మా భాషే మా శ్వాస!

  • 783 Views
  • 1Likes
  • Like
  • Article Share

అమ్మభాషను ఆర్థిక కోణంలో చూస్తూ, దాన్ని నేర్చుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అని ప్రశ్నించే స్థితికి వచ్చేసింది తెలుగుజాతి! లాభనష్టాల చిట్టాపద్దుల ఆధారంగా ఓ భాష... అందులోనూ మాతృభాష గొప్పదనాన్ని, దాని ఆవశ్యకతను ఎంచగలమా? లేదు.. అది అసాధ్యం. ఆ విషయాన్ని గుర్తించాయి కాబట్టే ఆంగ్లేతర దేశాలెన్నో తమ తమ సొంతభాషల ద్వారానే అభివృద్ధి సాధించాయి. ప్రపంచీకరణ యుగంలోనూ తమదైన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ముందడుగు వేస్తున్నాయి. అన్నట్టు ఆయా దేశాల పాలకులకూ తమ భాషా సంస్కృతుల మీద ఎంత అభిమానమో! సందర్భం వచ్చినప్పుడల్లా దాన్ని బహిరంగంగా వ్యక్తీకరిస్తుంటారు కూడా. అలా అగ్రదేశాల అధినేతలు వివిధ సందర్భాల్లో చెప్పిన మాటల్లో మనకు స్ఫూర్తిమంత్రాలాంటివి కొన్ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) సందర్భంగా...


ఏం పర్లేదు! ఇంగ్లీషులో తప్పుల్లేకుండా మాట్లాడటానికి నేనేమీ షేక్‌స్పియర్ని కాదు. 

- మారియానో రజోయ్‌, స్పెయిన్‌ ప్రధాని

(రజోయ్‌కు స్పానిష్‌ తప్ప మరో భాష రాదు. ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాతే ఆయన ఆంగ్లం నేర్చుకోవడం ప్రారంభించారు.  ఈ క్రమంలో ఆయన ఎక్కడైనా ఆంగ్లంలో మాట్లాడబోతే తప్పులు దొర్లుతుంటాయి. ఈ విషయం మీద ఆమధ్య ఎవరో విమర్శిస్తే ఆయనేమీ సిగ్గుపడిపోలేదు. నాది కాని భాష కాబట్టే ఈ పరిస్థితి అని చెప్పారు.)


ఇవాళ నేను నా మాతృభాషలో మాట్లాడేందుకు అనుమతించిన మీ అందరికీ ధన్యవాదాలు.

 - ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌లో జర్మనీ ఛాన్స్‌లర్‌ ఎంజెలా మెర్కల్‌

(హిట్లర్‌ కాలంలో యూదులను ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్‌, జర్మన్‌ ప్రజల మధ్య సంబంధాల్లో ఆనాటి నెత్తుటి మరకల పాత్ర ఎక్కువ. ఈ నేపథ్యంలో 2008లో ఏంజెలా ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అత్యున్నత చట్టసభలో ప్రసంగించారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న మొదటి జర్మన్‌ అధినేత ఆవిడే. మరోవైపు జర్మన్‌ భాషను ‘హంతకుల భాష’గా పరిగణిస్తూ... ఆమె తమ దగ్గరికి వచ్చినప్పుడు ఆ భాషలో మాట్లాడకూడదని ఇజ్రాయిలీ ఎంపీలు కొంతమంది పట్టుబట్టారు! కానీ, తన భావవక్తీకరణ మాతృభాషలోనైతేనే ప్రభావవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఏంజెలా జర్మన్‌ భాషలోనే ప్రసంగించారు. ఆనాటి అకృత్యాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు నివాళి అర్పించారు.) 


థియోడర్‌ హెర్జ్‌ మా ఆధునిక మోజస్‌. ఆయన కల నిజమైంది. మేం మా స్వస్థలానికి తిరిగి వచ్చాం. మా భాషను పునరుద్ధరించుకున్నాం. దేశభ్రష్టులమైన వాళ్లమందరం కలిశాం. ఆధునిక, అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్నాం.

- బెంజిమిన్‌ నెతన్యాహూ, ఇజ్రాయిల్‌ ప్రధాని


తన మాతృభాష కాని భాషను నేర్చుకుని తీరాల్సిందేనని ఎవరినీ బలవంతపెట్టలేం. మన భాషని కాపాడుకోవడం అంటే మన ఉనికిని పరిరక్షించుకోవడమే. మనదైన విలక్షణ వ్యక్తిత్వం, సాంప్రదాయాలు మన భాషతోనే ముడిపడి ఉంటాయి. అయితే ప్రస్తుత కాలపు భాషావాతావరణాన్ని ఎక్కువగా నియంత్రిస్తోంది ప్రసార మాధ్యమాలే! ఇవి భాషకు సంబంధించిన ప్రాథమిక వ్యాకరణ సూత్రాలను తరచుగా ఉల్లంఘిస్తుంటాయి. ఇతర భాషల నుంచి అరువుతెచ్చిన పదాలను విరివిగా  ఉపయోగిస్తుంటాయి. అలాంటి అవసరమేదీ లేకపోయినా సరే! కాబట్టి మన రష్యన్‌ భాషా స్వచ్ఛతను మనమే కాపాడుకోవాలి. అంతర్జాలం, టీవీల్లో వాడే అన్యభాషా పదాలను వీలైనంత త్వరగా, సంపూర్ణంగా పరిహరించాలి.  

- వ్లాదిమిర్‌ పుతిన్‌, రష్యా అధ్యక్షుడు


సంప్రదాయ చైనీస్‌ భావజాలం, సంస్కృతుల అవిచ్ఛిన్నత, ఉదాత్తీకరణే నేటి చైనా భావజాలం, సంస్కృతి. ఇవాళ్టి చైనాను అర్థం చేసుకోవాలంటే, చైనీస్‌ను తెలుసుకోవాలంటే ఎవరైనా సరే, తరతరాల చైనీస్‌ సాంస్కృతిక వారసత్వంతో మమేకం కావాల్సిందే. చైనీయులను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఈ సాంస్కృతిక హలభూతిని అభినందించాల్సిందే.  

- జి జినిపింగ్‌, చైనా అధ్యక్షుడు


విదేశాల్లో ఉన్న కొరియన్‌ సహోదరులందరికీ ఓ హామీ ఇస్తున్నా. మీ వారసులు కొరియన్లుగా తమదైన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి  అవసరమైన సాయం చేస్తాం. కొరియన్‌ భాష, సంస్కృతి, చరిత్రలను అధ్యయనం చేయడానికి ఆయా దేశాల్లో ఇప్పటికే వృవస్థీకృత విద్యావసతులు ఉన్నాయి. వాటికి అదనంగా మీ పిల్లలను ఇక్కడికి ఆహ్వానించి శిక్షణ ఇప్పించడం, ఉపకార వేతనాలు మంజూరు చేయడం తదితరాలకు ప్రాధాన్యమిస్తాం. 

- మూన్‌ జే ఇన్‌, దక్షిణకొరియా అధ్యక్షుడు 


భాష అంటే మనం కాపాడుకుని తీరాల్సిన వారసత్వ సంపదే కాదు, మన భవిష్యత్తు కూడా. ఫ్రెంచి భాషకు ఉన్న ఆకర్షణాశక్తి, దాని ప్రభ ఫ్రాన్స్‌కు మాత్రమే పరిమితం కాబోదు. దాని వెలుగులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయి. విశ్వభాషల్లో అగ్రగామిగా ఫ్రెంచి ఎదుగుతుంది.

 - ఇమానుయల్‌ మాక్రాన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు


జాతి సంస్కృతి, జాతిజనుల జీవిత విధానాలను ప్రతిబింబించే ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ప్రతి దేశంలోనూ, మతంలోనూ ఉంటాయి. అవి ఆ జాతి పూర్వికుల నుంచి అందిన వారసత్వ సంపదలు. నా దృష్టిలో అవి చాలా గౌరవప్రదమైనవి.

 - షింజో అబె, జపాన్‌ ప్రధాని  


వెనక్కి ...

మీ అభిప్రాయం