భావ దీపావళి

  • 1563 Views
  • 0Likes
  • Like
  • Article Share

న ఘన సంస్కృతిని నిండా ప్రతిబింబించేవి మన పండుగలు. అందులోనూ వెలుగుల విందులు చేసేది దీపావళి.
      కాల్చేవీ, పేల్చేవి ఎన్ని ఉన్నా రకరకాల దీపాల వరుసలు చూడటమే కళ్లకు వేడుక. అసలు దీపా‘వళి’ అంటేనే దివ్వెల వరుస.
      దీపావళి అమావాస్యను తెలుగులో దివ్వెల అమాస అంటారు. దీపస్తంభాన్ని దివ్వెకంబం అంటాం. దీపాలు పెట్టడాన్ని ‘దివ్వెలెత్తు’ అంటారు. దీపావళి కాంతుల్లో ఇవి తెలుగు వెలుగులు.
      అసలీ పండుగ చేసుకోవడానికి మూలకారణాలు అనూచానంగా చెప్పే సందర్భాలున్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా వెళ్లి నరక రాక్షసుణ్ని చంపడం అనే ఆనందం రోజు నుంచి దీపావళి చేసుకోవడం వచ్చింది. బలిచక్రవర్తి తన రాజ్యాన్ని వామనుడికి ఇచ్చేసిన రోజు నుంచి ఈ పర్వనిర్వహణం ఉంది. శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించాక, సీతాసమేతుడై రాజ్యపట్టాభిషిక్తుడైన శుభ సందర్భదినం నుంచి ఈ పండుగ జరుపుకోవడం ఉంది. అంతేకాదు, విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడైన రోజు నుంచే ఏటా ఇలా పండగ చేసుకోవడం ఉంది. ఏ కథను బట్టైనా, ఏ సందర్భాన్ని బట్టైనా దీపావళి జరుపుకోవడం, ఇంటింటికీ వెలుగు మేలి రాకలకు ఎదురుచూడటం ఉంది.
      ఇంతటి గొప్ప పండక్కి స్పందించడం ప్రజాజీవనాన్ని ప్రతిబింబించే కవులకు అత్యంత సహజం. ఆనందాలు ‘మందికి’ చెందడం సంస్కృతిలో భాగం. దీపావళినాడు మార్వాడీలు లక్ష్మీపూజను లక్షణంగా, వైభవంగా చేస్తారు. అది వారినుంచీ ఇతరులకూ వచ్చింది.
      లక్ష్మీ పూజల్లో- లక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తూ ఓ మంగళహారతి  ఇలా పాడతారు- 
      మహాలక్ష్మీ అని నిన్ను చాలగొల్చితే ఓ లక్ష్మీ నీకింత జాలమేలా?
పాలసముద్రుని పట్టిరో అని నిన్ను పలుమారు పిలిచితే పాలించవేవమ్మా!
మంగళం మంగళం, మహలక్ష్మి మంగళం మంగళం
అలికి పూసిన యింట్లో చిలుకు చల్లితినేను, మెరపు చూపుతూ రావే అలుకలేలా?
కళకళ నవ్వుచు కలయిండ్ల నెక్కుచు కలికిముద్దుల చిలుక రావమ్మా,
ఒంటిగానీవు మా యింటికి రావమ్మ జంట బాయక నావెంట ఉండూ,
కంఠాన మెరిసేటి కంఠహారములిత్తు, యింట్లోకి రావమ్మ ఇపుడూ
                                                                 ।।మంగళం మంగళం।।
      ఈ పాటలో జానపదుల్లోని ఓ ప్రేమ పూర్వక అమాయకత్వపు ఆలోచనలున్నాయి. మనకు సంపద లివ్వడానికి లక్ష్మిని ఆహ్వానిస్తూ, వస్తే ఆమెకు మెరిసే కంఠహారాల్ని ఇస్తామనడం అలాంటిదే! జానపద వాఙ్మయంలో భాగమైన సామెతలు దీప సంబంధంగా ఉన్నాయి. ‘దీపావళి వర్షాలు ద్వీపాంతరాలు దాటుతాయి; ‘దీపావళికి దీపమంత చలి’, ‘దీపాన వెలిగించిన దివిటీ పెద్దదైనట్లు’, ‘దీపం పేరుకు చీకటి పరుగు’; ‘దీపముండగనే నిప్పుకు దేవుశ్లాడినట్లు’, ‘దీపం ఆరిన తర్వాత దినుసంతా ఒకటే’, ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ - అనేవి అందులో కొన్ని మెరుపులు.
      కవులు మానవ కల్యాణాన్ని కోరతారు. సమయ సందర్భాల రచనల్లో సైతం ఏదో ఓ భావుకత, ఓ చమత్కారం, ఓ అనుభూతి ఇలాఇలా ఏదో ఒకటి ప్రతిఫలిస్తాయి. తెలుగులో కవులు ప్రధానంగా ఆధునిక కాలంలో దీపావళి కవితలు ముఖేముఖే సరస్వతి అన్నట్లుగా స్పందించి రాసి అందించారు. విహంగావలోకనం చేద్దాం రండి...
1938లో భాగవతుల లక్ష్మీపతిశాస్త్రి ‘నీతి దీపావళి’ పేర పిల్లల కథల పుస్తకం తెచ్చారు. విషయ సూచికలో 22 దీపాలు అంటూ వేరువేరు కథల పేర్లిచ్చారు.
      వైజయంతీవిలాసంలో సారంగు తమ్మయ కవి ‘దీపము మన్మథ రాగోద్దీపము’ అంటూ అది ‘భవహరము’ శుభంకరము అన్నాడు. దాసరి లక్ష్మణస్మామి సేకరణ గ్రంథం ‘వర్ణన రత్నాకరం’ పద్య సేకరణ గ్రంథాల్లో మంచి పద్యాలకు ఆకరం. అందులో ‘విద్యుద్దీపములు’ అన్న ఓ ఖండిక ఆరి, వెలిగే దీపాల స్థితిని వర్ణించింది. అది ఓగునుగు సీసం వంటిది.
      తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి ½దరి దీపావళి అనే ఓ ఖండికలో- 
‘‘వచ్చినది దీపా
వళి మహస్సని ఎట్లు పొంగెద
చచ్చిచావని బక్క బ్రతుకులు
సకల మహినుండన్‌ 
ఎపుడు సంతృప్తిని స్వతంత్రత
నెల్లపేదయుననుభవించు
      అపుడు పొంగెద నిక్కమగు దీపావళిని గనుచున్‌’’ అంటూ బీదాబిక్కీ అందరూ సంపదను అనుభవించే ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు.
      దీపావళి అనగానే ఠకీమని గుర్తుకొచ్చే కావ్యం ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి భావకవితా సంపుటి ‘దీపావళి’. అందులో నిశీధినితో ఒక అవ్యక్త భావ కవితా వ్యక్తీకరణ, ఒక దుఃఖ వేదనా నివేదనం, హృదయం దహించుకుపోవడం ఒక ఇమడలేనితనం వంటివెన్నో ఉంటాయి.
‘‘ జగతి ఈనాటి ఈ మహోత్సవమునందు
మునిగి ఆనందమున బొంగి పోవుచుండ
ఇటు రగుల్కొల్పిరెవరు నీ హృదయమందు
అణచుకొనియున్న ఘోరదుఃఖానలమ్ము’’
అని నిశీధిని అంటే నేను అంటూ కవి
కాఱుకొన్న యమాస చీకటులనడుమ
నేకండనె ఈ శూన్యనిలయమందు
అదురువడిపోయి మరణవాద్యమ్ములట్లు
గుండియలు కొట్టు కొననేడ్చుకొనుచు నుంచి’ నన్నాడు.
      పైగా నా హృదయం దహించుకొనిపోయే ఈ సందర్భంలో కన్నీటి చుక్కల వల్ల అది చల్ల బడునేమో అంటూ
      ‘‘మూసికొనిపోయె నా నేత్రములు తమంత
రాత్రియే యింక బహిరంతరముల నాకు’’ అంటాడు.
      బయట అమావాస్య రాత్రి చీకటి ఎలాగూ ఉంది. కళ్లు మూసికొని పోవడం వల్ల ఆ కళ్లలో చీకటి ఉంది కనక- బయట, లోనా చీకటే ఉంది అనేది భావుకతకు సంబంధించిన అంశం.
      బయట ఇంత వైభవంగా దీపావళి ఉత్సవం ఫెళఫెశార్భాటాలతో జరుగుతూంటే దీపావళి భావకవి-
      ‘లోనజ్వలియించుచున్న మహానలమున
కొకస్ఫులింగమెకద’ యీ ఉత్సవాగ్ని అంటారు. తనలోని చెప్పలేని ‘వేదనాగ్ని’కి ఇంత దీపావళి ఒక విస్ఫులింగమేనట. చివరకు ‘చిమ్మట’ కూడా కవిగారూ ఈ బాణసంచాల మ్రోతల మధ్య మీ జీవితాశల్ని మోగించుకుంటున్నారని అంటుంది.
      నన్ను నిరసించే జనం ఆనందంలో నాకు భాగం వద్దు. చిమ్మెట లైన మీరు చేసే ధ్వనులే గానరవాలు నాకంటారు.
‘దినములు పరస్పర ప్రతిధ్వనులు’గా అంటే మామూలుగా ఉన్నాయంటారు. ఈ మాట చాలాకాలంగా కవి రసజ్ఞజనంలో ఒక సామెతలా ఉండిపోయింది. చివరగా వేదులవారు- 
‘మ్రొక్కిన కొలంది కాలితోత్రొక్కివేయు
ఈ కఠినలోకమెల్ల బహిష్కృతమ్ము
రండు చిమ్మెటలార ఈ రాత్రివేళ
నావలెన్‌ పాడుకొను మీరె నాకు సఖులు’ అంటారు.
మొత్తంపై ఖండికంతా సఖులు, సమాజం, నిరాశ అంశాలతో వేదనాదీపావళే!
ప్రజల గొడవలే ‘నాగొడవ’గా రాసిన కాజీ దీపావళి దీపాలు కవితలో
‘‘ఊరి వెలుపలనున్న పూరి గుడిశల దూరి
లోని చీకటి బాపలేని దీపాలు
దోచిదాచిన దెంతో దుర్భాగులకు జూప
ధనపూజ చేయించు ధర్మదీపాలు’’
అంటూ సామాన్య మానవుల బాధలు, దోపిడీదారుల గురించి వాస్తవ చిత్రాలు చెప్పారు.
తెనాలి కవి గోనుగుంట పున్నయ్య ‘చెదరు చినుకులు’ ఖండకావ్యంలో దీపావళిపై రాసిన కవితలో ‘దీపావళి’ని హద్దులు దాటి చేసుకోకండనే అవసర ప్రబోధం ఇలా వ్యక్తమైంది.
‘సిరులు గల వారి వైభవపరత తోడ
వీధుల సురేంద్ర సభలు గావింత్రుగాక!
మేరమీరిన యెడల ఈ ఘోరకేళి (దీపావళి)
జాలిగుండెల గరగించు నీరువోలె’
మందుగుండు సామాను కాల్చడం మానుకోండి అనేవరకూ ఈ ప్రబోధం సాగుతుంది.
‘‘మందుమండించు టికనైన మాయమగుచు
ధవళశాల్యన్న కాంతియు ధవళధౌత
వస్త్రముల చల్వనిగ్గులు బదులునిలిచి
పేదకడుపును తనువు నింపెడినిగాత!’’
- మందుకాలిస్తే వెలుగులు వస్తాయి. తెల్లని వరి అన్నం, తెల్లని చక్కని బట్టలు ఉండి పేదల కడుపులు నిండితే అంతకన్నా వెలుగులు ఏమి ఉంటాయి అన్నారు. తెల్లనివి బాగా వెలగడం సహజం కదా!
      మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ‘కేశాకుళి’ (ఫౌంటెయిన్‌కు తెలుగు) ఖండకావ్యంలో ‘దీపోత్సవం’ ఖండికలో...
‘‘ తెలుగు బిడ్డల చేత తివిరి కాల్పించిన
      గోగువత్తుల వెలుంగులకు బెదరి
దిబ్బుదిబ్బుగ వారు దివ్వటీల్‌ కొట్టెడి
ఉత్సాహ వాక్కుల దిగి నిల్చి
కాళ్లపై బోసిన నీళ్లు లారకమున్న
తిన్నబిడ్డల నోటి తీపి కలరి
మైనంపు వత్తి లేమంట భగ్గనజల్లు
గుగ్గిలపుం బూల కొసలనరసి
దొడ్డిలో పశ్చిమపువైపు తులసికోట
తొలి టపాకాయ ప్రేలుడు నలుకు తగిలి
లేగదుడుకుల నడచుపాలేరు గదిసె
లీల నరుదెంచె దీపావళీ మహస్సు.
గోగువత్తులు- దివిటీలు కొట్టడం, కాళ్లు కడుక్కువచ్చి నోళ్లు తీపి చేసుకోవడం- వంటి వన్నీ జరిగితేనే దీపావళి పర్వ సంస్కృతి ఉన్నట్లు. ఆరోజు కూడా రెండుమూడు సినిమాలు చూసి ఊరుకుంటే మనం సంస్కృతిలో జీవించినట్లు కాదు. ‘మధ్యతరగతి మందహాసం’లో సి.నారాయణరెడ్డి ‘దీపం ముట్టిస్తున్నావా’ కవితలో ఒక తరంవారి సామాజిక వెనుకబాటుతనాన్ని ఎండగడుతూ ‘పాప’ ద్వారా వర్తమాన తరంలోని చీకటిని పోగొట్టాలని ఆశిస్తూ...
‘‘దీపం ముట్టిస్తున్నావా! పాపా!
పాపచ్ఛాయలు సోకని పాలవ్రేళ్లతో
దీపం ముట్టిస్తున్నావా పాపా! ముట్టించు నీవైనా ముట్టించు
మట్టి దీపమైనా మనసారా ముట్టించు
... నిండు వెలుగులు కోరుకున్న మాకు 
నీడలే చేతికందుతున్నాయి
ఇంక మేము దీపాలు ముట్టించలేము
చల్లారిపోయిన మా ఆశయగర్భాల్లో
జ్వాలాముఖిని దట్టించలేము
మంచిని వెలిగించలేని భీరువులం మేము
మయసభలో జారిపడ్డ కౌరవులం మేము
ఇరుకులోయల్లో తలదాచుకున్న మేము
ఎలా నవ్వులు పండించగలం
ముట్టించు పాపా దీపం ముట్టించు’’ అన్నారు.
‘అమృతం కురిసిన రాత్రి’లో బాలగంగాధర తిలక్‌ ‘దీపం’ కవిత దీపాల వెలుగుల పార్శ్వాల్ని విప్పి చెబుతుంది.
‘‘దీపాల మధ్య చీకటి మెరిసిపోతుంది’..
దీపం ఆసరాతో చీకటి నైజాన్ని తెలుసుకో..
పాపం ఆసరాతో మానవుని నైజాన్ని తెలుసుకో..
ఎన్నెన్నో ప్రాణాలు! ఇవన్నీ దీపాలు..’’
సమాధి మీద దీపం చావుని వెలిగించి చూపుతుంది.. అంటూ సాగుతుందది.
అగ్నిహంస కవితా సంపుటిలో రాళ్లబడి కవితాప్రసాద్‌ ‘వెలిగే చీకటి’ అని ఒక కవితావచనం రాశారు. అందులోని ‘దీపం కన్న పసిపాప కదా వెలుతురు; మరి చీకటికి కన్నతల్లెవరు? అనే ప్రశ్న జవాబునివ్వదు కానీ వెలితిని గుండెల్లో మిగులుస్తుంది.
దాశరథి ‘ప్రాణదీపం’ కవితలో - 
‘గగనములు పడిపోయి, సాగర
గణము పాతాళమున కింకిన
గాని ఈ ప్రాణ దీపము
కాంతి తగ్గదు, సత్యము’
అంటూ ప్రాణదీపంకి ఉన్నకాంతి ఉన్నతం అంటారు. ప్రాణదీపాల ఆనందాలకే కదా ఈ దీపావళైనా. ఏమైనా, అద్దేపల్లి రామమోహనరావు ‘అంతర్జ్వాల’లో దీపావళి కాదు తిమిరావళి ఖండికలో- 
‘భవిష్యదద్దంలో ముఖం చూసుకుంటే
ఒక కంట్లో సహారా ఎడారీ
ఒక కంట్లో హిందూ మహాసముద్రమూ కనిపించి
రాతివలె స్తంభించిపోయిన
వర్తమాన యువతరం యొక్క బ్రతుకు మెలికలో
ఎక్కడ పడితే అక్కడ చీకటి
ఏ తలుపు తెరిస్తే అక్కడ చీకటి’
అంటూ తిమిరావళిని ఆవిష్కరిస్తూ వారి బతుకుల్లో దీపావిష్కరణలు ఆశిస్తారు.
రసరాజు ‘రసభారతి’ ఖండకావ్యంలో ‘దీపలక్ష్మి’ మన ఇళ్లలోకి రావడం కొన్ని షరతులపై మాత్రమే వస్తుందని మనల్ని ఇలా భయపెడుతున్నారు.
‘‘ద్వార బంధాలపై తోరణమ్ములు కట్టి
స్వాగతం బనిన లాభంబు లేదు
వెండిపళ్లెరమందు పిండివంటలు పెట్టి
ఆతిథ్యమనిన సంప్రీతి లేదు
దివ్వెల తోటలో పువ్వులు పూయించి
సత్కారమనిన హర్షమ్ము లేదు
వైభవంబీనగా బాణసంచా కాల్చి
కనులవిందనిన సౌఖ్యమ్ము లేదు
ముందు-మీ గుండెలందున ముసురుకొన్న
కరడుగట్టిన కటిక చీకటుల దునిమి
వెలుగు జెండాలనెత్తు-డవ్వేళ నేను
‘దీపలక్ష్మి’గ మీ యింట తేజరిలుదు’’
      నిజమే ముందు మనం మన గుండెల్లో కరడుగట్టిన దుష్టభావాల చీకట్లను చీల్చుకోగలిగితే దీపలక్ష్మి మన ఇళ్లకు వస్తుంది. వెలుగు పూస్తుంది. మానవ కల్యాణాన్ని కోరడం కవుల నైజం. వారి నిజ భావాలు ఎందరెందరి కలాల మతాబుల వెలుగుల చిందుల్లోనో ఉంటాయి. ఈ చిందడం కొన్ని చిలకరింపులే, మరెన్నో ఉంటాయి. వెలుగుల కవితలు అనంతం.


వెనక్కి ...

మీ అభిప్రాయం