోలిస్తే తెలుగు అమలు శాసన వ్యవస్థలో కొంత ఆశాజనకంగానే ఉందని పార్థసారథి అభిప్రాయపడ్డారు. శాసనసభలో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉంటాయని అన్నారు.  
ప్రజలే ఒత్తిడి తేవాలి
ఈ సందర్భంగా పార్థసారథి స్వీయ అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నేను ఒక జిల్లా కలెక్టరుగా ఉన్నప్పుడు ప్రభుత్వం వందశాతం రాయితీతో షెడ్యూల్డ్‌ కులాలకు సామాజిక బావుల పథకం ప్రవేశపెట్టింది. ఎన్ని అడుగులు తవ్వితే ఎంత రుసుము ఇస్తారు లాంటి వివరాలతో ఆ ఉత్తర్వును తెలుగులోకి అనువదించి లబ్ధిదారులకు పోస్టులో పంపించాం. అయిదారు నెలల్లోనే లబ్ధిదారులు మా కార్యాలయానికి వచ్చి.. నాకు చదువు రాదు. నా కొడుకు పది చదివాడు. ఈ ఉత్తర్వు చదివి వినిపించాడు. ఆరడుగులు తవ్వితే రూ.అయిదువేలు ఇస్తారని ఇందులో ఉంది. కానీ మా ఇంజనీరు రెండువేలే ఇస్తానంటున్నాడు అని ప్రశ్నించారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో పాలన సాగితే ప్రభుత్వ పథకాల అమల్లో మంచి ఫలితాలుంటాయనడానికి ఇదే చక్కటి ఉదాహరణ’’ అని అన్నారాయన. అలాగే ఆయా పథకాలకు సంబంధించిన నిబంధనలు, దరఖాస్తు విధానం లాంటి వివరాలను తెలుగులో అందిస్తే పాలనలో తప్పకుండా మంచి ఫలితాలొస్తాయని సూచించారు. దరఖాస్తులు కూడా తెలుగులోనే ఉండాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో కవులు, సాహితీవేత్తలు, రచయితలను కూడా భాగస్వామ్యం చేయాలని, గతంలో హెచ్‌ఐవీ మీద అవగాహన కల్పించేందుకు ఇలాంటి ప్రయత్నం చేసి, పుస్తకాలు తెచ్చామని చెప్పారు.  
      ప్రభుత్వంలో ఏం జరుగుతోందో ప్రజలు తెలుసుకోవడానికి ప్రజల భాషలో పాలన అత్యంత ముఖ్యమని ఐపీఎస్‌ అధికారి బి.మల్లారెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలద్వారా ఎన్నికైన ప్రభుత్వాలున్నా ఇంకా ప్రజల భాషలోనే పాలన సాగాలని సమావేశాలు పెట్టుకునే పరిస్థితి ఉండటం దురదృష్టకరమని అన్నారు. ప్రజల భాషలో పాలన, తీర్పుల కోసం ప్రభుత్వాలు, అధికారులు, న్యాయ వ్యవస్థపై ప్రజలే ఒత్తిడి తేవాలని సూచించారు. అధికార విధుల్లో, పార్లమెంటులో, శాసనసభల్లో ఎక్కడైనా పరాయి భాష మాట్లాడితే అతను నా అధికారి కాదు, నా పాలకుడు కాదు అనేంత అభిమానం ఉండాలని, అయితే అది దురభిమానం కాకూడదని పేర్కొన్నారు. తాను 1987 నుంచి జాతీయం, అంతర్జాతీయంగా ఎక్కడైనా తెలుగులోనే సంతకం చేస్తున్నానని, ఎలాంటి సదస్సులో అయినా తెలుగులోనే మాట్లాడుతున్నానని చెప్పడంతో ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. పక్క రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలను పరిశీలించి వాటిని అనుసరించినా మనం రెండు మూడేళ్లలో తెలుగును పాలనలో అమల్లోకి తెచ్చుకోవచ్చని చెప్పారు.
      న్యాయ, పరిపాలన రంగాల్లో అమ్మభాషకు అగ్రతాంబూలం దక్కాలంటే ప్రభుత్వాలే చొరవ తీసుకోవాలి. ఆ దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు నడుం బిగించి పటిష్ట వ్యవస్థ రూపకల్పనకు ప్రణాళికలు రచించాలి. అప్పుడే ప్రజలకు మెరుగైన పౌర, న్యాయసేవలు అందుతాయి.


పరిపాలనలో తెలుగు అమలుకు సంబంధించి ఐఏఎస్‌ అధికారి పార్థసారథి పలు సూచనలు చేశారు. అవి.. 
* ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) ఇవ్వాలంటే తప్పకుండా ఒక నంబరు ఉండాలి. ఆ జీవో తెలుగులో లేకుంటే నంబరు రాకుండా వ్యవస్థను ఏర్పాటు చేస్తే ప్రతి జీవో తప్పకుండా తెలుగులోనే వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన జీవోలన్నింటినీ కూడా తెలుగులోకి అనువాదం చేసుకోవాలి. ఎందుకంటే కొత్త జీవోలు రాయాలంటే పాత వాటిని చూడాల్సి ఉంటుంది. 
* రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఒక అనువాద వ్యవస్థ ఉండాలి. దీనికోసం నిఘంటువులు, పదకోశాలు అవసరం. వీటిలో గ్రాంథికం కాకుండా ప్రజలు వాడే భాషకు చోటు కల్పించాలి 
* పాలనలో తెలుగు అమలు ఆధారంగానే అధికారులకు ప్రోత్సాహకాలు, బహుమతులు, ప్రమోషన్లు, పోస్టింగులు ఉండాలి 
* తెలుగువారు కాని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు ప్రత్యేక తెలుగు కోర్సులు నిర్వహించాలి. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు తెలుగు నేర్చుకొని రాయగలిగితే, కింది స్థాయి సిబ్బంది కూడా తప్పకుండా వారిని అనుసరిస్తారు. 
* పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నియామకాలు చేపట్టేటప్పుడు ఇతర అంశాలతో పాటు తెలుగులో ప్రావీణ్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు కొత్తతరం తప్పకుండా తెలుగులో నైపుణ్యం సంపాదిస్తుంది. తెలుగు లేనిదే పాలన జరగదు అన్న స్థాయికి మనం పరిపాలనని తీసుకెళితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఈమేరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాలి.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష