అనువాదం... ఆయన జీవననాదం

  • 590 Views
  • 4Likes
  • Like
  • Article Share

    డా।। కప్పగంతు రామకృష్ణ

  • తెలుగు అధ్యాపకులు
  • విజయవాడ
  • 9032044115
డా।। కప్పగంతు రామకృష్ణ

అనువాదం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. హిందీలో స్నాతకోత్తర విద్య ప్రారంభించిన సమయంలోనే అప్పటి సుప్రసిద్ధ రచయిత గోపీచంద్‌ కథాసంకలనం ‘తండ్రులు కొడుకులు’ను హిందీలోకి అనువాదం చేసి, పెద్దల అభినందనలు అందుకున్నారు. అప్పటి నుంచి ఆయన అనువాద రచనలు అప్రతిహతంగా సాగిపోతున్నాయి. కథలు, కథానికలు, నాటకాలు, కవితలు, నవలలు.. ఒకటేమిటి, తెలుగు, హిందీ భాషల్లో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అనువాదం చేస్తూ రెండు భాషల్నీ సుసంపన్నం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలకు పైబడి ఆయన చేస్తున్న అనువాద యజ్ఞానికి ఇప్పుడు ఫలితం లభించింది. ప్రసిద్ధ పంజాబీ రచయిత్రి అజిత్‌కౌర్‌ ‘ఖానా బదోష్‌’ పేరుతో హిందీలో రచించిన స్వీయచరిత్రను ‘విరామమెరుగని పయనం’ పేరుతో ఆయన చేసిన తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తన అనువాదాల ద్వారా తెలుగు భాషా సాహిత్యాల వైభవ కీర్తిపతాకాన్ని జాతీయస్థాయిలో ఎగురవేసిన ఆయన డా।। వెన్నా వల్లభరావు.
అనువాదం కోసం అనువాదం, రచన కోసం అన్నట్లుగా రచన చెయ్యటం వల్లభరావుకు చేతకాని పని. అనువాదం చేసినా, స్వతంత్ర రచన కన్నా ఎక్కువగా కష్టపడతారు. ప్రతి రచన కోసం పరిశోధన చేస్తారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జీవిత చరిత్ర రచించటానికి వల్లభరావు అయిదేళ్లు శ్రమించారు. 94 ఏళ్ల వయసున్న వెంకయ్య కుమార్తె సహకారంతో ఆయన జీవితంలోని ప్రతి విషయాన్ని తెలుసుకుని, ఆ మహానుభావుడి గొప్పదనాన్ని తన రచన ద్వారా సంపూర్ణంగా ఆవిష్కరించారు. 
      తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని కోరుతూ తెలుగుప్రజలు చేసిన ఉద్యమానికి విజయవాడకు చెందిన డాక్టర్‌ జి.వి.పూర్ణచందు ‘తెలుగే ప్రాచీనం’ అంటూ పరిశోధన గ్రంథాన్ని రచించి, బలం చేకూర్చారు. ఈ పుస్తకాన్ని వల్లభరావు ‘తెలుగు హీ ప్రాచీన్‌ హై‘ పేరుతో హిందీలోకి అనువాదం చేసి, తెలుగువాణిని జాతీయస్థాయిలో వినిపించారు. 
కృష్ణాజిల్లా గుడివాడ మండలం బేతవోలులో వెన్నా హనుమంతరావు, లక్ష్మీనాగేశ్వరమ్మ దంపతులకు వల్లభరావు 1956లో జన్మించారు. బేతవోలులోనే పాఠశాల విద్య, గుడివాడలో కళాశాల విద్య పూర్తిచేసి, ఆంధ్రవిశ్వకళా పరిషత్తు నుంచి ఎమ్మే (హింది), ‘భగవతీ చరణ్‌ వర్మా కే ఉపన్యాసోమే వ్యక్తి ఔర్‌ సమాజ్‌’ అంశంపై చేసిన పరిశోధనకు గాను పీహెచ్‌డీ. పట్టాలు అందుకున్నారు. 
      వల్లభరావు చిన్ననాటి ఉపాధ్యాయుడు యార్లగడ్డ అంకినీడు వీధిబడి నడిపేవారు. తన విద్యార్థులు జాతీయస్థాయికి ఎదగాలంటే హిందీ తప్పనిసరని భావించి, కొచ్చర్లకోట వేంకట సుబ్బారావుతో తన విద్యార్థులకు హిందీపాఠాలు చెప్పించేవారు. సుబ్బారావు కూడా మనసుకు హత్తుకునేలా బోధించటంతో, వల్లభరావుకు హిందీ పట్ల ఎనలేని మక్కువ కలిగి, కళాశాలకు వచ్చేనాటికే హిందీ ప్రచార సభ నుంచి అన్ని పరీక్షలు పూర్తిచేశారు. చదువు పూర్తయిన తర్వాత, విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో హిందీ అధ్యాపకుడిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి, 2014లో అక్కడే హిందీ విభాగాధిపతిగా పదవీ విరమణచేశారు. 2007లో న్యూయార్క్‌, 2015లో భోపాల్‌లో జరిగిన ప్రపంచ హిందీ మహాసభల్లో, మూడు ప్రపంచ రచయితల మహాసభల్లో వల్లభరావు ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. యాభైకి పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పరిశోధనా పత్రాలు సమర్పించారు. 
అనువాదంపై అనురాగం
ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో చదువుకునే సమయంలో తన గురుపుత్రుడైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, హిందీ విభాగాధిపతి ఆచార్య ఆదేశ్వరరావు ప్రోత్సాహంతో వల్లభరావు అనువాద రచనకు శ్రీకారం చుట్టారు. తొలిప్రయత్నంలోనే ప్రసిద్ధ రచయిత గోపీచంద్‌ కథాసంపుటిని తెలుగులోకి అనువాదం చేశారు. అప్పటినుంచి తెలుగు, హిందీ అనువాదాన్ని ఉద్యమంగా చేపట్టారు. సమకాలీనంగా వస్తున్న కథలు, కవితల్ని హిందీలోకి అనువాదం చేయటానికి వల్లభరావు ఎంచుకుంటారు. అలాగే, తులనాత్మక వ్యాసాల పట్ల ఆయనకు మక్కువ ఎక్కువ. తెలుగు, హిందీ భాషల్లో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వందల సంఖ్యలో కవితలు, వ్యాసాలు, కథల్ని అనువదించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోసం ఆయన చేసిన నాటక అనువాదాలన్నీ ఒక ఎత్తు. ఆకాశవాణితో ఆయనది 33 సంవత్సరాల అనుబంధం. సుమారు 40 దాకా నాటకాల్ని ఆయన అనువాదం చేశారు. ఇవన్నీ జాతీయస్థాయి నాటక పోటీల్లో గెలుపొందినవే కావటం విశేషం. 
      వల్లభరావుకు సాహిత్య అకాడమీ పురస్కారం తెచ్చిన ‘విరామమెరుగని పయనం’ స్వీయచరిత్ర మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులుగా మార్చుకుని, విజయశిఖరాలు అధిరోహించిన మహిళ ఇతివృత్తం ఇందులోని ప్రధానాంశం. తరతరాలుగా మహిళల్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యల్ని అజీత్‌ కౌర్‌ (మూలగ్రంథ రచయిత్రి) ఎలా ఎదుర్కొన్నారో వల్లభరావు వివరించిన తీరు పాఠకుల మనసును ఆర్ద్రం చేస్తుంది. నేటి మహిళల్లో చైతన్యం నింపుతుంది. సాహిత్య ప్రయోజనం సమాజచైతన్యమని నిరూపిస్తుంది. 
      కేవలం అనువాదాలకే వల్లభరావు రచన ప్రస్థానం పరిమితం కాలేదు. హిందీ, తెలుగు భాషల్లో ఎన్నో స్వతంత్ర రచనలు చేశారు. ‘కవిరాజ్‌ త్రిపురనేని రామస్వామి చౌదరి, అక్షర సత్య్‌, ఇక్కీ సవీ శతాబ్దీ కీ తెలుగు కవితా, ఆంధ్రప్రదేశ్‌ కే సాంస్కృతిక్‌ పర్యటన్‌ క్ష్రేత్‌ ఔర్‌ లోక్‌ కలాయే, ఛోటే కుమార్‌, రాష్ట్ర ధ్వజ్‌కే నిర్మాతా పింగలి వెంకయ్య, తెలుగుభాషా సంస్కృతీ చైతన్య యాత్రలు, సాహిత్య వారధి, కవితా భారతి, గురజాడ కథలు - నాటక రూపాలు’ తదితర పుస్తకాలను ఆయన వెలువరించారు. 
చిన్నచూపు ఎందుకు?
అనువాదాలతో తెలుగు, హిందీ భాషల మధ్య సాహిత్య వారధి నిర్మించిన వల్లభరావును ఎన్నో పురస్కారాలు వరించి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ (2011), నల్లనివాడు రేడియో నాటకానికి జాతీయ పురస్కారం, దక్షిణభారత హిందీ ప్రచార సభ నుంచి ‘సాహిత్యకార్‌’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఈ ఏడాది ఉగాది పురస్కారం ఆయన కీర్తి కిరీటంలో కొన్ని కలికితురాళ్లు. ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడెమి నుంచి ‘అనువాద సాహిత్య రత్న’ బిరుదునూ ఆయన అందుకున్నారు. 
      ‘‘ఇప్పటికీ చాలా సందర్భాల్లో అనువాదాన్ని కొద్దిగా తక్కువ దృష్టితోనే చూస్తారు. వాస్తవానికి స్వేచ్ఛా రచన కన్నా అనువాదం ఎంతో కష్టం. రచయిత హృదయాన్ని అనువాదకుడు అందుకోలేకపోతే రచన నిర్జీవం అవుతుంది. నిజానికి అనువాదం అంటే పునర్జన్మతో సమానం. ఒక భాషలో పుట్టిన సాహిత్యం, అనువాదం ద్వారా మనోభాషలో జీవం పోసుకుంటుంది. అనువాదాల వల్లే భాషలకు జాతీయ గుర్తింపు లభిస్తుంది. మన తెలుగు వరకు తీసుకుంటే, అనువాదం విషయంలో తెలుగు ఎంతో నష్టపోతోంది. సరైన దృష్టికోణం, ఆదరణ రెండూ ఇక్కడ లోపించాయి. ఈ ధోరణి మారి, ప్రభుత్వం, రచయితలు సమష్టిగా ఉద్యమిస్తే అనువాదాల ద్వారా తెలుగుకు ఎంతో మేలు జరుగుతుంది. తెలుగు సాహిత్యం సత్తా జాతీయస్థాయిలో వినబడుతుంది. నా వరకు సామాజిక ప్రబోధం, మానవాభ్యుదయం ఉన్న అంశాల్నే అనువాదానికి ఎంచుకుంటాను. దళిత, స్త్రీవాద సాహిత్యాలను అనువాదం చేయటం అంటే ఇష్టం. ఇకమీదట కూడా ఇవే అంశాలు ఎంచుకుంటాను. సాహిత్య అకాడమీ పురస్కారం ద్వారా నేను అందుకుంటున్న కీర్తి అంతా నా గురువులైన యార్లగడ్డ అంకినీడు, కొచ్చర్లకోట వేంకట సుబ్బారావులకే అంకితం చేస్తున్నాను. నేనివ్వగలిగిన గురుదక్షిణ ఇదే’’నంటారు వల్లభరావు. తెలుగు సాహిత్యం లోతెంతో ఇతర భాషీయులకు తెలియాలంటే అనువాదాలతోనే సాధ్యం. ఈ కోణంలో కృషిచేస్తున్న రచయితలందరూ అభినందనీయులే.


వెనక్కి ...

మీ అభిప్రాయం