శివుడి అంతఃపురం

  • 1070 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డా।। నాగశేషు

  • నెల్లూరు
  • 9985509053

గోదావరి తీరంలో ఆధ్యాత్మిక ప్రశాంతతని అమృతంలా పంచే అరుదైన క్షేత్రం దాక్షారామం. కాలాన్ని శాసిస్తూ వెయ్యేళ్లనాటి శిల్పకళా వైభవానికి సాక్షిగా నిలిచిందీ ఆలయం. ఎందరో రాజన్యులు ఇక్కడి భీమేశ్వరుడి సేవలో తరించారు. కవీశ్వరులెందరో తమ కవన మాధుర్యంతో ఆ స్వామికి అక్షరహారతులందించారు.
ద్రావిడ
నిర్మాణ శైలిలో దర్శనమిచ్చే పంచారామాల్లో తూర్పుగోదావరి జిల్లాలోని దాక్షారామం మాత్రం చూడటానికి అద్భుతంగా ఉంటుంది. సప్తగోదావరి నీటి అలలపై అంతెత్తు గోపుర కలశాలు తళుక్కున మెరుస్తూ కనపడతాయి. ఆలయ ప్రవేశ గోపురాన్ని దాటుకుని అడుగు పెట్టామో లేదో... రెండో ప్రాకారానికి పక్కగా ధుండి గణపతేశ్వరుడి విగ్రహం  కరుణ రసాత్మకంగా గోచరిస్తుంది. లోపలికి వెళ్లగానే పసుపు గంధ సువాసనలు ముక్కుపుటాలను తాకుతాయి. పొందికగా అమరి తడిబారిన రాతిఫలకాల మీదుగా నడుచుకుంటూ గర్భగుడి వైపు తిరిగితే.. ఆ ప్రాకారపు రాతిగోడల మీద చెక్కిన శాసనాలు కనిపిస్తాయి. అలనాటి చాళుక్యలిపి సంకేతాలు మెలికలు తిరుగుతూ బహుముచ్చట గొలుపుతాయి. అర్థంకాకపోయినా ఆ శాసనలిపిని మౌనంగానే తడిమి తడిమి మురిసిపోవాల్సిందే!
      గర్భగుడి రెండు అంతస్తుల్లో ఉంటుంది. కింది మెట్ల వైపుగా వెళ్తే చీకటి కోణంలా కింది భాగం కనిపిస్తుంది. దాన్నలా గమనిస్తూ పైఅంతస్తుకు వెళ్తే అక్కడి రాతి గోడల మీద బొడిపెలు కనిపిస్తాయి. వాటిదగ్గర పూర్వం నవరత్నాలు ఉండి, దీపాల కాంతిపడి మరింత తేజోవంతమయ్యేవట. వాటికి గుర్తుగా ఆ బొడిపెలు అలా మిగిలి ఉన్నాయంటారు. అక్కడే దాక్షారామ భీమేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈయన అతిపొడవైన (2.5 మీటర్లు) స్ఫటిక లింగాకార స్వరూపంగా కొలువుదీరడం విశేషం! స్వామికి అభిముఖంగా ఉండే నందీశ్వరుడి రూపరేఖావిలాసాదులన్నీ సజీవత్వాన్ని పొందుతున్నట్లుంటాయి.  
ఏమని వర్ణించగలం!
నందిని వదలి మూడడుగులు వేస్తే అక్కడే కనిపిస్తుంది.. యుగాల నాటి తపోనిష్ఠకి ప్రతీకగా నిలిచే అశ్వత్థ నారాయణ వృక్షం. ధూపదీపనైవేద్యాలతో పసుపు కుంకుమ శోభితమై ఉండే ఈ చెట్టు చుట్టూ నాగప్రతిష్ఠలు దర్శనమిస్తాయి. కోనేటికి అభిముఖంగా నిలబడి ఆ వృక్షం మొదట్లో ప్రతిష్ఠితమైన శంకరనారాయణున్ని గమనిస్తే, జైనముని పోలిక ఏదో మదిలో మెదులుతుంది. ఇక అక్కడక్కడ నెలకొన్న గుడి మండపాలూ, సప్తర్షుల ప్రతిమలు ప్రత్యక్ష అనుభూతిని కలిగిస్తాయి. అక్కడున్న ప్రాకారాలన్నింటినీ ఒక కంట గమనిస్తూ.. వివిధ దేవతాది మూర్తులకు కైమోడ్పులర్పించుకుంటూ పడమట గోపురం దగ్గరికి వచ్చి తలెత్తి చూస్తే... అక్కడ మిధున శిల్పాలు ఖజురహో అందాలను గుర్తుకుతెస్తాయి. కాలభైరవుడు, ధుండి విఘ్నేశ్వరస్వామి, నటరాజ, చతుర్ముఖ బ్రహ్మ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, వీరభద్రుడు, సూరేశ్వర, చండేశ్వరాది దేవీదేవతామూర్తుల శిల్ప వైభవం ఆ ఆలయ ప్రాకారమంతా నిండి ఉంటుంది. పడమట గాలిగోపురం మీద ఉండే శృంగార నాట్యశాస్త్ర భంగిమలు అలౌకిక అనుభూతిని కలిగిస్తాయి. అపురూప శిల్పసౌందర్యంతో అలరారే ఈ అద్భుతసృష్టి మానవమాత్రులకు సాధ్యమయ్యేది కాదని, ఏ సౌందర్యదేవతలో ఈ ముక్తిధామాన్ని నిర్మించారని మనకు మనం సర్దిచెప్పుకుంటాం.
      అన్ని క్షేత్రాల మాదిరిగానే పేరులోనే స్థల మాహాత్మ్యాన్నీ, నామసార్థకతని పొందింది ఈ దాక్షారామం. దక్షుడు యజ్ఞం చేసిన చోటు ఇదే కావడంతో దీన్ని దక్షవాటిక అని, దక్షుడి ఆరామం కావడంతో ఇది దాక్షారామం అయ్యిందన్నది పౌరాణిక కథనం. ప్రజల నోళ్లలో అది ‘ద్రాక్షారామం’గా మారింది. దాక్షారామం నుంచి కోటిపల్లి సోమేశ్వరుణ్ని దర్శించుకునే మార్గంలో ఈ ‘దక్షగుండాన్ని’ చూడవచ్చు. దాక్షారామం ఆలయానికి పడమర దశలో గోగులాంబ, ఉత్తర దిశలో మండాలమ్మ, తూర్పు దిశలో నూకాంబ, దక్షిణ భాగాన ఘట్టాంబిక ఆవాసాలు కనిపిస్తాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబదేవి కోవెల కూడా ఇక్కడే ఉంటుంది. భీమేశ్వర ఆలయాన్ని ఆనుకుని ఉన్న పైండా అన్నదాన సత్రం పర్యాటకులకు అన్నపూర్ణేశ్వరిలా ఆతిథ్యమిస్తుంది. శ్రీ ఆంజనేయ బాలభక్త సమాజం వైపుగా వచ్చే భజనగీత తరంగాలు మనసులను రంజింపజేస్తాయి. అంతెత్తుకు ఎదిగిన కొబ్బరిచెట్లు ఆధ్యాత్మిక పరిమళాలను వ్యాపింపజేసే వింజామరలుగా కదులుతుంటాయి. కార్తీకమాసంలో (చివరి మంగళవారాన్ని దీపాల పండగని పిలుస్తారు) దీపాల పండగప్పుడు పుష్కరిణి నీటి అద్దాలతో తళుకులీనే దీప కాంతులు భక్తుల మనోనేత్రాల మీద చెరగని ముద్ర వేస్తాయి.
సాహిత్యంలోనూ అదే ప్రభ!
పంచారామ యాత్ర చేసే క్షేత్ర పర్యటకులు చివరి మజిలీగా అన్నవరం, పీఠికాపురం (పిఠాపురం), బిక్కవోలు, సామర్లకోట లాంటి పుణ్యస్థలాలను దర్శించి ద్రాక్షారామం చేరుకునే సరికి అలసిపోతారు. కానీ, 70 అడుగుల పొడవైన ధ్వజస్తంభపు గంటల నాదం చెవులకు తాకగానే ఉత్సాహపూరితులై ఆ స్వామి సన్నిధిలో సేదతీరతారు. కాలం మారినా కాలదోషం పట్టని కావ్య సంపదని సృష్టించుకున్న ఈ ద్రాక్షారామ భీమేశ్వరుడు... గుర్రం జాషువా మాటల్లో చెప్పాలంటే ఉజ్జీలేని దయాస్వభావుడు! చారిత్రకంగా ఈ క్షేత్రం ఎంత ప్రసిద్ధిని పొందిందో సాహితీ సొబగులతోనూ అంతగా అలరారింది.
      భారతం ఆదిపర్వంలో నన్నయ అర్జునుడి తీర్థయాత్రలను వర్ణించేటప్పుడు గోదావరి, భీమేశ్వరుల ప్రస్తావన తీసుకువస్తాడు. ‘‘దక్షిణ గంగనాఁదద్దయు నొప్పిన గోదావరియు జగదాదియైన భీమేశ్వరంబును బెడగుచున్న శ్రీ పర్వతంబును జూచి...’’ అన్న సీసపద్య పంక్తుల్లో నన్నయకు ప్రాంతీయత మీదున్న మక్కువ వెల్లడవుతుంది. ‘కావ్యాలంకార చూడామణి’ రాసిన విన్నకోట పెద్దన త్రిలింగదేశ ప్రస్తావన తీసుకువస్తూ... ‘‘దరశ్రీపర్వత కాళేశ్వర దాక్షారామ సంజ్ఞవఱలు త్రిలింగా కరమగుట నంధ్రదేశంబరుదార త్రిలింగ దేశమనఁజనుగృతులన్‌’’ అంటాడు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామాల మధ్య ప్రాంతాన్ని అప్పట్లో త్రిలింగ దేశంగా వ్యవహరించేవారు.  
      సకల విద్యాసనాథుడూ, ఈశ్వరార్చన కళాశీలుడైన శ్రీనాథుడు మాత్రం దాక్షారామంతో ఆత్మీయపు మర్యాదను పొందగలిగాడు. శ్రీనాథుడి కాశీఖండ కావ్యాన్ని అంకితం పొందిన వీరభద్రారెడ్డి.. ఆ మహాకవిని ప్రశంసిస్తూ చెప్పిన ‘‘ఈ క్షోణిన్నినుబోలు సత్కవులు లేరీ నేటి కాలంబునన్‌/ ద్రాక్షారామ చాళుక్య భీమ వర గంధర్వాప్సరోభామినీ...’’ పద్యం విఖ్యాతం. ఇక శ్రీనాథుడు తన భీమఖండంలో (భీమేశ్వర పురాణంలో) దాక్షారామ క్షేత్ర సమీపంలోని గ్రామ దేవతలనూ, మాణిక్యాంబదేవిని ప్రస్తావించడమే కాకుండా దక్షవాటిక మాహాత్మ్యాన్నీ వివరించాడు. అందులో భీమేశ్వర క్షేత్ర వైభవాన్ని వర్ణించిన తీరు చూడండి...
దక్షవాటీ మహాస్థానంబులోలేని
            యమరు లే స్థానంబునందు లేరు
దక్షవాటీ మహాస్థానంబులోలేని
           యర్థ మే స్థానంబునందు లేదు
దక్షవాటీ మహాస్థానంబులోలేని
           యమృత మే స్థానంబునందు లేదు
దక్షవాటీ మహాస్థానంబులో లేని
          యజ్ఞ మే స్థానంబునందు లేదు
దక్షవాటిక సకల తీర్థముల కరవు
దక్షవాటిక సకల విద్యలకు గరిడి
దక్షవాటిక విభవంబు తానకంబు
దక్షవాటిక శివుని యంతఃపురంబు

     దాక్షారామ క్షేత్రంలో లేనివి మరెక్కడా ఉండవు. సకల తీర్థాలకు, విద్యలకు ఇదే నిలయం. అంతెందుకు! ఇది సాక్షాత్తూ శివుడి అంతఃపురం అన్నది శ్రీనాథుడి భావన. ఈ కవిసార్వభౌముడిలానే మల్లనార్యుడు కూడా తన ‘రుక్మాంగద చరిత్ర’లో ఈ భీమేశ్వర క్షేత్రాన్ని అంత్యానుప్రాసతో పన్నెండు విశేషాల సమాహారంగా చెప్పాడిలా... ‘‘కామ్యార్థ ఫల సముత్కర కల్పతరువాటి/ దళిత పాతక కోటి దక్షవాటి/ ప్రణుత కల్యాణైక గుణమణి వ్రజపేటి/ ధాత్రీ కటీశాటి దక్షవాటి/ సన్మునింద్రారామ సస్యమేఘస్పోటి/ దమిత రోగనిశాటి దక్షవాటి/ రథవిమానాతపత్ర పతాక గజఘోటి/ తాపాద్రి శతకోటి దక్షవాటి/ తర్పితాశాలతాకోటి దక్షవాటి/ దనరు నిగమాళిపురిచేటి దక్షవాటి/ ద్వారసేవిత కర్ణాటి దక్షవాటి/ దక్షితేందు కిరీటి శ్రీదక్షవాటి’’! కోరికలను నెరవేర్చే కల్పవృక్షవనం,  కోటి పాపలైనా తొలగించగలిగన (దళితం చేయగల) క్షేత్రం, మంచి గుణాలకు పేటిక, బాధాపర్వతాలను బద్ధలు చేసే  వజ్రాయుధం అంటూ ఈ భీమేశ్వరుడి నెలవును అభివర్ణించాడు మల్లనార్యుడు. దాక్షారామం ఈ వసుధకు చీర లాంటిది, వేదమాతకు చెలికత్తెలా అలరారుతోందనే వర్ణనలు ఈ పద్యసొగసును ఇనుమడింపజేశాయి.  
ఆయనకు సాటి లేదు!
ఆధునిక కవులు అనేకమంది ఇక్కడి భీమేశ్వరుణ్ని స్తుతిస్తూనో, పుర వైభవాన్ని వర్ణిస్తూనో అద్భుత కావ్యసృష్టి చేశారు. కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ మధ్యాక్కరల్లో ద్రాక్షారామాన్ని వర్ణించారు. ‘భీమేశలింగ! ద్రాక్షారామ సంగ’ అనే మకుటంతో దాక్షారామ శతకం రచించారు. ఈ క్షేత్రం మీద ఇంద్రగంటి హనుమశ్ఛాస్త్రి కూడా కావ్యం వెలయించారు. ఇక జాషువా ‘గబ్బిలం’ కావ్యంలో వచ్చే దాక్షారామ ప్రసక్తి గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 
      దళితుల సమస్యను ‘శివుడికి’ విన్నవించేందుకు గబ్బిలాన్ని దూతగా ఎంచుకున్నారు జాషువా. ఈ కావ్య నాయకుడికి మార్గాయాసం కలగకుండా దేశవర్ణన చేస్తారు కవి. అలా తంజావూరు (తమిళ నాడు)కు దక్షిణం నుంచి యాత్ర మొదలు పెడతారు. ముందుగా నాయకరాజులు, తర్వాత నెల్లూరు- తిక్కన- పెన్నానది గురించి వర్ణిస్తారు. అక్కడి నుంచి గబ్బిలాన్ని పశ్చిమానికి మళ్లించి హంపీ విజయనగర వైభవాన్ని విశదీకరిస్తారు. మళ్లీ దాన్ని ఈశాన్యానికి మళ్లించి వినుకొండకూ, కొండవీడులకు వెళ్లమంటారు. అక్కడి నుంచి ఇంకొంచెం పక్కకు మళ్లించి ఇలా దాక్షారామానికి దారి చూపిస్తారు... 
అజ్జాయింతువొ చుట్టు మార్గమని ద్రాక్షారామ 
భీమేశ్వరుం/ డుజ్జీలేని దయాస్వభావుడు, 
ప్రభావోల్లాసి ముప్పొద్దులుం/ గజ్జెంగట్టెడి 
నాట్యగాడతడు, సాక్షాత్కారముం జెందినన్‌/  
మజ్జాత్యుద్ధరణంబు గల్గగలదమ్మా పొమ్ము 
సేవింపగన్‌

      ‘ఓ గబ్బిలమా... చుట్టు మార్గం అవుతుందని సందేహిస్తావేమో! కానీ దాక్షారామ భీమేశ్వరుడు సాటిలేని దయాస్వభావి. ఆయన మూడు పొద్దులా గజ్జెగట్టి నాట్యం చేస్తాడు. ఆయన సాక్షాత్కరిస్తే మా/ నా జాతి ఉద్ధరణ జరుగుతుంద’న్నది కవిభావం. భౌతిక భేదాలకు అతీతంగా సర్వప్రాణి కోటికి సమానంగా ముక్తిని ప్రసాదించే క్షేత్రం దాక్షారామం (అగ్రజుండైనను నంత్యజుండైననుఁ/....... / మై రహిని దక్షవనచతుర్ద్వారసీమఁ/ బొందుఁగైవల్య కల్యాణభోగలక్ష్మి) అంటాడు శ్రీనాథుడు. అలాంటి చోటు నుంచే వర్ణభేదాలు లేని సమసమాజ నిర్మాణం ప్రారంభమైతే ఇంకేం కావాలన్నది జాషువా ఆశ కావచ్చు!
తూర్పుచాళుక్య వైభవం
క్రీ.శ.892- 922 మధ్య వేంగి రాజ్యాన్ని పరిపాలించిన మొదటి చాళుక్య భీముడి హయాంలో దాక్షారామ ఆలయం నిర్మితమైంది. అయితే.. ఆలయాన్ని కట్టించింది ఎవరో కచ్చితంగా తెలియదు. ‘‘ఈ ఆలయం పేరు, ప్రాచీనతలను బట్టి చూస్తే చాళుక్యభీముడే దీన్ని నిర్మించాడని అనుకోవచ్చు. కానీ, తగిన ఆధారాలు లేవు. రాజును ఆదర్శంగా తీసుకున్న కొందరు సామంతులు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు’’ అన్నారు డా।। నేలటూరి వెంకటరమణయ్య తన ‘వేంగి తూర్పు చాళుక్యుల’ చరిత్ర పొత్తంలో. ఆలయ నిర్మాత ఎవరన్న విషయం అలా ఉంచితే.. ఈ కోవెల సౌందర్యం ఎంతటి వారినైనా ఆకట్టుకుంటుంది. తదనంతర కాలంలో ఈ దేవాలయాన్ని దర్శించిన రాజేంద్ర చోళుడు కూడా ఈ నిర్మాణకౌశలానికి అబ్బురపడ్డాడు. ఆలయాన్ని రూపుదిద్దిన శిల్పి పేరుకు తన పేరు చేర్చి, ఆయన్ని ‘రాజేంద్ర చోళాచారి’గా గౌరవించాడు. తూర్పు చాళుక్య శిల్పకళారీతికి ప్రతిరూపమైన ఈ దేవాలయం స్తంభాలు, గోడల్లో ప్రతి ఒక్కటీ చారిత్రక కళాకాంతులను వెదజల్లుతుంటుంది. వీటి మీద మొత్తం 832 శాసనాలు కనిపిస్తాయి. తూర్పు చాళుక్యులు, తూర్పు గాంగేయులు, కాకతీయులు, కొండవీటి రెడ్డి రాజులు, విజయనగర పాలకులు, గజపతుల కాలపు విశేషాలను ఇవి అందిస్తాయి. 
      కాకతీయుల కాలంలో భట్టిప్రోలు, పుష్పగిరి, శ్రీశైలం, త్రిపురాంతకం, అలంపురం, దాక్షారామం ప్రధాన శైవ క్షేత్రాలు. ఈ ప్రాంతాల్లో అప్పట్లో గోళకీ మఠాలు ఉండేవి. అప్పటి ప్రజల మీద వీటి ప్రభావం చాలా ఎక్కువ. శైవక్షేత్రంగా దాక్షారామానికి ఉన్న ప్రశస్తి కారణంగా క్రీ.శ.పదకొండో శతాబ్దంలో దక్షిణ దేశం (తమిళనాడు) నుంచి సన్యాసులు వచ్చి దాక్షారామంలో స్థిరపడ్డారు. ఇక నిర్మాణ విశేషాల పరంగా చూస్తే ఈ ఆలయంలో ప్రతిదీ అద్భుతమే! 12 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కొలువుదీరిన ఈ కోవెల రెండో ప్రాకారపు స్తంభాల మీద ఏనుగులూ, హంసలూ, నాట్యభంగిమల్లో అలరారే స్త్రీల సౌందర్యాన్ని లిఖించారు. పుష్కరిణికి వెళ్లే తోవలో సప్తర్షుల శిల్పాలు దర్శనమిస్తాయి. ఆలయంలోనికి ప్రవేశించగానే ఎడమ వైపున ఏకశిలపై కొలువుదీరిన సప్తమాత్రుకలు కనిపిస్తాయి. వాటి కిందివైపుగా తలొంచి చూస్తే ఆలయ నమూనా ఒకటి సూక్ష్మశిల్పకళా శోభితంగా ఆకర్షిస్తుంది.  
      దేవాలయ రంగమండపం దగ్గర్నుంచి పోతుంటే ఎన్నాళ్లనుంచో మూగబోయిన నాట్యవిలాసినుల మంజీర నాదాలు లీలగా వినిపిస్తూ ఉంటాయి. అటు నుంచి అటుగా వెళ్లిపోకుండా పక్కకి తిరిగితే పడమటి గోపురపు ఏటవాలు నీడలు కాళ్ల దాకా పరచుకుని ఉంటాయి. తలెత్తి ఆ గోపురం వైపు చూస్తే సంధ్యాకాంతిలో తళుకులీనే ఆ శిల్పాలు చేతనత్వంతో కదులు తున్నట్టే కనిపిస్తాయి. శోధించాలిగాని అనేక రహస్యాలు ఈ క్షేత్రమంతటా నిక్షిప్తమయ్యే ఉంటాయి. నేలమాళిగ ల్లో అనేక శివలింగాలు యోగ ముద్రలో ఉన్నాయని అంటారు. అందుకే ఈ భీమేశ్వర క్షేత్ర పరిసర ప్రాంతాలలో అనేక శివలింగాలు స్వయంభువుగా పూజలందుకుంటు న్నాయి. (వేగాయమ్మపేట, ఆదివా రపు పేట మొ।।). అందుకేనేమో దాక్షారామాన్ని అల కైలాసనాథుడి అంతఃపురంగా, అఖండ శివరూపంగా భక్తులు భావిస్తారు. 
      ఆ ఆధ్యాత్మిక భావనలను అలా ఉంచితే.. తెలుగుజాతి చారిత్రక ప్రస్థాన సమాచారాన్ని విశేషంగా అందించే శాసన భాండాగాగరం దాక్షారామం. పదకొండు శతాబ్దాల నాటి నిర్మాణ కౌశలానికి ప్రతీక. విలువ ఎంచే సాహసం చేయలేని వారసత్వ సంపద!  

సహకారం: త్రిమూర్తులు, ద్రాక్షారామం 


వెనక్కి ...

మీ అభిప్రాయం