బతుకు చిత్రాలు... బతుకమ్మ పాటలు!

  • 1133 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా.బండారు సుజాత శేఖ‌ర్‌

  • దేవ‌ర‌కొండ‌, న‌ల్లగొండ జిల్లా
  • 9866426640
డా.బండారు సుజాత శేఖ‌ర్‌

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేకతను ఆపాదించిన పండగ బతుకమ్మ. బతుకునిచ్చిన తల్లిని కొలుచుకునే తెలంగాణ ప్రజల బతుకు ఔచిత్యం బతుకమ్మ. బతుకు చిత్రం బతుకమ్మ. ఇది పండగేకాదు, మానవ జీవితాలకు అర్థం చెప్పిన ప్రకృతి నేపథ్యం. కుటుంబం- సమాజం వెరసి రాష్ట్రం... ఇలా సమష్టి భావనకు ఊతమిచ్చిన పాట.. బతుకమ్మ పాట! ఉమ్మడిగా నడిపించిన ఆట.. బతుకమ్మ ఆట! 
బతుకమ్మ పండగ ఈనాటిది కాదు. కాకతీయుల కాలం నుంచే ఈ పండగ జరుపుకుంటున్నారని చారిత్రక అంశాలు తెలియజేస్తున్నాయి. కొన్ని బతుకమ్మ పాటలతోపాటు, ఆయా జానపద కథలు, సంఘటనల ఆధారంగా, శాసనాలపరంగా కూడా ఎన్నో... ఎన్నెన్నో అంశాలు ఈ పండగ నేపథ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఇంకా ఎన్నెన్నో ఆధారాలు వెలికిదీయాల్సిన ఆవశ్యకతా ఉంది. బతుకమ్మ పండగపై ఎన్నో వ్యాసాలు, వ్యాస సంపుటాలు వచ్చాయి. వారి వారి అభిరుచులు, అనుభూతులు, అవగాహనలతో బతుకమ్మ నేపథ్యం, పాటల సంపుటులను ప్రచురించుకోవడాన్ని బట్టి ఈ పండగ విశిష్టత ఇంకా ఇంకా... ఆకాశమంత ఎత్తుగా కనిపిస్తూ ఉంది. ఇంతెందుకు... ఎక్కడ నృత్య కార్యక్రమం జరిగినా అక్కడ బతుకమ్మ నృత్యరూపకం ప్రదర్శితమవుతోంది. ఇలా తెలంగాణ రాష్ట్ర పండుగ, ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
      ఈ పండగ నేపథ్యాల్లో ఒక అంశం... బతుకమ్మను పేరంటాలుగా చూపుతుంది. మరోచోట లక్ష్మీ రూపంగా, అమ్మవారి స్వరూపంగా, కన్యకాంబ రూపంగా పూజలందుకుంటే, ఇంకోచోట సాహసవనిత త్యాగంగా కనిపిస్తుంది. ఇక తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు. ప్రాకృతిక అందాలను అద్దుకున్న సహజపూలనే దీనికి ఉపయోగిస్తారు.  
పచ్చపచ్చగా నవ్వుతుంటది
దారి వెంట బహు సక్కగుంటది
తెలంగాణ తల్లికి సిగపూవునంటది
బతుకమ్మ ఒడిలోన ఓలలాడుతది...
తంగేడుపూవు తల్లిపూవురా

తరతరాల మనచరిత రూపురా- ఇలా పొగడ్తలందుకునే తంగేడు పూవు.. కట్టలవెంట, గట్లవెంట, ఊరి పొలిమేరల్లో పూస్తూ ప్రకృతికి అందాన్నిస్తుంది. పసుపుపచ్చగా ఉండే తంగేడు పూవును గౌరీ రూపంగా భావిస్తారు. అయితే వైద్యపరంగా ఈ పూవుకు, కాయకు, కాండానికి ఔషధ గుణాలున్నాయి. వర్షాకాలంలో చిన్నచిన్న కుంటలు నిండి వాడకానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. బతుకమ్మలో పేర్చిన తంగేడును ఆ నీటిలో వేయడం వల్ల వాటిలో మాలిన్యం తొలగుతుంది. బంతి, చామంతి, గుమ్మడి, గునుగు, ముత్యాలపూవు, సీతజడ పూలు, తంగేడు, జిల్లేడు, తామర.. ఇలా రకరకాల పూలన్నింటినీ తెచ్చి బతుకమ్మను పేర్చుతారు. ఈ పూల మకరందం నీటికి స్వచ్ఛతను చేకూరుస్తుంది. మరి బతుకమ్మను పేర్చడం, పూజించడం, ఆడిపాడే విధానాలను గమనిస్తే... పండితులకు మాత్రమే సాధ్యమయ్యే శ్రీచక్రం, పూర్ణకుంభం, సర్వతోభద్ర మండలం బతుకమ్మ రూపంలో పామరుల ఇంట ఓలలాడటం మరో విశేషం. బతుకమ్మ త్రికోణంలో ఉండటం స్త్రీశక్తికి సంకేతం. సంతానోత్పత్తికి మూలంగా, జగత్తు స్త్రీరూపంగా బతుకమ్మ దర్శనమిస్తుంది.
      సృష్టి స్థితి లయకారులుగా, ప్రకృతి పురుషులుగా దేవుళ్లను ఆరాధించే ప్రజలు బతుకమ్మ పండగ ఏర్పాట్లు, నిర్వహణను బట్టి ఎన్నో జీవితపాఠాలు నేర్చుకోవచ్చు. దేవుళ్లను కొలిచేందుకు ఉపయోగపడే పూలనే ఈ పండగ వేళ దేవతగా కొలవడం తెలంగాణ ప్రజల గొప్ప మనో సౌందర్యానికి చిహ్నం. బతుకమ్మను పేర్చడానికి కావాల్సిన పూలను కోసుకుని లేక కొనుక్కొని రావడం మగవారి పని. పేర్చడంలో స్త్రీల కళాత్మకత ఉట్టిపడితే, వారికి పూర్తిస్థాయిలో మగవారు సహకరిస్తారు. కానీ బతుకమ్మ స్త్రీల ప్రత్యేక పండగ. ఒక గొంతు మధురంగా ఉయ్యాలపాట చెబితే ఎంతమంది స్త్రీలైనా  చేతులతో చప్పట్లు చరుస్తూ లయబద్ధంగా కదులుతూ పాటపాడుతుంటారు. గుండ్రంగా తిరుగుతూ ఆడే బతుకమ్మ కనులకింపుగా, చెవులకు సొంపుగా ఉంటుంది. 
      జానపదుల గొంతులో ఎన్నో బతుకమ్మ పాటలు ఉన్నాయి. వాటన్నింటికి మూలం స్త్రీల జీవితానుభవాలు. మౌఖికంగా ప్రచారంలో ఉన్న ఈ పాటలు స్త్రీలు కూర్చుకున్నవే. వారు విన్నవి కొన్నైతే, శ్రామికులుగా వారి పనిపాటల్లో ఆశువుగా అల్లుకున్నవి ఎన్నో. స్త్రీల ఆశలకు, ఆశయాలకు, నమ్మకాలకు దర్పణంగా నిల్చిన బతుకమ్మ పాటలు జనజీవనం నుంచి ఉద్భవించినవి. అందుకే ఒక్కోపాట ఓ బతుకుచిత్రం. అంతేకాదు,  ఈ పాటల్లో దాగిన అలంకారాలు అద్భుతం. ‘‘ముత్యపు గుండెక్కి ఉయ్యాలో ముదిత జలకమాడే ఉయ్యాలో/ పగడపు గుండెక్కి ఉయ్యాలో పడతి జలకమాడే’’- ఇంటి ఆరుబయట తడకలతో గట్టిన వారి స్నానాలగదిలో ఉన్న రాయిని ముత్యం, పగడంగా పోల్చడంలో జానపద స్త్రీల ఆత్మసౌందర్యం కనిపిస్తుంది. ‘‘పుంటికూర తిన్న ఉయ్యాలో పుట్టిల్లు మేలు ఉయ్యాలో’’ లాంటి చరణాల్లో సామెతలు కనిపిస్తాయి. ఇలా బతుకమ్మ పాటలు స్త్రీలను ఉత్తమోత్తమ కవులుగా నిలిపాయి. 
      బతుకమ్మ ఆటలో వలయాకారంగా ఒకేసారి వంగి లేస్తూ, చప్పట్లు చరుస్తూ, ఒకే గొంతుతో పాడటంలో స్త్రీల ఐక్యత గోచరిస్తుంది. బతుకమ్మ పాటల్లో  కుటుంబ సంబంధాలు, పుట్టిల్లు, అత్తిల్లు, ఇరుగుపొరుగు, వ్యవసాయం, పల్లె బతుకులు, వివిధ వృత్తులు, కష్టాలు కన్నీళ్లు ఒకటేమిటి నమ్మకాలు, దేవుళ్ల మొక్కుబడులు, పశుపక్ష్యాదుల పట్ల భావనలు, ఉద్యమాలు, ఊరి నుంచి దేశ రాజకీయాలు, ప్రమాదాలు, వాస్తవ సంఘటనలు, చారిత్రక, సాంస్కృతిక, పౌరాణిక అంశాలన్నీ ఉంటాయి. తాత్త్విక భావనలు సైతం అంతర్లీనమవ్వడం విశేషం. ‘‘అమ్మ బిక్షంబాని ఉయ్యాలో బిక్షగాడు వస్తే ఉయ్యాలో/ చెయ్యెత్తి దానంబు ఉయ్యాలో చేసినావ చేడ ఉయ్యాలో’’ అంటూ సాగే పాటలో ఈశ్వరుడు, ఆత్మను ప్రశ్నిస్తుంటాడు. ఇలా పుట్టుక నుంచి ఆత్మవరకు అన్ని భావనలూ ఈ పాటల్లో కనిపిస్తాయి. వీటిలో కొన్ని పాటలే కవుల రచనలు. మిగిలినవన్నీ ఆశువుగా స్త్రీలద్వారా మౌఖికంగా ప్రచారం పొందినవే. అంటే బతుకు ఔచిత్యాలన్నింటినీ ఏర్చికూర్చిన అంశాలే బతుకమ్మ పాటలయ్యాయన్న మాట. వాటన్నింటినీ ఇలా దాచి వారసత్వంగా అందిస్తున్న స్త్రీమూర్తులకు జోతలు పట్టాల్సిందే. 
      ఈ రకంగా సాగే బతుకమ్మ ఆటపాటలతోపాటు పండగ వేళ చేసే పలు నైవేద్యాలు, వంటలు స్త్రీల దూరదృష్టిని ఎరుకచేస్తాయి. ఈ రోజుల్లో వర్షాలు సరిగా లేవు. కానీ, బాగా వర్షాలు కురిసే రోజుల్లో ఈ వంటకాలు ఆరోగ్యపరంగా చాలా మంచివి. అంతేకాదు ఆడే ఆటలో వెంపలిచెట్టు నిలపడం, పూజ చేయడం, బతుకమ్మ చుట్టూ తిరగడం, ఆడటం, కోలాటం వేయడం, బతుకమ్మను సాగనంపుతూ పాటలు పాడటం, చెరువులో వదులుతూ జోపుచ్చడం, తిరిగి రమ్మని కోరడం... ఈ సందర్భాలన్నీ స్త్రీల జీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. 
      అమ్మ లేనిదే పుట్టుక లేదు. కానీ నానాటికీ సమాజంలో మొదటగా ఆడపిల్ల... ఆపైన అమ్మ నిర్లక్ష్యానికీ, వివక్షకూ గురవుతోంది. 
నేటి మహిళ, మేటి మహిళ
ఆడది అంటే అబల కాదని
ఆదిశక్తిగా ఎదిగింది, శక్తియుక్తి విజ్ఞానంతో
విజయవిహారం చేసింది...
నిదురలేచిన నేటి మహిళ... వెలిగే ఒక దీపంరా
వెలిగించే దీపంరా..
. అంటూ పాటలు పాడుకుంటున్న తరుణంలో కూడా ఇంకా ఆడపిల్లలకు అవమానాలు, అత్తింటి ఆరళ్లు తప్పడం లేదు. అయితే సమాజం సమతుల్యంగా ఉండాలి. ఆడైనా మగైనా సమానంగా జీవించే అవకాశం ఉండాలి. ప్రకృతిలో పూసిన ప్రతి పువ్వూ బతుకమ్మను పేర్చడానికి అవకాశాన్ని కలిగి ఉన్నట్లు అందరు ఒక్కటిగా భావించి, సమతామమతలతో, శాంతి సౌఖ్యాలతో జీవించాలి. బతుకమ్మ ఆటపాటల్లోని ఆనందం మన జీవితాల్లో నిండాలి. ఆడవారిని ముఖ్యంగా ఆడపిల్లల్ని పుట్టనివ్వాలి, పెరగనివ్వాలి, చదవనివ్వాలి. సూర్యచంద్రులు, రాత్రిపగలు, సృష్టికెంత సహజమో, స్త్రీ పురుషులు అంతే అన్న భావన పొందాలి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రత్యేకతకు ఆలవాలమైన బతుకమ్మ పండగ సందేశమొక్కటే.. సమసమాజం, సమైక్య సమాజం! 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం