ఓహోం ఓహోం హోయ్‌!

  • 546 Views
  • 24Likes
  • Like
  • Article Share

    సిద్దినేని భావ‌నారాయ‌ణ‌

  • sbn7hills@gmail.com
సిద్దినేని భావ‌నారాయ‌ణ‌

‘ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌/ అది మోసిన బోయీలెవ్వరు?’ అన్నారు శ్రీశ్రీ. అధికారానికీ, ఆడంబరానికీ ప్రతీక కాబట్టి పల్లకీని ఆయన పక్కనపెట్టమన్నారు కానీ, దాంతో కలిసి ప్రయాణిస్తే ఎంత చరిత్ర మన కళ్లముందు నిలుస్తుందో తెలుసా? బోలెడన్ని సామాజిక, ఆర్థిక, చారిత్రక, రాజకీయ విశేషాల మజిలీల మీదుగా సాగే ఆ ఆసక్తికర పయనాన్ని ప్రారంభిద్దామా! 
రామాయణ కాలం నుంచీ పల్లకీ ఉనికిలో ఉన్నట్టు చెబుతారు. ‘పాలంకి’ అనే సంస్కృత శబ్దం పల్లకీ పదానికి మూలం అని ఓ వాదన. పాలంకికి మంచం అనే అర్థం వుంది. సంస్కృతంలో పల్యంకిక అనే మాట ఉంది. హిందీ వాళ్లు పాల్కి అంటారు. వాళ్లకి డోలీ అని వేరే పరికరం కూడా ఉంది. యాత్రా స్థలాలలో ఒక్క మనిషిని కూర్చోబెట్టి మోసుకెళ్లే కుర్చీ వంటిదిది. వీళ్ల ఆచారాలలో పెళ్లికూతుర్ని డోలీలోనూ, పెళ్లికొడుకుని పల్లకీలోనూ కూర్చోబెట్టి మోస్తారు. తెలుగువాళ్లు ఈ భేదాన్ని పాటించినట్టు లేదు. పెళ్లి కూతురు, పెళ్లికొడుకునీ కూడా పల్లకీలోనే కూర్చోపెట్టేవారు. పల్లకీ పదం తెలుగులో మార్పు లేకుండా నిలబడిపోయింది. ఇలా దీర్ఘాంతమైన పదాలు తెలుగులో తక్కువ. ఇంగ్లీషులో పలాంక్విన్‌గా మారింది. 
      మొదట్లో పల్లకీ ఓ సౌకర్యం మాత్రమే. తర్వాత్తర్వాత పల్లకీ ప్రయోజనం విస్తరించింది. సాంఘికంగా వచ్చిన మార్పుల వల్ల, కొన్ని తరగతులవారు తమ స్థాయిని ప్రదర్శించే అలంకారంగా మారింది. మతపరమైన ఉత్సవాల్లోనూ, క్రతువుల్లోనూ, సాంఘికాచారాల్లోనూ ప్రవేశించింది. దేవాలయ నిర్మాణం, నిర్వహణ ముమ్మరంగా కొనసాగిన కాలంలో, ముఖ్యంగా దక్షిణాది సమాజాల్లో దేవుడి క్రతువుల్లో విడదీయరాని సంప్రదాయంగా స్థిరపడింది. పెళ్లి, విజయోత్సవం, పట్టాభిషేకం లాంటి వేడుకల్లో భాగంగా నిలదొక్కుకుంది. క్రమంగా అధికారానికీ, ఆడంబరానికీ ప్రతీకయ్యింది. కాకతీయుల పతనానంతరం తెలుగు ప్రాంతాలలోకొచ్చిన బహమనీలూ, గోల్కొండ కుతుబ్‌షాహీలూ అంతఃపురం అవసరాలకు తగినట్టు దీన్ని సర్దుబాటు చేసుకున్నారు. పరదా పద్ధతికి అనుగుణంగా అలంకరణలు, తెరలు ఏర్పాటు చేశారు. సౌకర్యంతో కూడిన ఈ ఆడంబరానికి తర్వాత వచ్చిన యూరోపియన్‌ వ్యాపారులూ, అధికారులూ, మిషనరీలూ సులువుగా అలవాటుపడి, స్థిరీకరించారు.
దేవాలయాల్లో దంతపు పల్లకీలు
వర్ణ వ్యవస్థ బలంగా ఉన్న సమాజంలో కులాలవారీ నిబంధనలు అనివార్యం. వేడుకల్లోనూ, ఉత్సవాల్లోనూ పల్లకీ వాడకం కొన్ని వర్గాలకు, కులాలకు పరిమితమైంది. అదే క్రమంలో పల్లకీ మోత కులవృత్తిగా రూపాంతరం చెందింది. కొన్ని కులాలకు ఈ పని కేటాయించారు. రెడ్డి, వెలమ, విజయనగర రాజ్యాల్లో దైవ కార్యాల్లోనూ, వేడుకల్లోనూ పల్లకీ పాత్ర పెరిగింది. సామాన్య పౌరుల్లో కొన్ని కులాలలోని పెళ్లి ఊరేగింపుల్లో పల్లకీ వచ్చి చేరింది. ఇది దైవకార్యాలలో పల్లకీ వాడకానికి అనుకరణ కావచ్చు. డోలు, నాదస్వరం వంటి సంగీత పరికరాల వినియోగం పెరిగింది. పల్లకీ, నాదస్వరం మంగళకరమైన ప్రతీకలుగా నిలదొక్కుకోవడం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రాంతాల్లో కనపడుతుంది. 
      తిరుమల వెంకటేశ్వరస్వామికి జులై నెలలో అణివారం ఆస్థానం జరుగుతుంది. ఆ సాయంత్రం మలయప్పస్వామి పూల పల్లకీలో నాలుగు మాడ వీధులలో విహరించడం ఆచారం. ఇకపోతే, ఉగాది రోజు సాయంత్రం బంగారు పల్లకీ!! తిరుచానూరులోనూ, పద్మావతీ అమ్మవారికీ కార్తీక బ్రహ్మోత్సవంలో అయిదోరోజున మోహినీ అవతారంలో పల్లకీ యాత్ర ఉంది. సాలకట్ట బ్రహ్మోత్సవం అయిదో రోజున వేంకటేశ్వరుడు కృష్ణావతారంలో ఏనుగు దంతంతో చేసిన పల్లకీలో దర్శనమిస్తాడు. ఈ పల్లకీని మైసూరు పాలకులు సమర్పించారని చెబుతారు. ముత్యాలపల్లకీ సేవ పేరుతో జరిగే వేడుక కూడా వెంకన్న అర్చనలో ప్రసిద్ధమే. తిరుమలలో ఇంకో దంతపు పల్లకీ, దశావతారాలు చెక్కింది కూడా ఉందని చెబుతారు. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంతో పాటు తిరునల్వేలి జిల్లా నంగనూరులోని వానమామలై పెరుమాళ్‌ కోవెలలోనూ దంతపు పల్లకీలు ఉన్నాయి. ఇవన్నీ మైసూరు ఉడయర్లు వివిధ కాలాల్లో సమర్పించినట్టు చెబుతారు. వానమామలై పెరుమాళ్‌ కోవెలలోని పల్లకీ ప్రస్తుత పరిస్థితి తెలియదు. 1901లో తీసిన ఫొటో మాత్రం ఒకటి బ్రిటిష్‌ గ్రంథాలయంలో ఉంది. 
కవులూ ఎక్కారు
అధికారాన్నీ, దర్పాన్నీ ప్రదర్శించడానికి పల్లకీ చిహ్నం అయ్యింది కదా మరి. రాచ కుటుంబాలూ, తర్వాత అధికారులూ వచ్చారు. అనంతరం మఠాధిపతులు. ఈ వరుసలో రాజాశ్రయం పొందిన మత గురువులూ, కవులూ వేంచేశారు. శ్రీనాథుడు కొండవీడు నుంచి కృష్ణా డెల్టాకు అనేకసార్లు ప్రయాణించాడు. కొల్లూరు దగ్గర కృష్ణానది దాటి, అయ్యలూరు (ఇప్పటి ఐలూరు) మీదుగా దగ్గుమిల్లిలో అత్తగారిల్లు చేరినట్టుంది. పలనాటి యాత్రా, హంపీ యాత్రా పల్లకీ లేకుండా సాగుతుందా? ఈయనకు సంబంధించే కల్పిత గాథ ఒకటి ప్రచారంలో ఉంది. శ్రీనాథుడు పల్లకీలో వెళ్తూ నాగలి దున్నుతున్న మల్లన్నను చూసి, బోయీలను తప్పించి పల్లకీ నడిపించాడనీ, మల్లన్న కూడా ఎడ్లను తప్పించి నాగలి నడిపాడనీ కథనం. మల్లన్న పోతన కొడుకు. కథలో నిజం ఉన్నా లేకున్నా పల్లకీ ప్రాచుర్యానికిది నిదర్శనం. శ్రీనాథుడు చాలా విలాసవంతంగా జీవించినట్టు చెబుతారు. కాబట్టి, రాజమహేంద్రి నుంచి దాక్షారామానికీ, కోటిపల్లికీ పల్లకీ ప్రయాణమే సాగించి ఉండాలి. ఈ యుగానికి చెందిన ప్రసిద్ధ నర్తకి లకుమది చందోలు. అక్కడి నుంచి కొండవీటిలోని కొలువుకు లకుమ ప్రయాణం ఎడ్లబండిలోనో, పల్లకీలోనో?
నరసనాయకుడు మొదట హంపీ రాజ్యానికి చంద్రగిరిలో సామంతుడు. ఇతని మూడో భార్య నాగమ్మ పుట్టిల్లు అరిగండ పల్లి (హరిగండపురం). ఇక్కడి నుంచి మొదట చంద్రగిరికీ, ఆ తర్వాత చంద్రగిరి నుంచి హంపికీ ప్రయాణాలు సాగించింది. ఈవిడ కొడుకే కృష్ణరాయుడు. దక్షిణాదికంతటికీ చక్రవర్తి అయ్యాడు. రాజమాత పల్లకీ కాక ఎడ్లబండి ఎక్కుతుందా? అరిగండపల్లిని తల్లిపేరుమీద నాగలాపురంగా మార్చి, చక్రవర్తి హోదాలో, ఇక్కడ వేదనారాయణస్వామి ఆలయం నిర్మించాడు. ఈయన తిరుమల యాత్ర ఆరుసార్లు రికార్డుల్లో ఉంది. దేవుడికి నగలూ, మాన్యాలు ఇచ్చిన సంగతులు కూడా శాసనబద్ధమయ్యాయి. అంతటి చక్రవర్తి నిటారైన కొండను కాలినడకనెక్కుతాడా? పల్లకీ ఎందుకెక్కడు?  
      ఇక కృష్ణరాయ చక్రవర్తి అంతటివాడే తను పల్లకీకి భుజం పట్టాడని పెద్దన చెప్పుకొన్నాడు. ఇంతటి యోగం పట్టిన కవులు బాగా అరుదుగానే వున్నారు. ఇదే యుగంలో తర్వాతి కాలానికి చెందిన భట్టుమూర్తికి గానీ, తెనాలి రామలింగయ్యకు గానీ పల్లకీ యోగం పట్టలేదు. రామలింగయ్య మరీ వెనకబడిపోయినట్టున్నాడు. నాదెండ్ల గోపయ్య లాంటి ప్రాంతీయ పాలకుడికీ, విరూరి వేదాద్రి లాంటి చిరుద్యోగికి కృతులంకితమిచ్చాడు. భర్తృహరి శతకాలను అనువదించిన లక్ష్మణకవి, పల్లకీ యోగం లేకే కావచ్చు, ఏనుగెక్కి సంస్థానాలు తిరిగాడని చెబుతారు.
శిల్పాలు, చిత్రాల్లో...
కలప, వెదురు, ఇనుప బద్దెలు, మేకులు పల్లకీకి ముడిపదార్థాలు. పదహారో శతాబ్ద కాలానికి దీని తయారీలో అలంకరణా, ఆడంబరాలు చేరాయి. పట్టు పరదాలు వచ్చాయి. వెండి రేకులు తాపడం చెయ్యడం, పూసల దండలమర్చడం మొదలయ్యింది. హంపీ యుగం కంటే హంగులు పెంచారు. శిల్పంలోనూ, చిత్రలేఖనంలోనూ పల్లకీ ప్రస్తావనలు కనిపిస్తాయి. కర్ణాటకలోని భత్కళ్‌లో దొరికిన శిల్పశకలం, పశ్చిమ చాళుక్య యుగానికి చెందిన శివాలయంలోనిదని ఊహిస్తున్నారు. ఆలయం జాడలేదు గానీ, పల్లకీ శిల్పం ఉన్న ఈ శకలం ఎనిమిదో శతాబ్దికి చెందిన శైలి కావచ్చు. శృంగేరి విద్యాశంకరాలయంలోని వర్ణ చిత్రం, మొగల్‌ మినియేచర్లూ పాత డిజైను పల్లకీలను చూపిస్తాయి. హంపీ విరూపాక్షాలయం పైకప్పు మీది వర్ణ చిత్రం క్రీ.శ.1450 ప్రాంతాలది. ఈ కాలానికి పల్లకీ నిర్మాణంలో ఇంతకు మునుపు లేని అలంకరణలు చోటు చేసుకున్నాయి.
      మధ్య యుగాలలో కొన్ని ప్రయాణాలు బాగా ప్రసిద్ధమయ్యాయి. కవి తిక్కన నెల్లూరు నుంచి ఓరుగల్లు కొచ్చి గణపతి దేవుడితో రాయబారం చేశాడని చెబుతారు. అంత పలుకుబడి కలిగిన వ్యక్తి గుర్రమెక్కి వచ్చాడని చెప్పలేం. గుర్రం సాధారణ సైనికాధికార వాహనం. రాజపుత్రుల గాథల్లో చిత్తోర్‌ కోటలోకి రాజపుత్ర యోధులు పల్లకీల్లోనే ప్రవేశించి అల్లావుద్దీన్‌ సేనలతో యుద్ధం చేస్తారు. ఇక హంపీ నుంచి సామంతులుగా దక్షిణానికి వెళ్లిన తెలుగు నాయకరాజులంతా పల్లకీ సంప్రదాయాన్ని కూడా తీసుకెళ్లారు. మధురైలోనూ, తంజావూరులోనూ తెలుగు ప్రాంతాల నుంచి వలసవచ్చిన వడ్రంగి శ్రేణులుండేవి. వీరు వీణ తయారీతోబాటు పల్లకీ నిర్మాణం కూడా చేశారు. ఈ యుగంలో బోయీల్లో చాలావరకు తెలుగు కులాల వారే కనిపిస్తారు.
పల్లకీ ప్రబంధాలు
తంజావూరు నాయకుల్లో రఘునాథ నాయకుడి (1575-1634) కాలానికి ప్రధానమంత్రిగా ఉండే గోవింద దీక్షితుడు బాగా వృద్ధుడైపోయాడు. ఈయన రఘునాథుడి తాత, తండ్రుల కొలువులో కూడా ఉన్నాడు. ‘చతుర్దండి ప్రకాశిక’ కర్త వెంకటేశ్వర దీక్షితుడు (వెంకటమఖి) ఈయన చిన్న కొడుకే. గోవింద దీక్షితుడికి ఓ యజ్ఞంలో రఘునాథుడే గౌరవసూచ కంగా గొడుగు పట్టాడని చెబుతారు. గొడుగూ, పల్లకీ అధికార ప్రతీకలు.  
      తెలుగు నాయకుల తర్వాత వచ్చిన మరాఠీ పాలకులు తెలుగు పద్ధతులు కొనసాగించారు. తంజావూరు షాహాజీ (1684 - 1710) ఏకంగా ఒక సంగీత రూపకం రాసి, తిరువారూరు శివాలయం (దైవం పేరు త్యాగరాజు)లో ప్రదర్శనను సంప్రదాయకంగా ఏర్పాటు చేశాడు. ఇందుకోసం మాన్యాలూ, ఒక గ్రామం దానం చేశాడు. పైగా ఈ రూపకం తెలుగులో రాశాడు. పేరు ‘శంకరపల్లకీ సేవా ప్రబంధం’. దీన్ని 1890 ప్రాంతాలవరకూ దైవం ముందు ప్రదర్శించేవారు. ఈయనదే ఇంకో రూపకం ‘విష్ణు పల్లకీ సేవా ప్రబంధం’.
అక్కడి నుంచి వచ్చి...
ఆ కాలంలో విదేశీయులు చాలా విస్తృతంగా పల్లకీని వినియోగించారు. జీన్‌ బాప్టిస్ట్‌ టవర్నియర్‌ (1605 - 1689) తెలుగు ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగి, విలువైన వజ్రాలను చవకగా కొన్నాడు. బందరు ఓడరేవు నుంచి గోల్కొండ యాత్రలో బాటలు లేవనీ, చక్రాల బండి నడవడం కష్టమనీ రాశాడు. గోల్కొండ నుంచి కొళ్లూరు లాంటి ఊళ్లు తిరిగాడు. గండికోట యాత్రా చేశాడు. ఈ ప్రయాణాల్లో విరివిగా పల్లకీ వాడాడు. సీజర్‌ ఫ్రెడరిక్‌ 1567లోనూ, ఎడ్వర్ట్‌ టెరీ అనే ఇంగ్లిషు యాత్రికుడు 1660లోనూ పల్లకీలో ప్రయాణించి, యాత్రలను నమోదు చేశారు. 
