వందేళ్ల విజ్ఞాన ప్రకాశం

  • 1266 Views
  • 7Likes
  • Like
  • Article Share

    కూన వెంకటేశ్వర్లు

  • సూర్యాపేట
  • 9963023112
కూన వెంకటేశ్వర్లు

నూరేళ్ల చరిత్ర కలిగిన పొత్తపుగుడి అది. నిజాం నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ప్రజలను సంఘటితం చేసిన ఘనత దానిది. అధిక సంఖ్యాకుల అమ్మభాషకు రాజాదరణ కొరవడిన ఆ కాలంలో కమ్మటి తెలుగులో విజ్ఞాన వీచికలు పంచిందా పుస్తకాలయం. అదే సూర్యాపేటలోని శ్రీఆంధ్ర విజ్ఞాన  ప్రకాశినీ గ్రంథనిలయం. సామాన్యులకు అక్షరాలతో స్నేహం చేయించి, క్రియాశీల ఆలోచనలకు ప్రేరణగా నిలిచిన ఈ గ్రంథాలయం స్ఫూర్తితో ఎదిగివచ్చిన చైతన్యశక్తులెన్నో!
అవి హైదరాబాదు రాజ్యంలో నిజాం దమననీతి నిరాటంకంగా సాగుతున్న ఇరవయ్యో శతాబ్ది తొలి రోజులు. నలుగురు కలిసి మాట్లాడుకోవడానికి లేదు. పత్రికల పేరెత్తితే అధికారుల గొంతులు కరుకవుతాయి. అంతటా నిర్బంధమే. అలాంటి నిశ్శబ్ద నిశీధి వాతావరణంలో మగ్గిపోతున్న జీవితాలకు వెలుగు తెచ్చింది గ్రంథాలయోద్యమం. దీనికి నాంది పలికింది శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం. హైదరాబాదులోని కోఠిలో 1901లో ఇది ఏర్పాటైంది. మరో మూడేళ్లకు హనుమకొండలో రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం స్థాపితమైంది. వీటి స్ఫూర్తితో 1917వ సంవత్సరం విజయదశమి నాడు సూర్యాపేటలో శ్రీఆంధ్రవిజ్ఞాన ప్రకాశినీ గ్రంథనిలయం ఆవిర్భవించింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, గాడిచర్ల హరి సర్వోత్తమరావుల సహకారంతో పువ్వాడ వెంకటప్పయ్య, కోదాటి లక్ష్మీనారాయణ, రామకృష్ణారావు, కన్నెగంటి వీరాచారి, యామా కన్నయ్య, నకిరెకంటి రామలింగయ్యలు చేసిన కృషి ఈ గ్రంథాలయానికి పురుడుపోసింది.  
      నిజాం ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ శ్రీ ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథ నిలయం తరఫున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే వారు. జాతీయ పండగలు, దేశనాయకుల జన్మదినాలను గ్రంథాలయ ఆవరణ పక్కనున్న భువనగిరి లక్ష్మీనారాయణ ఇంట్లో జరిపేవారు. జాతీయ గీతాలాపన, పతాక ఆవిష్కరణలను గోప్యంగా చేసేవారు.  ప్రభుత్వం నిషేధించిన పుస్తకాలను ఒకరికొకరు అందించుకునేవారు. దీపావళి సమయంలో పెద్దలందరూ గ్రంథాలయ భిక్ష పేరుతో విరాళాలు సేకరించేవారు. ఎందరో దాతలు దీనికి పుస్తకాలు అందించేవారు.
ఆటంకాన్ని ఎదుర్కొని..
సమాజంలో విజ్ఞానదీప్తులను దేదీప్యమానం చేస్తూ, ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించే ఉద్దేశంతో నెలకొల్పిన ఈ గ్రంథాలయానికి తొలినాళ్లలోనే పెద్ద ఆటంకం ఎదురైంది. 1921లో నల్గొండ జిల్లా తాలూక్దారు సూర్యాపేట పర్యటనకు వచ్చినప్పుడు దీన్ని సందర్శించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా గ్రంథాలయం ఎలా నడుపుతున్నారని.. మూసివేయాలని హుకుం జారీ చేశారు. విషయం తెలుసుకున్న మాడపాటి అప్పటి హోంశాఖ కార్యదర్శి సర్‌ అక్బర్‌ హైదరీని కలిశారు. గ్రంథాలయాల స్థాపనకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదనే ఉత్తర్వులు ఇప్పించారు. దాంతో శ్రీ ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథ నిలయం ఉనికి పటిష్టమైంది. తెలంగాణలో గ్రంథాలయాల మీద జరిగిన మొట్టమొదటి దాడి.. దాన్ని తిప్పికొడుతూ సాధించిన విజయంగా దీన్ని చెప్పవచ్చు. ఈ ఉత్తర్వులతో 1927 నాటికి వివిధ ప్రాంతాల్లో నూటపది గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి.
      సూర్యాపేటలో వ్యాపారుల ఐక్యతకు బీజం ఈ గ్రంథాలయంలోనే పడింది. ఈ పట్టణం మొదటి నుంచీ వ్యాపార కేంద్రం. నాగపూరు నుంచి దక్షిణ భారతదేశానికి, హైదరాబాదు నుంచి విజయవాడ, ఓడరేవులు, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడలి. ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాల పర్యటనకు వచ్చినప్పుడు భోజన బాధ్యత వర్తకులదే. ఇందుకు కొందరు ఉద్యోగులు డబ్బు చెల్లించేవారు. మరికొందరు నామమాత్రపు రుసుం ఇచ్చేవారు. ఇక ఉద్యోగులు మకాం ఏర్పాటు చేస్తే సర్వం వ్యాపారులే భరించాల్సివచ్చేది. 
      ఈ దోపిడీని ఎదుర్కోవడానికి గ్రంథ నిలయం వ్యవస్థాపకులు, ఉపాధ్యాయుడు పువ్వాడ వెంకటప్పయ్య సహకారంతో యామా అరవయ్య, భోనగిరి శరభయ్య, భోనగిరి లక్ష్మయ్య, మహేంద్రకర్‌ అంబాజీ పెద్దోజీ, లాభిశెట్టి లింగన్నగుప్తాలు 1922 డిసెంబరు 2న వర్తక సంఘం ఏర్పాటుచేశారు. ఈ సంఘం మార్గదర్శకాలు మాడపాటి సహకారంతో ఈ గ్రంథాలయంలోనే రూపుదిద్దుకున్నాయి. ఆ తర్వాత వర్తకులంతా తమ గళాలను సమష్టిగా, బలంగా వినిపించారు. క్రమేణా నిజాం రాజ్యమంతా ఈ సంఘాలు  వ్యాపించాయి.
స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి 
స్త్రీలు విద్యావంతులైనప్పుడే సమాజ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. దీన్ని గుర్తించిన శ్రీ ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథనిలయం స్త్రీ విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేసింది. అలాగే సాంఘిక సంస్కరణ భావాలను ప్రజల్లో వ్యాప్తిచేసే ప్రయత్నం చేసింది. 1923 ఆగస్టు 17, 18 తేదీల్లో సూర్యాపేటలో వర్తక సంఘం, భజన మందిర వార్షిక సభలతోపాటు గ్రంథాలయ తృతీయ వార్షిక సభలను నిర్వహించారు. తొలిరోజు పువ్వాడ వెంకటప్పయ్య వార్తాపత్రికల గురించి, శివానంద మొదలియారు స్త్రీ విద్య గురించి ప్రసంగించారు. అదేరోజు వితంతు వివాహంపై కొమరగిరి సీతారామచంద్రరావు మాట్లాడటం సామాజిక చైతన్యం దిశగా జరిపిన కృషికి నిదర్శనంగా చెప్పవచ్చు. 1927 మే 9, 10, 12 తేదీల్లో సూర్యాపేటలో స్త్రీల సభలు జరిగాయి. పదో తేదీ సాయంత్రం కొమరగిరి సీతారామచంద్రరావు పంతులు అధ్యక్షతన గ్రంథాలయంలో జరిగిన బహిరంగ సభలో స్త్రీ విద్య ఆవశ్యకతను లాభిశెట్టి లింగన్నగుప్తా వివరించారు. కస్తూరిబా గాంధీ, సరోజినీ నాయుడు, ఉన్నవ లక్ష్మీబాయమ్మ తదితరుల స్ఫూర్తి గాథలను తెలియజెప్పారు. ప్రతి శుక్రవారం స్త్రీల సభ నిర్వహించి, వారికి అవసరమైన గ్రంథాలు తెప్పించి బోధించాలని ఆ తర్వాత నిర్ణయించారు. 1970ల నాటికి వచ్చేసరికి మహిళల కోసం ప్రత్యేకంగా పుస్తకాలను రిక్షాలో వాళ్ల ఇళ్లకే పంపే ఏర్పాటు కూడా చేశారు. 
      మే, 1928లో నాలుగో ఆంధ్ర జనసంఘం, రెండో గ్రంథాలయ మహాసభలు సూర్యాపేటలో జరిగాయి. వాటితో పాటు యామా అంజయ్య అధ్యక్షతన వర్తక సంఘం, సురవరం ప్రతాపరెడ్డి నేతృత్వంలో ఆంధ్రవిజ్ఞాన ప్రకాశినీ గ్రంథనిలయ వార్షికోత్సవాలు కూడా నిర్వహించారు. వీటిలో భాగంగా స్త్రీల సభ, ఆంధ్ర యువక, ఆంధ్ర సంఘసంస్కర్త, వైశ్యుల సభలూ ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో ‘‘కొన్ని సంవత్సరాలుగా సూర్యాపేట రాజకీయాలకు గొప్ప కేంద్రమైపోయింది. సభలకు అనుమతి ఇవ్వొద్దు. రాష్ట్రమంతటిలో సూర్యాపేట అపాయకరమైన ప్రాంతం’’ అని స్థానిక పోలీసులు సర్కారుకు నివేదిక ఇచ్చారు. అంతేనా! ఈ సభలు జరగడానికి ఒకరోజు ముందుగానే ఇక్కడ సాయుధ పోలీసులను మోహరించారు. నాటి గ్రంథాలయోద్యమం జనచైతన్యానికి ఎలా తోడ్పడిందో ఈ ఘటనలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సాయుధ పోరాటం పురుడుపోసుకోవడానికి కారణమైన ఆంధ్రమహాసభల ఆవిర్భావం ఈ మహాసభల సందర్భంగానే జరగడం మరో చారిత్రక విశేషం. గ్రంథాలయ ఉద్యమం ఎన్నో పత్రికల ప్రారంభానికి నాందీ పలికింది. నల్లగొండ జిల్లాకు చెందిన ప్రఖ్యాత నీలగిరి పత్రికకు స్ఫూర్తి సూర్యాపేట గ్రంథాలయమేనని అంటారు. 
చైతన్యజ్యోతి
మొదట్లో ఈ గ్రంథాలయాన్ని సూర్యాపేటలోని పాత ధర్మశాలలో నడిపేవారు. తర్వాత ఉపాధ్యాయుడు భువనగిరి రామయ్య ఇంట్లో కొనసాగింది. బూర్గుల రామకృష్ణారావు మంత్రిమండలిలో సహాయ మంత్రిగా పనిచేసిన ఎం.ఎస్‌.రాజలింగం, అప్పటి గ్రంథాలయ అధ్యక్ష కార్యదర్శులు కోదాటి నారాయణరావు, డాక్టర్‌ జి.వి.హెచ్‌.శర్మల కృషితో 1956 మే 22న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన జరిగింది. నూతన భవనాన్ని 1960 ఏప్రిల్‌ 24న మాడపాటి హనుమంతరావు ప్రారంభించారు. 1975లో ప్రథమశ్రేణి గ్రంథాలయంగా ఉన్నతీకరణ పొంది నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ అధీనంలోకి వెళ్లింది. అప్పట్లోనే మహిళా పాఠకుల కోసం ప్రత్యేక గది నిర్మించటం విశేషం. 2007 డిసెంబరు 6న నూతన భవన నిర్మాణానికి గ్రంథాలయ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు యానాల యాదగిరిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి దశరథ ఆధ్వర్యంలో ముందడుగుపడింది. దాతల విరాళాలతో నిర్మించిన నూతన భవనాన్ని 2009 జులై 12న ప్రారంభించారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఈ గ్రంథ నిలయం సూర్యాపేట జిల్లా కేంద్ర గ్రంథాలయమైంది. 
      సూర్యాపేట గ్రంథాలయంతో ఆత్మీయ జ్ఞాపకాలు కలిగినవారెందరో. ముఖ్యంగా ఏ తెలంగాణ సాయుధ పోరాట యోధుడిని కదిపినా ‘మాకు రాజకీయ ఓనమాలు నేర్పింది, మాలో సామాజిక చైతన్యం తెచ్చింది ఈ గ్రంథ నిలయమే’ అంటారు. ‘‘భువనగిరి రామయ్య పంతులు ఇంట్లో చాపలపై కూర్చొని పుస్తకాలు చదువుకున్నాం. మహాభారతం, పోతన భాగవతం, శ్రీకృష్ణదేవరాయల చరిత్ర పుస్తకాలు, గోల్కొండ లాంటి పత్రికలు తిరగేసేవాళ్లం. చీకటయితే చాలు ధర్మభిక్షం, ఎడ్ల గోపయ్య, కటారి నారాయణ, శంభయ్యలు లాంతరు వెలుతురులో రాత్రిబడి (వయోజన విద్య) నిర్వహించేవారు. ఇది రాజకీయాలకతీతంగా నడిచేది. కోదాటి నారాయణరావు, చకిలం తిరుమలరావు, డి.వెంకటేశ్వరరావు గ్రంథాలయ అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారు’’ అంటూ ఈ గ్రంథాలయం సాగించిన విజ్ఞాన కృషిని వివరిస్తారు స్వాతంత్య్ర సమరయోధుడు లక్కరాజు పాండు. ‘‘మాది మోతె మండలం రావిపాడు. సూర్యాపేటకు రోజూ వచ్చి ఈ గ్రంథాలయంతో పాటు పక్కనే ఉన్న ఎన్జీరెడ్డి (నాగిరెడ్డి గోపాల్‌రెడ్డి) పుస్తకశాలలో పత్రికలు, రష్యా, చైనా విప్లవాన్ని అధ్యయనం చేసేవాణ్ని. అప్పుడు మాలాంటి యువకులు చైతన్యవంతం కావడానికి, నిజాంకు వ్యతిరేకంగా పోరాడటానికి ఈ గ్రంథాలయమే స్ఫూర్తినిచ్చింది’’ అంటారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కాకి లక్ష్మారెడ్డి. ‘‘గ్రంథాలయాల విస్తృతికి వట్టికోట ఆళ్వారుస్వామి చాలా కృషి చేశారు. ఆయన ఊరూరా తిరిగి అనేక పుస్తకాలు విక్రయించేవారు. మాడపాటి, కోదాటి, వట్టికోట, ఆవుల పిచ్చయ్యలు ఈ గ్రంథాలయాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. రాచరిక భూస్వామ్యాన్ని ఎదిరించడం గ్రంథాలయోద్యమంతోనే మొదలైంది’’ అంటూ గ్రంథాలయోద్యమ ప్రాధాన్యాన్ని తెలియజేస్తారు మరో సాయుధ పోరాట యోధుడు బొల్లెద్దు వెంకట్రామయ్య. ‘‘మా నాన్న ఎన్జీరెడ్డి పుస్తకశాలలో ఎన్నో గ్రంథాలుండేవి. పక్కనే గ్రంథాలయం ఉండటంతో వారోత్సవాల్లో కవి సమ్మేళనంలో పాల్గొనేదాన్ని. అది నాలో సాహితీ వికాసానికి తోడ్పడింది’’ అంటారు నూతన్‌కల్‌ తహసీల్దారు అరుణజ్యోతి. మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ సమగ్ర సమాచారాన్ని నవ ఉద్యమకారులకు అందించిందీ గ్రంథాలయం. చర్చలు, సదస్సులతో వారిని కార్యోన్ముఖుల్ని చేసింది. సాయుధ పోరాట కాలంలో ఉన్న ఆర్యసమాజ గ్రంథాలయం, ఎన్జీరెడ్డి పుస్తకశాలలు కాలక్రమంలో కనుమరుగయ్యాయి. 
నిర్లక్ష్యమే శాపం..
సూర్యాపేట పొత్తపుగుడిలో మొత్తం 24,543 పుస్తకాలున్నాయి. తెలుగు (19,042), ఉర్దూ (676), ఇంగ్లిష్‌ (3,479), హిందీ (1346) భాషల్లో విలువైన రచనలెన్నో ఇక్కడ కొలువుదీరాయి. కానీ, మౌలిక వసతులు కొరవడటంతో అవన్నీ సంచుల్లో మగ్గుతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఓ 2500 పుస్తకాలను మాత్రం అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయమైనా సరే, ఇక్కడ కంప్యూటరీకరణ జరగలేదు. ఉన్న ఒక్క కంప్యూటర్‌ కూడా వినియోగంలో లేదు. సిబ్బంది కొరతా సరేసరి. చదువుకోవడానికి సరైన బల్లలు కూడా లేవు.
      వంద సంవత్సరాలుగా విజ్ఞాన యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ఈ గ్రంథాలయం భావితరాలకూ అంతే చక్కగా సేవలందించాలంటే పాలకులు నిర్లక్ష్యం వీడాలి. మౌలిక వసతులు కల్పించి అన్ని పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తేవాలి. అలాగే, వాటి డిజిటలీకరణకు నడుం బిగించాలి. ఆ దిశగా అడుగులు పడినప్పుడే గ్రంథాలయ ఘన చరిత్ర మరింత దేదీప్యమవుతుంది. దాని విజ్ఞాన ప్రకాశం విస్తృతమవుతుంది.


శతాబ్ది వైభవం 
సూర్యాపేట గ్రంథాలయం ఆవిర్భవించి 2017 అక్టోబరు 25కు వందేళ్లు పూర్తయ్యాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబరు 21 నుంచి 25 వరకు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్‌, పాటల పోటీలు నిర్వహించారు. కవి సమ్మేళనం కూడా జరిగింది. కార్యక్రమానికి సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, కవి, విమర్శకులు వేణు సంకోజు, ప్రముఖ కవి, చిత్రకారుడు తల్లావఝల శివాజీ తదితరులు హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహించారు. వట్టికోట సేవలకు గుర్తుగా గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి ఆవిష్కరించారు.


గ్రంథాలయ శతాబ్ది ఉత్సవాలను ఏడాదంతా జరుపుతున్నాం. 2018 అక్టోబరు 25న స్మారక సంచిక ఆవిష్కరిస్తాం. ఈ గ్రంథాలయ డిజిటలీకరణకు ప్రణాళికలు రూపొందిస్తాం. డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌ కంప్యూటర్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనుంది.

 - నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు


రోజూ 400 మందికి పైగా పాఠకులు ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తారు. అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నాం. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇటీవల వెల్లడైన పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాల్లో 32 మంది ఉద్యోగాలు దక్కించుకున్నారు. ఇద్దరు ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం గ్రంథాలయానికి 3,231 మంది సభ్యులున్నారు.

- శుక్లాదేవి,గ్రంథాలయ కార్యదర్శి


పాఠకుల అవసరాల రీత్యా నూతన భవన నిర్మాణాన్ని తలపెట్టాం. ఆ ఆలోచనను మా స్నేహితుడు కాణాజీతో చెబితే వెంటనే రూ.యాభైవేలు అందించారు. మీలా సత్యనారాయణ తన మిత్రుడి పేరిట రూ.1.50 లక్షలు ఇచ్చారు. తర్వాత చాలామంది దాతలు ముందుకొచ్చారు. అలా పూర్తయిన భవనాన్ని 2009లో ప్రారంభించాం. దాతల వివరాలు, నిర్మాణ క్రతువుపై ‘సూర్యచంద్రిక’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చాం.

- యానాల యాదగిరిరెడ్డి, గ్రంథాలయ అభివృద్ధి సంఘం మాజీ అధ్యక్షుడు


మాది మద్దిరాల మండలం ముకుందాపురం. 2005లో గ్రంథాలయ సభ్యత్వం తీసుకున్నా. సూర్యాపేటలో గది అద్దెకు తీసుకుని, ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రంథాలయంలోనే ఉండి చదువుకునేవాణ్ని. 2012లో ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యా. నాలాంటి చాలామందికి ఇది చేయూతనిచ్చింది. 

- వనపర్తి రవి, ఎస్సై, కల్వకుర్తి


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  గ్రంథాలయాలు