వచ్చెను కనవే ఆమని

  • 1369 Views
  • 3Likes
  • Like
  • Article Share

    సత్యభావన

  • హైదరాబాదు,
  • 9848036760
సత్యభావన

నవనవోన్మేషమైన నడకలతో నవవసంతం వచ్చింది. ఆరు రుతువుల కాలచక్రంలో తొలి రుతువు వసంతంలో, తొలుత వచ్చే చైత్ర మాసపు పాడ్యమి ఘడియల్లో, ఉషోదయపు కాంతితో నడిచి వచ్చే సంవత్సరారంభ సంరంభమే ఉగాది. అందుకే ‘‘ఉగాది అదిగో అరుదెంచే - జగాన శోభలు వ్యాపించే’’ అన్నారు గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ. అంతేనా, ఆ కొత్త సంవత్సరం తనతో తెచ్చే, ‘‘ఉగాది పచ్చడి, చేదు తీపులు జీవన సత్యాన్నెరిగించే’’ అని జీవన మాధుర్యంలోని రుచుల గురించి చక్కగా సెలవిచ్చారు. 
      నిజమే మరి, ఉగాది పర్వదినం ప్రకృతితో మమేకమైన పండగ. అందుకేనేమో, ఉగాది రాకను పంచాంగం కన్నా ముందే పూలరెమ్మలు, కోయిలమ్మలు, నిండు కొమ్మలు, గండు తుమ్మెదలు ఎలుగెత్తి చాటుతాయి. ప్రకృతి కాంతలోని పులకింతలను, వనమంతటా కలిగే గిలిగింతలు అచ్చంగా పొదువుకున్నదే ఈ వసంత రుతువు. అందుకే దీన్ని వర్ణిస్తూ తమ అక్షరాల్లో మధుమాస సుధల్ని ఒలికించని కవులు అరుదు. 
      భారతావనిలోని పండగలు కేవలం వేడుకలు కావు. ప్రకృతి ధర్మాన్ని, అందుకు అనుగుణంగా సాగాల్సిన మానవుడి ధార్మిక విలువలని వివరించే పర్వదినాలు. ముఖ్యంగా తెలుగువారి జీవితాల్లో వచ్చే పండగలు ఎన్నున్నా, వాటి గురించిన ఆటపాటలు సరదాలు ఎంత వర్ణించినా, ఈ ఉగాదిని మాత్రం ఎక్కువగా ‘ప్రేయసితో, పరువం’తోనే పోల్చారు కవులు. అందుకే ‘‘ప్రేయసి నవ్వే ఆశీస్సు - ప్రేమకు పోసే ఆయుష్షు - ఉగాదిలా సాగే వయస్సు’’ అంటూ వలపు సోయ గాలను వసంత రుతువున వచ్చే ఉగాదితో జతకూర్చి సాగింది చంద్రబోసు పాట. 
ఉగాది పండగ వేళ వనరాణిలో వెలిగే కళలన్నింటినీ, మావిచిగురును, కోకిల కబురును, మల్లియ గుబురును, గ్రీష్మపు గాలి తెమ్మెరను మొత్తంగా ఆమని రుతువును అతి సుందరంగా, సుమనోహరంగా వర్ణించారు మన సినీగేయ రచయితలు. ఉగాది అంటే పంచవన్నెల ప్రకృతిపై కవిత్వం, పరమాన్నాన్ని తలదన్నే షడ్రుచుల పచ్చడి, పరుగెత్తే కాలం తనతోపాటు మోసుకొచ్చే పంచాంగపు వైభవం... ఇలా చాలా ఉన్నాయి. కానీ, వాటన్నింటి కంటే వసంత శోభను వర్ణించే పాటలు, ఆమని తోడ్కొని వచ్చే వలపు గీతాలు, మల్లెపూల మంటలు రగిలించే విరహ గీతాలే మిన్నగా సినీ కవులు, ఈ రుతువు చుట్టూ తమ పదబంధాల్ని, అల్లిబిల్లి కలల్ని అల్లి పులకించారు- పాటల్లో పలికించారు.