      వలస పాలకులకు రెండు అవసరాలు కావాల్సి వచ్చాయి. ఇక్కడి వేడి వల్లా, బాటల్లో నాణ్యత లేకపోవడంతోనూ, ప్రయాణం సుఖంగా లేదు. రెండోది స్థానికుల మీద ఆధిక్యం చూపాల్సి వచ్చింది. పైగా ఇక్కడ మనిషి శ్రమ విలువ తక్కువ. అందువల్లే పల్లకీ వాడకాన్ని ఓ విధానంగా చేసుకున్నారు. ఇందుకోసం మద్రాసు, మచిలీపట్టణం, నర్సాపురం, కలకత్తాల్లో బోయీల నివాసం కోసం ఇళ్ల స్థలాలిచ్చారు. ఈస్టిండియా కంపెనీ పాలనలో సాంఘికంగా కొన్ని పరిణామాలు వచ్చాయి. ఇంతకుముందు కొంతమందికే పరిమితమైన విద్యా, వ్యాపారాలు వ్యవసాయ కులాలకు అందుబాటులోకొచ్చాయి. వీళ్లలో వెసులుబాటు ఉన్న కుటుంబాలు ఉన్నతవర్గాల వారి ఆడంబరాలను అనుసరించారు. ఆంక్షలు సన్నగిల్లాయి. పెళ్లిలాంటి వేడుకల్లో పల్లకీ వాడకం ప్రారంభించారు. రాయలసీమ ప్రాంతంలో పాలెగాళ్లు సొంతంగానే పల్లకీలు తయారు చేయించుకున్నారు.
      కృష్ణా డెల్టాలో, దివిసీమ లాంటి ప్రాంతాల్లో వర్షాకాలంలో చక్రం కదలడానికి వీలులేకుండా డొంకల్లో, బాటల్లో బురద పరుచుకుని ఉండేది. పిల్ల కాలువలూ, మురుగు బోదెలూ బండికి అవరోధాలు. కాబట్టి పల్లకీ ప్రయాణం, ముఖ్యంగా ఆడవాళ్లకి, అనుకూలంగా ఉండేది. పెళ్లికూతురు అత్తవారింటికి ప్రయాణం చాలాసార్లు పల్లకీలోనే సాగేది. బోదుల వెంటా, పొలంగట్ల వెంటా బోయీలు చాకచక్యంగా నడిచేవాళ్లు. బందరు నుంచి కాండ్రేగుల జోగిపంతులు పొలాల మీదుగా కళ్లేపల్లి దగ్గర కృష్ణానది తూర్పు పాయదాటి పిట్టల్లంక దగ్గర దీవి మీదకు చేరి, అవనిగడ్డలోని దివాణం చేరేవాడని చెబుతారు. జోగిపంతులు ఈస్టిండియా కంపెనీకీ, గోలకొండకూ మధ్యవర్తి. దివిసీమలో 300 ఎకరాల భూములుండేవి. ఈ ప్రాంతంలో కొన్ని కులాలవారు పల్లకీలను అద్దెకిచ్చి, బోయీలుగా ఉండేవారు. డెల్టా ప్రాంతాల్లో ముఖ్యంగా దివిసీమ, కోనసీమల్లో పల్లకీ మోతుబరుల సంప్రదాయంగా మారింది.
బోయీలెవ్వరు?
పందొమ్మిదో శతాబ్దంలో మందీ మార్బలం, సేవకులూ, సాయుధ కాపలాదార్లతో కుటుంబ సమేతంగా ఏనుగుల వీరాస్వామయ్య చేసిన కాశీయాత్ర విలక్షణం. యాత్రా విశేషాలన్నింటినీ ఆయన నమోదు చేశారు. తెలుగులో వచ్చిన అరుదైన, సమగ్రమైన యాత్రాచరిత్ర ఇది. ఇందులో పల్లకీ విషయం మూడు నాలుగు సందర్భాల్లో చెబుతారు వీరాస్వామయ్య. తయారు చేసే విధానం, మధ్యలో మరమ్మతు చేయించిన సంగతీ చెప్పారు. మొత్తంగా సాహిత్యంలో పల్లకీ వర్ణనలు చూడాలంటే అదో ప్రత్యేక అధ్యయనాంశం. షాహాజీ పల్లకీ ప్రబంధ రూపకాలతో పాటు వెంటనే గుర్తొచ్చే కావ్యం కృష్ణశాస్త్రి ‘పల్లకి’. సమాజంలోనూ, సంప్రదాయంలోనూ కుదురుకోవడం వల్ల పల్లకీ పదబంధాలు నుడికారంలో చాలానే చేరాయి. ఆశల పల్లకీ, ఊహల పల్లకీ, ముత్యాల పల్లకీ, బంగారు పల్లకీ లాంటివి. లలిత కళల్లోనూ, తద్వారా సినిమా మాధ్యమంలో ఈ ప్రతీకను బాగానే వాడుకున్నారు. జానపదాలలో, పెళ్లి పాటలలో, చలనచిత్రాల్లో దీన్ని ఉపయోగించి పాడుకునే పాటలనేకం. 
      చరిత్రలో వివరాలు తవ్వితీసే ప్రయత్నాలను శ్రీశ్రీ విసుక్కున్నాడు. దేశ చరిత్రల్లో సామాన్యుడి జీవనం ఎలా ఉండేదో తేల్చమని గద్దించాడు. ‘ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌/ అది మోసిన బోయీలెవ్వరు?’ అని నిలదీశాడు. నిజమే. బోయీల సమాచారం తక్కువగానే దొరుకుతుంది. వీళ్లని బోయీలనడానికి కారణం కూడా తెలియదు. విభిన్న కులాల వారు పల్లకీని మోసినా బోయీలుగానే నమోదయ్యారు. ముందొకరూ, వెనకొకరూ భుజం పట్టి పల్లకీని మోస్తారు. బరువూ, ప్రయాణించే దూరం - వీటిని బట్టి ముందు ఇద్దరూ, వెనక ఇద్దరూ, లేక ముందు ముగ్గురూ వెనక ముగ్గురూ మోస్తారు. అరుదుగా ఈ సంఖ్య నాలుగేసి చొప్పున ఉండొచ్చు. మోసే రెండు జట్లు కాక, మరో రెండు ఖాళీ జట్లు ముందు నడుస్తాయి. కొంత దూరం సాగిన తర్వాత భుజం మార్చుకుంటాయి. ఇలా మార్చి మార్చి జట్టులు మారుతూ దూర ప్రయాణం సాగిస్తాయి. అన్ని జట్టులూ లయబద్ధంగా బృంద గీతాలను ఆలపిస్తూ ఒకే గునుకుతో పరుగులాంటి నడక సాగిస్తాయి. టవర్నియర్‌ ప్రకారం రోజుకి 13 లేక 14 లీగులు (32 మైళ్లు) ప్రయాణం సాగింది. ఈ సంగతిని అదే కాలంలో యాత్ర చేసిన థామస్‌ బెవరీ కూడా చెప్పాడు. 1810  ప్రాంతంలో బర్మింగ్‌ హామ్‌ నుంచి వచ్చిన మిషనరీ ఎలిజా హూలీ మరిన్ని వివరాలు నమోదు చేశాడు. బోయీల వృత్తి పద్ధతులూ, కులాలూ, ఆర్థిక స్థితిగతులూ చెప్పాడు. బైబిల్‌ గ్రంథం తమిళ అనువాదాన్ని తిరిగి రాసిన బృందంలో హూలీ సభ్యుడు. ఒకసారి 600 మైళ్లు పల్లకీ ప్రయాణం చేసి, బోయీలను గమనించాడు. వీళ్లను అతను ‘జెంటూ’లంటాడు. జెంటూలంటే అప్పటి వ్యవహారంలో తెలుగువాళ్లు.
బోయీలు కుండా, చట్టీ వెంట తెచ్చుకున్నారనీ, తమ వంట తామే చేసుకున్నారనీ, తోవ పొడుగునా పాటలు (బహుశా తెలుగులో) పాడారనీ, వీరిలో కులం పట్టింపు కూడా ఉందనీ హూలీ అన్నాడు. టవర్నియర్‌ నాలుగు రూపాయల నెల జీతం ఇచ్చానన్నాడు. ప్రయాణ కాలం 60 రోజులు దాటితే తలకొక్కింటికీ నెలకు అయిదు రూపాయలట. ఇంకో ఫ్రెంచి యాత్రికుడు జాన్‌ థెవనాట్‌, పాతికేళ్ల తరవాత దక్కన్‌ యాత్ర చేశాడు. బోయీలకు నెల జీతం తలకు పది ‘లిరా’లుగా చెప్పాడు. ఇటలీలో 2002 వరకూ అమలులో ఉన్న నాణెం ‘లిరా’. 1704లో ప్రయాణించిన ఛార్లెస్‌ లాకియర్‌ అనే ఇంగ్లిషు యాత్రికుడు నెలకు మూడు పెన్నీలిచ్చానన్నాడు. ఈస్టిండియా కంపెనీ తన అధికారులకిచ్చిన ఉత్తర్వుల్లో బోయీల జీతం నెలకు ఐదు పగోడాలుగా నిర్ధారించింది. 
నిరుపేద బతుకులు
1837లో రెవరెండ్‌ హోవర్డ్‌ మాల్కమ్‌ అనే మిషనరీ కలకత్తా నుంచి మద్రాసు వరకూ పల్లకీలో ప్రయాణం చేశాడు. తాను మొత్తం 14 మంది బోయీలను నియమించుకున్నాననీ, అందరికీ కలిపి మైలు ఒక్కింటికి షిల్లింగు చొప్పున వేతనం ఇచ్చాననీ చెప్పాడు. ఇది చాలా స్వల్ప వేతనమనీ, వంటతో సహా ఖర్చులన్నీ పోగా వారికి మిగిలిన పైకం సగంలోపేననీ అతనే రాశాడు. ఏనుగుల వీరాస్వామయ్య కూడా బోయీలు శ్రమకుతగ్గ ప్రతిఫలం పొందలేకపోతున్నారని చెప్పారు. వీరి జీవన ప్రమాణాలు హీనంగా ఉన్నాయనీ, అంతా నిరుపేదలనీ, నిరంతరం అప్పుల్లోనే ఉన్నారనీ పేర్కొన్నారు. వర్గ సమాజంలో శరీర కష్టం చేసే వాళ్ల స్థితిగతులంత సులభంగా మెరుగుపడవు. ఇతర వృత్తుల్లో ఉంటూనే, తాత్కాలిక ప్రాతిపదిక మీద పల్లకీ మోసేవాళ్లూ ఉన్నారు కానీ, పూర్తికాలం అదే వృత్తిలో కొనసాగిన బోయీలే అధికం.
      రహదారులు అభివృద్ధి చెందడంతో ఇరవయ్యో శతాబ్దం మొదట్లో చక్రాల వాహనాలు సులభంగా నడిచాయి...; ఎడ్లబండీ, గుర్రబ్బండీ, రిక్షాలాంటివి. ఇంతలోనే యంత్రశక్తి- బస్సు, రైలూ, కారూ వచ్చాయి. ఆధునిక నాగరికత సామాజిక మర్యాదల్లో మార్పు తెచ్చింది. ఇరవయ్యో శతాబ్దపు సాంఘిక దృక్పథంలో అంతరాలకు ఆమోదం లేదు. కనీసం బహిరంగంగా మనుషుల మధ్య అంత‌రాలుండటం ఆధునికం కాదు. సోషలిస్టు ఆదర్శాలకు పల్లకీలోని ప్రాథమిక సూత్రం- అదే మనిషిని మనిషి మోయడం అనాగరి కంగానూ, సంస్కార హీనంగానూ కనిపించ డంలో వింత లేదు. అలా ప్రయాణ సాధనంగా పల్లకీ యుగం ముగిసింది.
పల్లకీ అంటే సౌఖ్యం. పల్లకీ అంటే విలాసం; దర్పం; వేడుక. అయినా దాని మూలసూత్రం అనాగరికం. ఉపయోగానికి కాలం చెల్లింది గానీ, తెలుగువాళ్ల అంతరంగంలో సజీవంగానే ఉంది. ఇప్పుడు పల్లకీ శుభానికీ, వైభవానికీ సంకేతం; వేడుకకు ప్రతీక.


వెనక్కి ...

మీ అభిప్రాయం