తెలుగు అంటే ఓ నాగరికత!

  • 918 Views
  • 2Likes
  • Like
  • Article Share

    ముత్తా నారాయణరావు

  • విజయవాడ,
  • 8008011010
ముత్తా నారాయణరావు

శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సాక్షిగా జరిగిన ‘భాషా బ్రహ్మోత్సవాలు’ తెలుగు వికాసానికి ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యతలను గుర్తుచేశాయి. బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించిన ఈ ఉత్సవాలకు కవులు, రచయితలు, భాషాభిమానులు, వివిధ రంగాల్లోని నిపుణులు, నాయకులు భారీసంఖ్యలో తరలివచ్చారు. తెలుగు వెలుగులు సుస్థిరమయ్యేలా చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణ మీద విస్తృతంగా చర్చించారు.  
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన ‘భాషా బ్రహ్మోత్సవాలు’ స్ఫూర్తివంతంగా సాగాయి. ‘మనిషికి తొలిగురువైన అమ్మ నుంచే తెలుగు భాషా వికాసానికి పునాది పడాలి. మాతృభాషలో విద్యాబోధన జరగాలి. ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు తెలుగులో ఉండాలి. ఎప్పటికప్పుడు మారే సాంకేతికతలకు అనుగుణంగా ఆయా ఉపకరణాలను మన భాషలోకి తెచ్చుకోవాలి. విజ్ఞాన శాస్త్రంలో వచ్చే అనేక ఆంగ్ల పదాలకు తెలుగులో ప్రత్యామ్నాయాలను సృష్టించుకోవాలి... ఇలా భాషాభివృద్ధికి సంబంధించిన విభిన్న అంశాల మీద ‘భాషా బ్రహ్మోత్సవాల్లో’ వక్తలు గళమెత్తారు. ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మకత- సంస్కృతీ సమితి, పర్యాటక శాఖ, దేవదాయ ధర్మదాయ శాఖ, దివి ఐతిహాసిక మండలి సంయుక్తంగా నిర్వహించాయి.
      ‘‘2018 సంవత్సరాన్ని తెలుగు భాషా వికాస సంవత్సరంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆ నేపథ్యంలో భాషాభివృద్ధికి రాష్ట్రవ్యాప్తంగా విభిన్న, వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాటిలో భాగంగానే ఏర్పాటుచేసిన ఈ భాషా బ్రహ్మోత్సవాల్లో 13 జిల్లాలకు చెందిన 125 మందికిపైగా సాహితీవేత్తలు భాగస్వాములయ్యారు. గత ఏడాది నిర్వహించిన ‘తెలుగు పద్య కవితా బ్రహ్మోత్సవాలు’ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వెయ్యి పుటలతో ప్రత్యేక సంచిక ప్రచురించాం. దాదాపు 250 మందికిపైగా కవుల కవితలు, పద్యాలు ఇందులో ఉన్నాయి’’ అని ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మకత- సంస్కృతీ సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి దీర్ఘాసి విజయభాస్కర్‌ చెప్పారు. భాష బతకాలంటే సామాన్యుడికి సులభంగా అర్థమయ్యేలా ఆయా ప్రాంతాల మాండలికాల సాయంతో పారిభాషిక పదాల్ని సృష్టించుకోవాలి. ‘తోలరి’ (వాహనం తోలేవాడు), ‘పదిగం’ (దశాబ్దం) లాంటి పదాల్ని వాడుకలోకి తీసుకురావాలి. ఇలాంటి అచ్చతెలుగు మాటలతో ‘పద నిధి’ని రూపొందిస్తున్నామని విజయభాస్కర్‌ ప్రకటించారు.  ‘‘తెలుగు జాతి, భాషలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళం. 500 ఏళ్ల కిందట శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళంలోని ఆంధ్రమహావిష్ణువు దేవాలయంలోనే ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే ఎవరికైనా స్ఫూర్తి కలుగుతుంది. ఈ ప్రాంత గొప్పదనాన్ని జాతికి తెలియజేసేందుకు 2007 నుంచి ఏటా శ్రీకృష్ణదేవరాయ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అవి ఈసారి భాషాబ్రహ్మోత్సవాలుగా జరగడం ఆనందదాయకం’’ అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌. విజయనగర సామ్రాజ్యంలో తెలుగు రాజభాషగా ఉండేది. ఆ స్ఫూర్తితో మన పాలనా భాషగా తెలుగును అమలులోకి తెచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
తెలుగులోనే బోధించాలి
సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ ఉత్సవాలను ప్రారంభించి ఉత్తేజభరితంగా ప్రసంగించారు. భాష మీద ప్రజల్లో మక్కువ తగ్గడానికి గల కారణాలను విశ్లేషించారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడ్డారు. మొదలి నాగభూషణ శర్మ, రాంభట్ల నృసింహ శర్మ, శంకరనారాయణ, శలాక రఘునాథశర్మ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, ఆచార్య పద్మనాభరావు, నాగసూరి వేణుగోపాల్‌, భూసురపల్లి వెంకటేశ్వర్లు, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, డా।। రాధేయ, డా।। శిఖామణి, అనంతశ్రీరాం, కె.ఆర్‌.జగదీష్‌, గుమ్మా సాంబశివరావు, జి.వి.పూర్ణచంద్‌ తదితర సాహితీవేత్తలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తెలుగు భాషా వికాసం కోసం పనిచేస్తున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, విజయవాడ సాంస్కృతిక కేంద్రం ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈమని శివనాగిరెడ్డి, ‘ఈనాడు పాత్రికేయ పాఠశాల’ ప్రధానాచార్యులు మానుకొండ నాగేశ్వరరావు, తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు సామల రమేష్‌ బాబు, ఎన్టీఆర్‌ ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి విష్ణువర్ధన్‌లతో పాటు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కొనకళ్ల నారాయణ రావు, శాసన మండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్‌, తెనాలి శాసన సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తదితర రాజకీయ ప్రముఖులూ వీటిలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ‘దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు రాష్ట్రాల్లో భాషా సంక్షోభం, ద్రవిడ, మంగోలు భాషల జన్యు సంబంధాలు, ఆంధ్ర మహావిష్ణు దేవాలయ చరిత్ర, శ్రీకాకుళాంధ్ర మహాదేవ సుప్రభాతం, తెలుగులో అతిథి పదాలు, పద్యకవితా బ్రహ్మోత్సవం, సూతరంగస్థలి, మన అమరావతి’ తదితర గ్రంథాలను ఆవిష్కరించారు. 
      పాఠశాల స్థాయిలో తెలుగును నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుతం తెలుగు భాష దురవస్థ ఎదుర్కొంటోందని ‘ఈనాడు పాత్రికేయ పాఠశాల’ ప్రధానాచార్యులు నాగేశ్వరరావు అన్నారు. ప్రసార మాధ్యమాలు- భాషాభివృధ్ధి అంశం మీద ఆయన ఉపన్యసించారు. మాతృభాషలో బోధన సాగేలా ప్రభుత్వం చొరవ చూపాలని, కనీసం తెలుగు ఒక పాఠ్యాంశంగా అమలు చేసి, ప్రతి విద్యార్థీ తెలుగులో ప్రావీణ్యం పొందేలా వ్యవస్థాగతంగా ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘‘పిల్లల ప్రాథమిక విద్యాభ్యాసం తప్పనిసరిగా మాతృభాషలోనే జరగాలి. భారత రాజ్యాంగం, యునెస్కోలతోపాటు విద్యాహక్కు చట్టం కూడా ఇదే మాట చెబుతోంది. భాషాభివృద్ధి, పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలి. దాన్ని పక్కాగా అమలు చేయాలి’’ అని సామల రమేష్‌బాబు సూచించారు. సంస్కృతికి భాష వారధిగా నిలవాలి. భాషలోని మాధుర్యాన్ని చిన్నారులకు చవిచూపించేలా తెలుగు పాఠ్యాంశాలు రూపొందించాలి. నేషనల్‌ కరికలమ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఆధారంగా బడి భాష సాగాలి. పాఠ్యాంశాలను మాతృభాషలోనే సహజంగా, సరళంగా నేర్పాలి. ఈ మేరకు శాస్త్రీయ విధివిధానాలు రూపకల్పన చేయాలి. పాలన, బోధన భాషగా తెలుగును అమలు చేయాలని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు చెప్పారు. భాష పరిరక్షణ కోసం ప్రభుత్వాలు సదస్సులు మాత్రమే నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని ఆచార్య జి.ఉమామహేశ్వరరావు నిష్ఠురసత్యం పలికారు. ‘‘బోధనా భాషగా, పరిపాలనా భాషగా తెలుగును అమలు చేసిన నాడే పూర్తిస్థాయి ఫలితాలు అందిపుచ్చుకోగలం. కనీసం ఇంటర్‌ వరకు తెలుగు మాధ్యమంలోనే బోధిస్తే ఏటా 15 లక్షల మంది తెలుగు మాధుర్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. కానీ, నేడు తెలుగును కేవలం ఒక పాఠ్యాంశంగా మాత్రమే బోధిస్తుండటంతో భాష పట్ల విద్యార్థులకు సరైన అవగాహన ఉండట్లేదు. ఇదే పరిస్థితి మరో ఇరవై ఏళ్లు కొనసాగితే రాబోయే తరం తెలుగును మర్చిపోయే ప్రమాదం ఉంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  
అమ్మభాషకు మొక్కవోయ్‌
విశిష్టమైన ఎన్నో సామెతలు, నుడికారాలు, వ్యాకరణ సహిత హాస్యోక్తులు తెలుగు భాషకు మాత్రమే సొంతం. వాటిలో ముఖ్యంగా సామెతలు సామాన్యుల మహాకావ్యాలు. మనం ఎలా జీవించాలో అవి తెలియజేస్తాయంటూ అమ్మభాష గొప్పదనాన్ని వివరించారు హాస్యావధాని, అనుభవజ్ఞులైన పాత్రికేయులు శంకరనారాయణ. ‘‘ఆంధ్రులకే కాదు ఆంగ్లానికీ అమ్మభాష తెలుగే. అబ్బాయి నుంచి బోయ్‌, మణి నుంచి మనీ, ఇరకాటం నుంచి ఇర్క్‌, గ్రాసం నుంచి గ్రాస్‌, కాసు నుంచి క్యాష్‌.. ఇలా ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు’’ అంటూ ఆహూతుల మోముల మీద చిరునవ్వులు పూయించారాయన. ‘‘అమ్మ భాషని చంపుకుంటే/ అమ్మనే చంపేసినట్టోయ్‌... తెలుగు అంటే నమ్మకం/ ఆంగ్లమంటే అమ్మకం/ చెమ్మగిల్లిన కళ్లతోటే/ అమ్మభాషకు మొక్కవోయ్‌’’ అంటూ శంకరనారాయణ ఆలపించిన కవితకు చప్పట్ల వర్షం కురిసింది. తెలుగు భాషా భవిష్యత్తుకు ఎలాంటి ఢోకాలేదు... అలా అని అలసత్వం ప్రదర్శించడం తగదని విశ్రాంత న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణా మండలి అధ్యక్షులు జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌ అన్నారు. గ్రామసీమల్లో తెలుగు ఇంకా బతికే ఉందని, సమకాలీన సాహిత్యాన్ని పల్లెలకూ చేరువచేయాలని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ సూచించారు.
‘‘తెలుగును అధికార భాషగా అమలు చేయడానికి కృషిచేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు.. ఇలా అన్ని చోట్లా నామఫలకాల్ని తెలుగులోనే రాయిస్తాం. కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరిగేలా ఆదేశాలిచ్చాం. మండల, డివిజన్‌, జిల్లా స్థాయిల్లో కమిటీలు వేసి తెలుగు భాష అభివృద్ధికి మరింత కృషి చేస్తా’’మని కృష్ణాజిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం హామీ ఇచ్చారు. శ్రీకాకుళం చారిత్రక విశిష్టతను ఈమని శివనాగిరెడ్డి తెలియజేశారు. క్రీ.శ 1054 నుంచి 1792 వరకు మొత్తం 52 శాసనాలు ఈ ప్రాంతం గురించి వివరిస్తూ ఉన్నాయన్నారు. భాష బతికితే గానీ సాహిత్యం, సంస్కృతి బతకవని తిరుపతి శంకరంబాడి సాహితీ పీఠం బాధ్యులు డా।। డి.మస్తానమ్మ చెప్పారు.
సాంస్కృతిక సందడి
అక్షరం ఆవిర్భావం మీద ప్రముఖ నాట్యాచార్యుడు కె.వి.సత్యనారాయణ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. విజయవాడ, నూజివీడు, హైదరాబాదు, ఏలూరు, నరసన్నపేట (శ్రీకాకుళం జిల్లా)కి చెందిన 28 మంది కళాకారులు  ఇందులో పాల్గొన్నారు. ‘‘తెలుగమ్మో నీ ఆవుదూడలు ఏవీ?/ తెలుగమ్మో చక్కెర బెల్లం ఏదీ?’’ అంటూ ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు గీతాలాపన చేశారు. తెలుగు భాషా వైభవం, కవుల గురించి ఆయన బృందం పాడిన జానపద పాటలు ఉర్రూతలూగించాయి. భాస్కర సాయికృష్ణ యాచేంద్ర బృందం చేసిన సంగీత నవావధానమూ ప్రశంసలందుకుంది.  
ఈ ఉత్సవాల్లో ఇంకా అనేక కళాప్రదర్శనలు జరిగాయి. విజయవాడకు చెందిన శ్రీ సాయిబాబా నాట్యమండలి కళాకారులు ఆంధ్ర మహావిష్ణువు నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణ దేవరాయలు విజయయాత్రను వివరిస్తూ బుర్రకథ కళాకారులు ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. కొండపల్లి ఖిల్లాను జయించే క్రమంలో మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణ దేవరాయల నడుమ జరిగిన సంవాదాన్ని వాళ్లు రక్తి కట్టించారు. తణుకుకు చెందిన విశ్రాంత అధ్యాపకుడు వాడ్రేవు సుందరరావు సహకారంతో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన తెలుగు భాషా ప్రియులను బాగా ఆకర్షించింది. లిపి పరిణామ క్రమానికి సంబంధించిన చిత్రాలు, తెలుగు భాషా వికాసం కోసం కృషి చేసిన మహనీయుల వర్ణచిత్రాలతో పాటు పలువురు ప్రముఖుల స్వదస్తూరితో కూడిన లేఖలు, కవితల చిత్రాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. గురజాడ అప్పారావు స్వదస్తూరిలోని ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ గేయం, పొట్టి శ్రీరాములును ఆశీర్వదిస్తూ మహాత్మాగాంధీ రాసిన ఉత్తరం, కుతుబ్‌ షాహి చక్రవర్తుల పాలనలో మాదన్న తెలుగులో ఇచ్చిన ఫర్మానా ప్రతి తదితరాలు అందరికీ ఆసక్తి కలిగించాయి. కీలకమైన అంశాల మీద చర్చలు, అచ్చమైన తెలుగు కళారూపాల ప్రదర్శనలతో ఈ ఉత్సవాలు స్ఫూర్తిజ్యోతులను వెలిగించాయి. మొత్తమ్మీద ఈ సభలు అందించిన సందేశం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాటల్లో ప్రతిధ్వనించింది. అదేంటంటే...  
తల ఎత్తి జీవించు తమ్ముడా
తెలుగు నేలలో మొలకెత్తినానని
నిలువెత్తుగా ఎదిగినానని..
ఎలుగెత్తి చాటవోయి తమ్ముడా
తెలుగు కన్నా దైవం లేదని...! 


ఎక్కువమంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారనేది కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలు ప్రచారంలోకి తెచ్చిన ఓ అసత్యం. దేశంలో కేవలం 15.49 శాతం మంది మాత్రమే ప్రాథమిక స్థాయిలో ఆంగ్లాన్ని అభ్యసిస్తున్నారు. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో మాతృభాషల్లోనే విద్యాబోధన జరుగుతోంది. జపాన్‌, దక్షిణ కొరియాల్లో విద్యావేత్తలు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తల్లో అత్యధికులకు ఆంగ్లం తెలియదు. అయినా వారు పారిశ్రామికంగానూ, సాంకేతికపరంగానూ ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఉపాధి కోసం ఆంగ్లాన్ని నేర్చుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ, ఆ భాష మోజులో పడి మాతృభాషను విస్మరించడం దురదృష్టకరం. ప్రతి నియోజకవర్గంలోనూ భాషా పండితులను ఓచోట చేర్చి సదస్సులు నిర్వహించటం ద్వారా పిల్లలకు ఓ సందేశాన్ని అందించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి.   

- జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి


మా ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికి కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2018ని తెలుగుభాషా వికాస సంవత్సరంగా ప్రకటించి ఏడాది మొత్తం కార్యక్రమాలు జరిగేలా ప్రణాళికలు రూపొందింపజేశారు. త్వరలోనే కొండపల్లి కోటలో భాషా వికాస కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 

- దేవినేని ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి 


సాహిత్య ప్రయోజనం నెరవేరాలంటే భాష బతికుండాలి. అనేక విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ఇస్తున్నా ఆయా పరిశోధనల్లో ఎంతమేర సారం ఉంది? కొత్తగా ఏమి కనుగొన్నారనే అంశాలు ప్రశ్నార్థకంగానే ఉంటున్నాయి. తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవం కోసం సాహితీవేత్తలు, భాషా ప్రేమికులు కలిసి కృషిచేయాలి. అందుకు సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలి. 

- మండలి బుద్ధప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉపసభాపతి


అద్భుత పదజాలం తెలుగు భాష సొంతం. ఆంగ్లంలో 12 రకాల బంధుత్వాలు ఉంటే 52 రకాల బంధుత్వాలతో సుసంపన్నమైన భాష మనది. అయితే.. ప్రాంతాల వారీగా మాతృభాష మూలాల్లోకి వెళ్లినప్పుడే పదాల వాస్తవరూపం తెలుస్తుంది. అందుకు ప్రభుత్వ పరంగా ఒక వ్యవస్థ ఏర్పాటై పరిశోధనలు సాగించాలి. పదనిధిని ఏర్పాటు చేయాలి. భాషా వ్యాప్తికి ప్రసార మాధ్యమాలు విశేషంగా కృషి చేశాయి. చేస్తున్నాయి. భాష వల్ల ప్రసార మాధ్యమాలు కూడా వృద్ధి చెందుతాయి. మాతృభాషకు ప్రాధాన్యం కల్పించడం వల్లే ప్రాంతీయ పత్రికలు, ప్రసార మాధ్యమాలకు ఆదరణ పెరుగుతోంది. ‘ఈనాడు’, ‘ఈటీవీ’ల్లో అచ్చమైన తెలుగు వినియోగానికి కృషి చేస్తున్నాం. నిజానికి ఇవాళ చదువు రానివారే తెలుగును బతికిస్తున్నారు. వారి నాలుకలపైనే తెలుగు తల్లి హాయిగా జీవనం సాగిస్తోంది. చదువుకున్నవారే నేడు తెలుగుకు   శత్రువులుగా మారుతున్నారు. ఈ పరిస్థితి మారాలి

- మానుకొండ నాగేశ్వరరావు, ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రధానాచార్యులు


తల్లి ఒడిని.. వీధిలో బడిని మొదట సంస్కరించాలి. ప్రతి ఇంటా పిల్లలకు తెలుగు నేర్పించాలి. మన భాష కేవలం భావాల వ్యక్తీకరణకు మాత్రమే పరిమితం కాలేదు. తరతరాలుగా భావజాలాన్ని అందిస్తూ గొప్ప నాగరికతకు మూలంగా ఉంది. భారతీయతను కాపాడటం, అభివృద్ధి చేయడంలో తెలుగు కీలక  భూమిక వహిస్తోంది. దీన్ని మనం పరిరక్షించుకోవాలి.

- ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి


యువతరాన్ని భాషపట్ల ఆకర్షితులను చేసేందుకు వారికి నచ్చే, అర్థమయ్యే రీతిలో రచనలు రావాలి. వారికి తెలిసిన కొద్దిపాటి తెలుగు పదాలతో లోతైన భావాలు తెలిసేలా చేయాలి. తెలుగులోని మాధుర్యాన్ని చవిచూపించాలి. ఈ క్రమంలో వారు మంచి భావుకతకు అలవాటు పడ్డారని రూఢీ చేసుకున్న తర్వాత కొత్త పదాలు, సాహిత్యం వైపు మళ్లించాలి. దీనికోసం సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలి. 

- అనంత శ్రీరామ్‌ 


ఆంధ్ర, తెలంగాణ మినహా దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాల్లో తెలుగు భాష పరిరక్షణ కోసం ‘రాష్ట్రేతర తెలుగు సమాఖ్య’ ద్వారా కృషి చేస్తున్నాం. ఈ మేరకు దాదాపు వెయ్యి తెలుగు సంఘాలతో సమన్వయం చేస్తున్నాం. ప్రభుత్వాల ఉదాసీనత వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న తెలుగు మాధ్యమ పాఠశాలలు నిరాదరణకు గురవుతున్నాయి. ప్రస్తుతం ఏకోపాధ్యాయ బడులుగా మిగిలాయి. ఎలాగైనా వాటిని రక్షించుకోవాలని ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. 

- పి.వి.పి.సి.ప్రసాద్‌, అహ్మదాబాద్‌

- రాళ్లపల్లి సుందరరావు, ఖరగ్‌పూర్‌ 


వెనక్కి ...

మీ అభిప్రాయం