గజ్జె ఘల్లుమన్నాదిరో!

  • 764 Views
  • 0Likes
  • Like
  • Article Share

    గండ్రేటి కిషోర్‌బాబు

  • విశాఖపట్నం,
  • 8008574767
గండ్రేటి కిషోర్‌బాబు

సాగర తీరాన్ని అటు అలలు హోరెత్తిస్తున్నాయి.. ఇటు జనసంద్రాన్ని పల్లె కళలు హుషారెత్తిస్తున్నాయి. సమయం గడుస్తోంది..  చిక్కబడుతోన్న చీకటిని విద్యుద్దీపాలు తరిమికొడుతున్నాయి. గజ్జలు ఘల్లుమంటూనే ఉన్నాయి. కళాకారుల విన్యాసాలకు ప్రేక్షకుల ఉత్సాహం తోడవుతున్న కొద్దీ కెరటాలు నిశ్శబ్దమైపోతున్నాయి. ఇలా ఒక్క రోజు కాదు, మూడు రోజుల పాటు అక్కడ జలధి మీద జానపదానిదే పైచేయి అయ్యింది. పదుల సంఖ్యలో పల్లె కళారూపాలను పట్నం ముంగిట్లోకి తెచ్చిన ‘విశాఖ ఉత్సవ్‌’ సందడి ఇది!
యారాడకొండ మీద ఒంటరిగా నిలబడి ఒక్కోరోజు ఒక్కోరకమైన విశాఖపట్నాన్ని చూసేవారట శ్రీశ్రీ. అది అదృష్టమో, అవకాశమో అన్న చర్చ అలా ఉంచితే, ఈ నగర సౌందర్యాన్ని మాత్రం మాటల్లో చెప్పలేం. అటు విశాల సాగరం... ఇటు బారుతీరిన పచ్చటి కొండలు... చుట్టుపక్కల కాస్త దూరంలోనే ప్రాచీన పుణ్యక్షేత్రాలు... ఇలా ఏ కోణంలో ‘చూసినా’ పర్యటకులకు కన్నులపండగ కలిగించే నగరమిది. ఇక్కడి పర్యటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏటా ‘విశాఖ ఉత్సవ్‌’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండున్నర కిలోమీటర్ల మేర సాగర తీరం పొడవునా వివిధ వేదికలు, ఆహారశాలలు, ఇతర దుకాణాలను కొలువుదీర్చి విభిన్న ఇతివృత్తాలతో వేడుకలు (కార్నివాల్‌) ఏర్పాటు చేస్తుంటారు. సాయంత్రం పూట ప్రారంభమయ్యే ఈ సంబరాల్లో స్థానికులతో పాటు ఎక్కువ సంఖ్యలో పర్యటకులూ పాల్గొంటూ ఉంటారు. వీటిలో ప్రత్యేకమైనవి జానపద కళారూపాల ప్రదర్శనలు. తాజాగా 2017 డిసెంబరు 28 నుంచి మూడు రోజుల పాటు సాగిన ‘విశాఖ ఉత్సవ్‌’ ప్రాచీన పల్లెకళారూపాలను నగరవాసులకు పరిచయం చేసింది. ఓ జాతరలాంటి వాతావరణంలో జరిగిన ఈ ప్రదర్శనలు... జానపద కళల పట్ల ప్రజల్లో ఇప్పటికీ ఆసక్తి ఉందని, ప్రభుత్వం కాస్త చొరవ చూపితే వీటికి పునర్వైభవం వస్తుందన్న నమ్మకాన్ని కలిగించాయి. ఇంతకూ ఈ ఉత్సవంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆ కళారూపాలేంటి, సంబంధిత కళాకారులు ఏమంటున్నారో చూద్దామా..!

      జానపద కళారూపాలు జాతి కళా తృష్ణకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిదర్శనాలు. ఇవి మరుగున పడటం అంటే.. మన సాంస్కృతిక మూలాలు, చారిత్రక వికాసం కనుమరుగవ్వడమే. సరైన ఆదరణ, ఆదాయం లేకపోవడం వల్లే కొత్త తరం ఈ కళారూపాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటీవలి కాలంలో ఆయా ఉత్సవాల్లో కోలాటం, తప్పెటగుళ్లు లాంటి వాటికి ప్రాధాన్యం దక్కుతోంది. పల్లెల్లో కంటే నగరాలు, దూర ప్రాంతాల్లో ప్రదర్శనలకు కళాకారుడికి కాస్త ఎక్కువ పారితోషికం లభిస్తోంది. పదేళ్ల కిందటితో పోల్చితే ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం పెరిగిందని కళాకారులు చెబుతున్నారు. అయితే.. ఈ ప్రోత్సాహం వ్యవస్థీకృతంగా జరగాలి. కళాకారులకు పింఛన్లు ఇవ్వాలి. ఉపాధికి లోటులేని విధంగా వీలైనన్ని ఎక్కువ చోట్ల ప్రదర్శనలు ఏర్పాటు చేయించాలి. నవతరానికి ఈ కళలో శిక్షణ ఇప్పించడానికి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలి. ఇలాంటివన్నీ సాకారమైనప్పుడే జానపద కళలకు పూర్వ వైభవం వస్తుంది. 


బుట్టబొమ్మల సందడి
బుట్టబొమ్మలు ఆడితే ఊరికి చలవచేస్తుందన్నది గ్రామసీమల్లో ఓ నమ్మకం. అందుకే ఉత్సవ సందర్భాల్లో ఈ ప్రదర్శనలు కచ్చితంగా ఏర్పాటు చేసేవారు. దాదాపు పన్నెండు అడుగుల ఎత్తయిన బొమ్మ ఆకారాన్ని ధరించిన కళాకారుల రూపం ఆకట్టు కుంటుంది. ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో బాగా ప్రసిద్ధిలో ఉన్న ఈ కళకు ప్రస్తుతం వారసులు కరవైపోయారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టూరుకు చెందిన షేక్‌ బాబ్జీ బృందం ఈ బుట్టబొమ్మలతో పాటు ‘మయూర నృత్యాన్ని’ కూడా ప్రదర్శించింది. నడుము కింది భాగంలో నెమలి ఆకారాలు, పింఛాలు ధరించి డప్పు దరువులకు అనుగుణంగా సాగిన ఈ నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులోనే గేదె వేషధారణలో సాగిన నృత్యం, గేదెలతో పోరాటం లాంటివి పిల్లలను అలరించాయి. తన దగ్గర వంద బుట్టబొమ్మలు ఉన్నాయని, అయితే 20 మంది కంటే కళాకారులు దొరకడం లేదని షేక్‌ బాబ్జీ ఆవేదన వ్యక్తంజేశారు. ‘‘తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా జానపద కళా ప్రదర్శనలకు చోటు కల్పిస్తున్నారు. దాంతో పాటు కళాకారులకు పింఛను కూడా అందిస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఒక్కో ప్రదర్శనకు ఒక కళాకారుడికి రూ.800 నుంచి రూ.1500 వరకే లభిస్తున్నాయి’’ అని అన్నారాయన. 

(షేక్‌ బాబ్జి: 98661 31473)


తప్పెటగుళ్ల కోలాహలం
పలుచటి రేకుతో చేసిన తప్పెటను ఎదపై కట్టుకుని రెండు చేతులతో వాయిస్తూ, ఆ శబ్దానికి కాలి గజ్జెల ఘల్లుఘల్లులను జతకలుపుతూ, మెడను క్రమపద్ధతిలో ఆడిస్తూ, ఎగిరి దుముకుతూ కళాకారులు ప్రదర్శించిన ‘తప్పెటగుళ్ల’కు నగరవాసులు మైమరచిపోయారు. శ్రీకాకుళం, విజయనగరాల్లో చాలా ఆదరణ ఉన్న ఈ కళలో రామాయణం, భాగవతాలను పల్లె పలుకుబడిలో వినసొంపుగా చెబుతారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం జి.ఆర్‌.కె.పురం నుంచి వచ్చిన ఎస్‌.సత్యం బృందం ఇక్కడ ప్రదర్శన ఇచ్చింది. ఇతర పనులు చేసుకుంటూ ఈ కళలో కొనసాగుతు న్నామని సత్యం చెప్పారు. ‘‘గ్రామాల్లో ఆటకు ఒక్కో కళాకారుడికి రూ.200 వస్తాయి. భోజనం, రవాణా ఖర్చులు కూడా ఇస్తారు. అయితే.. దుస్తులు, గజ్జెలు, తప్పెట కోసం ఒక్కో కళాకారుడికి రూ.4 వేల వరకు ఖర్చవుతుంది. ప్రజాదరణ ఉంది కాబట్టి ఈ కళారూపం అంతర్థానమయ్యే ప్రమాదమైతే లేదు’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

(ఎన్‌.సత్యం 94904 60957)


మూలాలు తడిమిన రేలారే రేలా
పల్లె సంస్కృతీ సంప్రదాయాల్లోంచి ప్రాణంపోసుకున్న జానపద గేయాలు, ఆ పాటలకు అనుగుణంగా సాగే నృత్యాలు, డప్పుదరువులతో సాగిన రేలారే రేలా కార్యక్రమం ప్రేక్షకులను హుషారెత్తించింది. విజయనగరం జిల్లా నుంచి వచ్చిన బొత్స రామారావు బృందం గీతాలాపన చేస్తుంటే నగరవాసులకు తమ పల్లె మూలాలు మదిలో మెదిలాయి. ‘‘ఏటా సుమారు 200 ప్రదర్శనలు ఇస్తున్నాం. ఒక్కో కళాకారుడికి కార్యక్రమానికి రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు లభిస్తాయి’’ అని చెప్పారు రామారావు. ప్రజల్లో ఉత్సాహం నింపే పాటలు కావడంతో అన్ని ఉత్సవాలు, జాతర్లకు తమకు ఆహ్వానాలు వస్తున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

(రామారావు: 96668 86848)


హరోం హర.. వీర నాట్యం!
మహాశివుడి ఉగ్ర స్వరూపాన్ని కళ్లకు కట్టే వీరనాట్యం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. దీన్ని వీరంగం, వీరభద్ర నృత్యం అనీ పిలుస్తారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు హైదరాబాదు, కర్నూలు, అనంతపురం, వరంగల్లు, ఖమ్మంలలో ఈ ప్రదర్శనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అమలాపురం ముక్కామల నుంచి వచ్చిన 22 మంది బృందం ఈ నాట్యాన్ని ప్రదర్శించింది. నెలకు 5 నుంచి 10 ప్రదర్శనలిస్తుంటామని, ఒక్కో ప్రదర్శనకు కళాకారుడికి రూ.700 నుంచి రూ.వెయ్యి వరకూ అందుతుందని బృంద నాయకుడు నాగబాబు చెప్పారు. మరో దశాబ్దం తర్వాత ఈ కళ మనుగడ ప్రశ్నార్థకమేన న్నది ఆయన ఆందోళన! గతంతో పోల్చితే దీనికి ఆదరణ పెరిగినా కొత్తవారు రావడం లేదని, కళాకారులకు ఆర్థిక భద్రత ఉంటేనే పరిస్థితి మెరుగవుతుందని అభిప్రాయ పడ్డారు.

 (నాగబాబు: 98487 70107)


ఆకట్టుకున్న కొమ్ముకోయ
తలకు పదునైన కొమ్ములు, వాటిమీద నెమలి ఈకలు ధరించి వేలాడే పొడవాటి కొయ్య డప్పులను మగవారు వాయిస్తుంటే.. మహిళలు ఒకరి భుజాలపై ఒకరు చేతులుంచి నర్తిస్తారు. ఇదే గిరిజనుల కొమ్ము కోయ కళారూపం. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం తుమ్మల గ్రామం నుంచి వచ్చిన బృందం దీన్ని ప్రదర్శించింది. బృంద నాయకుడు ముత్తాడ రాజయ్య మాట్లాడుతూ ఆదాయం పెరిగితే కొత్తగా కళాకారులు దీనిలోకి వస్తారని చెప్పారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తే కళ నిలబడుతుందన్నారు. 

(రాజయ్య: 94940 45920)


కాళ్లకు సొజ్జలతో..
కాళ్లకు దాదాపు పది కిలోల బరువైన ఇనుప సొజ్జలతో 30 మంది కళాకారులు చేసిన భేరి నృత్యం ప్రేక్షకులకు గగుర్పాటు కలిగించింది. ఆ సమయంలో వాళ్లని చూస్తే.. ఆహా! వీళ్లకు ఎంత శక్తి అనుకోవాల్సిందే. వేదిక బలంగా లేకుంటే ఆ నృత్యానికి  ఏ క్షణంలోనైనా అది కూలిపోవడం ఖాయమనిపిస్తుంది కూడా. తూర్పుగోదావరి జిల్లా అంగర గ్రామం నుంచి వచ్చిన సి.హెచ్‌.లోవరాజు బృందం విశాఖపట్నం సాగరతీరంలో సొజ్జ నృత్యాన్ని చాలా చక్కగా ప్రదర్శించింది. ఈ కళకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోందని, ప్రతి నెలా కనీసం నాలుగు ప్రదర్శనలిస్తున్నామని బృంద నాయకుడు లోవరాజు చెప్పారు. అయినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉందన్నారు.

 (లోవరాజు: 90006 34510) 


రెక్కల పులులు!
చేతులకు రెక్కలు, గడ్డం కింద విచిత్ర ఆకారాలతో ప్రదర్శించిన పులివేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాధారణ పులివేషానికి భిన్నంగా ఈ ప్రదర్శన సాగింది. వేదికపైనే కాకుండా ప్రజల మధ్య కూడా పులి వేషధారులు వివిధ విన్యాసాలు చేస్తుంటే ముఖ్యంగా పిల్లలు సంభ్రమాశ్చర్యాలతో చూశారు. విజయనగరం నుంచి వచ్చిన తిరుపతిరావు బృందం పులివేషాలతో పాటు కత్తి, కర్రసాములను కూడా ప్రదర్శించింది. కాలక్రమంలో సాములు అంతరించిపోతున్నాయని తిరుపతిరావు ఆవేదన వ్యక్తంచేశారు. కళాకారులు కూడా సాముపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదన్నారు. దానికి తగ్గట్టు చాలాచోట్ల జనం కూడా పులివేషాలనే అడుగుతున్నారని చెప్పారు.         

 (తిరుపతిరావు: 90009 53750)


డప్పుల దరువులు
విశాఖ ఉత్సవ్‌లో డప్పుల మోత ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. లయబద్ధంగా డప్పులు వాయిస్తూ, జానపద గీతాలు, నృత్యాలతో కళాకారులు సాగర తీరాన్ని హోరెత్తించారు. కృష్ణా జిల్లా చిట్టూర్పు గ్రామం నుంచి వచ్చిన కె.ఏడుకొండలు బృందం ఈ కళారూపాన్ని ప్రదర్శించింది. పదేళ్ల కిందటితో పోల్చితే ప్రస్తుతం డప్పుకు ఆదరణ కాస్త బాగుందని అన్నారు ఏడుకొండలు. కానీ, భవిష్యత్తు మీదే సందేహం వ్యక్తం చేశారాయన. కళాకారుల పిల్లలు చదువుకుంటూ, ఉద్యోగాలు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పారు.

(కె.ఏడుకొండలు: 97046 81728)


థింసా అడుగులు
ఓ పక్క మంచు దుప్పటి కప్పేస్తుంటే... చలిమంటల వెలుగులో గిరిజన మహిళల థింసా నృత్యం చూడటం అరకు సందర్శకులకు అనుభవంలోకి వచ్చే అద్భుత అనుభూతి. విశాఖ ఉత్సవ్‌లో కూడా అంతే అందంగా నృత్యాన్ని ప్రదర్శించారు కళాకారిణులు. వీళ్ల బృందానికి నేతృత్వం వహించిన పరశురాం, అప్పన్నలు మాట్లాడుతూ చాలా మంది దీన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఒక్కో కళాకారిణికి ఒక ఆటకు రూ.500 వరకూ అందుతున్నాయన్నారు. ఈ సంప్రదాయ నృత్యానికి పర్యాటక రంగంలో విశేష ప్రాధాన్యమున్న నేపథ్యంలో ‘థింసా’ భవిష్యత్తు భద్రమే!   

(కె.పరశురాం, అప్పన్న 85006 53164)


అంతరించిపోతున్న కళలను సంరక్షించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ మన సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబించే కళాప్రదర్శనలను ఏర్పాటుచేస్తున్నాం. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి కార్యక్రమాల వరకూ ప్రతిచోటా తప్పనిసరిగా కళాకారులకు అవకాశమిస్తున్నాం. అదే విధంగా ‘విశాఖ ఉత్సవ్‌’లో జానపద జాతర పేరిట ప్రత్యేక వేదికను ఏర్పాటుచేశాం. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులను పిలిపించి ప్రదర్శనలు ఏర్పాటుచేశాం. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తాం.

- ప్రవీణ్‌కుమార్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ 


ప్చ్‌.. పౌరాణిక నాటకం!
ఒకప్పుడు ప్రతి పల్లెలో అభిమాన నీరాజనాలందుకున్న పౌరాణిక నాటకం క్రమంగా తన ప్రభను కోల్పోతున్న దైన్యం విశాఖ ఉత్సవ్‌లో కనిపించింది. ఇక్కడ ఈ నాటకాలకు ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటుచేశారు. రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర, చింతామణి లాంటి వాటిని చక్కగా ప్రదర్శించారు కూడా. అయినా.. ప్రేక్షకుల నుంచి వీటికి పెద్దగా ఆదరణ లభించలేదు. దీని మీద విజయనగరం జిల్లా పైడిమాంబ నాట్యమండలి నిర్వాహకులు సీరపు సత్యారావు మాట్లాడుతూ పౌరాణిక  నాటకాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రేక్షకులున్నారని చెప్పారు. అయితే కళాకారులు లేకపోవడంతో తమ తరంతోనే ఈ నాటకం ఆగిపోతుందేమోననే సంశయం వ్యక్తం చేశారు.

(సత్యారావు: 93925 08202)


     
 


వెనక్కి ...

మీ అభిప్రాయం