మాటేమంత్రం

  • 1486 Views
  • 1Likes
  • Like
  • Article Share

    ఆదరాసుపల్లి గిరిధర్‌

  • హైదరాబాదు
  • 9491331453
ఆదరాసుపల్లి గిరిధర్‌

చక్కని వచోరీతి వ్యక్తిత్వానికి సమగ్రతను ప్రసాదిస్తుంది. వచస్సు లేని తపస్సు పరిమితం. వచస్సున్న వాని తపస్సు అపరిమితం. వక్తృత్వ కళారాధనం అక్షరాస్యులకు లక్ష్యం కావాలి. సంస్కృతి పరిరక్షణకు పునాది కావాలి. నిద్రాణమైన మనశ్శక్తి జాగృతం కావాలంటే వక్తృత్వ కళోపాసనం ఒక సాధనం. చక్కగా సంభాషించడం, మనోజ్ఞంగా సంభాషించడం, ఇతరుల మనసులకు హాయి కలిగేటట్టు సంభాషించడం, బర్బరత్వం, అజ్ఞానం, దారిద్య్రం రూపుమాసిపోయేటట్టు సంభాషించడం బుద్ధిమంతుని లక్షణం. పెద్దమనిషి లక్షణం. దేశభక్తుని లక్షణం.

- డా।। ఇరివెంటి కృష్ణమూర్తి

‘‘అల్పాక్షరములందు అనల్పార్థ రచన/ కల్పించుటయ కాదె కవి వివేకంబు’’ అన్న పాల్కురికి సోమన మాటలకు అక్షర రూపం లాంటిది ‘వాగ్భూషణం భూషణం’ పుస్తకం. డా।। ఇరివెంటి కృష్ణమూర్తి రచించిన ఈ పొత్తమంతా కలిపి 21 పుటలే! అయితేనేం.. సభాకంపంతో కంపించిపోయే వారికి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. వక్తలుగా రాణించాలనుకునే వ్యక్తులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. 
      ‘‘ఇరివెంటి వ్యుత్పత్తి అత్యంత విస్తృతం. సమకాలీన కవిపండితులకు అందని అనేకాంశాలు ఆయన కొననాల్క మీద గునగున పరుగుతీస్తాయి’’ అంటూ తన ‘సహవ్రతుడు’ కృష్ణమూర్తి గురించి చెప్పారు సినారె. 120కి పైగా పుస్తకాల ప్రచురణ, సాహిత్యసభలు, యువతకు శిక్షణ శిబిరాలతో సాహితీ రంగానికి విశేష సేవలందించిన ‘యువభారతి’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఇరివెంటి. తెలంగాణ తొలితరం కథకుడిగా కూడా ఆయన సుప్రసిద్ధులు. ‘వెలుగుచూపే తెలుగు పద్యాలు’ నుంచి ‘కవిసమయాలు’ వరకూ వివిధ రచనలూ వెలువరించారు. ‘‘నా నృగ్వేదవినీతస్య నా యజుర్వేద ధారిణః’’ అంటూ హనుమంతుడి సంభాషణా నైపుణ్యాన్ని వర్ణించిన వాల్మీకి మహితోక్తులకు వ్యాఖ్యానంగా ‘వాగ్భూషణం భూషణం’ పుస్తకం వెలువరించారాయన. ‘యువభారతి’ ప్రచురణగా 1983లో మొదటిసారి ఈ పొత్తం ప్రచురితమైంది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ దీన్ని పునర్ముద్రించింది. 
మాట బాగుంటేనే...
మాట లేకుంటే చోటే లేదన్నది ఓ సామెత. ఆ చోటన్నది ఊళ్లో అయినా.. ఎదుటివాళ్ల గుండెల్లోనైనా! మనిషి సంగతి చెప్పేది మాటే. ఉపాధ్యాయుల నుంచి రాజకీయ నాయకుల వరకూ, సాహితీ ఉపన్యాసకుల నుంచి కార్పొరేట్‌ బృందనాయకుల వరకూ ఏ రంగంలోనివారైనా సరే, గెలవాలంటే ప్రసంగ కళ మీద పట్టు సాధించాల్సిందే. ‘వాగ్భూషణం భూషణం’లో కృష్ణమూర్తి ఈ విషయాన్నే చెబుతూ ‘‘ఎవని మాటలు ముత్యాల మూటలో, ఎవని మాటలు వినేవాళ్లను ఆకట్టుకుంటాయో, ఎవడు తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని అందివ్వగలుగుతాడో అతడు సంఘంలో ఏ రంగంలోనైనా రాణించగలుగుతాడు’’ అంటారు. స్పష్టత లేని భాష వల్ల ప్రయోజనం ఉండదు. సుందర పదజాలం, సముచిత హావభావ ప్రకటన మాట విలువను పెంచుతాయన్నది ఆయన సూచన. 
      ప్రసంగాలకు ఎలా సన్నద్ధమవ్వాలన్న దగ్గర నుంచి శ్రోతల మనసులను రంజింపజేసేలా ఉపన్యసించే శక్తిని అలవర్చుకోవడం వరకూ వివిధ అంశాలను ఈ పుస్తకంలో వివరించారు రచయిత. ఇందులో విషయాన్ని సంక్షిప్తంగా, సూటిగా, ఆసక్తికరంగా చెప్పిన ఇరివెంటి శైలి ఎంతోమందిని ప్రభావితులను చేసింది. వాళ్లు మంచి వక్తలుగా ఎదిగేందుకు దోహదపడింది. ‘వాగ్భూషణం భూషణం’ స్ఫూర్తితో ‘మాట’ మీద అధికారం సాధించిన వాళ్లలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకరు. ఆయన సూచనతోనే ఈ పొత్తాన్ని మహాసభల్లో ప్రతినిధులకు అందించిన ఉచిత సాహితీ సామగ్రి(కిట్‌)లో చేర్చారు నిర్వాహకులు. మనిషికి నిజమైన అలంకారం వాక్కేనన్న విషయాన్ని ప్రబోధాత్మకంగా వివరించే ఈ పుస్తకం.. వయోభేదాలకు అతీతంగా అందరికీ నేస్తమే!


వెనక్కి ...

మీ అభిప్రాయం