తమిళ రాజధానిలో తెలుగు వాన

  • 228 Views
  • 0Likes
  • Like
  • Article Share

    టి.ప్రభాకర్‌

  • చెన్నై
  • 9121229281
టి.ప్రభాకర్‌

అమ్మభాషను ఆరోప్రాణంగా భావించే తమిళగడ్డ మీద తెలుగు తలపులు పల్లవించాయి. తెలుగువారి ఒకప్పటి సాంస్కృతిక కేంద్రమైన చెన్నై మహానగరంలో మరోసారి మన గజ్జెలు ఘల్లుమన్నాయి. భాషాసంస్కృతుల పరిరక్షణ మీద సమాలోచనలు, కళారూపాల ప్రదర్శనలతో ప్రపంచ తెలుగు సమాఖ్య రజతోత్సవ వేడుకలు శోభాయమానమయ్యాయి.  
మనిషి ఎక్కడ స్థిరపడినా, ఎంత ఎత్తుకు ఎదిగినా తనదైన భాషాసంస్కృతులతో ఉండే అనుబంధం విస్మరింపరానిది. ఎందుకంటే, ఏ వ్యక్తికైనా గుర్తింపు చిహ్నాలివే. తనవైన ఆచార వ్యవహారాలతో జీవితాన్ని గడపడానికి, నేను ఫలానా అని చెప్పుకోవడానికి ఆధారాలివే. జాతి అస్తిత్వమూలాలైన ఈ భాషాసంస్కృతులను కాపాడుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరినీ ఓ వేదిక మీదకు తీసుకురావాలన్న సంకల్పంతో 1993లో ప్రపంచ తెలుగు సమాఖ్య ఆవిర్భవించింది. తర్వాతి ఏడాది చెన్నైలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఈ సమాఖ్యను అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి సంస్థ బాధ్యులు రెండేళ్లకోసారి మహాసభలను నిర్వహిస్తున్నారు. చెన్నై, దిల్లీ, హైదరాబాదు, సింగపూరు, విశాఖపట్నం, బెంగళూరు, దుబాయ్‌, విజయవాడ, చెన్నై, మలేసియాల్లో ఇప్పటి వరకు సభలు జరిగాయి. ఈ ఏడాది పదకొండో ద్వైవార్షిక మహాసభలతో పాటు సమాఖ్య రజతోత్సవ వేడుకలను కూడా మరోసారి చెన్నైలో వైభవంగా నిర్వహించారు. 
       ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరిగిన ఈ మహాసభలకు అతిరథమహారథులు తరలివచ్చారు. తమిళనాడు క్రీడా, యువజన శాఖల మంత్రి, తెలుగువ్యక్తి పి.బాలకృష్ణారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిలు జ్యోతిని వెలిగించి ఈ వేడుకలను ప్రారంభించారు. మన భాషా సంస్కృతులను మర్చిపోతే మన ఉనికినే కోల్పోతామని పురంధేశ్వరి హెచ్చరించారు. మహాసభల్లో భాగంగా ‘మహిళా సాధికారతకు స్ఫూర్తిప్రదాతలు’ అనే అంశం మీద నిర్వహించిన సదస్సులో ఆవిడ మాట్లాడుతూ.. సంస్కృతిని కాపాడటంలో మహిళల పాత్ర కీలకమని, పిల్లలకు- సంస్కృతికి వారధిగా స్త్రీలు నిలవాలని పిలుపిచ్చారు. 
తల్లిదండ్రుల బాధ్యత
భాషాసంస్కృతుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ మహాసభల్లోని వక్తల ప్రసంగాలు అందరినీ ఆలోచింపజేశాయి. అమ్మభాష ద్వారా ఉపాధి లభించేలా తెలుగు ప్రభుత్వాలు చొరవచూపాలని సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సూచించారు. పరాయిరాష్ట్రాల్లో అమ్మభాషల అభివృద్ధికి జరుగుతున్న కృషి తెలుగు రాష్ట్రాల్లో జరగట్లేదని శాసనమండలి సభ్యులు ఎంవీవీఎస్‌ మూర్తి ఆవేదన వ్యక్తంజేశారు.  ఒక భాషలోని పదాలు, అక్షరాలు వినియోగంలో లేకపోతే అది మృతభాషగా మిగులుతుందని, కానీ ప్రపంచ వ్యాప్తంగా మన భాష మాట్లాడేవారు 18 కోట్ల మంది ఉన్నారు కాబట్టి తెలుగుకు ఆ పరిస్థితి రాదని తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌ గౌరీశంకర్‌ అభిప్రాయపడ్డారు. ‘‘మద్రాసు, దిల్లీ, మలేసియా, అమెరికాలు ఉన్నంతవరకు తెలుగుభాషకు ఢోకా లేదు. ఆయా ప్రాంతాల్లోని తెలుగువారు అమ్మభాషను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మనం కళ్లప్పగించి చూస్తూ ఉండొచ్చు’’ అంటూ హాస్యావధాని శంకరనారాయణ ఒకవైపు నవ్వులు విరబూయిస్తూనే, చురకలు అంటించారు. మానసిక వికాసానికి మాతృభాష అవసరమని సినీ నటుడు కోట శ్రీనివాసరావు చెప్పారు. బతుకుతెరువు కోసం పరభాషలు నేర్చుకోవాలి కానీ.. సంప్రదాయాలు, సంస్కృతిని పరాయిభాష పాలు చేయకూడదని స్పష్టంచేశారాయన. 
      ‘‘పిల్లలకు తెలుగు భాషను నేర్పించేటప్పుడు అ-అమ్మ, ఆ-ఆవు, ఇ-ఇల్లు, ఈ-ఈశ్వరుడు అనే అర్థవంతమైన అక్షరాలతో ఆరంభిస్తాం. జన్మనిచ్చిన అమ్మకు ప్రథమస్థానం, పూజనీయమైన గోవుకు రెండో స్థానం, గృహస్థాశ్రమాన్ని తెలియజేస్తూ ఇల్లు, బాధ్యతలన్నీ నెరవేర్చుకుని చివరకు భగవంతుడిలో ఐక్యమవ్వాలని తెలియజేస్తూ ఈశ్వరుడు... ఇలా బాల్యదశలోనే విలువలను అలవర్చడం మన భాష ప్రత్యేకత. అందుకే తెలుగువారైనందుకు మనం గర్వపడాలి’’ అన్నారు ఆధ్యాత్మికవేత్త, అవధాని గరికిపాటి నరసింహారావు. ‘తెలుగుభాష, సంస్కృతి పరిరక్షణలో యువత, తల్లిదండ్రుల పాత్ర’ అనే అంశం మీద రెండో రోజు జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. విద్యావిధానాల్లో డొల్లతనం కారణంగా ప్రస్తుత యువత ప్రతి చిన్న సమస్యకూ ఆత్మహత్యే పరిష్కారంగా భావిస్తోందని గరికిపాటి ఆవేదన చెందారు. ఆపదలను ఎదుర్కొనే ధైర్యాన్ని పిల్లల్లో నింపడం, మానసిక స్థైర్యాన్ని అందించే పుస్తక పఠనాన్ని అలవాటు చేయడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారు
సాంస్కృతిక వీచికలు
ఈ రెండు రోజుల్లో జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విజయవాడకు చెందిన నాట్యాచార్యులు సీహెచ్‌ అజయ్‌కుమార్‌ దర్శకత్వంలో ఆయన శిష్యబృందం ప్రదర్శించిన స్వాగతనృత్యంతో వేడుకలు మొదలయ్యాయి. అనంతరం సమాఖ్య ప్రధాన కార్యదర్శి జేఎం నాయుడు సంస్థ లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించి, వార్షిక నివేదికను చదివి వినిపించారు. ‘భువన విజయం’ సభలో ఆలపించిన అష్టదిగ్గజ కవుల పద్యాలు ప్రబంధ సాహిత్య విశిష్టతను తెలియజెప్పాయి. హైదరాబాదుకు చెందిన సుధాకాంత్‌ ఇసుకతో పలు చిత్రాలకు జీవం పోస్తూ నిర్వహించిన సైకత చిత్ర ప్రదర్శన, విశాఖపట్టణానికి చెందిన విజయకుమార్‌ నీడల రూప ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. యువ దర్శకుడు తోట శ్రీకాంత్‌కుమార్‌ అచ్చ తెలుగు మాటలతో తీసిన ‘అమ్మ’ లఘుచిత్రం ఆకట్టుకుంది. సింగపూర్‌లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న కాత్యాయని రెడ్డి కూచిపూడి నాట్య ప్రదర్శన కన్నులపండువగా సాగింది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఆటిజం బాధితుడైన యువకుడు కామిశెట్టి వెంకట్‌ తన తల్లిదండ్రులు స్వరాలు పలికితే దానికి సంబంధించిన పాటను పాడటం తదితరాలతో ఆహూతుల అభినందనలు అందుకున్నాడు. తెలుగు మహాసభల్లో నేత్ర, అంగుష్ఠావధానాలతో అబ్బురపరచిన చిన్నారులు ఎన్వీ శిరీష, కె.శిరీషలు ఇక్కడా ప్రతిభను ప్రదర్శించారు. డా।। అక్కిరాజు సుందరరామకృష్ణ, వాడ్రేవు సుందరరావుల ఏకపాత్రాభినయాలు, సికింద్రాబాదుకు చెందిన శ్రీరామ నాటక నికేతన్‌ వారి నృత్యమాలిక, వందేమాతరం శ్రీనివాస్‌ సారథ్యంలో సంగీత విభావరి రసవత్తరంగా సాగాయి. కవి, గాయకుడు గోరటి వెంకన్న స్వీయ కవితలను ఆలపించారు.
 మహాసభల సందర్భంగా కరీంనగర్‌కు చెందిన జానపద కళాకారుడు దుర్సెట్టి రామయ్యకు ‘యార్లగడ్డ శంభుప్రసాద్‌’ పురస్కారం ప్రదానం చేశారు. తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త, రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపకులు డా।। గుత్తా మునిరత్నంకు ‘వేమిరెడ్డి శ్యామలమ్మ’ స్మారక పురస్కారం, గోరటి వెంకన్నకు ‘గుమ్మడి వెంకటేశ్వరరావు’ పురస్కారం, ‘శ్రీకళాలయ’ వ్యవస్థాపకురాలు, చిత్రకారిణి గూడూరు లక్ష్మికి ‘యార్లగడ్డ ప్రభావతి’ పురస్కారాన్ని అందజేశారు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ ఇంటి నుంచే మొదలవ్వాలన్న సందేశాన్ని ఈ సభలు అందించాయి. తెలుగువారు ఈ పిలుపునకు సానుకూలంగా ప్రతిస్పందిస్తేనే జాతి అస్తిత్వం పదికాలాలపాటు నిలబడుతుంది.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని సంఘటితం చేస్తూ.. తెలుగు భాషాసాహిత్యాలు, సంస్కృతీసంప్రదాయాలు, కళలను భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతోనే ‘ప్రపంచ తెలుగు సమాఖ్య’ ఏర్పాటైంది. విశాఖలోని కైలాసగిరి మీద తెలుగు సాంస్కృతిక నికేతనాన్ని నెలకొల్పడం ఈ ప్రయాణంలో ఓ మధుర జ్ఞాపకం.

- ఇందిరా దత్‌, ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు 


తెలుగువారి ఐక్యతకు సమాఖ్య చేస్తున్న కృషి అభినందనీయం. వాట్సప్‌, గూగుల్‌ గ్రూపుల ద్వారా ఈ సేవలను ఇంకా విస్తరించవచ్చు. మాతృభాషలో చదువు, ఉమ్మడికుటుంబ వ్యవస్థలతో మన భాషాసంస్కృతులను కాపాడుకోవచ్చు. 

 - సుజనా చౌదరి, కేంద్ర మంత్రి


ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర భాష నేర్చుకోవడం మంచిది. అయితే ఎన్ని భాషలు నేర్చుకున్నా, మాతృభాషను మాత్రం మర్చిపోకూడదు. 

- పి.బాలకృష్ణారెడ్డి, తమిళనాడు మంత్రి 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం