‘అల్పజీవి’ మనోజ్వాల

  • 1773 Views
  • 1Likes
  • Like
  • Article Share

    అంపశయ్య నవీన్‌

  • కేంద్ర సాహిత్య అకాడమీ , పురస్కార గ్రహీత
  • వరంగల్లు
  • 9247102022
అంపశయ్య నవీన్‌

‘‘చైతన్యస్రవంతి, మనోవైజ్ఞానిక నవల వగైరాల గురించి నాకేం తెలియదు. ఈమధ్య విమర్శకులంటుంటే వింటున్నాను’’... 1981లో ‘ఆకాశవాణి’ ముఖాముఖిలో రావిశాస్త్రి చెప్పిన విషయమిది. కానీ, నాటికి మూడు దశాబ్దాల కిందటే ఆయన ‘అల్పజీవి’ నవలను రచించారు. అది మనోవైజ్ఞానిక రచనే. ఆత్మన్యూనతతో అల్లల్లాడిపోయే ఓ సగటు మనిషి ఇందులో కథానాయకుడు. కల్లోల కడలి లాంటి అతని మనసులో ఎగిసిపడే గుబులు కెరటాల భీకరఘోష ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది.
‘అల్పజీవి’.. మనోవైజ్ఞానిక నవల లేదా మనస్తాత్విక నవల. దీనికి ముందు వెలువడిన ‘అసమర్థుని జీవయాత్ర’, ‘చివరకు మిగిలేది’ నవలల్ని కూడా మనోవైజ్ఞానిక నవలలన్నారు. ఇలాంటి రచనల ముఖ్య లక్షణం పాత్రల బాహ్య రూపాన్ని కాకుండా మనసుల్ని శోధించటం. ప్రధానంగా పాత్రల మనస్సుల్లో చెలరేగుతున్న సంఘర్షణను చిత్రించటం. ఈ చిత్రణకు ఆధారం సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌, ఆల్‌ఫ్రెడ్‌ అడ్లర్‌, యాంగ్‌ లాంటి మానసిక శాస్త్రవేత్తల సిద్ధాంతాలు. ప్రతి వ్యక్తిలోనూ అతనికి తెలియని అంతశ్చేతన అనేదొకటుంటుందని, ఆ అంతశ్చేతనలోకి అణిచివేయబడ్డ అనేక శక్తులు అతని బాహ్య జీవితాన్ని ప్రభావితం చేస్తాయని ఫ్రాయిడ్‌ చెప్పాడు. అలాగే అడ్లర్‌ ప్రతి వ్యక్తిలోనూ ఆత్మన్యూనతా భ్రాంతి ఉంటుందని, బాల్యంలో తీవ్రంగా కలచివేసిన సంఘటనలు ఇది ఏర్పడటానికి కారణమవుతాయన్నాడు. వ్యక్తి పెరిగి పెద్దయ్యాక ఏవో కారణాల వల్ల అతని బాల్య జీవితంలో జరిగిన ఆ భయంకర సంఘటన గుర్తొచ్చి, ఆ సంఘటన స్వరూపం అతనికి స్పష్టంగా కనిపించాక అతనిలో ఏర్పడిన ఆత్మన్యూనతా భ్రాంతి తొలగిపోవచ్చని కూడా అడ్లర్‌ చెప్పాడు.
      ‘అల్పజీవి’ కథానాయకుడు సుబ్బయ్య. ఇతనిలో ఆత్మన్యూనతా భ్రాంతి ఉందని రచయిత మనకు నవల ప్రారంభంలోనే చెబుతారు. ‘‘సుబ్బయ్య సుందరుడు కాడు’- ఇది సుబ్బయ్య అభిప్రాయం; ‘సుబ్బయ్య ఒట్టి చచ్చు దద్దమ్మ’- అదీ సుబ్బయ్య అభిప్రాయమే!’’... ఇలా అన్నమాట. తనను తాను తక్కువ చేసుకోవడం ఆత్మన్యూనతా భ్రాంతి ఉన్నవాళ్ల ప్రధాన లక్షణం. తనను తాను తక్కువ చేసుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్నవాళ్ల దృష్టిలో కూడా తను తక్కువవాడే అనుకుంటాడు ఈ భ్రాంతికి లోనైనవాడు. ‘‘సుబ్బయ్యకు జమీందారీ లేదని’’ అతని భార్య సావిత్రి, ‘‘సుబ్బయ్య నంగిరి పింగిరి వాడని’’ అతని బావమరిది వెంకట్రావు, ‘‘సుబ్బయ్య ఈజ్‌ వెరీ ఇనెఫిషియన్ట్‌’’ అని ఆఫీసు హెడ్‌క్లర్కు అనుకుంటున్నారని సుబ్బయ్య అనుకుంటాడు.
      మనోవైజ్ఞానిక నవలల్లోని కథంతా ప్రధాన పాత్ర మనసులోనే జరుగుతున్నట్టుగా రచయిత చిత్రిస్తాడు. ఈ తరహా నవలల్లో పాత్రల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ‘అల్పజీవి’లో సుబ్బయ్య ఒక్కడే ముఖ్య పాత్ర. మిగతా పాత్రలన్నీ అతని చుట్టే తిరుగుతుంటాయి.
ఆ రెండు ఘటనలూ...
సుబ్బయ్యలో ఆత్మన్యూనతా భ్రాంతి ఏర్పడటానికి కారణం అతని బాల్యంలో జరిగిన ఓ సంఘటన. సుబ్బయ్య తల్లి చనిపోయాక తండ్రి సోమయ్య ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అతని రెండో భార్య చాలా వికృతంగా ఉండడమే కాకుండా చాలా క్రూరమైంది. ఆవిణ్ని- అంటే తన సవతితల్లిని మొదటిసారి చూడగానే జడుసుకుని తండ్రిచుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని నిల్చుండిపోయాడు సుబ్బయ్య. వచ్చిన మర్నాడే ఆవిడ సుబ్బయ్యను కొట్టింది. అప్పట్నించి ప్రతిరోజూ కొట్టేది. లేత వయసులో ఆమె ఉన్నన్నాళ్లు సుబ్బయ్య పడిన మనోవేదన, యాతన ఇంతా అంతా కాదు. ఆమె ఒక్క సంవత్సరం మాత్రమే సుబ్బయ్య తండ్రితో కాపురం చేసింది. తర్వాత ఆవిణ్ని పక్కింటి పెద్దమనిషి లేవదీసుకుపోయాడు. ఆవిడ అలా వెళ్లిపోయినందుకు ఎవరూ పెద్దగా బాధపడలేదు. కానీ సుబ్బయ్యలో ప్రవేశించిన భయం మాత్రం అలానే ఉండిపోయింది.
      సుబ్బయ్య బాల్యంలో అతన్ని తీవ్రంగా భయపెట్టిన మరో సంఘటన కూడా జరిగింది. అదేమిటంటే! ఒక రాత్రి సుబ్బయ్య తన తండ్రితో కలిసి ఎక్కడికో వెళ్తొంటే ముగ్గురు మనుషులొచ్చి సుబ్బయ్య నాన్నను కొట్టడం మొదలెట్టారు. వాళ్ళు ఎక్కణ్నించి వచ్చారో, తన తండ్రిని ఎందుకు కొడ్తున్నారో సుబ్బయ్యకు తెలియలేదు. దెబ్బలకు తాళలేక తండ్రి బాధతో మూలుగుతున్న చప్పుడు సుబ్బయ్యను కలచివేసింది.
సుబ్బయ్య తండ్రిని ఆ అర్ధరాత్రి కొట్టినవాళ్లెవరు, వాళ్లెందుకు అతన్ని కొట్టారు- ఈ విషయాలను రచయిత వివరించలేదు. ఎందుకంటే ఈ సంఘటన సుబ్బయ్య మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగించిందో చెప్పడమే రచయిత ఉద్దేశం. ఈ సంఘటన సుబ్బయ్య అంతశ్చేతనలోకి నెట్టివేయబడి అతని బాహ్య ప్రవర్తనను ప్రభావితం చేసింది. అతన్నో పిరికివాడిగా మార్చేసింది.
అంతరంగ మథనం
సుబ్బయ్య పెద్దవాడయ్యాక కొంచెం చదువుకుని ఓ ఆఫీసులో ఉద్యోగం సంపాదించాడు. ఏ పని చేసినా చాలా నెమ్మదిగా చేస్తుండటం వల్ల అసమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఉద్యోగుల్లో ఉన్న రాజకీయాల కారణంగా సుబ్బయ్యను అకౌంట్స్‌ సెక్షన్లో వేస్తారు. అది బాగా లంచాలు తీసుకోవటానికి అవకాశం ఉండే శాఖ. ఈ విషయం తెలుసుకున్న సుబ్బయ్య బావమరిది వెంకట్రావు... సుబ్బయ్యను గవర్రాజు అనే కాంట్రాక్టర్‌ దగ్గర అయిదు వందలు తీసుకుని తనకివ్వమంటాడు. సుబ్బయ్య ఎంత అమాయకుడంటే, గవర్రాజు దగ్గర్నుంచి ఆ డబ్బును లంచంగా తీసుకుని ఇవ్వమంటున్నాడన్న సంగతి అతనికి తెలియదు. వెంకట్రావు ఈ అయిదు వందలు తీసుకుని తిరిగి తనకిస్తే తను గవర్రాజుకు ఇచ్చేయవచ్చు అనుకుంటాడు. మొత్తమ్మీద వెంకట్రావు ఒత్తిడితో గవర్రాజు దగ్గర డబ్బు తీసుకుని ఇస్తాడు.
      గవర్రాజును డబ్బు అడగ్గానే ఎందుకిచ్చాడు? అతని బిల్లులు సుబ్బయ్య దగ్గరున్నాయి కాబట్టి. సుబ్బయ్యకి అయిదు వందలు లంచంగా ఇస్తే తన బిల్లులను త్వరగా పాసుచేస్తాడని. ఈ విషయం కూడా సుబ్బయ్యకు తెలియదు. తన తోటి క్లర్కులు చెబితే తెలుస్తుంది.
      ఆ ఆఫీసులో అందరికీ సుబ్బయ్య లంచం తీసుకున్నాడని తెలిసిపోతుంది. దాంతో అతన్ని డిస్పాచ్‌ సెక్షన్‌కు మారుస్తారు. తన బిల్లులు ఇప్పుడు సుబ్బయ్య దగ్గర లేవని తెలియడంతో గవర్రాజు తన డబ్బులు తిరిగి ఇవ్వమంటాడు. సుబ్బయ్య వెళ్లి వెంకట్రావును అడుగుతాడు. అతను ఇవ్వనంటాడు. ఇది సుబ్బయ్యను భయంకరంగా కుంగదీస్తుంది. తనో విషవలయంలో కూరుకుపోయినట్టు భావిస్తాడు. అతని అంతరంగంలో తీవ్రమైన ఘర్షణ. తనతో తను సంఘర్షించుకోవడం ప్రారంభమవుతుంది. తనీ పాడుపని ఎందుకు చేశానని తనను తను తిట్టుకుంటాడు. ఈ నవల్లోని ముఖ్య భాగాలన్నీ సుబ్బయ్యలో చెలరేగుతున్న ఈ మానసిక సంఘర్షణనే చిత్రిస్తాయి.
      ‘‘సుబ్బయ్య బాధపడ్తున్నాడు. భయపడ్తున్నాడు. పక్కకు తప్పుకోవాలి. ఎక్కడికైనా తప్పించుకుపోతే బావుండును. ‘జాగ్రత్తగా మసులుకో’ అని తనను హెచ్చరించారు’’... సుబ్బయ్య ఇలా అనుకోవడం సమస్య నుంచి తప్పించుకుపోయే పలాయనవాద ధోరణిని తెలియజేస్తుంది. ఆత్మన్యూనతా భ్రాంతిలో ఇదీ ఒక భాగమే. నవలలో చాలా చోట్ల సుబ్బయ్య తనతో తనే మాట్లాడుకుంటాడు. దీన్ని ఇంటీరియర్‌ మోనోలాగ్‌ అంటారు. పాత్ర తనతో తను, తనలో తను మాట్లాడుకోవటాన్ని స్వగతం అని కూడా అంటారని మనకు తెలిసిందే! ఇలా సుబ్బయ్య తనతో తను మాట్లాడుకుంటూ మధనపడటమే ఈ నవలంతా.
తోడుగా ఆమె!
బావమరిది కోసం లంచం తీసుకుని పూర్తిగా చెడ్డపేరు తెచ్చుకున్న ఈ వూబి నుంచి ఎలా బయటపడాలో సుబ్బయ్యకు తెలియదు. తననీ సంక్షోభం నుంచి రక్షించేవాళ్లెవరూ లేరు. అతని భార్యకు అతడంటే చాలా చిన్నచూపు. ఆమెతో ఏమీ చెప్పుకోలేడు. బావమరిదికి సుబ్బయ్యో చేతకాని దద్దమ్మ అన్న అభిప్రాయం. తోటి ఉద్యోగులందరూ అతన్ని అసమర్థు´డని అసహ్యించుకునేవాళ్లు. ఇలా పూర్తిగా ఒంటరివాడైపోయిన సుబ్బయ్య ఒక దశలో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వూహించని విధంగా అతనికో స్త్రీ తోడ్పడుతుంది. ఆత్మహత్య చేసుకోకుండా అతన్ని కాపాడుతుంది.
      సుబ్బయ్య వ్యక్తిత్వంలోని ఒక లక్షణమేమిటంటే, అందమైన స్త్రీలంటే అతనికి కొంత ఆసక్తి ఉంది. పిరికివాడే అయినా తన ఇంటి ముందు నుంచి వచ్చీపోయే అందమైన స్త్రీలను చూస్తుండటం అతనికి హాయిగా ఉంటుంది. అలా సుబ్బయ్యకు ‘మనోరమ’ అనే స్కూలు టీచరుతో పరిచయం ఏర్పడుతుంది.
      ‘‘నల్లచీరావిడ.. నీలి వెన్నెల్లో నల్లటి నలుపు చీర వెనక ఆవిడ తెల్లగా మెరుస్తోంది. ఈవిడ మనుషకాంత కాదు.. ఈవిడ దేవతామూర్తి’’- ఇవీ మనోరమను గురించి సుబ్బయ్య ఆలోచనలు. ఆమెను చూసినప్పుడు సుబ్బయ్యలో సంతోషం ఉప్పొంగి గట్లు తెంచుకుంటుంది. మనోరమ అతని మీద జాలిని చూపిస్తుంది. ‘‘జాలి. జాలి. జాలి. ఈ ప్రపంచంలో ఈ విశాల విశ్వంలో సుబ్బయ్యను చూసి జాలిపడే వ్యక్తి సుబ్బయ్యే! కానీ ఈవిడకు నన్ను చూచి జాలి కల్గిందట’’ అనుకుంటాడు సుబ్బయ్య. ఈ మనోరమ అతనిపట్ల ఎందుకంత ‘కన్‌సర్న్‌’ లేక జాలి లేక సానుభూతిని చూపిస్తుందో రచయిత మనకు స్పష్టంగా చెప్పరు. కానీ మనోరమ సుబ్బయ్యకు దగ్గరవుతున్నకొద్దీ అతనిలోని ఆత్మన్యూనతా భ్రాంతి తగ్గిపోతుంది. మనోరమ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె కట్టుకునే చీరలు, పెట్టుకునే పూలు అతన్నెంతో ఆకర్షిస్తాయి. ఆమె అతనికి దగ్గరయ్యాక తన కష్టాలన్నీ ఆమెతో చెప్పుకుంటాడు. ఒక్కొక్కసారి ఈ దృశ్యాలను చదువుతోంటే ‘ఇదంతా నిజంగా జరుగుతోందా? లేక సుబ్బయ్య కలగంటున్నాడా’ అనిపిస్తుంది. ఎందుకంటే సుబ్బయ్యకు ఒక స్త్రీతో అదీ ఒక అపరిచితురాలితో అంత చనువుగా ప్రవర్తించేంత ధైర్యం ఎలా వచ్చిందా అని అనుకుంటాం.
      ఇక్కడ రచయిత చెప్పదల్చుకున్నది ఏంటంటే! ఓ స్త్రీ ఓ పురుషుడికి దగ్గరైనప్పుడు, అతనిమీద సానుభూతిని, సహానుభూతిని చూపించినప్పుడు ఆ పురుషుడిలోని పిరికితనం పోయి ఆత్మవిశ్వాసం చోటు చేసుకుంటుంది. తను గవర్రాజు దగ్గర లంచం తీసుకున్న విషయం చెప్పి, అతడు ఆ డబ్బు తిరిగి ఇమ్మంటున్నాడని సుబ్బయ్య చెప్పినప్పుడు ‘‘మీరా డబ్బు గవర్రాజుకు తిరిగివ్వాల్సిన అవసరం లేదు, నేను గవర్రాజుతో మాట్లాడతాను, నాకు గవర్రాజు తెలుస’’ంటుంది మనోరమ. దాంతో కొండంత బలం వస్తుంది. మనోరమ అతని జీవితంలో ప్రవేశించడంతో అతని కష్టాలన్నీ తొలగిపోయాయన్న సూచనతో రా.వి.శాస్త్రి ఈ నవలను సుఖాంతంగా ముగించారు.
అర్థవంతమైన ప్రతీక
‘‘ఆ వెన్నెల్లో ఆమె కనుకొనలు కూడా మిలమిల్లాడేయి. ఆమెకి దగ్గరగా కూర్చున్న సుబ్బయ్య ఆమె చుట్టూ చెయ్యి వేసి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె ఏదో ఆలోచిస్తూ నిశ్చలంగా చూస్తోంది ఎదుటి కల్లోలంలోకి. అప్రయత్నంగా చూసేడు సుబ్బయ్య కూడా ఆవైపు. వెన్నెల్లో సముద్రం ఓసారి మిలమిల్లాడు తోంది. మరోసారి తళతళ్ళాడుతోంది. భీకరంగా ఉంది సముద్రం. మనోహరంగా ఉంది సముద్రం. సముద్రంలో కెరటాలు లేస్తూ లేస్తూనే ఉన్నాయి. సముద్రం కదుల్తూ కదుల్తూనే ఉంది. ఈ సముద్రం కదలకుండా ఎప్పుడుంది?!’’... ఇదీ అల్పజీవి నవలకు ముగింపు.
      ఇక సముద్రాన్ని సుబ్బయ్య మనసుకు ప్రతీకగా రచయిత సూచించాడు. సుబ్బయ్య మనసులాగే సముద్రం కదులుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఆ సముద్రం మనోహరంగా ఉంది. అతని మనసు మనోరమ కారణంగా మనోహరంగా మారింది. (మనోరమ అన్న పేరును రచయిత కావాలనే పెట్టారు. మనసును రంజింపచేసేది కదా మనోరమ!) ‘సముద్రం కదలకుండా ఎప్పుడుంది’ అనడంలో మనిషి కూడా కదలకుండా ఎప్పుడూ ఉండడని, అతని మనసు మారుతూనే ఉంటుందని చెప్పడం- సుబ్బయ్య మనసిప్పుడు మారింది. అతనిలో స్థిరపడిన ఆత్మన్యూనతా భ్రాంతి తొలగిపోయింది. ఎవరూ తోడు లేని వ్యక్తికి మనోరమ లాంటి స్త్రీ తోడు లభించినప్పుడు అతనిలో పిరికితనం స్థానంలో ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంటుందన్నది ఈ నవల ద్వారా రావిశాస్త్రి ఇవ్వదల్చుకున్న సందేశం.
కాలదోషం అంటని రచన: ‘‘1952 సంవత్సరంలో నేను అల్పజీవి అనే నవల రాసేను. చిన్నవాళ్ళకి చిన్నతగవులే మహావిషమసమస్యలవుతాయనే సంగతి మాత్రం నేను ఆ నవల్లో తీసుకున్నాను; అంతే చెప్పదలచుకున్నాను.... ఆ నవల రాయడానికి ముందు నేను కొన్నాళ్ళపాటు ఓ వెయ్యిమంది గుమాస్తాలతో కలిసి పనిచేసేను. గుమాస్తాలు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. అందుచేత ఆ నవల్లో చిన్నవాడిగా చిత్రించడానికి గుమాస్తా పాత్రని తీసుకున్నాను’’ అని చెబుతారు రావిశాస్త్రి. ఈ నవల ‘భారతి’ పత్రికలో ప్రచురితమైంది. దీనికి ‘అల్పజీవి’ అని పేరుపెట్టింది ఆ పత్రిక సంపాదకవర్గ సభ్యులు కె.సత్యనారాయణ రావు. శ్రీశ్రీ సృష్టించిన ‘కోనేటిరావు’ పాత్ర (‘కోనేటిజన్మ’ తదితర రచనల్లోని) తన ‘సుబ్బయ్య’కు కొంతగా నమూనా అని రావిశాస్త్రి చెప్పుకున్నారు. ఇటీవలి చిత్రం ‘జయమ్ము నిశ్చయ మ్మురా’కథకు ఆధారం ఈ నవలే. ‘‘అల్పజీవి నన్ను చాలా ఆకట్టుకుంది. అందులోని అంశాలకు సినిమా రూపమిస్తే బాగుంటుందని పించింది’’ అంటారు ఆ చిత్ర దర్శకుడు శివరాజ్‌ కనుమూరి. ‘అల్పజీవి’ ఈతరం పాఠకులనూ ప్రభావితం చేస్తోందంటే... రావిశాస్త్రి కలం బలమే దానికి కారణం.


వెనక్కి ...

మీ అభిప్రాయం