ఉగాది ఊసులు

  • 1001 Views
  • 1Likes
  • Like
  • Article Share

    కొలనుపాక మురళీధరరావు

  • రామగిరి, నల్లగొండ
  • 9247159203
కొలనుపాక మురళీధరరావు

షడ్రుచుల సమ్మేళనం తెలుగు భాష. సమష్టి భావాల సమాగమం తెలుగు సంస్కృతి. ఆరు రుచుల్లోని అంతరార్థాన్ని జీవితానికి అన్వయించుకుని, షడ్గుణాలకు అతీతంగా తోటి వారితో కలిసి నడవమని ఉద్బోధించేది తెలుగు ఉగాది. మన వారసత్వం ఘనం. మన సంప్రదాయం సమున్నతం. 
తెలుగు వారి తొలి పండుగ ఉగాది. ఈ ఉగాది ‘యుగాది’ అనే సంస్కృత పదానికి వికృతం. యుగానికి ఆది కాబట్టి యుగాది అయింది. ఉగస్య ఆదిః ఉగాదిః 
 ఇప్పుడు జరుగుతున్న కలియుగానికి ఆది... ప్రమాదినామ సంవత్సర చైత్ర శుద్ధ పాఢ్యమి. దాదాపు అయిదు వేల ఏళ్ల నాటి ఆ రోజు శుక్రవారం. సూర్యగ్రహణం,  అమావాస్య. అర్ధరాత్రి అష్టగ్రహ కూటమి మేషరాశి ప్రారంభ బిందువులో కలిసిన ఆ కాలమే మన పంచాంగానికి మూలం. ఆనాడే శ్రీకృష్ణ నిర్యాణం జరిగింది. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎత్తి చైత్ర శుద్ధ పాడ్యమి నాడే సోమకాసురుని సంహరించి వేదాలను రక్షించాడని, అందుకే ఆ రోజు పండుగను జరుపుకుంటున్నట్లు మరో గాథ కూడా ఉంది. 
      ఉగాది నాడు బ్రహ్మ ముహూర్తంలో (ఉదయం 4.30 నుంచి 5.30 గంటల్లోపు) నిద్ర లేచి లేచి అభ్యంగన స్నానం చేయాలి. అంటే, నువ్వుల నూనెతో శరీరాన్ని చక్కగా మర్థించుకుని, గోరువెచ్చని నీటితో ‘గంగేచయుమునేచైవ.. కృష్ణా, కావేరి, తుంగభద్రా పవిత్ర నదీస్నానం కుర్యాత్‌’ అనుకుంటూ స్నానమాచరించాలి. కుంకుమ తిలకధారణ చేసుకోవాలి. నూతన వస్త్రాలను ధరించాలి. శక్తిని బట్టి ఫల, పుష్ప, దీప, ధూప, నైవేద్యాలతో భగవంతుణ్ని ప్రార్థించాలి. ‘నింబకుసుమ భక్షణం’ అంటే వేపపూత పచ్చడిని తీసుకోవాలి. 
      ‘‘శతా యుర్వజ్రదేహయం సర్వ సంపత్కరాయి
సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం’’
వేపపూత రెమ్మలు, లేత మామిడి ముక్కలు, అశోక వృక్షం చిగుళ్లు, కొత్తబెల్లం, కొత్త చింతపండు పులుసు, చెరుకు ముక్కలు, జీలకర్ర, పటికబెల్లం, ఉప్పు, శనగలు, పాలు ఇంకా కొబ్బరి ముక్కలను కలిపి తయారు చేసేదే ఉగాది పచ్చడి. దీన్ని మనం తీసుకోవడమే కాకుండా బంధుమిత్రులకు కూడా పంచిపెడితే సంవత్సర శుభఫలం అందరికీ కలుగుంది. ఈ పచ్చడిని తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. పండుగ వచ్చే సమయానికి రుతువుల్లో మార్పులు చేర్పులకనుగుణంగా మన శరీరానికి అనారోగ్యం కలిగే అవకాశాలుంటాయి. ఉగాది పచ్చడి దాన్ని కొంత వరకూ నివారిస్తుంది.
      ‘‘త్యామష్ణశోకేనరాభీష్ట మధుమాస సమర్భవ
      నిభావిశోకే సంతస్తాం మామశోకం సదాకురు’’
      జీవితంలో శోకాలతో బాధపడుతున్న నేను... ఓ అశోక కలికమా! నిన్ను సేవిస్తున్నాను. వసంత మాసంలో చిగురించే అశోకమా.. నన్ను శోక విముక్తుణ్ని చేయి.. అని అర్థం. అశోకం అంటే శోకాన్ని నివారించేది. 
      ఉగాది పచ్చడిని తీసుకున్నాక పెద్దల ఆశీర్వచనం పొంది, పంచాంగ శ్రవణం చేయాలి. సంవత్సరపు శుభాశుభాలు తెలిపేది పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాలను తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. ఇందులో తిథితో సంపద, వారంతో ఆయుష్షు, నక్షత్రంతో పాపపరిహారం, యోగంతో వ్యాధి నివారణం, కరణంతో కార్యానుకూలం సిద్ధిస్తాయి. పూర్వం, సాయంకాలం దేవాలయ ప్రాంగణంలో పురోహితులు, జ్యోతిష్యుల ద్వారా పంచాంగ శ్రవణం చేసేవారు. వర్షం, కాలపరిస్థితి, ఆదాయ వ్యయాలు తదితర వివరాలను తెలుసుకోవడం ద్వారా మన జీవితాలను సమర్థవంతంగా సాగించుకోవచ్చు. దీపావళి పండుగతో వ్యాపారస్థులు కొత్త పద్దుల పుస్తకాలను ఆరంభిస్తారు. రైతులు, ఇతర వృత్తుల వారు ఉగాది నుంచి తమ లెక్కలు చూసుకుంటూ ఆశలకు పునాది వేసుకుంటారు. తెలుగునాట తెలుగుదనం తరిగిపోతున్న తరుణంలో మన తొలి పండుగ గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం అవసరం.  మనవైన ఆచార వ్యవహారాలు, సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు సాగినప్పుడే... వసుధపై తెలుగు జాతి అస్తిత్వం కొనసాగుతుంది.

* * *


వెనక్కి ...

మీ అభిప్రాయం