      ‘‘తీయని ఊహలు హాయిగ రేగే వసంత గానమే హాయి - వసంత నాట్యమే హాయ్‌ హాయ్‌...’’ అంటూ ‘పాతాళభైరవి’ చిత్రం కోసం పింగళి నాగేంద్రరావు రాసిన పాటలోని హాయిని అనుభవించని కన్నెవయసు అప్పట్లో లేనే లేదు. ఈ పాటనే ప్రేరణగా తీసుకుని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన ‘భైరవద్వీపం’ చిత్రానికి గేయ రచయితగా మారి, వలపు సుధలు కురిపించిన పాట కూడా ఈ వసంత గీతమే. ‘‘విరిసినదీ వసంతగానం వలపుల పల్లవిగా...’’ అంటూ పల్లవి ఎత్తుకుని ‘‘రుతువు మహిమేమో విరి తేనె, జడివానై కురిసె తీయగా’’ అంటూ ఆ వసంతమాసంలో వచ్చే వలపు వయ్యారాల మధువానగా కురిపించారు చరణంలో. ‘‘ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి - బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలి’’ అంటూ వసంత రాత్రులకు, వలపు పాటలకు ముడిపెట్టి బతుకును మధుపాత్ర చేసుకోమని చెప్పిన ఘనత మాత్రం దేవులపల్లి కృష్ణశాస్త్రిదే. 
ఉగాదులూ ఉషస్సులూ
ఉగాది నాటి వసంత శోభను ప్రదర్శించేవి ఆ కొమ్మలోని మావిచిగురు, గుబురులోని కోకిల కబురు... ఇందులో, ఏది ముందు? ‘‘మావిచిగురు తినగానే కోయిల పలికేనా? కోయిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా? ఏమో’’, దీనికి ఆమనియే సమాధానం చెప్పాలి అంటూ ప్రకృతి సోయగాల్ని తీయగా వర్ణించిన కృష్ణశాస్త్రి, తన ‘కృష్ణపక్షం- ప్రవాసం’లో మాత్రం ‘‘నా కుగాదులు లేవు- నా కుషస్సులు లేవు’’ అంటూ విరహాన్ని ఉగాది విహీన జీవనంతో పోల్చారు. ఇదే వేటూరి కలానికి ప్రేరణ కలిగించిందేమో... ‘ప్రేమఖైదీ’ సినిమాలో విరహానంతరం ప్రేయసి ప్రియులు కబుర్లు కలబోసుకుని ‘‘నీ కళ్లలో స్నేహము కౌగిళ్లలో ప్రాణము’’ అని పాడుకుంటూనే, ‘‘ఉగాదులు ఉషస్సులు వలపున రాక పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే’’ అంటూ ప్రేమలోని విరహబాధని ఉగాది లేమిగా ఎంతో వేదనాభరితంగా ప్రకటిస్తారు. ఈ వాక్యాలు చాలవూ, ఉగాది పండుగ మన జీవితాన్ని ఎంతగా పండిస్తుందో చెప్పేందుకు!
      కొత్త చిగురులు తొడిగిన కొమ్మల మీద, రెమ్మరెమ్మల మీద తొలకరి పాటలు వినిపించే సొగసరి కోయిల, సంవత్సరాదిన, కమ్మగా కూస్తూ, ఆనందరాగం పాడుతుంది. అది అలా వసంతానికి ఎదురుచూస్తూ, వనమంతా సందడి చేస్తుంటే- ‘‘వసంతంలా వచ్చి పోవాలిగా’’ అంటూ ప్రేయసి రాక కోసం వేచి చూసే ప్రియుడు పాడుతూ ఉంటే- అలా వచ్చి నిలిచి, చెంతచేరిన ప్రేయసి తోడే ఓ ‘ఉగాది’ అన్నారు వేటూరి. తరలి వచ్చిన వసంతంలో ‘‘వసంత గాలికి వలపులు రేగా... వరించు బాలిక మయూరి కాగా’’ అని వర్ణిస్తూనే ‘‘రవంత సోకిన గాలికి మరింత సోలిన వసంతుడేలే’’ అని ఇద్దరూ కలిసి చేసే ఆనంద నృత్యాన్ని అందంగా పొదివి పట్టుకుని పాటలో కట్టేసిన పింగళి రసజ్ఞతకు అంజలి ఘటించాల్సిందే.
పండించవే వసంతం..
వసంత రుతువులో ఉండే వన్నెచిన్నెల పోకడలనెన్నో తెలుగు సినిమా పాటల్లో చొప్పించారు గీత రచయితలు. ‘‘రావేలా వసంతాలే - శ్రుతి కానేల సరాగాలే’’ అంటూ, నూతన వేడుకల కోసం ఎదురుచూస్తూ ప్రేయసి ప్రియులు పాడుకునే ఈ యుగళ గీతం, ‘డాన్స్‌ మాస్టర్‌’ చిత్రం కోసం వేటూరి రాసింది. ఆరు రుతువులై సాగే వత్సరంలో ఈ చైత్ర రుతువు, కొత్తచిగుళ్లకు కోటి ఆశలకు నాంది. అలాంటి స్వాగత సంరంభంలో ప్రకృతి కాంత పరవశిస్తూ ‘‘ఈ చైత్ర వీణ ఝుంఝుమ్మని... రొదగా నా యెదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా... తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధనా’’ అంటూ వనమే యవ్వనమై జీవనమై సాగే ప్రకృతి పురుషుల ప్రణయాన్ని మధురంగా వర్ణించింది కూడా వేటూరి కలమే.
      అదే కలం, పాతికేళ్లకే రాలిపోయే జీవితాన్ని గురించి చెప్పాల్సిన సందర్భంలో మోడువారిన జీవితానికి ఆశను కల్పించేందుకు ‘‘ఆమనీ పాడవే హాయిగా... మూగవై పోకు ఈ వేళ’’ అంటూ, రాలేటి పూల రాగాలతో ఉన్న శిశిరాన్ని తట్టి లేపి, పూచేటి పూల గంధాలను ఆస్వాదించమంది. వత్సరారంభంలో వచ్చే చైత్రంలో మొగ్గ తొడగాల్సిన పువ్వు యవ్వన ప్రాయంలోనే రాలిపోతుంది అని చెప్పేందుకు ‘‘నివాళి కోరినా... ఉగాది వేళలో... గతించి పోవు గాథ నేనని’’ చరణాల నిండా వేటూరి ఎంతో హృద్యమైన భావాన్ని నింపారు. ఇక ‘తమిళ పాటకు తెలుగుసేత’లో అందెవేసిన చెయ్యి రాజశ్రీది. చైత్ర మాసంలో ఇళ్ల లోగిళ్లలో విచ్చుకునే ‘‘మల్లెపూల చల్లగాలి మంటరేపే ఎందుకో నేడు’’ అన్నది ఆయన సందేహం! కాస్త ఈ బాధను ఉపశమింప చేసేందుకు ‘‘పండించవే వసంతం- పంచవేల సుగంధం’’ అంటూ వసంతం రాకతో జీవితంలో పండగ వస్తుందనీ, అది ఓ జంట నవజీవనానికి నాందిగా, ఉగాదిగా మారుతుందని చెప్పకనే చెప్పారు.
      ఆరు రుతువుల సంవత్సర కాలం బహు తీరులుగా పరిభ్రమిస్తూ, పరివర్తనం చెందుతూ, ఆకురాలిన నాడు శిశిరమైపోయినా, అంతలోనే వసంతమై చిగురిస్తుంది. అలా ఎలాంటి జీవితంలోనైనా ఆనందం మళ్లీ రావాల్సిందేనని, అదే జీవన మాధురి అంటూ ఈ మధుమాసం కోటి ఆశల కలశం అని చెప్పారు కవులు. అందుకే ‘‘తరలి రాద తనే వసంతం... తన దరికి రాని వనాల కోసం...’’ అంటూ ఎంతటి వేదన నుంచైనా ఒక నవ్వుమొగ్గ వికసించే కాలం వస్తుందని బతుకులో అణువణువునా నిండుకున్న శ్రుతిని ఈ వసంత గీతంలో వర్ణించారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ‘‘మధు మాసమా... మధుర పద కోశమా... మదనాస్త్రమా... మధుప స్వర శాస్త్రమా...’’ అంటూ ఈ రుతువులో మురిపాల వనబాల నూతనోత్సాహ హేళను తేనెలొలికే తీయని పాటలో వర్ణించారాయన. ఇలా ఎన్నో సినిమా పాటల్లో వసంత వనాల శోభ, మధు మాసపు వలపుల సుధ, మనసులోని భ్రమరపు రొదలను అందంగా వర్ణించారు సినీ గేయ రచయితలు. 
లలితగీతాల్లోనూ వసంతశోభ
‘‘అరువది ఆకుల అక్షయ చక్రం’’ అంటూ రాయప్రోలు సుబ్బారావు తన ఉగాది పాటలో కొత్త సంవత్సర శోభల్ని వర్ణించారు. ‘‘చిగురుటాకు చీరలో వనరాణికెంత అందమో... ఏ చూపులైన రాగాలలో పులకించే ఈ వేళలో’’ అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన లలితగీతం వినని వారుండరు. అలాగే, ‘‘వచ్చినది వసంతము విచ్చినది మల్లీ లతాంతము’’ అంటూ వసంత మాసపు ఆగమనాన్ని, ప్రకృతి పొందే పరవశాన్ని వర్ణించే పాటను వింజమూరి శివరామారావు రచించారు. 
       ‘‘వచ్చెను కనవే ఆమని... వన్నెలు చిందే యామిని’’ అంటూ పద్మిని రాస్తే చిత్తరంజన్‌ స్వరపరచిన ఈ గీతం ఉగాది వేడుకల్లో తప్పక చవి చూడాల్సిన పాటల్లో ఒకటి. అలాగే, ‘‘చిగురించెను యెద యెదలో నవ ఉగాది, వినిపించెను అణువణువూ వేణువూది... ఆశల ముంగిళ్లలోకి నడవమనీ, బతుకు తీపి నలుదిశలా పంచమనీ’’ అంటూ సాగిన మరో ఉగాది భావ గీతం జీవన సారాంశాన్ని విశదీకరిస్తుంది. ఇక ‘‘ఓహో ఓహో వసంతమా నవ మోహన జీవన వికాసమా’’ అన్నది చైతన్య ప్రసాద్‌ రచన.  వేదవతి ప్రభాకర్‌ ఆలపించిన ఈ లలితగీతం అందరి మనసులనూ గెలిచిన పాట, ఎన్నో ఉగాది వేడుకల్లో వేదికన నిలిచిన పాట. ‘‘తెలుగు వత్సరాది ఉగాది తెలుగు వారి తొలి పండగ ప్రతి ఏడాది’’ అంటూ నోరి రఘురామమూర్తి రాసిన మరో భావ గీతం మన సంప్రదాయాన్ని, ఉగాది విశిష్టతను చక్కగా చెక్కిన పాట.
      ఇలా కేవలం భావ గీతాలే కాకుండా, శిశిర- వసంతాల మార్పును ప్రేయసి పాటలో చూసుకుంటూ ‘అమృతం కురిసిన రాత్రి’లో ‘‘నువ్వు లేవు నీ పాట వుంది’’ అన్న తిలక్‌ ఈ ఉగాదికి నీకు ఏం రాయను? అంటూ కొత్త సంవత్సరంలో పూచే ఆశల గురించి తన కవిత్వంలో పొదిగారు. ఇలా కవుల మాటల్లో, పాటల్లో దాగున్న వసంత సౌందర్యాలంకృత ఉగాది, నిత్యానందపు పునాది. అందుకే జీవితాన్ని స్వర్గంగా చేసుకొమ్మని, ‘‘మారిపోనీ మళ్లీరాని ఉగాదిలాంటి యవ్వనంలో రాజాలా వెలుగు - మారాజై బ్రతుకు’’ అంటూ యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. అందుకే బతుకంతా పాట అని చాటిన కృష్ణశాస్త్రి అడుగుల్లో నడిచి, ‘‘స్వరాలు సుమాలుగా పూచే- పదాలు ఫలాలుగా పండే’’ జీవితం కావాలని కాంక్షిస్తూ, ప్రేమైక జీవనంలో ‘‘నిరంతరమూ వసంతములే- మందారములా మరందములే’’ కురుస్తాయని చెప్పింది వేటూరి కలం. చేదు, తీపి, ఉప్పు, కారం, వగరుల కలబోతగా సాగే జీవితాన్ని శ్రుతి శుభంగా చేసుకుని ఆస్వాదించాలని, ‘కొమ్మకొమ్మకో సన్నాయి పాడే కోకిలలా’ బతుకు హాయిగా సాగిస్తూ, ప్రతిరోజూ ఉగాదిలా ఉషస్సులు వెదజల్లాలని చెప్పేందుకే ఇన్ని గీతాలు మన కవుల కలాల నుంచి విరితేనెలై కురిశాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం