ఓ ప్రశ్న..
‘‘లండన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు తమిళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ భాషల్లోకి తర్జుమా చేస్తారు. కానీ తెలుగుకు ఆ గౌరవం లభించట్లేదు. మనం సమష్ఠిగా ఒత్తిడి తేవకపోవటమే దీనికి కారణమా?’’
- డా।। సలేహ జాఫర్, మాజీమేయర్, లాంబెత్ పట్టణం (దక్షిణ లండన్, ఇంగ్లాండ్)
ఓ అభ్యర్థన..
‘‘మాకు సంస్కృతీ వైభవానికి లోటు లేదు. భాషాపరంగా కొన్ని సమస్యలున్నాయి. తమిళనాడుకు చెందినవారు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకుని పిల్లలకు భాష నేర్పిస్తున్నారు. మాకు ఈ సౌలభ్యం లేదు. తెలుగు ఉపాధ్యాయులను మా దగ్గరికి పంపించండి. తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా తెలుగు భాషా పీఠాన్ని ఏర్పాటు చేయండి’’
- కాసర్ల నాగేందర్‌రెడ్డి, ఆస్ట్రేలియా తెలంగాణ ప్రవాసుల ప్రతినిధి
ఓ అభిప్రాయం...
‘‘ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మాధ్యమంలో బోధన వల్ల పిల్లలకు చదువు సరిగ్గా ఒంటబట్టదు. ఇకపై ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికతో పనిచేస్తాయని ఆశిస్తున్నాను’’
- సురేశ్ కొలిచాల, అట్లాంటా
రవీంద్రభారతి యశోదారెడ్డి ప్రాంగణంలో వినిపించిన విదేశీ తెలుగు గళాలివి. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 19వ తేదీన జరిగిన ‘విదేశీ తెలుగు వారితో గోష్ఠి’లో ప్రాంగణమంతా ఇలా అభిప్రాయాల కలబోత, సమస్యల నివేదన, అభ్యర్థనలతో ప్రతిధ్వనించింది. మహాసభలకు 42 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆస్ట్రేలియా, మారిషస్, మలేసియా, అమెరికా, కెనడా, ఫిజీ, దక్షిణాఫ్రికా, బ్రిటన్, గల్ఫ్ తదితర దేశాల నుంచి తెలుగు సంబరాలను చూసేందుకు వీళ్లంతా తరలి వచ్చారు. ఆయా దేశాల్లో తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకోవడానికి తాము చేస్తున్న కృషిని, అక్కడ ఎదురయ్యే సమస్యలను ఈ గోష్ఠిలో పంచుకున్నారు. దీనికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, విదేశీ ప్రతినిధులు ఉపేంద్ర తిరుమల (న్యూజెర్సీ), సలేహా జాఫర్, వంగూరి చిట్టెన్రాజు, మహేశ్ బీగాల, మామిడి హరికృష్ణ, రఘురెడ్డి, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సభకు నారాయణస్వామి వెంకటయోగి (యు.ఎస్) అధ్యక్షులుగా, ఆత్మీయ అతిథిగా ఆచార్య టి.గౌరీశంకర్ వ్యవహరించారు.
సభాధ్యక్షులు నారాయణస్వామి వెంకటయోగి.. విదేశాల్లోని తెలుగు కవులు, సాహితీవేత్తలు తాము ఉంటున్న దేశాల్లోని బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను ఎత్తిచూపేలా రచనలు చేయాలన్నారు. అలానే తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ భాషల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భాషా ప్రముఖులు, సాహితీవేత్తలు, ఐటీ నిపుణులు ఒకే వేదికపైకి వస్తే తెలుగు భాష మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.
స్ఫూర్తిదాయకమైన కృషి
ఆచార్య టి.గౌరీశంకర్ మాట్లాడుతూ ‘‘తెలుగు భాషకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. తెలంగాణలో మరుగునపడ్డాయనుకున్న భాష, సంస్కృతి, సాహిత్యాలు ప్రపంచవ్యాప్తం కావడానికి ఈ సభలు ఒక భూమికగా ఏర్పడ్డాయి. మారిషస్, మలేసియా వంటి దేశాల్లో తెలుగువాళ్లు ఉన్నారు. అక్కడ వాళ్లకు అయిదో తరం నడుస్తోంది. ఈ మధ్యకాలంలో అమెరికా, యూకే, కెనడా లాంటి దేశాలకి 60, 70 ప్రాంతాల్లో వెళ్లిన తెలుగువాళ్లూ ఉన్నారు. వీళ్లలో ఇంకా మన భాషా సాహిత్యాలు తాజాగా పరిమళిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు అక్కడ తెలుగు భాషను నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నారు. అందుకు, తెలుగు పాఠ్యపుస్తకాలు తయారుచేసుకుని స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధనను కొనసాగిస్తున్నారు’’ అన్నారు. మలేసియా తెలుగువాళ్ల తరఫున ఈ మహాసభలకు వచ్చిన వాళ్లలో 94 ఏళ్ల సోమయ్య గురించి ఈయన ప్రత్యేకంగా ఉట్టంకించారు. సోమయ్య మొట్టమొదటి తెలుగు ప్రపంచ మహాసభలకు సైతం హాజరయ్యారు. మలేసియాలో తెలుగు పాఠ్యపుస్తకాలను తయారుచేసి, పిల్లలకు మన భాషను నేర్పించడంలో చాలా కృషిచేశారు. నేటికీ అక్కడ తెలుగు భాషా సంస్కృతులను పరివ్యాప్తం చేసేందుకు శ్రమిస్తున్నారు.
‘‘అమెరికాలో 45 ఏళ్లుగా ఎలాంటి భాషాసాహిత్య కార్యక్రమాన్నయినా మా మాతృసంస్థ ‘హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి’ తరఫునే నిర్వహిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం నుంచి మీ సారస్వత సంపదను మాకు పెట్టుబడి పెట్టండి. తెలుగు సారస్వత సంపదని అన్ని దేశాలకు పంచండి. దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉంటాం. భాషాసాహిత్యాలకు ఎల్లలు లేవు. మాతృభాషను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి’’ అంటూ వంగూరి ఫౌండేషన్ అధినేత వంగూరి చిట్టెన్రాజు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.
ఎక్కడ ఉన్నా తెలుగు తలపులే..
లండన్ నుంచి వచ్చిన సలేహా జాఫర్ సొంతూరు నల్గొండ జిల్లా. ఉద్యోగరీత్యా 1970లో లండన్‌లో స్థిరపడ్డారు. లేబర్ పార్టీ నుంచి లాంబెత్ పట్టణ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2014లో డిప్యూటీ మేయర్, 2016లో మేయర్‌గా పదవులు నిర్వర్తించారు. మిగిలిన భారతదేశ భాషల మాదిరిగా స్థానిక ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ అందుబాటులో ఉంచాలని అక్కడి పాలకులపై ఒత్తిడి తెస్తున్నారావిడ. అలానే లండన్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు పిల్లల కోసం తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాలని కోరారు. ఆమె ఏ సమావేశానికి వెళ్లినా పలకరింపు ‘నమస్కారం’తోనే! బతుకమ్మ, దసరా, ఉగాదిలాంటి పండగలు కూడా ఘనంగా చేసుకుంటారు. ఈ సభల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారావిడ.
‘‘ఆస్ట్రేలియాలో తెలుగు భాషను కమ్యూనిటీ భాషగా గుర్తించాలని స్థానిక ప్రభుత్వాన్ని కోరాం’’ అంటూ మెల్బోర్న్ నుంచి వచ్చిన మల్లికేశ్వరరావు కొంచాడ అన్నారు. ‘‘అక్కడ తెలుగువాళ్లు ఏటా పౌరాణిక, పద్య నాటకాలు ప్రదర్శించడం లాంటివి చేస్తున్నారు. అన్ని ప్రధాన పట్టణాల్లో తెలుగు పాఠశాలలు ఉన్నాయి. వాటికి మా సంఘం తరఫున సాయం చేస్తున్నాం. పాఠ్యాంశాలు రూపకల్పన చేస్తున్నాం. ఈ విషయంలో రెండు తెలుగు ప్రభుత్వాల నుంచీ సాయం కావాల’’ని ఆయన అభ్యర్థించారు. కువైట్ నుంచి వచ్చిన అభిలాష గొడిశాల... ‘‘తెలుగు నేల మీద అడుగుపెట్టగానే ఒళ్లు పులకరించింది. తెలుగు మాటలు వింటుంటే కడుపు నిండినట్లనిపిస్తుంది. తెలుగు మాట్లాడితే అమ్మతో మాట్లాడినట్లనిపిస్తుంది. అమ్మభాషలోని భావవ్యక్తీకరణ ఆంగ్లంలో చేయలేం. అందుకే నా పిల్లల్ని తెలుగులోనే మాట్లాడమని ప్రోత్సహిస్తాను’’ అని సంతోషంగా చెప్పారు.
పాలకుల చొరవే శ్రీరామరక్ష
‘‘తెలుగు ఇంతకన్నా పరిపుష్టంగా విదేశాల్లోనే ఉంది. పది పదిహేనేళ్ల క్రితం నేను సిలికానాంధ్ర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అక్కడ పిల్లలు అ ఆలు దిద్దేవాళ్లు... వాళ్లిప్పుడు అవలీలగా పద్యాలే రాసేస్తున్నారు. పద్యాలు రాయడం గర్వించదగ్గ విషయం’’ అన్నారు సినీనటులు తనికెళ్ల భరణి. ఈ మహాసభలు ప్రతి తెలుగు వాడి నరనరాన కొత్త నెత్తురు.. కొత్త స్ఫూర్తిని ఎక్కిస్తాయంటూ తన హృదయాంతరాల్లోని మాటను బయటపెట్టారు తనికెళ్ల. ముఖ్య అతిథి కవిత మాట్లాడుతూ ‘‘ఈ సభలకు 42 దేశాల నుంచి తెలుగువాళ్లు రావడం సంతోషకరం. ఒక్క మలేసియా నుంచే వందమంది వచ్చారు. ముందు తరానికి భాష, సంస్కృతులు అందించాల్సిన బాధ్యత మనదే’’నని చెప్పారు. తెలుగు భాష ప్రాచీనతను, తెలంగాణలో వచ్చిన సాహిత్యాన్ని దృశ్యాత్మకంగా (పవర్‌పాయింట్ ప్రజెంటేషన్) చూపిస్తూ వివరించారు. తర్వాత ఆవిడ విదేశీ ప్రతినిధులను సత్కరించారు.
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు విదేశాల్లో స్ఫూర్తిదాయక కృషి జరుగుతోందనడంలో సందేహం లేదు. మన రెండు ప్రభుత్వాల నుంచి పూర్తిస్థాయిలో తోడ్పాటులేకపోయినా ఆయా దేశాల్లోని తెలుగువారు.. అమ్మభాషను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నారు. మరోవైపు ఈ 21వ శతాబ్దంలో తెలుగును కాపాడుకోవాలంటే వ్యవస్థీకృతంగా జరగాల్సిన కృషి చాలా ఉంది. అదేంటో కంప్యూటర్లో తెలుగు ఖతుల (ఫాంట్లు) రూపకల్పనకు కృషిచేసిన తొలితరం నిపుణుల్లో ఒకరైన సురేశ్ కొలిచాల మాటల్లో చెప్పాలంటే... ప్రపంచమే కుగ్రామమైన సాంకేతిక యుగంలో ప్రస్తుతం ఉన్నాం. భాషా సమీకరణలు మారిపోతున్నాయి. చాలా వరకూ పెద్ద భాషలు.. చిన్న భాషలను కబళించేస్తున్నాయి. రానున్న వందేళ్లలో ప్రపంచ భాషల్లో కేవలం పది శాతం భాషలు మాత్రమే మిగిలే అవకాశం ఉందని భాషాశాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటిలో తెలుగు ఉంటుందా లేదా.. అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్ వరకూ తెలుగు చదివించడం, దుకాణాలు, కార్యాలయాలపై తెలుగులో పేర్లు, నిఘంటు నిర్మాణం, తెలుగు మహాసభల నిర్వహణ లాంటివి మేలు చేస్తాయి. రెండేళ్లకో, మూడేళ్లకో ఓసారి ఇలాంటి వేడుకలు చేసుకుంటే సరిపోదు.. తెలుగు పెద్ద భాషగా మనుగడ సాగించాలంటే పటిష్టమైన చర్యలుండాలి. తెలుగు చదువుకున్న వారికి ఉద్యోగం సులభంగా వచ్చే పరిస్థితి ఉండాలి. ఆ విషయంలో ప్రభుత్వాలు కృషి చేయాలి!
తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతు లను భావి తరాలకు అందించేందుకు సిలికానాంధ్ర తరఫున కృషి చేస్తున్నాం. తెలుగు భాషాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం. ఈ సభలవల్ల ఎంతో మంది తెలంగాణ కవులు, రచయితల గురించి తెలుసుకున్నాను. నేనూ శతావధానంలో పృచ్ఛకుడిగా పాల్గొన్నా.
- దీనబాబు కొండుభట్ల, అమెరికా
మన తెలుగు భాషకు, తెలుగుజాతికి, తెలుగుదనానికి గౌరవం ఇస్తూ సభలు జరిపారు. తెలుగంటే ఆంధ్ర, తెలంగాణలు మాత్రమే కాదు. ఈ ఎల్లలు దాటి కర్ణాటక, బళ్లారి, బ్రహ్మపూర్, మద్రాసు ఇవన్నీ తెలుగువారి చరిత్రలో భాగమైనవే. అక్కడి భాషనూ మనం కాపాడుకోవాలి. తెలుగువాళ్లను ఐక్యం చేయాలి. ఈ సభల ఉద్దేశమే అది. తెలంగాణ ప్రాంత తెలుగు సాహిత్య సంపదని, తెలుగుకు కృషి చేసిన వ్యక్తులందరినీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి పరిచయం చేయడానికి ఉద్దేశించిన సభలుగా వీటిని మనం భావించాలి. విద్యావ్యవస్థలో తెలుగు తప్పనిసరి అన్న మాట ఉత్తి వాగ్దానం కాకూడదు. అమలు పరచాలి. మలేసియా నుంచి వంద ప్రతినిధులం వచ్చాం. మాకు ఆంధ్ర అనో, తెలంగాణ అనో సంబంధం లేదు. మేము తెలుగు బిడ్డలం!
- అచ్చయ్య కుమార్‌రావు, మలేసియా తెలుగు సంఘం ప్రధారాధ్యక్షులు
ప్రపంచ తెలుగు మహాసభల్లో మమ్మల్ని భాగస్వామ్యులను చేయడం సంతోషకరం. రాబోయే తరానికి తల్లి, గురువు, సనాతన ధర్మాల విశిష్టతను తెలియజెప్పాలి. సదస్సు ప్రాంగణంలో నిలబడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.
- డా।। కాశీ విశ్వనాథ్, ఇంగ్లండ్
పుట్టి పెరిగింది మెదక్ జిల్లాలో. 11 ఏళ్ల కిందట లండన్ వెళ్లి న్యూరో సైంటిస్ట్‌గా స్థిరపడ్డా. సొంతగడ్డపై జరుగుతున్న ఈ అమ్మభాషా పండగలకు కుటుంబ సమేతంగా తరలివచ్చా. తొలిరోజు కేసీఆర్ ఉపన్యాసం అబ్బురపరచింది. నాకు తెలుగు సాహిత్యంపై పట్టు లేదు. కానీ మాతృభాషపై ఉన్న మమకారంతో కొన్ని కవితలు రాశాను. ఈ మహాసభల్లో నేను రాసిన కవిత చదివి వినిపించడం మర్చిపోలేని అనుభూతి.
- డా।। ఎ.హెచ్.గోపాలకృష్ణారావు, లండన్