భలే మంచిరోజు

  • 873 Views
  • 112Likes
  • Like
  • Article Share

    మానెం శ్రీనివాసరావు

  • ఒంగోలు,
  • 8008771094
మానెం శ్రీనివాసరావు

‘‘తెలుగునాట తెలుగులో తీర్పు ఇవ్వాలనుకుంటే ఇన్ని ఇబ్బందులు ఎదురవ్వడం మాకు బాధగానే అనిపించింది’’
వినడానికి కాస్త బాధాకరంగానే ఉన్నా, న్యాయస్థానాల్లో తెలుగు స్థితిగతులను కళ్లకుకట్టే వ్యాఖ్య ఇది. ప్రపంచ తెలుగు మహాసభల స్ఫూర్తితో ప్రకాశం జిల్లాలోని న్యాయమూర్తులందరూ ఒక రోజు పూర్తిగా తెలుగులోనే తీర్పులిచ్చేలా చొరవ తీసుకున్నారు ఆ జిల్లా న్యాయమూర్తి ఎం.జి.ప్రియదర్శిని. అలా 12 మంది న్యాయమూర్తులు డిసెంబరు 28, 2017న 21 తీర్పులను ప్రజలభాషలోనే వెలువరించారు. అయితే.. ఈ క్రమంలో వాళ్లు చాలా అవాంతరాలను ఎదుర్కొన్నారు. వాటి గురించి చెబుతూనే జస్టిస్‌ ప్రియదర్శిని పైన ఉట్టంకించిన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ అడ్డంకులన్నింటినీ తమ సంకల్పబలంతో దాటిన ఈ న్యాయమూర్తుల భాషాభిమానం స్ఫూర్తిదాయకం. 
ఇంగ్లీషులో
ఇచ్చిన తీర్పును కేసు వేసిన వాడు అర్థం చేసుకోలేడు. దాన్ని చదివి తెలుగులో వివరించే తీరిక న్యాయవాదికి  ఉండదు. మొత్తంగా తీర్పును ఎవరూ చదవని స్థితి నెలకొంటోందంటూ ‘న్యాయ, పరిపాలన రంగాల్లో తెలుగు’ అనే అంశం మీద ప్రపంచ తెలుగు మహాసభల్లో నిర్వహించిన సదస్సులో ఆవేదన వ్యక్తంజేశారు కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌. నిజమే! సాధారణ ప్రజల్లో ఆంగ్లం తెలిసినవాళ్లెంతమంది? అందులోనూ తీర్పుప్రతుల్లోని న్యాయపరిభాషను అర్థంచేసుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్లెంతమంది? పట్టుమని పదిమంది ఉంటారో లేదో! అయినా సరే, న్యాయస్థానాల్లో ఆంగ్లాన్నే ఎందుకు వాడుతున్నారు? జిల్లాస్థాయి న్యాయస్థానాల్లో తెలుగును వినియోగించవచ్చని చెబుతూ ఎప్పుడో 44 ఏళ్ల కిందటే జీవో నం.485 వచ్చింది కదా. అలాంటప్పుడు ఇప్పటికీ ‘తెలుగు తీర్పు’ ఓ విశేషం ఎందుకు అవుతోంది? ఎందుకంటే... తెలుగులో తీర్పులివ్వాలనుకునే న్యాయమూర్తులు ఉన్నా, అలా ఇవ్వడానికి వాళ్లకి అవకాశం కల్పించే పరిస్థితులు లేవు కాబట్టి! తెలుగులో న్యాయపాలనకు అవసరమైన కనీస మౌలిక వసతులు మన న్యాయస్థానాల్లో కొరవడ్డాయి కాబట్టి!! అయినాసరే, ఆ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ సమష్టి సంకల్పంతో తెలుగులో తీర్పులు ప్రకటించారు ప్రకాశం జిల్లాలోని న్యాయమూర్తులు. 
      న్యాయమూర్తులెవరైనా సరే, తెలుగులో తీర్పులివ్వడం అరుదు. అంతకు మించి కష్టం కూడా. హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన నేపథ్యంలో తెలుగు కోసం తానూ ఏదైనా చేస్తే బాగుంటుందనుకున్నారు ఎం.జి.ప్రియదర్శిని. ఆ క్రమంలో  డిసెంబరు 21వ తేదీన ఆమె తెలుగులో ఓ తీర్పు చెప్పారు. తాను ఒక్కరే కాకుండా జిల్లాలోని అందరు న్యాయమూర్తులూ ఒకేసారి తెలుగులో తీర్పులిస్తే ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కదా అనిపించిందావిడకు. వెంటనే అందరితో చర్చించారు. అలా ఆవిడ ఆలోచన డిసెంబరు 28న కార్యరూపం దాల్చింది. ఆ రోజు జిల్లావ్యాప్తంగా 21 తీర్పులు తెలుగులో వెలువడ్డాయి. చీరాల సీనియర్‌ సివిల్‌జడ్జి కృష్ణన్‌కుట్టి మలయాళీ. ఆయన కూడా తెలుగులోనే తీర్పు ఇవ్వడం విశేషం. 
చిక్కులను అధిగమించి...
తెలుగులో తీర్పులివ్వడం అంత సులువేమీ కాదు. పారిభాషిక పదజాలాన్ని తెలుగు చేసుకోవడం ఒకెత్తు. దీనికి న్యాయమూర్తులు రెండు రోజుల ముందు నుంచి కసరత్తు ఆరంభించారు. సాధారణంగా న్యాయమూర్తులు చెప్పే ఆంగ్ల తీర్పుని టైపురైటర్‌ ద్వారా సిబ్బంది కాగితంపై ఎక్కించి... గంటలోనే దాని ముద్రిత ప్రతి ఇవ్వగలరు. కానీ తెలుగు విషయానికి వచ్చేసరికి అసలు ఏ న్యాయస్థానంలోనూ తెలుగు అక్షరమాల ఉన్న టైపురైటర్లు లేవు. తెలుగు టైపింగు తెలిసిన సిబ్బంది లేరు. కంప్యూటర్లలోనూ తెలుగు సాఫ్ట్‌వేరు అందుబాటులో లేదు. అయినాసరే, న్యాయమూర్తులు వెనక్కి తగ్గలేదు. ఆంగ్ల- తెలుగు నిఘంటువుల సాయంతో పారిభాషిక పదజాలాన్ని ఎంచుకున్నారు. ప్రధాన గరిష్ఠ పౌర న్యాయమూర్తి (సీనియర్‌ సివిల్‌ జడ్జి), వాది, ప్రతివాది, దావా, సత్యదూరాలు, రుణపత్రం, నేరస్థలం తదితర పదాలను ఎంచుకున్నాక తుది తీర్పును కాగితంపై రాసుకుని, సరిచూసుకుని టైపు చేయించారు. దీనికోసం అంతర్జాలం నుంచి సాఫ్ట్‌వేరును సమకూర్చుకున్నారు.  
      స్ఫూర్తిదాయక కృషి చేసిన ఈ న్యాయమూర్తుల్లో ఒకరైన ఒంగోలు సీనియర్‌ సివిల్‌జడ్జి టి.రాజావెంకటాద్రి నాలుగున్నరేళ్ల కిందటి నుంచే ‘తెలుగులో న్యాయపాలన’ కోసం ప్రయత్నిస్తూ వస్తున్నారు. జూన్‌ 17, 2013న ఆయన ఏడు తీర్పులను తెలుగులో చెప్పారు. అప్పటికి ఆయన జూనియర్‌ సివిల్‌జడ్జిగా నెల్లూరు జిల్లా కావలిలో విధులు నిర్వహిస్తున్నారు. సివిల్‌ వివాదాల మీద అప్పట్లో ఆయన తెలుగులో తీర్పులిచ్చారు. ఈ క్రమంలో ఎదురయ్యే ప్రాథమిక ఇబ్బందులు, తీర్పులను టైపు చేయించి వాటికి తుదిరూపం ఇవ్వడం తదితరాల మీద ఆయనకు అవగాహన ఉంది. ఆ అనుభవంతో తాజాగా ప్రకాశం జిల్లాలోని న్యాయమూర్తులు తెలుగు తీర్పులను ఇవ్వడంలో ఆయన కొంత సహకరించారు. ‘‘న్యాయవ్యవస్థలో తెలుగు వాడుక పెరగాలనేది నా కోరిక. ప్రజలకు న్యాయసేవలు సులువుగా చేరువ కావాలంటే వాదనలు, తీర్పులు మాతృభాషలోనే ఉండాలి. బయట ఎక్కడా వాడని పదాలు న్యాయ విభాగంలో ఉంటాయి. ఆమేరకు జాగ్రత్తలు తీసుకుంటే, సొంతభాషలో తీర్పు ద్వారా వాదులకు, ప్రతివాదులకు సరిగా అర్థమయ్యేలా తీర్పు ఇవ్వవచ్చు. అందుకే ఒకే రోజు ఏడు తీర్పులు ఇచ్చాను. తర్వాత కూడా అడపాదడపా ఇస్తున్నాను. చిన్నచిన్న చిక్కులను అధిగమిస్తే క్రమం తప్పకుండా తెలుగులో తీర్పులు ఇవ్వవచ్చు’’ అని చెప్పారాయన. 
      న్యాయశాస్త్ర గ్రంథాలు తెలుగులో లేకపోవటం, తెలుగులోకి అనువదించిన న్యాయశాస్త్ర గ్రంథాలు కూడా న్యాయమూర్తులకు అందుబాటులో లేకపోవటం, న్యాయమూర్తులకు తెలుగులో సరైన శిక్షణ తరగతులు నిర్వహించకపోవడం, న్యాయవాదుల్లో తెలుగులో దావాలు రాసే పద్ధతి అలవడకపోవడం, పదకోశాలు ఉనికిలోకి రాకపోవడం, వీటి రూపకల్పన దిశగా నిరంతర పరిశోధన  జరగకపోవడం లాంటి కారణాలతో తెలుగులో తీర్పులు రావట్లేదంటారు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జి.చంద్రయ్య. వీటితో పాటు సిబ్బందికి తెలుగు టైపింగ్‌లో శిక్షణ ఇవ్వడం, అన్ని న్యాయస్థానాల్లో తెలుగు సాంకేతిక ఉపకరణాలను అందుబాటులో ఉంచడం తదితరాల మీదా దృష్టిసారించాలి. ఈ సమస్యలను త్వరగా అధిగమించగలిగితేనే... న్యాయం సామాన్యుడికి చేరువవుతుంది.


వృత్తి పరంగా ఆంగ్లం అలవాటైపోయింది. అక్కడక్కడా తెలుగు తీర్పులు ఇస్తున్నా అందరం ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించుకుని అమలు చేశాం. కష్టమైనా చేసి చూపించాం. దీన్ని ఇక్కడితో ఆపేయకుండా కొనసాగిస్తాం. భాషపై పట్టున్న స్టెనోలు లేరు, తెలుగులో టైపుచేసేందుకు సాఫ్ట్‌వేర్‌ లేదు. మొదట ఆంగ్లంలో తీర్పుని రాసుకుని తర్వాత తెలుగులోకి అనువదించుకున్నాం.  న్యాయస్థానాల్లో అనువాదకుడు అనే ఉద్యోగం ఉండేది. ఇప్పుడు చాలాచోట్ల లేరు. ఉన్నా విధుల్లో మార్పులు వస్తున్నాయి. గతంలో ఎన్‌టీఆర్‌ ప్రభుత్వ సమయంలో తెలుగు టైపురైటర్లు ఇచ్చారు. ఇప్పుడు మా సిబ్బంది తెలుగు సాఫ్ట్‌వేర్‌ను అంతర్జాలం నుంచి సేకరించారు. తెలుగునాట తెలుగులో తీర్పు ఇవ్వాలనుకుంటే ఇన్ని ఇబ్బందులు ఎదురవ్వడం మాకు బాధగానే అనిపించింది. 

