ఏరువాకొచ్చిందమ్మా ఏరువాకమ్మ!

  • 763 Views
  • 0Likes
  • Like
  • Article Share

    గణేశ్‌ బెహరా

  • వాటపాగు, శ్రీకాకుళం జిల్లా
  • 7732097027
గణేశ్‌ బెహరా

తొలకరి వానలకు తడిసిన నేల దుక్కుకు సిద్ధంగా ఉన్నప్పుడు... నాగలికి తోరణాలు కట్టి, కాడెద్దులకు పొంగళ్లు పెట్టి, తలపాగా చుట్టి, ములుకోల పట్టుకుని బయల్దేరతాడు రైతు. చేలగట్టున గణపయ్యకు దండంపెట్టుకుని చాళ్లు తోలుతాడు. ఇదే ఏరువాక పున్నమి! ‘ఏరువాకమ్మను ఏమి కోరాలి?/ ఎడతెగని సిరులివ్వ వేడుకోవాలి/ పాడిపంటలు కోరి పరవశించాలి’ అంటూ ఏరువాక పదాలు పాడుకుంటూ తొలి పంటేసే పొద్దు రైతులోకం చేసుకునే పండగ ఇది. పల్లె లోగిళ్లు పైరు పచ్చందాలను అద్దుకోవడానికి నాంది పలికే ఈ సంబరం... అచ్చతెలుగు జానపదాల సిరి చందనం!
‘‘హిందువులందరికిని పండుగలు పబ్బములు ఒకటేయన వీలులేదు. ఔత్తరాహులకు హోలీ, వసంత పంచమీలు ప్రత్యేకాభిమతములు. తమిళులకు పొంగల్‌ పండుగ ముఖ్యము. ఆంధ్రులకు ఉగాది, ఏరువాక పున్నమి ముఖ్యమైనవి’’ అంటారు సురవరం ప్రతాపరెడ్డి. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ మొదటి ముద్రణ పీఠికలో తెలుగువాళ్ల ఆచార వ్యవహారాల ప్రత్యేకతలను ఉట్టంకిస్తూ ఇలా చెప్పారాయన. ఈ ఏరువాక పున్నమి ఈనాటి పండగ కాదు. పన్నెండో శతాబ్దం నాటికే తెలుగు రైతులు దీన్ని జరుపుకునేవారన్నది చారిత్రక వాస్తవం. ‘పండితారాధ్య చరిత్ర’లో దీన్నే ‘దవన పున్నమి’గా పేర్కొన్నాడు పాల్కురికి సోమనాథుడు. కారు పున్నమి, కృషిక పున్నమి తదితర పేర్లతో పిలిచే ఈ సంబరాన్నే తెలంగాణలో ‘ఏరొక్క పండగ’గా జరుపుకుంటారు.
      ‘‘ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ/ ఏళ్లు నదులు పొంగి వెంబడొచ్చాయి/ నల్ల మేఘాలలో నాట్యమాడింది/ కొండ గుట్టల మీద కులుకు లాడింది/ ఇసక నదిలో బుసలు కొట్టింది/ పాడుతూ కోయిలా పరుగు లెట్టింది/ ఆడుతూ నెమలి అలసిపోయింది/ నవ్వుతూ మా అయ్య బువ్వ తిన్నాడు/ ఆకాశమున మబ్బులవతరించాయి/ ఉరుమొక్కటావేళ ఉరిమిపోయింది/ కాపు పిల్లల మనసు కదిలిపోయింది/ అటకమీద గంప అందుకోవయ్య/ విత్తనాలు దీసి విరజిమ్మవయ్య/ మృగశిరా కార్తిలో ముంచెత్తు వాన/ కలపరా అబ్బాయి కొత్త దూడల్ని/ కట్టరా అబ్బాయి కొత్త నాగళ్లు/ దున్నరా ఓ అయ్య దుక్కుల్లు మీరు/ ఒకగింజ కోటియై వర్థిల్లు మీకు/ ఏరువాక సాగి ముసురుకోవాలి/ కొత్త పంటలు మనకు కోరుకోవాలి’’... ఎండలు తగ్గి వానలు పడ్డాక ఏర్లూ నదులూ నీళ్లతో కళకళలాడుతున్న వేళ- ఇంకెందుకాలస్యం దుక్కులు మొదలెట్టేయమంటూ అన్నదాతలకు శ్రీకారం పలికే పాట ఇది. తాము ప్రారంభించబోయే ‘సాగు యజ్ఞం’ నిర్విఘ్నంగా సాగాలని వినాయకుణ్ని పూజించి, సంప్రదాయబద్ధంగా వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు రైతులు. ఈ ఆనవాయితిలో భాగంగా వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచే ఎడ్లను శుభ్రంగా కడిగి, వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. ముఖానికి పసుపు కుంకుమలు పెట్టి, గిట్టలకు నూనె పూస్తారు. తర్వాత వాటికి పూజచేసి... బెల్లం పులగం, పొంగళ్లు తినిపిస్తారు. ఆ తర్వాత వాటిని పొలానికి తీసుకెళ్లి, మూడు.. అయిదు.. తొమ్మిది చాళ్లను (బేసి సంఖ్యలో) దున్నిస్తారు. ఇలా దున్నడమే ఏరువాక! ఏరు అంటే ‘ఎద్దులను కట్టి దున్నడానికి సిద్ధం చేసిన నాగలి’ అని నిఘంటర్థం.
మంగళమమ్మా మా నాగలి నీకు
సాధారణంగా తెలుగునాట జ్యేష్టమాసంలో వానాకాలం ప్రారంభమవుతుంది. అందుకే ఆ నెలలో వచ్చే పౌర్ణమి రోజు (ఈ ఏడాది జూన్‌ 9) అన్నదాతలు ఏరువాక ప్రారంభిస్తారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్నిచోట్ల శ్రావణ, ఆషాఢ మాసాల్లో ఈ పండగను జరుపుకుంటారు. ఏ నెలలో అయినా సరే, పౌర్ణమి నాడే నిర్వహిస్తారు. ఆ రోజు చాళ్లు దున్నాక ఎడ్లను స్వేచ్ఛగా వదిలేస్తారు. తర్వాత వూరంతా పచ్చనాకుల తోరణాలు కడతారు. రోజంతా ఆరుబయలు ప్రాంతాల్లో తిరుగొచ్చిన ఎడ్లు, సాయంత్రం ఆ తోరణాల కిందినుంచి వూళ్లొకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత పల్లీయులు ఆ తోరణాల ముక్కలను పంచుకుని.. తమ ఇళ్లలో, కొట్టాల్లో ఉంచుతారు. పశువులతో వూరేగింపులు నిర్వహించడం, స్థానిక దేవాలయాల్లో వాటితో ప్రదక్షిణలు చేయించడం లాంటివీ కొన్నిచోట్ల కనిపిస్తాయి. మొత్తమ్మీద రైతన్నలకు ఏరువాక పున్నమి పెద్దపండగ. బయటూళ్లలోని బంధువులందరినీ పిలుచుకుని మరీ ఆనందంగా దీన్ని జరుపుకుంటారు.
      కర్షకుల కష్టాన్ని పంచుకునే వాటిలో ఎడ్లతో పాటు నాగలిదీ ప్రధానపాత్రే. అందుకే ఏరువాక పున్నమి రోజు దానికి రావాకుల తోరణాలు కడతారు. పసుపు కుంకుమలతో పూజిస్తారు. అంతేనా! మంగళహారతులూ పాడతారు. అలాంటిదే ఓ పాట... ‘‘మంగళమమ్మా మా పూజలు గైకొమ్మా/ మంగళమమ్మా మా నాగలి నీకు/ కష్టమనక భూమి దున్ని / కరవు మాపి, కడుపు నింపి/ సకల జీవ రాశిని, నీ/ చాలున పోషింతువమ్మా/ కర్షకులను, కరుణతోడ/ కాపాడుచు, నెల్లప్పుడు/ కామితార్థముల నొసంగు/ కల్పవల్లివమ్మ నీకు మంగళమమ్మా’’! అవసరానికి కాస్త సాయం చేసినవాళ్లు ఎవరికైనా సరే మనసారా కృతజ్ఞతలు తెలపడం మనిషితనం. అయితే, ప్రాణంలేని నాగలిని కేవలం వస్తువుగా భావించకుండా... దానికి కూడా రైతులు కృతజ్ఞతలు చెప్పడం తెలుగు సంస్కృతిలోని ఔన్నత్యానికి నిదర్శనం. మనుషుల్లోని సున్నితత్వం క్రమంగా గడ్డకట్టిపోతున్న ఈ రోజుల్లో పాడి పశువులను, సాగు సామగ్రిని సొంతబిడ్డల్లా చూసుకునే అన్నదాతలు ఆదర్శప్రాయులే కదా.
ఏరువాకమ్మకు ఏమి కావాలి?
పండగ ఏదైనా పాటకు పెద్దపీట వేయడమే పల్లె ప్రత్యేకత. ఏరువాక పదాలూ అలా పుట్టుకొచ్చినవే. ఇక్కడ చూడండి... ఏరువాక పున్నమిని ఎలా జరుపుకోవాలో చెబుతోందో పదం...
ఏరువాకమ్మకూ ఏమి కావాలి
ఎర్ర ఎర్రని పూలమాల కావాలి
ఎరుపు తెలుపుల మబ్బుటెండ కావాలి
ఏరువాకమ్మకీ ఏమి కావాలి!
పొలము గట్టున నిలిచి వేడుకోవాలి
టెంకాయ వడపప్పు తెచ్చి పెట్టాలి
ముత్తైదులందరూ పాట పాడాలి
పాట పాడుతు తల్లి పాదాలు మొక్కాలి
ఏరువాకమ్మనూ ఏమి కోరాలి
ఎడతెేగని సిరులివ్వ వేడుకోవాలి
పాడి పంటలు కోరి పరవశించాలి

      వానలు తెరపిచ్చి ‘ఎరుపు తెలుపుల’ ఎండ పరచుకున్న ఓ మంచిరోజును ఎంచుకోవాలి. ఏరుకు పూలమాలలు కట్టాలి. నేలతల్లికి కొబ్బరికాయ, వడపప్పు నైవేద్యం పెట్టాలి. ఇక్కడ ఏరువాకమ్మ అంటే భూమాతే. నాగలి పోట్లను భరించి పంట ఇచ్చేది ఆ తల్లే కదా. అందుకే, పాట పాడుతూ ఆమె పాదాలకు మొక్కాలి అంటున్నారు జానపదులు. అంటే... ఆ చేలోని మట్టిని తాకి వేడుకోవాలని! ధాన్యసంపదలను అనుగ్రహించమంటూ ఆ భూమితల్లికి దండంపెట్టుకునే కదా ఏ రైతైనా దుక్కిదున్నేది! ఇలా ఎన్నో పదాలు, అన్నీ రైతు గుండెల్లోంచి పొంగుకొచ్చినవే.
      అన్నదాతలందరూ కలిసి చేసుకునే పండగ ఏరువాక పున్నమి. ఈ విషయాన్ని చెప్పే పాట ఇది... ‘‘కాపులందరు వేగ కూడి రావాలి/ గాదెల్లో విత్తనాలు గట్టిగా తేవాలి/ గంపల్లో విత్తనాలు దండిగా తేవాలి/ మృగశిర చిందించె ముసలెద్దు రంకేసె/ దుక్కిటెద్దుల దెచ్చి అరక గట్టాలి / దున్నినా చేలన్నీ మిన్నగా పండాలి/ ఒక్క గింజకు కోటి గింజలివ్వాలి’’! వూళ్లొని రైతులందరూ (కాపులు) కలవాలి.. గాదెలోని విత్తనాలను గంపలకెత్తాలి... దుక్కిటెద్దులతో అరక కట్టి నడవాలి... ఆ చాళ్లలో విత్తిన విత్తులన్నీ వేగంగా మొలకెత్తాలి... విరగ పండాలి... కాపు లోగిలి ధాన్యంతో మెరవాలి... ఇదీ అన్నదాతల ఆశ! సానుకూలమైన ఆలోచనలతో పని ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందన్న విశ్వాసానికి ఇది గీతరూపం.
      కాలం చేయిదాటిపోకుండా ఏరువాక సాగితేనే రైతుల ఇళ్లలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా/ నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా’ అంటూ కొసరాజు రాసిన పాటలో ఈ సందేశమే ప్రతిధ్వనిస్తుంది. కానీ, ఇప్పుడు కాలం కట్టుతప్పుతోంది. పర్యావరణ విధ్వంసంతో భూమి వేడెక్కుతోంది. చినుకు ఎప్పుడు నేలకు దిగుతుందో తెలియట్లేదు! ఈ నేపథ్యంలో వ్యవసాయం రోజురోజుకూ కష్టంగా మారిపోతోంది. ఈ పరిస్థితుల్లో మార్పొచ్చి, రైతు జీవితాల్లో పున్నమి వెలుగులు పరుచుకునే రోజు ఎప్పుడొస్తుందో!
 


వెనక్కి ...

మీ అభిప్రాయం