ఆధ్యాత్మిక గ్రంథ రచనా సారథి 

  • 305 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చందలూరి నారాయణరావు

  • అద్దంకి

ఆధ్యాత్మిక గ్రంథ రచనలో మేటి దేవులపల్లి చెంచుసుబ్బయ్య. దేవతా స్తోత్రాలు, వేదానువాదాలు, పురాణ కావ్యాలు, సుప్రభాతాలు, పద్య, గేయ, వచన కవితలు, సామాజిక స్పృహ కలిగిన రచనలు ఆయన కలం నుంచి జాలువారాయి. రాయలసీమ కవిరత్నంగా ప్రసిద్ధి చెందిన చెంచుసుబ్బయ్య ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో 1949 ఫిబ్రవరి 25న లక్ష్మీనరసమ్మ, వెంకయ్యశర్మ దంపతులకు జన్మించారు. ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కర్నూలు కేవీఆర్‌ ప్రభుత్వ మహిళా కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. గోపికానంద గోవిందం, రాధామాధవీయం, రేనాటి వీరభారతం తదితర 35 కావ్యాలు రచించారు. ఆయన రచించిన వివిధ దేవతా సుప్రభాతాలు సీడీల రూపంలో విడుదలయ్యాయి. మహాత్మాగాంధీ సుప్రభాతాన్ని సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు. చెంచుసుబ్బయ్య రచించిన శ్రీమద్రామాయణ కథా సుధాలహరి, శ్రీమదాంధ్ర సౌందర్యలహరిలను పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో డిజిటలీకరణ చేసి అంతర్జాలంలో అందుబాటులో ఉంచారు. ఆయన రచలనపై పరిశోధనలు కూడా జరిగాయి. రచయితగానే కాకుండా వక్తగా, ఉత్తమ వ్యాఖ్యాతగా కూడా ఆయన సుప్రసిద్ధులు. ఈటీవీ, సప్తగిరి ఛానళ్లలో ఆయన ప్రసంగాలెన్నో ప్రసారమయ్యాయి. కడప, కర్నూలు, విజయవాడ, హైదరాబాదు రేడియో కేంద్రాల నుంచి రెండొందలకుపైగా ప్రసంగాలు వచ్చాయి. రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ, ఉత్తమ అధ్యాపక పురస్కారాలు అందుకున్నారు. భువనవిజయం నాటకంలో కవిగా నటించి సన్మానం పొందారు. కవికిశోర, భక్తకవిరత్న, మధురకవి, ఆర్ష విద్యావిభూషణ అనే బిరుదులు ఆయన సాహితీ ప్రతిభకు నిదర్శనాలు. ఏడుపదుల వయసులోనూ అలుపెరగని ఉత్సాహంతో రచనా వ్యాసంగం కొనసాగించిన చెంచుసుబ్బయ్య జనవరి 9న తుదిశ్వాస విడిచారు. 

- ఎస్‌.కాసింసాహెబ్‌, నంద్యాల
 


వెనక్కి ...

మీ అభిప్రాయం