ఉస్మానియాకు ‘వంద’నం

  • 900 Views
  • 0Likes
  • Like
  • Article Share

    భూక్యా వెంకన్న

  • హైదరాబాదు
  • 709398159
భూక్యా వెంకన్న

తెలుగునాడును మేధోసమాజంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది సంబరాల సమయమిది. స్థానికభాషల్లో విద్యాబోధనకు పట్టంకట్టిన మహోన్నత స్ఫూర్తికేంద్రమిది. ఉన్నత విద్యారంగంలో ఎన్నో విశిష్టతలకు పుట్టినిల్లు ఇది. ఎన్నెన్నో సామాజిక ఉద్యమాలకు చోదకశక్తిగా నిలిచిన ఘనచరితా ఉస్మానియాకు సొంతం!
కొన్ని ఆలోచనలు చరిత్రను మలుపు తిప్పుతాయి. కొన్ని నిర్ణయాలు కొత్త చరిత్రకు పునాదిరాళ్లవుతాయి. 1917, ఏప్రిల్‌ 26న ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ జారీ చేసిన ఫర్మానా కూడా ఇలాంటిదే. ‘ప్రాచీన, ఆధునిక విజ్ఞానాలను సమ్మిళితం చేసి ఓ కొత్త విద్యావ్యవస్థను నెలకొల్పాలి. నైతిక శిక్షణపై దృష్టిపెట్టి విద్యార్థిలోకాన్ని దిద్దితీర్చాలి. వాళ్లను ఆధునిక శాస్త్ర పరిశోధనల వైపు నడిపించాలి’... ఉర్దూ బోధనా భాషగా ఉస్మానియా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటుచేస్తూ నిజాం ఇచ్చిన ఆ ఫర్మానా సారాంశమిది. నాటి హైదరాబాదు ప్రభుత్వ ఉన్నతోద్యోగి అక్బర్‌ హైదరీ చొరవతో జారీ అయిన ఈ ఉత్తర్వు... ఆనాటి కాలమాన పరిస్థితుల్లో ఓ విప్లవాత్మక ముందడుగు. ‘‘విదేశీ భాషా సంకెళ్ల నుంచి మన విద్యారంగం విముక్తమయ్యే ఈరోజు కోసమే నేను ఎదురు చూస్తున్నా. విశ్వవిద్యాలయంలో బోధనకు ఉర్దూ మాధ్యమాన్ని ఎంచుకున్న మీ నిర్ణయం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని అభినందిస్తూ విశ్వకవి రవీంద్రుడు సైతం నిజాంకు లేఖ రాశారు.  
      ‘‘భారతీయ ఉన్నతవిద్యారంగం రెండో దశలోకి విస్తరిస్తున్న సందర్భంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్‌ల మేధోపరమైన అభివృద్ధికి ఈ విశ్వ విద్యాలయం చాలా దోహదపడింది. భారతీయ భాషలో పాఠాలు చెప్పిన తొలి విశ్వవిద్యాలయం ఇదే’’ అన్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాటలు అక్షరసత్యాలు. శాస్త్ర, సాంకేతిక, వైద్యవిద్యా బోధన కోసం అవసరమైన పుస్తకాల్ని సమకూర్చుకోవడానికి ఉస్మానియా వ్యవస్థాపకులు నాడే ఓ ప్రత్యేక అనువాద విభాగాన్ని ఏర్పాటుచేశారు. 1919- 1951 సంవత్సరాల మధ్య ఈ విభాగం దాదాపు 500 ప్రామాణిక గ్రంథాలను వివిధ భాషల్లోంచి ఉర్దూలోకి అనువదించింది. ఆధునిక భారత విద్యారంగ చరిత్రలో ఇదో అరుదైన సందర్భం. తెలుగులో ఉన్నత విద్యను అందించాలంటే పదసంపద చాలదంటూ వ్యాఖ్యానాలు చేసేవాళ్లందరికీ ఉస్మానియా ప్రయోగమే ఓ సమాధానం.  
అదో చారిత్రక నిర్మాణం
ఆగస్టు 28, 1919న ఆబిద్స్‌ గన్‌ఫౌండ్రీ దగ్గర తాత్కాలిక భవనాల్లో ఇంటర్మీడియెట్‌ తరగతుల బోధనతో ఉస్మానియా తొలిఅడుగు వేసింది. 1921లో బియ్యే, 1923లో ఎమ్మే, ఎల్‌ఎల్‌బీ, 1927లో మెడిసిన్‌, 1929లో ఇంజనీరింగ్‌ కోర్సులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఏకరూప దుస్తులుగా నలుపు, నీలం రంగు షేర్వాణీలు ధరించేవారు. 225 మందితో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు 83 దేశాలకు చెందిన విద్యార్థులున్నారు. విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం నాటి నగరానికి దాదాపు మూడు మైళ్ల దూరంలోని ఆరు గ్రామాల పరిధిలో 2300 ఎకరాల స్థలాన్ని ఎంపికచేశారు. జులై 5, 1923న ఆర్ట్స్‌ కళాశాల నిర్మాణానికి నాందిపలికారు. విశ్వ విద్యాలయాన్ని 1934లో ప్రస్తుత అడిక్‌మెట్‌ ఆవరణంలోకి తరలించారు. దాదాపు రూ.36 లక్షలతో ఆర్ట్స్‌ కళాశాల నిర్మాణం పూర్తయ్యింది. డిసెంబరు 4, 1939న దీనికి ప్రారంభోత్సవం జరిగింది. 
      రెండంతస్తుల ఆర్ట్స్‌ కళాశాల భవనం మొదటి అంతస్తులో అజంతా, ఎల్లోరా గుహల శైలుల్లో అష్టముఖ స్తంభాల వరసలు కనపడతాయి. ఇవి బౌద్ధ, జైన నిర్మాణాలను, రెండో అంతస్తులోని స్తంభాలు, కమాన్లు ఇస్లాం సంప్రదాయాలనూ సూచిస్తాయి. అందమైన ఈ కళాశాల భవనం ఇండో సార్సెనిక్‌ నిర్మాణశైలికి ఓ మచ్చుతునక. ప్రారంభంలో విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలూ ఈ కళాశాలలోనే ఉండేవి. ఆ తర్వాత వాటికి ప్రత్యేక భవనాలు నిర్మితమయ్యాయి. ప్రస్తుతం ఆర్ట్స్‌ కళాశాలలో ఆర్ట్స్‌, సోషల్‌సైన్స్‌ విభాగాలకు చెందిన 26 కోర్సుల తరగతులు నడుస్తున్నాయి. వీటిలో తెలుగు, తమిళం, కన్నడం, మరాఠీ, ఆంగ్లం,  రష్యన్‌, జర్మన్‌, ఫ్రెంచి, అరబిక్‌, పర్షియన్‌ తదితర భాషల కోర్సులూ ఉన్నాయి. హైదరాబాదు సంస్థానం భారత దేశంలో విలీనమయ్యాక, ఉర్దూ స్థానంలో బోధనాభాషగా ఆంగ్లం వచ్చి చేరింది! 
      ఉస్మానియా భవన సముదాయంలోని ప్రతి ఇటుకా ఓ వారసత్వ సంపదే. ఆర్ట్స్‌ కళాశాలలోని 57వ నంబరు గది లాంటివి అయితే ఎన్నెన్నో కీలక ఘట్టాలకు మౌనసాక్ష్యాలు. ఈ గది రాజకీయ, సామాజిక, శాస్త్ర సాంకేతిక చర్చలకు కేంద్రస్థానం. ఆర్ట్స్‌ కళాశాలను ప్రారంభించిన నిజాం కూడా ఈ గదిలోనే సమావేశం నిర్వహించారన్నది పెద్దల మాట. దేశంలో అత్యవసర పరిస్థితికి ముందు జయప్రకాశ్‌నారాయణ ఈ గదిలోనే విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జార్జి ఫెర్నాండెజ్‌, డా।। కరణ్‌సింగ్‌, పీలూమోడీ (స్వతంత్ర పార్టీ నాయకుడు, ఎంపీ) తదితరులు ఈ గదిలో సమావేశాలు నిర్వహించారు. 
సృజనశక్తులకు ఆలవాలం
వందేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం... విభిన్న రంగాలను తేజోవంతం చేసింది. తెలుగు సాహిత్యానికి ‘అంపశయ్య’ లాంటి రచనలను అందించింది. ఈ విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నప్పుడే నవీన్‌ ఈ నవలను రచించారు. తెలంగాణ తొలితరం కథకులు భాస్కరభట్ల కృష్ణారావు ‘యుగసంధి’ నవలలోనూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విశేషాలు కనిపిస్తాయి. ఇక ఇక్కడి నుంచి ఎంతమంది కవులు, రచయితలు ఎదిగివచ్చారో! విశ్వవిద్యాలయ ఆవరణలో ఉదయం నడకకు వచ్చే కాళోజీ లాంటి సాహితీమూర్తులతో మాట్లాడుతూ ఉస్మానియా విద్యార్థికవులు తమను తాము తీర్చిదిద్దుకునేవారు. ఏప్రిల్‌ 7, 1970న ప్రత్యేకంగా ‘ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి రచయితల సంఘమే’ ఏర్పాటైంది. మరుసటి సంవత్సరం ఏప్రిల్‌ 25న సంఘం మొదటి వార్షికోత్సవ సంచిక ‘జ్యోత్స్న’ విడుదలైంది. ప్రముఖ కవి ఓలేటి పార్వతీశం కుమారుడు శశాంక (ఓలేటి సుబ్బారావు) అప్పట్లో ఈ సంఘం అధ్యక్షుడు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కవిసమ్మేళనాలు నిర్వహించడం దగ్గర నుంచి సృజనాత్మక రచనల దిశగా ప్రోత్సహించడం వరకూ ఈ సంఘం మంచి కృషిచేసింది. 
      ఉస్మానియా విద్యార్థి... పాఠ్య పుస్తకాలతో పాటు సమాజాన్నీ చదువుతాడు. స్పందిస్తాడు. అవసరమైతే తానే ఓ ఉద్యమశక్తిగా మారతాడు. నాటి వందేమాతర ఉద్యమం నుంచి నిన్నటి మలిదశ తెలంగాణ పోరాటం వరకూ ఈ విషయంలో అనేకసార్లు నిరూపితమైంది. 1938లో నాటి నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పీవీ నరసింహారావు, రామచంద్రరావు తదితరులు ఆలపించిన వందేమాతర గీతం... స్థానికంగా జాతీయోద్యమానికి ప్రేరణగా నిలిచింది. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ఇక్కడి విద్యార్థులు   ఉద్యమ చుక్కానులై నిలిచారు. ఇక తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లోనైతే వీళ్లదే కీలకపాత్ర. ‘ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా... వీర తెలంగాణమా’ అని కవులు గానం చేసేంతగా ఉద్యమజెండాలను రెపరెపలాడించిందీ విద్యార్థిలోకం. ఆరుట్ల రామచంద్రారెడ్డి, మాడపాటి రామచంద్రరావు, మాదిరాజు లక్ష్మీనరసింహారావు, కొత్తపల్లి జయశంకర్‌, హయగ్రీవాచారి, చెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, ప్రముఖ చిత్ర దర్శకుడు శ్యామ్‌బెనగల్‌, రిజర్వ్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి, అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈవో శాంతను ముఖర్జీ, గద్దర్‌... ఇలా ఉస్మానియా పూర్వవిద్యార్థుల్లో విభిన్న రంగాల ప్రముఖులు కోకొల్లలు.
ఎన్నెన్నో ప్రత్యేకతలు
* తెలుగునాట తొలి విశ్వవిద్యాలయం ఉస్మానియా. దేశం మొత్తమ్మీద ఏడో ప్రాచీన విశ్వవిద్యాలయం.   
* పుణె విశ్వవిద్యాలయం తర్వాత దేశంలో అత్యధిక సంఖ్యలో విదేశీ విద్యార్థుల చదువుతున్న విశ్వవిద్యాలయమిదే. ప్రస్తుతం ఇక్కడ నాలుగ వేల మంది విదేశీ విద్యార్థులున్నారు.  
* విశ్వవిద్యాలయ పరిధిలో ఎనిమిది క్యాంపస్‌ కళాశాలలు, అయిదు అనుబంధ కళాశాలలతో పాటు జిల్లాల్లో పీజీ కేంద్రాలు, 410 డిగ్రీ కళాశాలు ఉన్నాయి.
* న్యాక్‌ ‘ఎ’ గ్రేడ్‌ను సాధించిన తొలి రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయం ఇదే.  
* విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు 47 గౌరవ డాక్టరేట్లు అందించింది. నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్‌, అంబేడ్కర్‌, రవీంద్రనాథ్‌ టాగోర్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, బూర్గుల రామకృష్ణారావు, మన్మోహన్‌సింగ్‌, యాసర్‌ అరాఫత్‌ తదితరులకు వీటిని ప్రదానం చేసింది.
* దేశంలో తొలిసారి సాయంకాలం కోర్సు ఇక్కడే ప్రారంభమైంది. పాత్రికేయ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీని మొదటిసారి అందించిందీ ఈ సంస్థే.
విద్య, పరిశోధన రంగాల్లో మేటి
ఆసియాలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం ఉస్మానియా. ఇక్కడి మౌలిక వసతులూ ఆ స్థాయిలోనే ఉంటాయి. దాదాపు అయిదున్నర లక్షల పుస్తకాల గ్రంథాలయం ఉంది. ఇక్కడ ఒకేసారి పదిహేను వందల మంది చదువుకోవచ్చు. పుస్తకాలతో పాటు 6825 తాళపత్రాలు, 11,486 పరిశోధన పత్రాలూ అందుబాటులో ఉన్నాయి. పరిశోధక విద్యార్థుల కోసం ఐక్యరాజ్యసమితి కేంద్రాన్నీ ఏర్పాటు చేశారు. దాంతో సమితిలో ప్రచురించే అన్ని రకాల గ్రంథాలనూ ఇక్కడ భద్రపరుస్తారు. అలాగే, అప్పట్లో నగరానికి దాదాపు 35 మైళ్ల దూరంలో రంగాపూర్‌ దగ్గర 48 అంగుళాల రిఫ్లైక్టింగ్‌ టెలిస్కోపును ఏర్పాటు చేశారు. ఆనాడు ఆగ్నేసియా దేశాల్లోనే అతిపెద్ద టెలిస్కోపు ఇది. దీని సాయంతో అంతరిక్ష పరిశోధనలు జరిగేవి. అలాగే, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చి ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాలకోసం విశ్వవిద్యాలయంలో ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. సాంఘికశాస్త్రంలో పరిశోధనలు చేసే దక్షిణభారత విద్యార్థులందరికీ ఇది సాయపడుతోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించిన పట్టణ పర్యావరణ ప్రాంతీయ అధ్యయన కేంద్రం (ఆర్‌క్యూస్‌) పదకొండు రాష్ట్రాలకు సేవలందిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులకు శిక్షణివ్వడంతో పాటు పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాల్లో ఈ కేంద్రం పరిశోధనలు నిర్వహిస్తూంటుంది.  
      వందేళ్ల ఉస్మానియా చరిత్ర సమస్తం ఉజ్వల ఘట్టాల సంపద్వంతం. తెలుగు నాట విద్యారంగం నుంచి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల వరకూ ఉస్మానియా ప్రభావం అమేయం. నిరంతర చైతన్యశీలమైన విశ్వవిద్యాలయ ప్రస్థానం భావితరాలనూ వెలుగుబాటలో నడిపిస్తుందన్నది సత్యం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం