సంక్రాంతి పండగొచ్చె సిద్ధేశ్వరా!

  • 1074 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆచార్య మహాసముద్రం దేవకి

  • అనంతపురం,
  • 9963295997
ఆచార్య మహాసముద్రం దేవకి

వచ్చిందయ్యా వచ్చింది - ఉల్లాసంగా సంక్రాంతి
తెచ్చిందయ్యా తెచ్చింది - తెలుగు వాకిట సుఖశాంతి
గణగణ గంటలనాదంతో - గలగల గజ్జెలరావంతో
కిలకిల కిలకిల నవ్వులతో - గరిసెలు నిండగ రాసులతో
డూడూ డూడూ వెంకన్నా - గంగిరెద్దుల బసవన్నా
తూతూ తూతూ పాటలతో - కిన్నెర సన్నయి పాటలతో

అంటూ ఎల్లోరా సంక్రాంతి సంబరాలను తన ‘పండగల పాటలు- కథలు’ అనే గ్రంథంలో చిత్రించారు. తెలుగువాళ్ల జీవన విధానంలో పనిపాటలతో పాటు అలసిపోయిన శరీరాలకు విశ్రాంతినిచ్చి సంతోషాన్ని పంచే వాటిలో పండగలు, పబ్బాలు, వ్రతాలు నోములు కూడా భాగాలుగా ఉన్నాయి. తరతరాలుగా సామాన్య జనసమూహంలో నిలిచి ఉన్న నమ్మకాలు క్రియా రూపాన్ని దాల్చి పండగలుగా రూపుదిద్దుకున్నాయి. మానసిక అవసరాల్ని తీర్చుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.
      ప్రతి పండగకు ఒక అర్థం పరమార్థం తప్పనిసరి. సంక్రాంతి హిందువుల పండగల్లో అత్యంత ప్రాచీనమైనది. ‘సంక్రాంతి’ అంటే ‘ప్రవేశించడం’ అని అర్థం. జగాలకు జవజీవాల్ని, వెలుగును ప్రసాదించే జాతిరత్నమైన సూర్యుడు దక్షిణాభిముఖుడై ప్రయాణం చేసి పుష్యమాసంలో ఉత్తరాభిముఖుడై ప్రయాణాన్ని సాగిస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండగను మకర సంక్రాంతి అంటారు. పెద్ద పండగ, పొంగలి పండగ అని కూడా పిలుస్తారు.
      ఉదయాన గడ్డిపోచల మీద నిలిచిన మంచుముత్యాలు, బంతి పూదోటల అందాలు, విరిసిన గుమ్మడి పూల సోయగాలు, చెట్లనిండా ఎర్రటి రేగుపళ్లు, వాటికోసం పిల్లల పరుగులు, కోసిన మళ్లలో- పంట ఒడిపిన చేలలో కడుపారా మేతమేసే పశువులు, తోకలెత్తుకుని వాటి మధ్య గంతులేసే లేగదూడలు.. ఈ అందాల మధ్య చలికాలం నుంచి వేసవిలోకి ప్రవేశిస్తున్న సంధికాలంలో వస్తుంది సంక్రాంతి. తలంట్లు, కొత్తబట్టలు, పిండివంటలు అన్ని పండగల్లో ఉండేవే. హరిదాసుల హరినామ సంకీర్తన, అందంగా అలంకరించిన గంగిరెద్దులు, బ్రహ్మముహూర్తానికి ముందే ‘అంబపలుకు - జగదంబపలుకు’ అంటూ డమరుకాన్ని వాయిస్తూ ఇంటింటి ముందూ నిలబడి ఆ ఇంటి భవిష్యత్తు చెప్పే బుడబుడక్కలవాళ్లు, విష్ణుభక్తులు ఇంకా తెల్లవారకనే పాడే తిరుప్పావై పద్యాలు, సంచార భిక్షక గాయకుల భిక్షాటన- జోలె నిండేట్లు ఇంటింటా లేదనకుండా భిక్ష వేసే గృహిణులు.. ప్రతి ఊళ్లో తప్పక కనిపించే ఈ పండగలోని ప్రత్యేక దృశ్యాలు. ‘‘సంక్రాంతి పండగొచ్చె సిద్ధేశ్వరా - తల్లిపిల్ల చల్లగుండ సిద్ధేశ్వరా/ సాంబమూర్తి కరుణ కల్గి సిద్ధేశ్వరా - కలకాలం వర్ధిల్లు సిద్ధేశ్వరా’’ అని దీవించి  భిక్ష స్వీకరిస్తారు సంచార భిక్షక గాయకులు.
సంప్రదాయాలు... సంబరాలు
సంక్రాంతి ముచ్చటగా మూడు రోజుల పండగ. కొన్ని ఊళ్లలో నాలుగు రోజుల పండగ. మొదటి రోజు ‘భోగి’. పాతదనానికి వీడ్కోలు పలికి కొత్తను సాదరంగా ఆహ్వానించే పండగ. ఉదయాన్నే భోగిమంటలు వేసుకుంటారు. ఆ మంటల్లో ఇంట్లో ఉన్న పాత వస్తువులను కాల్చేస్తారు. భోగిమంటల్లో దురదృష్టం కాలిపోతుందని నమ్ముతారు. ‘‘భోగి మంటలు కాగి - నూగు స్నానాలు చేసి/ భోగి పులగాములు - బాగుపరమాన్నంబు’’ వండుకొని తింటారు. ఆ రోజు సాయంకాలం పేరంటాళ్లను పిలిచి చిన్నపిల్లలకు దృష్టిదోషం తగలకుండా రేగుపళ్లు, చిల్లర, చెరుకు ముక్కలు, పూరేకులు, అక్షితలు కలిపిన భోగిపళ్లను పిల్లల తల మీద పోసి ఆశీర్వదిస్తారు. బాలాంత్రపు రజనీకాంతరావు ‘జేజి మామయ్య పాటలు’లో భోగిపళ్లు పోయడాన్ని ‘‘చిట్టీ చిట్టీ రేగిపళ్లూ - చిట్టీ తలపై భోగిపళ్లూ/ ఎంతో చక్కని భోగిపళ్లు - ఎర్రా ఎర్రని రేగిపళ్లూ/ ఘల్లుఘల్లున దమ్మిడీలు - జల్లుగ అల్లో నేరేడిపళ్లు/ తళతళ తళతళ లాడిపోతూ - తలపై ఎన్నో దొర్లిపోతాయ్‌’’ అని వర్ణించారు.
      రెండో రోజు సంక్రాంతి. దీన్ని పెద్ద పండగ, పెద్దల పండగ అని పిలుస్తారు. చనిపోయిన వాళ్లకు కొత్తబట్టలు, పిండివంటల నైవేద్యాలు పెట్టి తర్పణం వదులుతారు. మూడో రోజు కనుమ. కనుమనాడు రైతులు పశువులను చెరువు దగ్గరికో, వంక దగ్గరికో, చెలమ దగ్గరికో తోలుకొనిపోయి వాటిని శుభ్రంగా కడిగి  కొమ్ములకు జివిరి రంగులు పూసి గజ్జలతో, పూలతో అలంకరించి పొంగలి  తినిపిస్తారు. ఊళ్లో ఉన్న పశువులన్నిటినీ గుడి దగ్గరికి చేర్చి పూజ చేసి వాటిపైన పొలి చల్లుతారు. ఆ తర్వాత వాటిని వీధులగుండా పరిగెత్తించి పోటీలు నిర్వహిస్తారు. దీన్ని కుంచెలు తోలడం అంటారు. ఇదంతా చాలా సరదాగా జాతరలాగా సాగిపోయే వ్యవహారం. దీన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. ముందురోజు పెద్దలకు పెట్టి మొక్కిన కొత్త పంచెలు, చీరలు ఈ సమయంలో ధరించి అందరికీ కనువిందు కలిగిస్తారు. నాలుగో రోజు గ్రామదేవతలకు పొంగళ్లు పెడతారు. ఆవులకు పాలు పిండకుండా దూడలకు వదిలేస్తారు. అందుకే ఆ రోజు పండగను పొంగలి పండగని, దూడల పండగని పిలుస్తారు. 
      కోడి, పొట్టేలు పందేలు, ముగ్గులు, గొబ్బెమ్మల పోటీలు, గాలి పటాలు ఎగరవేయడం... చేతినిండా పని, కడుపునిండా పిండివంటలు, మనసు నిండా ఉల్లాసం ఈ సంక్రాంతికి ఉన్నంతగా మరే పండగలోనూ లేదంటే అతిశయోక్తి కాదు. 
గొబ్బి పాటల ప్రత్యేకత
సంక్రాంతికి సాహిత్యంతో కూడా సంబంధముంది. ఈ పండగలో గొబ్బి పాటలకు ప్రాముఖ్యమెక్కువ. ఆడపిల్లలు ఇంటి ముంగిట గొబ్బెమ్మలను పెట్టి గొబ్బిపాటలు పాడుతూ, ఆ పాటల్లోని తాళ లయలకు అనుగుణంగా చేతులు తడుతూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతారు.
      తెలుగునాట గొబ్బిపాటలు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. గ్రామీణులు అప్రయత్నంగా అలవోకగా సృష్టించుకున్న ఆ పాటలు ఒక తరం నుంచి మరో తరానికి మౌఖికంగా సంక్రమిస్తూ వస్తున్నాయి. అన్నమయ్య గొబ్బిపాటల్ని రాయడం ఆ పాటలకున్న ప్రాధాన్యం ప్రాచీనమైనట్లు తెలుస్తోంది. గొబ్బిపాటలు చాలా రకాలు. విషయ వైవిధ్యంతో కూడుకున్న ఆ పాటల్ని రకరకాలుగా వర్గీకరించి పరిశీలించవచ్చు.
      సామూహికంగా పాడే ఆ పాటల్ని ఒకరు ఒక చరణాన్ని పాడగా మిగిలినవాళ్లు దాన్ని అనుకరిస్తూ పాడతారు. గొబ్బిపాటల వైశిష్ట్యాన్ని, వైవిధ్యాన్ని, వస్తు విస్తృతిని అర్థం చేసుకోవడానికి కొన్ని పాటల్ని చూద్దాం.
కథన రూపంలోనివి.. 
రామాదశరథరామా రామన్న భీమన్న 
అన్నదమ్మూలూ రామా దశరథరామా 
రామాదశరథరామా రామన్న బోయేను 
                            రాజ్యమేలాను 
ఏడు జాముల పొద్దు ఏట్లో వాలింది        
భీమన్న వచ్చేను బీడు దున్నేసీ            
అన్నరో ఓయన్న నీళ్లియ్యరన్నా            
మీయన్న లేడు మరిది నేనున్నా మరిదీ        
ఎవరుంటె ఏమొదిన నీళ్లియ్యి వదినా    
బాయిలోని నీళ్లన్ని బండ మరుగాయా        
పాలన్న దీసియవె పాపకారొదినా    
ఆవులన్ని అడివేగి తిరిగి రాలేదూ            
అన్నమన్న పెట్టవే ఆశపోతొదినా
పొయిలోని పిల్లిలెయ్యనే లేదూ            
మంచమన్న ఎయ్యవే మాటకారొదినా        
మంచంలో మీయన్న కునుకు తీసేనూ         

      సాధారణంగా ఒక సమాజంలోని ఆచార వ్యవహారాలను, వివిధ వర్గాల మనస్తత్వాలను, సామాజిక జీవిత దృక్పథాన్ని ప్రతిబింబించే లక్షణం ఆ సమాజపు జానపద సాహిత్యంలోనే ఎక్కువగా ఉంటుంది. జానపదులు పాడుకొనే గొబ్బిపాటల్లో ఆ లక్షణాలన్నీ సమగ్రంగా ప్రస్ఫుటమవుతాయి. కన్నబిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకొనే తల్లులు సవతి పిల్లల్ని, తల్లి లేని పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం, బండెడు చాకిరీ చేయించుకొని కడుపుకింత కూడైనా పెట్టకపోవడం జానపదుల్లో అరుదుగా కన్పించే ఒకానొక లక్షణం. అలాంటి స్వభావానికి పై పాట అద్దం పడుతోంది. కథన రూపంలో ఉన్న గొబ్బిపాటలు జానపదుల కథన కౌశలాన్ని, వర్ణనా నైపుణ్యాన్ని సువ్యక్తం చేస్తాయి. ‘‘గొబ్బియ్యలో ఊరూరి ముందరా మా ఊరి ముందరా/ మా ఊరి ముందరా సిరిపొన్నమానూ/ సిరిపొన్న మానుకూ మూరెడే రేకూ/ మూరేసి మాయన్న మేడ కట్టించే/ మేడలో ఉన్నాది మేలంపు కన్నె... / నీ తోటి సిలకలు ఎందుబొయినాయి/ నా తోటి సిలకలు మేతకు బొయినాయి’’ పాట దీనికో ఉదాహరణ. 
సంభాషణ రూపంలో...
సంభాషణా శైలిలో ఉన్న ఈ పాటను ప్రశ్న రూపంలో ఉన్న పాటను ఒకరు పాడగా మిగిలినవాళ్లు సమాధాన రూపంలో ఉన్న పాటను పాడతారు. ‘‘గొబ్బియ్యలో కట్టమింద బొయ్యేది ఎవరమ్మ సిలకా/ ‘‘గొబ్బియ్యలో నీసేతి మల్లిమొగ్గ నాకిచ్చిపోవే!/ గొబ్బియ్యలో ఇస్తాను రావమ్మ ఈ కోనలోకి/ ‘‘గొబ్బియ్యలో ఈ కోన దాడ్తానే ఏ ఊరు వచ్చు/ గొబ్బియ్యలో ఈకోన దాటగానే గుజ్జిమావిళ్లు/ ‘‘గొబ్బియ్యలో గుజ్జిమావిళ్లాకాడ ఏముంటదమ్మ?/ గొబ్బియ్యలో గుజ్జిమావిళ్లాకాడ గుర్రాలదండు’’... గుర్రాలదండుకొక మంచినీళ్లబాయి, ఆ బాయికి బంగారుమెట్లు, ఆ మెట్లపైన బుడబుడ చెంబు, ఆ చెంబును బాయినీళ్లలో ముంచగానే గురిగింజ చిక్కడం, దాని నేతన్నకిస్తే ఒక వెండిచీర నేసివ్వడం, అది కట్టుకోని ఆ అమ్మాయి పట్నానికి పోవడం, పట్నంలో ఉన్న పెళ్లికొడుకు పూలుకొనివ్వడం, ఆ పూలు పెట్టుకొని సంతకుపోతే ఆ సంతలో మామ సై సై అనడం - అంతా ప్రశ్నోత్తరాల రూపంలో సాగుతుంది.
దేవతా ప్రార్థనలు.. హాస్య ప్రధానాలు 
గొబ్బి పదాల్లో ప్రాచీనాలన్నీ దైవభక్తి ప్రధానాలే. ఈ పండగలో నృత్య మొక విశేషం. వైష్ణవ సంప్రదాయాన్ని తెలిపే ధనుర్మాసపు వేడుకల్లో నృత్యం చెయ్యడం ఉంది. గొబ్బి, కుమ్మి పదాలు ఒకే సంప్రదాయానికి చెందినవిగా టేకుమళ్ల కామేశ్వరరావు ఆంధ్ర జానపద వాఙ్మయ చరిత్రలో పేర్కొన్నారు. ‘‘కొలిని దోపరికి గొబ్బిల్లో - యదుకుల స్వామికి గొబ్బిల్లో/ కొండగొడుగుగా గోవులగాచిన - కొండొక శిశువుకు గొబ్బిల్లో’’- ఈ పాట యదుకుల తిలకుడైన శ్రీకృష్ణుణ్ని నాయకునిగా చేసి కన్నెపిల్లలు పాడింది. గోపికల ఊహల్లో ఉయ్యాల లూగిన వీరశృంగార మూర్తి గోపాలుడు. దేవతాపరమైన వర్ణనల్లో వరములిమ్మని కోరడం (‘సుబ్బీ గొబ్బెమ్మా శుభములియ్యావే- గుండు గౌరమ్మా గుణము లియ్యావే’ లాంటి వాటిలో) కనిపిస్తుంది. 
వరసైన వాళ్లతో మేల మాడటం పండగ వినోదాల్లో ప్రధానమైన భాగం. కొత్తల్లుడు అత్తవారింటి కొచ్చినప్పుడు మరదళ్లు బావగారి ముందర పాటలు పాడి వీలైనంత ఎక్కువ కానుకల్ని రాబట్టాలని చూస్తారు.
గొబ్బియ్యలో పదేళ్ల నాటిది పాత దూలమూ
పడిపోయె మా బావ పల్వరస మీద
పళ్లన్ని పిప్పాయె నోరెర్రనాయె
వీధిలో బావకూ వినసిగ్గులాయె
రచ్చలో బావకూ రా సిగ్గు లాయె
సభలోన బావకు తలవంపులాయె

మామ వరసైన వాళ్లను, బావను ఎగతాళి చేసి ఏడిపించి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం సామాన్యుల సరససల్లాపాల్లో ఒకానొక అంశం. అలాంటి సన్నివేశాలు హాస్యప్రధానంగా ఉంటాయి. మామయ్యను ఎగతాళి చేస్తూ పాడే ఓ గొబ్బిపాట... ‘‘మామొచ్చినాడమ్మ మామొచ్చినాడు - యాలొచ్చినాడమ్మ యాలొచ్చినాడు/ వట్టింటి పుల్లాకు నాకనొచ్చినాడు - కుక్కముట్టిన బెల్లం తినవొచ్చినాడు/ ఆకడిగినాడమ్మ ఆకడిగినాడు - కట్టమింద కానగాకు కోసుకోమంటి/ వక్కడిగి నాడమ్మ వక్కడిగినాడు - దిబ్బలో చింతగింజ ఏరుకోమంటి/ సున్నమడిగినాడమ్మ సున్నమడిగినాడు - గోడమింద కాకిరెట్ట తీసుకోమంటి/ దుగ్గడిగినాడమ్మ దుగ్గడిగినాడు - వీధిలో దుమ్మెత్తి పోసుకోమంటి/ పొవ్వాకడిగినాడమ్మ పొవ్వాకడిగినాడు - అటకా కింద ఎలక తోక తుంచుకోమంటి’’! 
ఊతపదాలు  
గొబ్బిపాటల్లో సామాన్యంగా అభినయానికి అనుకూలంగా ఎత్తుగడలో కొన్ని పదాలు కన్పిస్తుంటాయి. అవి జంగం కథల్లోని ‘తందానతాన’ లాంటివి. పాటల్లో ఒక చరణం నుంచి మరో చరణాన్ని అందుకోవడానికి అవి ఊతపదాల్లాగా ఉపయోగపడతాయి. గొబ్బిపాటలు ఎక్కువగా ‘గొబ్బియ్యలో’ ఎత్తుగడలో ఉంటాయి.
గొబ్బియ్యలో చిన్న చిన్న బుడిగిల్లొ 
                        కూరొండి పెడితి
పెద్ద పెద్ద బుడిగిల్లో కూడొండి పెడితి
కోడిగూటిమింద కూడారబోస్తి
కొండ చిలకలు వచ్చి చిల్లాడిపోయా
చిల్లాడి పోతానే మొలకలై మొలిచా
మొలకలకు మారాజు కోటగట్టిచ్చా
కోట కోటంటారు ఏదమ్మ కోటా
చూడండి చెల్లెలా చుక్కల్ల కోటా

      ఈ పాటలోని వర్ణనావైచిత్రి కొనియాడ దగింది. తెల్లని వెన్నెలే ఆరబోసిన అన్నం. వెన్నెల పిండార బోసినట్లుందనడం లోక వ్యవహారం. అలాంటిదే ఇదికూడా. పగలు అసలు కన్పించని చుక్కలు రాత్రయ్యేసరికి ఒక్కొక్కటే పుట్టుకొస్తాయి. పుట్టే చుక్కలకు, మొలిచే మొలకలకు సామ్యముంది. చుక్కలకు రాజు చంద్రుడు. అతడు కట్టించిన చుక్కల్ల కోట ఆకాశం. జానపదులు అప్రయత్నంగా సృష్టించుకున్న పాటల్లో ఇలాంటి మధుర భావనలుండటం వాళ్ల ఊహాశక్తికి తార్కాణం. ‘బుడిగి’ అంటే ‘పిడత’ అని అర్థం.
      అలాగే ఇంకో ఊతపదం.. గౌరమ్మ! గొబ్బెమ్మ గౌరమ్మే. ఆమె పూజ చేస్తూ అదే పదాన్ని ఎత్తుగడలో వాడటం గమనించదగింది. ‘ఒక్కొక్క పోకంచునే - గౌరమ్మ/ ఒక్క కట్టాకులందూ/ రాచూరి సున్నమందూ - గౌరమ్మ/ రాయబారామందునూ..’ దీనికో ఉదాహరణ. ఇక ‘‘ఎనకాల బుట్టింది తుమ్మెదా/ పెద్ద ఎర్రబంతీ చెట్టు తుమ్మెదా/ ఆ చెట్టు పూచింది తుమ్మెదా/ పెద్ద ముద్దబంతీపువ్వు తుమ్మెదా..’’ లాంటి పాటల్లో వినిపించే ‘తుమ్మెదా’ అనే మాట ధ్వని పూర్వకంగా ఉంటుందనీ కొన్నిచోట్ల ఆత్మ అనీ, మరికొన్ని చోట్ల భారతీయుడని భావం కనిపిస్తుందంటారు టేకుమళ్ల కామేశ్వరరావు. అలాగే ‘భద్రుడా’ (ఆ కొండా ఈ కొండరా భద్రుడా శివాజి కొండొకటిరా...), ‘దేవా’ (సిరిమల్లె శ్రీ కొండలో దేవా ఏమేమి ఉన్నాయిరా దేవా..), ‘ఎన్నిలాయిలో’ (కథారూపంలో ఉన్న ‘ఒక ఊరి దేశమోడు ఎన్నిలాయిలో వాడు సింతమాను మగమనిషి ఎన్నిలాయిలో’ లాంటి గొబ్బిపాటల ఎత్తుగడలో ఇది కనిపిస్తుంది), ‘ఎన్నల్‌’ (అక్కాచెల్లెండ్ల ఎన్నల్‌ ఒకూరిలో ఇచ్చె ఎన్నల్‌..), ‘ఓబులమ్మయిలేరి గొబ్బియ్యలో’ (ఓబులమ్మ గౌరమ్మకున్న మరోపేరు. ‘గాలెమ్మ ధూలెమ్మ గంగాభవానీ ఓబులమ్మయిలేరి గొబియ్యలో..’ లాంటివి దీనికి ఉదాహరణ), ‘రామచిలుకా’ (వాడబుట్టింది వానంబిలో ఓ రామచిలుకా..) లాంటి ఊతపదాలతో పాటు గొబ్బిపాటల్లో ‘హైలెస్సా, ఓలెస్సా, చిలకమ్మా, కోయిలా’ మొదలైన ఎత్తుగడలు కూడా కన్పిస్తాయి. కథలో వచ్చే పాత్రల పేర్లు ఎత్తుగడలో కొన్నిచోట్ల కన్పిస్తాయి. ‘‘నగిరి బస్సు తాను ఎక్కాడే ఎల్లమ నారాయుడు/ వాడు పుంగునూరి సంతకొచ్చాడే/ వాడు సెల్లీకయినా బుడిగిలు కొన్నాడే/ వాడు అక్కాకయినా సీరలు కొన్నాడే ఎల్లమనారాయుడు’’ లాంటి పాటలు ఈ కోవలోవే. 
      గొబ్బి తట్టుతూ, నృత్యం చేస్తూ పాడే ఈ పాటలేకాక గొబ్బెమ్మను రాత్రి నిద్రపుచ్చుతూ పాడే జోలపాటలు, నిద్రలేపుతూ పాడే మేలుకొలుపులు కూడా ఉన్నాయి. ప్రతిరాత్రీ గొబ్బెమ్మను తంగేడు పూలపై పడుకోబెట్టి కళ్లపై తంగేడు రేకులుంచి ‘‘సాకలి సరవన్నా రెండూ సలవలు దేరన్నా/ కుమ్మరి గురిశెట్టీ రెండూ కుండలు దేరన్నా/ అరటిపండ్లాగారమే గౌరమ్మ సింతపూల సింగారమే/ నీదీ నిదానమే గౌరమ్మ నిద్రాకు జయకాలమే/ సన్నగిరి సాపమింద సాలించి నిద్దరపోవె సంపతి గౌరమ్మా’’ అని జోలపాడతారు. 
      ఉదయమే లేచి గొబ్బితట్టే వాళ్లందరూ గొబ్బెమ్మ చుట్టూ చేరి ‘‘ఒక్కొక్క పొద్దుపుట్టె లెయ్యే గౌరి/ వంకలోని నీళ్లు తేను లెయ్యే గౌరి/ రెండు జాముల పొద్దుపుట్టె లెయ్యే గౌరి/ రోటిలోని వడ్లుదంచ లెయ్యే గౌరి/ మూడు జాముల పొద్దుపుట్టె లెయ్యే గౌరి/ ముంత సద్ది నెత్తికెత్త లెయ్యే గౌరి’’ అని పాడుతూ పడుకోబెట్టిన గౌరమ్మను నిలబెట్టి, కంటిమీది రేకులు తీసేసి ఎత్తుగా పువ్వులమర్చి కూర్చోబెడతారు. ఈ పాటలో తెలుగింటి ఆడపడుచుగాని, కోడలుగాని ఉదయమే చెయ్యాల్సిన పనులు సువ్యక్తం. రాయలసీమలో గొబ్బి పాటలకు ప్రసిద్ధి ఎక్కువ. తెలంగాణలో పాడే బతుకమ్మ పాటలకు, వీటికీ పోలికలుండటం గమనార్హం.
      సూర్యోదయానికి ముందే లేచి వాకిట్లో కళ్లాపి చల్లి, ముగ్గులుపెట్టి మిగిలిన పనులు చేసుకోవడం పల్లెప్రజల ఆచారం. నాగరికత పెరిగిన కొద్దీ జీవన విధానంలో మార్పులొచ్చాయి. క్రమంగా ఆనాటి పాటలూ మరుగున పడిపోతున్నాయి. జాతి నడచివచ్చిన తోవలేంటో భావితరాలకు తెలియజేయాలంటే ఈ మౌఖిక వాఙ్మయాన్ని కాపాడుకోవాలి. 


ఎవరేం చెప్పినా తెలుగు మాట్లాడాలనేదే విషయం. జాతి ప్రాభవాన్ని ప్రపంచానికి చాటడమే కాకుండా మనం మనల్ని బాగుచేసుకోవడానికి కూడా తెలుగు ఉపయోగపడుతుంది. 

- కోట శ్రీనివాసరావు


 


వెనక్కి ...

మీ అభిప్రాయం