- ఎం.జి.ప్రియదర్శిని, జిల్లా న్యాయమూర్తి


దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిన కారణంగా మన చట్టాల్లోను, న్యాయవ్యవస్థలోను ఆంగ్ల ప్రభావం ఎక్కువ. ముందు చట్టాలను పూర్తిగా తెలుగులోకి అనువదించుకోవాలి. తమిళనాడులో కేసు విచారణలు, వాదనలు, తీర్పులు అన్నీ తమిళంలోనే సాగుతాయి. కక్షిదారుల సౌలభ్యం కోసం తెలుగులోనే తీర్పులు ఇవ్వాలని మాకూ కోరిక. ఆంగ్లంలో ఇస్తే వాళ్లు మళ్లీ వేరేవాళ్ల ద్వారా తీర్పు సారాంశం తెలుసుకోవాల్సి వస్తుంది. సిబ్బందికి శిక్షణ, సరైన తెలుగు సాంకేతిక పరిజ్ఞానం సమకూరిస్తే తెలుగులోనే కొనసాగించగలం. న్యాయసేవలు ప్రజలకు చేరువ కావాలంటే ఇదే మంచిది. తీర్పులు తెలుగులో వస్తే... సంబంధిత వ్యాజ్యాన్ని పరిష్కరించే క్రమంలో న్యాయమూర్తి తీసుకున్న అంతిమ నిర్ణయానికి కారణాలేంటో కక్షిదారులు పూర్తిగా అర్థం చేసుకోగలరు. కాబట్టి, తెలుగులోనే తీర్పులు ఇవ్వాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఇక ముందు కూడా ఈ ఒరవడిని కొనసాగిస్తాం. 

- మహేంద్ర ఫణికుమార్‌,  సీనియర్‌ సివిల్‌ జడ్జి, కందుకూరు


నేను పుట్టి పెరిగిందంతా కేరళలోనే. న్యాయవాదిగా తమిళనాడులో సాధన చేశాను. ఆ సమయంలో అక్కడి వారికి భాష మీద ఉన్న మమకారాన్ని చూశాను. తీర్పులన్నీ తమిళంలోనే ఉంటాయి. పదమూడేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌కు న్యాయమూర్తిగా వచ్చాను. వివిధ ప్రాంతాల్లో పనిచేశాను. తెలుగు నేర్చుకునేందుకు ఉపాధ్యాయుణ్ని నియమించుకున్నాను. ఏడాదిన్నర పాటు సాధన చేసి తెలుగు రాయడం, చదవడం, మాట్లాడటం నేర్చుకున్నాను. తెలుగులో తీర్పు చెప్పాలని జిల్లాలో న్యాయమూర్తులు నిర్ణయించుకునప్పుడు నేను ప్రత్యేక సాధన చేశాను. నేరానికి సంబంధించిన నివేదికలన్నీ చదివాను. నిఘంటువుని దగ్గర పెట్టుకున్నాను. ముందుగా తీర్పుని ఆంగ్లంలో రాసుకుని తెలుగులోకి తర్జుమా చేసుకున్నాను. నాకు తెలిసిన నాలుగు భాషల్లో మాట్లాడటానికి తీయగా ఉండేది మాత్రం తెలుగే. 

- కృష్ణన్‌కుట్టి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, చీరాల


తెలుగులో తీర్పు చెప్పాలని ఏడేళ్ల నుంచి ఉండేది. కానీ, సమస్యలు అధిగమించడం కష్టమయ్యేది. 2013లో కావలిలో పనిచేస్తున్నప్పుడు, 2015లో సత్తెనపల్లిలో ఉన్నప్పుడు రెండు సివిల్‌ కేసులకు తెలుగులో తీర్పు చెప్పాను. మళ్లీ ఇప్పుడు అందరితో కలిసి చెప్పడం ఆనందం కలిగించింది. తెలుగులో అయితేనే భావవ్యక్తీకరణ బాగుంటుంది. కక్షిదారులు ప్రతి విషయాన్నీ తెలుసుకునే వీలుంటుంది. తీర్పు టైపుచేయడం, సాఫ్ట్‌వేరు లేమి, సిబ్బందికి అవగాహన లోపం కారణంగా కుదరట్లేదు. దాంతో సమయం ఎక్కువ తీసుకుంటుంది. 

- షేక్‌ మొహమ్మద్‌ నజీర్‌ ఉల్‌-ఇన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి, పర్చూరు


మేముసైతం
ప్రపంచ తెలుగు మహాసభలు మాతృభాష, సంస్కృతి పట్ల అందరిలో అభిమానాన్ని పెంచాయి. అమ్మ భాషను అందరూ నేర్చుకుని రక్షించుకోవాలన్న సంకల్పం ఇచ్చాయి. న్యాయ, పరిపాలన రంగాల్లో తెలుగు అమలు గురించి విలువైన సూచనలనూ అందించాయి. ఈ మహాసభల స్ఫూర్తితో హైదరాబాదు నగర పోలీసులు అమ్మభాషకు సముచిత గౌరవం అందించడంలో ముందడుగు వేశారు. తొలిసారిగా తమ వార్షిక నివేదకను తెలుగులో ముద్రించి అందరి మన్ననలు అందుకున్నారు. మొత్తం 46 పేజీల ఈ నివేదికలో ఆయా నేరాల తీరు, ఛేదించిన కేసులు, సాధించిన విజయాలు, ఆయా మండలాల పరిధిలో నెలకొన్న ప్రగతి, అందించిన శిక్షణ... ఇలా అన్ని వివరాలను తెలుగులో అందించారు. భద్రమైన సమాజం, మెరుగైన సేవల కోసం తాము తీసుకుంటున్న చర్యలను ప్రజలకు అమ్మభాషలో తెలియజెప్పి, వారికి పోలీసు వ్యవస్థపై గౌరవం మరింత పెరిగేలా చేయాలన్న హైదరాబాదు పోలీసుల తపన ఈ నివేదికలో కనిపిస్తుంది. నిజానికీ పోలీసు శాఖ అంటేనే ప్రజల్లో కొంత ప్రతికూల ఆలోచనలుంటాయి. నేరస్థులను అణచివేయడంలో పోలీసులు అనుసరించే తీరు అందుకు కొంత కారణం కావచ్చు. అయితే పోలీసు వ్యవస్థ అమ్మభాష బాట పడితే.. దాని పనితీరు అర్థమై, దానిపట్ల గౌరవాభిమానాలు ఇనుమడిస్తాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ శాఖల్లో తెలుగు వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో తొలిసారి ఈ ప్రయోగం చేశామని హైదరాబాదు నగర పోలీసు కమిషనరు వి.వి.శ్రీనివాసరావు చెప్పారు. నివేదికలో చిన్నపాటి తప్పులుంటే సరిదిద్దుకుంటామనీ అన్నారు. మొదటిసారి జరిగిన ప్రయత్నం కాబట్టి ఇందులో అక్కడక్కడా ఆంగ్లపదాలు కనిపిస్తాయి. కానీ, మొత్తంగా హైదరాబాదు పోలీసుల స్ఫూర్తి హర్షణీయం. ఆయా శాఖల్లో వినియోగించే పదజాలానికి సంబంధించి సమగ్ర పదకోశాలు రూపొందించుకుంటే ఇలాంటి నివేదికలను తెలుగులో సమగ్రంగా తేవడానికి అవకాశం ఉంటుంది.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం