కదిలింది ‘తెలుగు దండు’!  

  • 1244 Views
  • 16Likes
  • Like
  • Article Share

    వందవాసు శ్రీనివాస్‌

  • విశాఖపట్నం,
  • 8008574478
వందవాసు శ్రీనివాస్‌

సాగరతీర నగరంలో ‘తెలుగు దండు’ కదంతొక్కింది. అమ్మభాషకు గొడ్డలిపెట్టు లాంటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యమించింది. ఈ ‘దండు’కు మద్దతుగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు రాజుకు న్నాయి. విద్యార్థుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ అందరూ భాగస్వాములైన ఈ భాషోద్యమం చివరికి ఫలితం సాధించింది. పాలకుల మనసులు మార్చింది. 
నిరహార దీక్షలు.. రిలేదీక్షలు.. ర్యాలీలతో తెలుగు భాషోద్యమం పదునెక్కింది. పురపాలక పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన జీవో నం.14ను నిరసించిన భాషాభిమానుల చైతన్యం అమ్మభాషకు గొడుగుపట్టింది. ‘పాఠశాల విద్యలో తెలుగు- ప్రతిభాపాటవాలకు వెలుగు’ అని నినదిస్తూ విశాఖపట్నంలో 31 రోజుల పాటు ‘తెలుగుదండు’ సభ్యులు నిర్వహించిన నిరసన దీక్షలు ప్రభుత్వాన్ని కదిలించాయి. ‘‘పిల్లలందరూ తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాలి. దాంట్లో రెండో ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగును ప్రోత్సహించాలి. తెలుగును కాపాడుకోవాలి. పురపాలకశాఖ బడుల్లో కూడా తప్పనిసరిగా తెలుగు ఉంటుంది. ఇంగ్లిష్‌ నేర్చుకుంటే నేర్చుకుంటారు గానీ తెలుగు మాత్రం తప్పనిసరిగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. జీవో కూడా సరి చేశాం’’ అని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు విస్పష్ట ప్రకటన చేయడం ఈ ఉద్యమ ఫలితమే.
      రాష్ట్రంలోని పురపాలక బడులన్నింటినీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చేస్తూ ఆంధ్ర ప్రభుత్వ ఉత్తర్వు (జీవో నం.14) ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి పిల్లలను బడికి దూరం చేయడమే కాదు, తెలుగు భాషకు తీరని నష్టం కలిగిస్తుందన్న ఆందోళన భాషాభిమానుల్లో తలెత్తింది. ముఖ్యంగా విశాఖలోని ‘పరవస్తు పద్యపీఠం’ అధ్యక్షులు పరవస్తు ఫణిశయన సూరి ఈ విషయంలో చొరవ తీసుకుని, అందరినీ కదలించారు. విద్యార్థులు, సాహితీవేత్తలు, కళాకారులు, ప్రభుత్వ-ప్రైవేటు ఉద్యోగులను భాగస్వాములుగా చేస్తూ ‘తెలుగు దండు’ను ఏర్పాటు చేశారు. జీవో నం.14ను రద్దుచేయాలంటూ వీళ్లు ప్రభుత్వానికి 15 వేల ఉత్తరాలు రాశారు. వాటికి స్పందన లేకపోవడంతో ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు.
ఉద్యమ శంఖారావం
‘తెలుగు దండు పోరుబాట’ పేరిట నవంబరు 1న ఫణిశయన సూరి నిరాహార దీక్షకు కూర్చున్నారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ మహాత్ముడి విగ్రహం దగ్గర ఈ దీక్షా శిబిరం ఏర్పాటైంది. సూరితోపాటు తొలి రోజు దీక్షలో సాహితీవేత్త వేదగిరి రాంబాబు కూడా పాల్గొన్నారు. మధుమేహంతో బాధపడుతున్నా సరే, అమ్మభాష కోసం దాన్ని లెక్కచేయకుండా వేదగిరి రాంబాబు 24 గంటల పాటు నిరహార దీక్ష చేశారు. ఇలా ఈ నిరసనలు మూడు రోజులు జరిగాయి. ఆ తర్వాత పోలీసులు నిరాహార దీక్షలకు అనుమతించబోమని చెప్పడంతో ‘తెలుగు దండు’ సభ్యులు రిలే దీక్షలకు పూనుకున్నారు. వరసగా 28 రోజుల పాటు వాటిని కొనసాగించారు. సూరి, రాంబాబులతో పాటు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, గొల్లపూడి మారుతీరావు, వంగపండు ప్రసాదరావు, డా।। సూరపనేని విజయకుమార్‌, రావి కొండలరావు, సింహాద్రప్పడు, ఆచార్య దుగ్గిరాల విశ్వేశ్వరం, ఆడారి కిషోర్‌బాబు, ఎస్‌.కె.మిశ్రో, ఆచార్య బాలమోహన్‌దాసు తదితరులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం, అఖిల భారత సాహిత్య పరిషత్‌, జాలాది ఛారిటబుల్‌ ట్రస్టు లాంటి సంస్థలు ఉద్యమానికి మద్దతుగా నిలిచాయి.
       దీక్ష శిబిరం దగ్గర తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఉద్యమకారులు దీక్షలు చేశారు. ఉద్యమ నేపథ్యాన్ని ప్రజలకు వివరించేందుకు దీక్షా శిబిరం దగ్గర వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ‘తెలుగు కావాలా? వద్దా?, మాతృభాషా పరిరక్షణ బాధ్యత ప్రజలదా? ప్రభుత్వానిదా?’ తదితర అంశాల మీద చర్చలు, తప్పెటగుళ్లు ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. అలాగే, ‘తెలుగుతల్లికి తిరువీధి ఉత్సవం’ నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథం మీద తెలుగు తల్లి విగ్రహాన్ని ఉంచి నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. కళాకారుడు వంగపండు ప్రసాదరావు తన జానపద గీతాలతో స్ఫూర్తినిచ్చారు. తన బృందంతో ‘తెలుగు గర్జన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘తెలుగు మనుగడను మనం ఎందుకు కోరుకుంటున్నాం’ అనే అంశం మీద డప్పు శ్రీనివాస్‌ బృందం, ‘తెలుగే కావాలి’ అని నినదిస్తూ డప్పు రమణ బృందం గేయాలు ఆలపించాయి. స్థానిక బి.వి.కె. పాఠశాల, విశాఖ మహిళా కళాశాలల విద్యార్థులతో పాటు వివిధ పురపాలక బడులకు చెందిన చిన్నారులూ రోజూ దీక్షల్లో పాల్గొన్నారు. విశాఖ ఎంపీ డా।। హరిబాబు, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌లు ఉద్యమానికి మద్దతు పలికారు.
చట్టసభల్లోనూ ప్రతిధ్వని
ఈ దీక్షల సందర్భంగా ‘తెలుగు దండు’ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచింది. అవి..
* మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరపాలి. ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలి.
* జీవో నం.14ను రద్దుచేసి పురపాలక పాఠశాలల్లో పూర్వస్థితిని పునరుద్ధరించాలి.
* అంగన్వాడీ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలనే ఆలోచనలను వెంటనే విరమించుకోవాలి.
      ‘తెలుగు దండు’ సభ్యుల దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా భాషాభిమానుల్లో స్ఫూర్తి కలిగించాయి. అలా విశాఖ నగరంతోపాటు విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, చిత్తూరు, నరసరావుపేటల్లో జీవో నం.14కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌ శాసన మండలిలో ‘తెలుగు దండు’ ఉద్యమాన్ని ప్రస్తావించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్‌రాజు శాసనసభలో జీవో నంబరు 14 వల్ల కలిగే ఇబ్బందులను ఏకరవు పెట్టారు. ‘తెలుగు దండు’ ఉద్యమం గురించి సభ్యులకు వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పురపాలక పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించబోమని ప్రకటించింది. అమ్మభాష కోసం నిరహార దీక్షలకు కూర్చోవడం ద్వారా భాషోద్యమాన్ని ‘తెలుగు దండు’ సభ్యులు ఓ కీలక మలుపు తిప్పారు. భాషాభిమానులందరూ చేతులు కలిపి ముందడుగు వేస్తే ప్రభుత్వాలను కదిలించగలరని నిరూపించారు. 


తెలుగు దండు ఓ సమైక్య పోరాట వేదిక. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం మాతో కలిసి వచ్చారు. అకుంఠిత దీక్షతో 31 రోజుల పాటు దీక్షల్లో పాల్గొన్నారు. అందరి సహకారంతో ఈ ఉద్యమం ఫలప్రదమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి హామీ ఇచ్చారు. 

- పరవస్తు ఫణిశయన సూరి  


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష