మేమూ తెలుగు వాళ్లమే!

  • 763 Views
  • 0Likes
  • Like
  • Article Share

    గణేశ్‌ బెహరా

  • వాటపాగు, శ్రీకాకుళం జిల్లా
  • 7732097027
గణేశ్‌ బెహరా

తెలుగు పీఠం కావాలని ఒకరు... భాషాపరంగా తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పి, ప్రజల హక్కులు కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని మరొకరు.. మమ్మల్ని తెలంగాణ బిడ్డలుగా గుర్తించండని వేరొకరు.. భాషను నిలబెట్టే విషయంలో నిర్ణయం మీకే వదిలేస్తున్నామని ఇంకొకరు.. తెలుగువాళ్లు లేకపోతే ఉద్యోగం మానేసేవాణ్నేమోనని మరో ఐపీఎస్‌ అధికారి... ఇలా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగువారు తమ భావాలను, సమస్యలను, అనుభూతులను పంచుకున్నారు. 
‘‘మహారాష్ట్రకు పొట్ట చేతబట్టుకుని వెళ్లిన తెలంగాణ బిడ్డలు శ్రామిక, కార్మిక వర్గాలుగా బతుకుతున్నారు. గత 60 ఏళ్లలో తెలంగాణ గడ్డ ఎంత నిర్లక్ష్యానికి గురైందో వలస జీవులం మేము అంతకంటే ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యాం. ఏడు ద్వీపాలుగా ఉన్న ముంబయి నగరాన్ని ఒకే నగరంగా తీర్చిదిద్ది వస్త్ర మిల్లుల్లో ప్రాభవాన్ని చూపెట్టుకుని ముంబయి మహానగరాన్ని ఆర్థిక రాజధానిగా చేసిన ఘనత తెలంగాణ బిడ్డలది. అన్ని రాష్ట్రాల తెలుగువాళ్లకు సమస్యలు ఉన్నట్లే మహారాష్ట్రలో తెలుగు ప్రజలకూ ఇబ్బందులు ఉన్నాయి’’... డిసెంబరు 19న రవీంద్రభారతిలో నిర్వహించిన ‘రాష్ట్రేతర తెలుగు వారితో గోష్ఠి’కి అధ్యక్షత వహించిన సంగెవేని రవీంద్ర ఆవేదన ఇది. ఈ సమావేశంలో చాలామంది తమ గోడు వెళ్లబోసుకున్నారు. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, కొత్తదిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబంగ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల ప్రతినిధులు ఈ గోష్ఠికి హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథి రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ అధ్యక్షులు వి.ప్రకాశ్‌, గౌరవ అతిథి డా।। ఎ.రాధాకృష్ణంరాజు (బెంగళూరు), ఆత్మీయ అతిథి ఆచార్య డి.మునిరత్నంనాయుడు. ఎర్రోజు శ్రీనివాస్‌ సమన్వయ బాధ్యతలు నిర్వర్తించారు.
      ‘‘సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్నవారిలో తెలంగాణ వారున్నారు. మహారాష్ట్ర మొట్టమొదటి స్పీకర్‌ షాయజీ లక్ష్మణ్‌ శీలం తెలంగాణ బిడ్డే. కానీ ట్యాంకుబండ్‌ మీది విగ్రహాల్లో ఆయనకు చోటు దక్కలేదు. చరిత్ర పుటల్లో కూడా క్రమేణా కిందకి వెళ్లిపోతున్నారు. అలానే ముంబయిలోని తెలుగువాళ్లు ‘దర్పణం’ పేరుతో మాసపత్రిక తీసుకురావడం, కవి సమ్మేళనాలు, నెలనెలా వెన్నెల ముచ్చట్లు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ భాషాసాహిత్యాలకు కృషి చేస్తున్నారు. కానీ, ముంబయి విశ్వవిద్యాలయంలో సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ లాంటి చిన్న రాష్ట్రాలకు పీఠాలు ఉన్నాయి కానీ తెలుగు పీఠమో, తెలంగాణ పీఠమో లేదు. దాంతో మన చరిత్రను మనం భద్రపరుచుకో లేకపోతున్నాం. ఉపాధ్యాయుల నియామకాలు ఆగిపోయాయి. తెలుగు పాఠశాలలు మూతపడిపోతున్నాయి. ఈ విషయమ్మీద మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగర్‌రావుకు వినతి పత్రం ఇచ్చాం. తెలుగు పాఠశాలలను నిలబెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సాయం చేయాలి. ముంబయి నగరంలో అన్ని రాష్ట్రాల సాంస్కృతిక భవనాలు కనిపిస్తాయి. కానీ తెలుగు భాషకు, తెలంగాణ సాంస్కృతిక శాఖకు సంబంధించి భవనం లేదు’’ అంటూ రవీంద్ర ఉద్వేగభరితంగా మాట్లాడారు.  
       భివండీ (మహారాష్ట్ర) నుంచి వచ్చిన డా।। పాము మనోహర్‌ కూడా అక్కడి సమస్యలను ఏకరవు పెట్టారు. ‘‘1967 నుంచి తెలుగు పాఠశాలలు నిర్వహిస్తున్నాం కానీ మహారాష్ట్ర, తెలుగు ప్రభుత్వాలు ఎలాంటి సాయమూ అందించట్లేదు. అయినా ‘తెలుగు సంక్షేమ సంస్థ’ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయిదు పాఠశాలలు, ఓ జూనియర్‌ కళాశాలని నడిపిస్తున్నాం. ఇక్కడ తెలుగు చదువుతున్నవాళ్లకు ఉపకారవేతనాలిచ్చి ప్రోత్సహించాలి. మరో విషయం.. ప్రథమ భాష తెలుగుగా ఇంటర్‌ విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ పొందాలంటే ఎక్కడికి వెళ్లాలి? తర్వాత డిగ్రీ చేయాలన్నా కుదరడంలేదు. అదే తెలుగు పీఠం ఉంటే ఆ సమస్యకు పరిష్కారం దొరకుతుంది.. ఉపాధి కలుగుతుంది’’ అని అన్నారు. మా అమ్మభాష తెలుగు.. మా పెద్దమ్మ భాష మరాఠీ అంటూ ఆ గడ్డతో పెనవేసుకుపోయిన బంధాన్ని వివరించారు.  ఇదే రాష్ట్రం నుంచి వచ్చిన పోతు రాజారాం ‘‘ముంబయిలో ఉన్న తెలుగు వాళ్లు బాగుపడాలంటే ఉన్నత చదువులు చదవాలి. ఉన్నత ఉద్యోగాలు లభించాలి. వైద్యులు, ఇంజనీర్లు కావాలి. అలా కావడానికి రిజర్వేషన్‌ అవసరం. రిజర్వేషన్‌కు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లాంటి గుర్తింపులు అవసరం. కానీ, అక్కడ అవి రావు. తెలంగాణ సమగ్ర సర్వేలో ఇక్కడ మా ఇంట్లో అద్దెకున్నవాళ్లకి గుర్తింపునిచ్చారు. ఇంటి యజమానినైనా నాకు స్వరాష్ట్రంలో గుర్తింపు లేకుండా పోయింది. దాంతో మా పరిస్థితి ఎటూ కాకుండా పోతోంది. మమ్మల్ని తెలంగాణ బిడ్డలుగా గుర్తించండి’’ అని విజ్ఞప్తి చేశారు. 
ఆ హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు
పంపకవి పేరున బెంగళూరులో కూడళ్లు ఉన్నాయి. సాహితీ సంస్థలు ఉన్నాయి. ఆయన పేరు మీద నిర్వహించే కార్యక్రమాలకు కర్ణాటక ప్రభుత్వం ఏటా రూ. 5 లక్షలు కేటాయిస్తోందంటూ ఆ రాష్ట్రంలో ఓ తెలుగు బిడ్డ(పంపన)కు దక్కుతున్న గౌరవాన్ని కళ్లకుకట్టారు డా।। ఎ.రాధాకృష్ణంరాజు. భాషాపరంగా అల్పసంఖ్యాకులైన వారి హక్కులను నిరాకరించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదన్నారాయన. కానీ, కొన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి చోటుచేసుకుంటోందని ఆవేదన వ్యక్తంచేశారు. కర్ణాటక ప్రభుత్వం తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు రూ.240 కోట్ల నిధులు కేటాయించింది. కన్నడ అభ్యసించే విద్యార్థులకు సాయమందిస్తోంది. శ్రీలంకలో ఓ చోట తమిళ పాఠశాల, కళాశాల శిథిలమైతే జయలలిత రూ.15 కోట్లు విడుదల చేసి పునర్నిర్మాణానికి తోడ్పడ్డారు. మన ప్రభుత్వాలు కూడా అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు పాఠశాలలకు, తెలుగువారికి చేయూతనివ్వాలని రాధాకృష్ణంరాజు అభిలషించారు.  
      తెలుగుకు ప్రాచీన భాషగా ఎప్పుడో గుర్తింపు వచ్చింది. కానీ, ప్రాచీన భాషా కేంద్రం మాత్రం ఇప్పటి వరకూ తెలుగుగడ్డ మీద ఏర్పాటు కాలేదు. దీని మీద దక్షిణ ప్రాంతీయ భాషా కేంద్రం (బెంగళూరు) ప్రధానాచార్యులు డా।। జి.ప్రభాకర్‌ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన తదితర పరిణామాల నేపథ్యంలో ప్రాచీన భాషా కేంద్రం హైదరాబాదుకు రాలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కాబట్టి దీన్ని ఎక్కడ స్థాపించాలన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం సతమతమవుతోంది. రెండు తెలుగు ప్రభుత్వాలు చర్చించుకుని ఈ సంస్థను త్వరగా ప్రారంభిస్తే మన భాషకు, సంస్కృతికి సేవ చేసినవాళ్లమవుతామని చెప్పారు ప్రభాకర్‌. ఈ విషయంలో జాప్యం జరగకుండా పాలకులు తగిన చొరవ తీసుకోవాలి. ఆ కేంద్రం తెలుగుగడ్డ మీద కొలువుదీరితే చాలామంది యువ పరిశోధకులకు ఉపకారవేతనాలు దక్కడమే కాకుండా, యువ రచయితలకు జాతీయస్థాయి పురస్కారాలు, తెలుగు చదువుకున్నవాళ్లకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఆధునిక నిఘంటువులు తయారుచేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌ తరాలకు పురాతన గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు అర్థమయ్యేలా తర్జుమా చేసే ప్రయత్నాలూ జరుగుతాయి.  
      భోపాల్‌ (మధ్యప్రదేశ్‌)లో పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన మరియకుమార్‌ కూడా ఈ గోష్ఠికి హాజరయ్యారు. ‘‘1986లో మధ్యప్రదేశ్‌కి వెళ్లినప్పుడు అక్కడ నాకు తెలిసినవాళ్లు లేరు. హిందీ అంతగా రాదు. వాళ్లు మాట్లాడేది అర్థమయ్యేది కాదు. ఎక్కువ కాలం అక్కడ ఉద్యోగం చేయలేననిపించింది. తెలుగు వాళ్లెవరైనా కనిపిస్తే ఈ విషయాలను పంచుకోవాలనుకుని మనవాళ్లకోసం వెతికితే... కొంత మంది అధికారులు, ఇంకొందరూ కలిశారు. చాలా సంతోషించాను. సాంత్వన కలిగింది. మనం ఆత్మీయంగా, ఆప్యాయంగా భావాలు పంచుకునేందుకు ఉపయోగపడేది మన మాతృభాష’’ అంటూ అమ్మభాష గొప్పదనాన్ని ఆయన గుర్తుచేశారు.  
అన్ని చోట్లా అవే సమస్యలు
తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు భౌగోళికంగా, జనాభా పరంగా చాలా సారూప్యత ఉంది. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాహితీ, సంగీత ప్రియులే! అయితే, ఒడిశాలో తెలుగు కనిపించడం లేదు. వినిపించడం లేదు. రైల్వేస్టేషన్లలో తెలుగు లేదు. తెలుగు పుస్తకాలు లేవు. తెలుగు ఉపాధ్యాయులు లేరు. తెలుగు ప్రభుత్వాలు పూనుకుంటేనే అక్కడ మన భాష పునరుజ్జీవం పొందుతుందన్నారు ఆనందరావు పట్నాయక్‌. 
      భిలాయి నుంచి వచ్చిన బి.జోగారావు ఛత్తీస్‌గఢ్‌లో తెలుగు పరిస్థితిని వివరించారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌ మధ్యప్రదేశ్‌లో కలిసి ఉండేటప్పుడు రెండు తెలుగు మహాసభలు జరిపించాం. విడిపోయాక 2016లో ఛత్తీస్‌గఢ్‌ తెలుగు మహాసభలు కూడా ఘనంగా నిర్వహించాం. భిలాయిలో తెలుగు పాఠశాలలున్నాయి. వాటికి తెలుగు ప్రభుత్వాల నుంచి కానీ, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి గానీ ఏ సాయమూ అందట్లేదు. ఉపాధ్యాయులకు జీతాలు కూడా సరిగ్గా లేవు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, రిజర్వేషన్లు లేవు. అలానే మన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి భవనాలూ లేవు’’ అంటూ తమ సమస్యలను నివేదించారు. 
      ‘‘ఆంగ్లేయుల కాలం నుంచి హోసూరులో తెలుగు ఉంది. అయినా తమిళనాడులో మనవాళ్లకు సరైన ఆదరణ లేదు. ఈ పరిస్థితి వల్ల తెలుగువాళ్లు అమ్మభాషకు దూరమవుతున్నారు. తమిళనాట తెలుగు చదువుల కోసం ఎన్నో వినతిపత్రాలు అందించాం. ఏ పాలకులూ పట్టించుకోలేదు’’ అన్న ఎం.వెంకట రమణప్ప మాటలు సభాసదుల గుండెలను బరువెక్కించాయి. హైదరాబాదు నుంచి తమిళనాడు వచ్చే అన్ని పుస్తకాల మీద తమిళ స్టాంపులు ఉంటాయి తప్ప, తమిళనాడు నుంచి వచ్చే పుస్తకాల మీద ఒక్క తెలుగు స్టాంపు అయినా కనిపిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం తమిళనాడు పాలకులతో చర్చలు జరిపి తెలుగు నిలబడేలా చేయాలని వెంకటరమణప్ప అభ్యర్థించారు. ఇలా ఈ గోష్ఠిలో చర్చకు వచ్చిన అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ముఖ్య అతిథి వి.ప్రకాష్‌ హామీ ఇచ్చారు. మహాసభలకు మొత్తం 17 రాష్ట్రాల నుంచి దాదాపు 1500 మంది ప్రతినిధులు వచ్చారు. ముంబయి నుంచి ప్రత్యేక రైలులో 170 మందిమి తరలివచ్చామని ‘ఆంధ్రమహాసభ’ సంయుక్త కార్యదర్శి గాలి మురళీధర్‌ ‘తెలుగు వెలుగు’తో చెప్పారు. ఈ సంస్థకు 90 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సంస్థ ప్రతి నెలా సాహిత్య, సాంస్కృతిక, భాషాపరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
      రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది తెలుగువాళ్లు ఉన్నారో దాదాపు అంతే సంఖ్యలో ఇతర రాష్ట్రాల్లో మనవాళ్లు నివసిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో విద్య, ఉద్యోగావకాశాల విషయంలో వీళ్లందరూ ఇబ్బంది పడుతున్నారు. అన్నింటికీ  మించి అమ్మభాషను నిలబెట్టుకునే విషయంలో వీళ్లకి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినాసరే, తెలుగు కోసం వాళ్లు తపిస్తున్నారు. ఈ విషయంలో తెలుగు పాలకులు వీలైనంత త్వరగా స్పందించాలి. ఆయా ప్రాంతాల్లోని తెలుగువారికి చేదోడువాదోడుగా నిలవాలి.


పశ్చిమబంగలో తెలుగువాళ్లం చాలామందిమి ఉన్నాం. తెలుగు పాఠశాలలూ ఉన్నాయి. అయితే.. ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించి తగిన వనరులు, వసతులు లేవు. ఈ విషయంలో తెలుగు ప్రభుత్వాలు సాయం చేయాలి.

- ఎం.శివలింగం, కోల్‌కతా 


తెలుగు గడ్డకు దూరంగా ఉంటున్నా మేమూ తెలుగువాళ్లమే. అమ్మభాష మీద అభిమానంతో ఈ సభలకు వచ్చా. మొదటి ప్రపంచ మహాసభల్లోనూ పాల్గొన్నా. కానీ, సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం మా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలాగ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి మా బాధల్ని తొలగించేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నా.

- శిలపరశెట్టి సంజీవరావు, ఖరగ్ పూర్, పశ్చిమబంగ


 తమిళనాడులోని ఉన్నత పాఠశాలలకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేశా. తమిళాన్ని తప్పనిసరిగా చదవాలన్న నిబంధన అక్కడి తెలుగువారికి శాపంగా మారింది. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. ఈ సమస్యను తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 200 మందిమి ఈ సభలకు వచ్చాం.  

- జి.మునిరెడ్డి, హోసూరు


అసలు ఏ తరగతిలోనూ తెలుగు చదవకుండా ఉన్నత విద్యను పూర్తి చేసే విధానం ఇక్కడ ఉంది. దాంతో చాలామంది తెలుగు భాషకి సంబంధించి ప్రాథమిక విషయాలు కూడా తెలియట్లేదు. తెలంగాణ ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి 12వ తరగతి వరకూ తెలుగు ఒక బోధనాంశంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అది సంతోషం కలిగించింది.

- దాట్ల దేవదానంరాజు, యానాం  


భాష పట్ల పిల్లలకు ఆసక్తి కలిగించే బాధ్యతను తల్లిదండ్రులే తీసుకోవాలి. ప్రభుత్వాలు సైతం పిల్లలకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు పెట్టాలి. బాల సాహిత్యానికి పెద్దపీట వేయాలి. పని ఒత్తిడి కారణంగా తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతోంది. దీంతో వారు పాఠశాలల్లోనే అధిక సమయం గడుపుతున్నారు. అందువల్ల ప్రభుత్వమే పిల్లలకు భాష పట్ల ఆసక్తి కలిగించేలా చర్యలు తీసుకోవాలి. 

- రవీందర్‌ వన్నం, పుణె


 


వెనక్కి ...

మీ అభిప్రాయం