సీతమ్మ ఆడపడుచు శాంతమ్మ

  • 1357 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। గాది శ్రీనివాస్‌

  • తెలుగు ఉపన్యాసకులు, యన్‌.బి.కె.ఆర్‌. సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కళాశాల,
  • నెల్లూరు,
  • 9989079742
డా।। గాది శ్రీనివాస్‌

ఋష్యశృంగుడికి తన కూతురు శాంతను ఇచ్చి పెళ్లి చేసి, అల్లుడి ఆధ్వర్యంలో దశరథుడు పుత్రకామేష్టియాగం జరిపించాడన్నది వాల్మీకి రామాయణ కథనం. అంతవరకే కానీ, అందులో శాంతకు ఇంకెలాంటి ప్రాధాన్యమూ లేదు. వాల్మీకి రామకథే చెప్పాడు. కానీ, తెలుగు జానపదుల తలపుల్లో మాత్రం రాముడి అక్క శాంత, మరదళ్లు ఊర్మిళ, శృతకీర్తి, మాండవి తదితర పాత్రలు అద్భుతరీతిలో దర్శనమిస్తాయి. మళ్లీ వాటిలో శాంతను అగ్రస్థానంలో ఉంచాయి మన జానపదుల రామాయణపు పాటలు.
నలుగురు తమ్ముళ్లకు అక్క, నలుగురు మరదళ్లకు వదిన శాంతాదేవి. ‘శ్రీరామపట్టాభిషేకం, ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు, కుశలవ కుచ్చల చరిత్రలు, శాంతగోవిందనామాలు’ తదితర జానపదుల పాటల్లో ఈ శాంత పదహారణాల తెలుగింటి ఆడపడుచు. వాటిలో సీత సైతం ‘‘శాంత మరదలా!’’ అనే పిలిపించుకుంటుంది. ఇక రాముడైతే అక్కకు ఇచ్చే గౌరవం అంతాఇంతా కాదు! ‘‘పట్టము గట్టుకొని ప్రభు రాఘవులూ/ శాంతకు మొక్కెను అతిభక్తితోనూ/ అడుగులపైనున్న ఆ రామునెత్తి/ దీవించె శాంతమ్మ దీవెనెలు పెక్కు’’- ఇదీ మన జానపదులు దర్శించిన ఆ అక్కాతమ్ముళ్ల అనుబంధ దృశ్యం! ఇలా మన పల్లె రామాయణాల్లో విశేష ప్రాధాన్యంతో కనిపించే ‘‘దశరథుల కూతురు శాంత మహాదేవి’’ కథను చూద్దాం.
      దశరథుడు సంతానలేమితో చింతిస్తున్నాడు. ‘మీరోసారి ఉత్తర భూమిలోని రుషివర్యుణ్ని దర్శిస్తే ఫలితం ఉంటుందేమో ప్రభూ’ అని భర్తకు సూచించింది కౌసల్య. దశరథుడు ఆయన్ను కలిశాడు. ‘దక్షిణభాగంలో రాజర్షి దంపతుల దగ్గర ఆడపిల్ల ఉంది. తెచ్చి పెంచుకోండి’ అని రుషి చెప్పాడు. మహారాజు సపరివార సమేతంగా ఆ రాజర్షి దంపతుల దగ్గరికి వెళ్లి చేతులు జోడించాడు. ‘‘అరవై వేలేండ్లకు గోవింద రామ/ మాకు ఒక బాల పుట్టింది గోవిందా/ ఆ బాలను ఇచ్చి గోవింద రామ/ యెట్లు మేముందుము గోవిందా’’ అని ఆ రాజర్షి దంపతులు విచారపడుతూనే, దశరథుడి ప్రార్థనకు చలించి ఇచ్చేస్తారు. ఆ బాలికే శాంత. 
‘‘దినదినంబులును శాంత దీప్తి పెరుగుచునుండె’’- ఆమె అపురూప సౌందర్యవతి అయ్యింది. ‘‘ఆ అతివ నవ్విన నవ్వు చంద్రకిరణంబాయె’’! ఓ శుభతరుణంలో శాంతను రుష్యశృంగుడికిచ్చి వివాహం చేశారు. అల్లుడి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేసి పుత్రసంతానం పొందాడు దశరథుడు.
మా మంచి వదినె
ఇంటి పనుల్లో కానీ, రాజకీయాల్లో కానీ శాంతమ్మదే పైచేయి. ఆమెని అడగందే ఏ పని ఎవరూ చేయరు. అచ్చమైన తెలుగింటి పెద్ద ఆడబిడ్డ పెద్దరికమే ఆమెది. అయితే.. ఆడపడుచు అన్న దౌష్ట్యం శాంతకు అంటలేదు. ఆమెకు మరదళ్ల మీదున్న మమకారం మరువలేనిది. ముఖ్యంగా సీతంటే అవధి లేని అభిమానం. జనకమహారాజు సీతను శాంతకు అప్పగించి కన్నీరు పెడుతుంటే ‘‘జనకుడా మీ బిడ్డకేమి కాదువయ్యా- అలరు పాన్పు మీద అమరంగ గలదు’’ అని ఓదార్చుతుంది. సీతమ్మను అలరు పాన్పు మీద ఉంచటమే కాదు, చివరి వరకూ పువ్వులానే చూసుకుంది శాంత.
      ఆడపడుచునని శాంత ఎప్పుడూ అధికారం చెలాయించలేదు. మరదళ్లతో కలిసి ఆటలాడేది. ఓరోజు సీతతోపాటే ఊర్మిళ, మాండవి, శృతకీర్తిలను కూడా పిల్చుకుని ఆడుతోంది శాంత. అప్పుడు రాముడు అక్కడికి వచ్చాడు. ‘నీకేం పనిరా ఇక్కడ’ అంది అక్క. ‘ఆట చూస్తున్నా’ అన్నాడు తమ్ముడు. మరదళ్లను పంపేసి సీతారాముల్ని ‘దాగుడుమూతలు’ ఆడమంది శాంత. కనుసైగతో సీతకు రాముడు దాక్కున్న ప్రదేశం చెప్పింది. సీతను గెలిపించింది. కోట్ల ధనమియ్యమని రాముణ్ని అడగమని సీతకు చెప్పింది. ‘అక్కా.. నువ్వు చెప్పావు కాబట్టి సీత గెలిచింది. నేనేమీ ఇవ్వను’ అన్నాడు రాఘవుడు. 
      సీత గెలవడంతో రాముడు ఉడికిపోయాడు. ‘‘ఎంతదానవే జానకి నీవు’’ అంటూ ఆమె చిన్నప్పుడు శివధనుస్సును ఎత్తటం నుంచి ప్రారంభించి దెప్పిపొడవడం మొదలుపెట్టాడు. సీత కన్నీరు పెట్టింది. శాంతకు తమ్ముడి వరస నచ్చలేదు. ‘‘చిన్నవాడవా రాఘవా నీవూ/ సీతతోను పంతములేలర/ ఆడమన్నదా జానకి నిన్నూ/ ఓడమన్నదా జానకి నిన్ను/ ఆడవారితో ఆడగనేలా/ ఓడిన ధనమడిగితే కోపములా’’ అని కేకలేసింది. చివరికి తమ్ముణ్ని చేరదీసి ‘‘రామా నీదు ధనము కాద రామసీత’’ అంటూ సమాధానపరిచింది.  
అక్క వచ్చింది!
శ్రీరామ పట్టాభిషేక సమయంలో హనుమంతుడితో శాంతకు కబురుపెట్టాడు రాముడు. ఆమె ముత్యాలపల్లకి ఎక్కి వచ్చింది. అక్కకు ఆ అన్నదమ్ములు ప్రదక్షిణ చేసి, సాష్టాంగ నమస్కారాలు చేశారు. శాంతకు గద్దె పెట్టించి కొలువై కూర్చున్నాడు రాముడు. అలంకరించుకుని తనను చూడవచ్చిన మరదళ్లను చూసి శాంత ‘‘తొడుగులు తెమ్మనవే జానకి వీరికి’’ అని ఆజ్ఞాపించింది. గౌతముడిచ్చినవి, అగ్నిహోత్రుడు తెచ్చినవి ఏరి ఏరి మరదళ్లకు అలంకరించింది. ‘‘ఇరుపక్కల మరదళ్లు- సురటి (విసనకర్రలు) విసురువారు, చందనము పూయు వారొకరు, ఆకుమడిచి ఇచ్చేవారొకరు, చుక్కలలో చంద్రునివలే కూర్చున్న మన అక్క చూడు’’ అని శతృఘ్నడికి చూపించాడు శ్రీరాముడు.
      పెద్దలందరూ భోజనాలు చేయడానికి గద్దెలు ఏర్పాటు చేసి వడ్డిస్తోంది శాంత. రాముడు ఆమెను పిల్చి బావకు వడ్డించమని హెచ్చరించాడు. ‘‘అక్కా! రుష్యశృంగునకు చాల వడ్డించు’’ అంటూ బావగారి మీద ప్రేమాభిమానాలను చాటుకున్నాడు. మగవాళ్ల భోజనాలయ్యాక సీత శాంతను రత్నపీఠం మీద కూర్చోబెటి,్ట తాను ముత్యాల గద్దె మీద కూర్చుంది. మొత్తమ్మీద శాంత, సీత, ఊర్మిళ, శృతకీర్తి, మాండవి సహపంక్తిలో ఆరగించారు. అప్పుడు ఆ వదినామరదళ్ల ముచ్చట్లెన్నో...
ఇద్దరికిద్దరే
పద్నాలుగేళ్లు నిద్రలో ఉన్న ఊర్మిళ మీద శాంత దృష్టిపడింది. ఇక ఆమెతో చతుర్లు మొదలెట్టింది. ‘ఓ ఊర్మిళాదేవి పద్నాలుగేళ్లు అన్నపానాదులు లేవు కదా నీక్కూడా. పాయసం, మేలైన పిండివంటలను సంతుష్టిగా తిని సరయూ నది నీళ్లను ప్రీతిగా తాగు. లక్ష్మణుడు అడవి నుంచి వచ్చాడు కదా. ఇక విచారమే లేదు. ఈ రాత్రికి నీకు నిద్ర ఉండదు. సౌమిత్రితో సరసమాడాలి కదా’ అంది. ఊర్మిళ సిగ్గుతో నవ్వినా, చెల్లెల్ని అన్నందుకు మాటకు మాట అప్పగించింది సీతమ్మ. ‘‘సతుల రూపెరుగనీ రుషి తల్పమందూ/ రుష్యశృంగులూ అన్న విభ్రమ నుండి/ ముగ్ధరాలవుచున్న ముగ్ధవో వదినే/ బుద్ధి నీ వెనక సుమ్ము...’’- శాంతతో పెళ్లికాక మునుపు రుష్యశృంగుడికి స్త్రీలంటే తెలియదట. అతనికోసం దశరథుడు అప్సరసలను పంపితే, ‘నాకు తలపై ఒక్క కొమ్ము మాత్రమే ఉంది మీకు రెండు కొమ్ములెలా వచ్చా’యని వారి వక్షోజాలను చూసి అడుగుతాడు. ‘‘రెండు కొమ్ములు ఉండె- వీరెట్టి తాపసులో- ఏ పూజ చేసిరో’’ అని ఆశ్చర్యపడతాడు. ‘‘రెండు కొమ్ములూ మీకు ఏ రాజు ఇప్పించె- ఈశ్వరుడిచ్చినాడా బ్రహ్మ ఇచ్చినాడా’’ అని ప్రశ్నిస్తాడు. మరి అలాంటి వాణ్ని వలపించుకున్న పెద్దమనిషివి నీతో మేమేం మాట్లాడగలమమ్మా వదినమ్మా అని సీత సమాధానమిచ్చింది. 
      అక్కడితో వదులుతుందా శాంత. ‘పద్నాలుగేళ్లు సొలసినా నీ చెల్లెలికి కళ తరగలేదు. కుందనపు ప్రతిమ కళలూ ఈ కళలు! దిష్టి తగలకుండా నీలాల నివ్వాళులివ్వరమ్మా’ అంది. సీత వెంటనే ‘‘మా చెల్లెళ్లకేల? లోకముల వలపించు మీ తమ్ములకే దిష్టి తగలకుండా నీలాల నివ్వాళులివ్వండ’’ని చెప్పింది. తమ్ముళ్లను అనేసరికి శాంతకు పౌరుషం పొడుచుకొచ్చింది. ‘‘అక్కాచెల్లెండ్రు మీరు మిక్కిలి సౌందర్యశాలురమ్మ/ మా తమ్ముల నలుగురినీ వలపించు జాణలకు దిష్టితగులూ’’ అంది. వలపించు జాణలనడంతోనే సీత మళ్లీ వడ్డించింది. ‘మాయన్న రుష్యశృంగుడు ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే అమాయకుడు. అలాంటి వాణ్ని, ఏమీ ఎరుగని తాపసిని ఓ వదినా కేళించి విడిచావు’ అంటూ రుష్యశృంగుణ్ని సంసారబంధాల్లో తెచ్చి పడేసిన జాణవు నువ్వు కాదా అని మాటకు మాటేసింది. శాంతకు సమాధానమివ్వగలిగిన మరదలు సీత మాత్రమే. ఆ వదినామరదళ్ల హాస్య సంభాషణలు జానపదుల హృదయాల్లోని సుకుమార భావ సంపదకు తార్కాణాలు.
తమ్ముడే అలా అంటే...?!
సీతారాముల అరణ్యవాసం ముగిసిన తర్వాత ఊరందరూ క్షేమ సమాచారాలు అడగడానికి వచ్చారు. సీతకు పిల్లలు లేరని బాధపడిన శాంత వచ్చిన వారిని ‘‘ముద్దుల సుతులు కలుగునట్లుగా దీవెనలీయుడి’’ అని వేడుకున్నది. రాముడు జానకి కోసం అంతఃపురానికి వస్తే ‘‘ఏమిరా తమ్ముడా జానకిని క్షణమైనా ఎడబాయకున్నావు/ అడవులలో జానకిపెట్టిన మందులు తలకెక్కినవా’’ అని హాస్యమాడింది.
      ఒకరోజు సీత శాంతతో ముచ్చట్లాడుతూ రాముడి దగ్గరికి వెళ్లలేదు. ఆయనకి కోపం వచ్చింది. వెంటనే తన అస్త్రాలను అతివలుగా చేశాడు. వారు ‘‘వేడుకతో వింజామర విసరుచూ/ ఆకుముడుపు అందిచ్చుచునూ/ పాదములొత్తుచు శ్రీరాములకు/ కూడియుండి శ్రీరామునితోడు’’! భర్తతో ఉన్న ఆ స్త్రీలను చూసి సీత ఏడ్వసాగింది. విషయం తెలిసిన శాంత తమ్ముణ్ని మాటలతో దండించి, సీతకు సత్యం తెలియజేస్తుంది. అవనిజ అంటే ఆమెకు ప్రాణం.
      సీతను అనుమానించిన రాముడు, ఆమెను చంపమని లక్ష్మణుణ్ని ఆదేశిస్తాడు. విషయం తెలిసి శాంత పరుగు పరుగున  వస్తుంది. ‘సీతకే పాపం తెలియదు. నువ్వు సూర్యవంశానికి చెందినవాడవు.. నీ క్షత్రియ ధర్మం ఇంతేనా’ అని తమ్ముణ్ని నిలదీస్తుంది. దానికి రాముడు ‘‘కూటికి వచ్చిన బాపన పడుచువు కూతలేటికే అక్కరో!’’ అంటూ మాట జారతాడు. అలా అంటూనే కంచాలూ ముంతలూ తీసుకెళ్లమంటాడు. చివరికి తన మాటకు విలువ లేకుండాపోయిందని మరదళ్ల దగ్గర విలపిస్తుంది శాంత.
నన్నూ చంపేయండి!
సీతను సంహరించి వచ్చానన్న లక్ష్మణుడితో, ఆమెకు దినావారాలు ఎలా చేయాలో చెప్పడానికి శాంతను పిల్చుకు రమ్మంటాడు రాముడు. ‘సీతను అడవికి పంపేముందు నాతో ఆలోచించారా? పంపిన వాడు రాఘవుడు. చంపిన వాడివి నువ్వు. దినావారాలు మీరే చేసుకోండి’ అని నిష్కర్షగా చెబుతుంది శాంత. మరదల్ని చంపించిన తమ్ముణ్ని ఆమె క్షమించలేకపోయింది. ధర్మోదకాలు విడిచే సమయంలో నదీతీరంలో శాంత దుఃఖాన్ని తీర్చలేకపోయారట. ముత్తయిదువలకు అక్షతలు వేయడం ఎలాగో తెలపమని  రాముడు మళ్లీ శాంతను పిలిచాడు. ‘‘చంపిన చేతుల తోడనే/ చేతులారగ చెయ్యుడి మీరే’’ అని ఆమె సమాధానమిచ్చింది. ఆమె క్రోధం ఇంకా చల్లారలేదు. ఆ రాత్రి లక్ష్మణుడు అక్క చెంతకు వచ్చాడు. ‘నీది సూర్యవంశమైతే, అన్నమాట తప్పనివాడవైతే సీతను చంపిన ఆయుధంతో నన్నూ చంపు’ అంటుంది. ఇలాంటి ఆడబిడ్డ తెలుగు జానపదుల సృష్టిలో తప్ప ఇంకెక్కడైనా ఉంటుందా!! సీత కోసం శాంత మంచం పట్టింది. నిద్రాహారాలు మానేసింది. ‘నా నేరం మన్నించక్కా. నువ్వు తినందే నేను తినను’ అన్నాడు రాముడు. శ్రీరామచంద్రుడి కంటే శాంతే సీతను ఎక్కువగా ప్రేమించిందనిపిస్తుంది జానపదుల కథనాల్ని వింటే! 
      శాంతకు సీత మీదున్న అభిమానం ఎంతటిదో భరతుడికి తెలుసు. అందుకే సీతకు తనయులు కలిగినారని అక్కకే ముందుగా తెలుపుతూ, మా వదిన జీవించే ఉందని చెప్పాడు. అంతేకాదు, సంతోషకరమైన వార్త తెచ్చినందుకు అక్కను కట్నమడిగాడు కూడా. తర్వాత మునిపల్లెలో వారు పురిటి నూనె పంచడానికి వచ్చారు. వాళ్లను శాంత చాటుకు పిలిచి ‘సీతకు తల్లితండ్రి సమస్తం మీరే’ అని కన్నీళ్లు పెట్టుకుంది. పసిపిల్లలను ఎత్తుకుని మునిపల్లెలో ఉన్న సీత ‘‘యే విధమున లాలించునో శాంత’’ అని చింతించింది. జోలపాడుతూ ‘‘బంగారు గిన్నెలో పాలు నెయ్యి పోసి శాంతమ్మ మేనత్త వచ్చెనేడువకు’’ అని కుమారులను జోకొట్టింది. 
      గతంలో తనకు చెప్పకుండా సీతను అడవికి పంపించినపుడు శాంత తీవ్రంగా కోపించిన విషయం రాముడికి గుర్తుంది. అందుకే కుశలవులతో యుద్ధానికి బయల్దేరే ముందు అక్క దగ్గరికే వెళ్లాడు. ‘తమ్ముళ్లు ముగ్గురూ యుద్ధంలో ఓడిపోయారు. ఇక నేనే వెళ్తున్నా. దీవించు’ అన్నాడు. ‘‘తమ్ముళ్లతో కొలువై సీతతోటి సింహాసనమెక్కి రాజ్యమేలగలవు’’ అని దీవించిందామె. యుద్ధానికి ఏగే రాముడు ‘‘శాంతకు తమ్ముడ’’నని భేరీ వేయించాడట! అదీ శాంత గొప్పదనం. 
సొంత ఆడబిడ్డ లానే...
జానకి తన తనయులతో వస్తోందన్న వార్త శాంతకు చెప్పడానికి అందరూ ఆతృతతో ఉన్నారు. ఇంతలో రుష్యశృంగుడు ‘జానకి సుఖంగా ఉందని నేను చెప్పినా నువ్వు నమ్మలేదు. నేడు చూస్తావుగా.. నాకేమిస్తావు’ అన్నాడు భార్యతో. ‘వెన్న అరిసెలు, అప్పడాలు చేసి పెడతాలెండి’ అన్నది శాంత సమాధానం. ఇక్కడ కూడా అచ్చమైన తెలుగు పిండివంటలే.  
      సీత అయోధ్యకు వచ్చింది. పిల్లల్ని చూసి అందరూ ముగ్ధులయ్యారు. తన మేనల్లుళ్లకు ఎంత దిష్టి తగులుతుందో అనుకుంటూ వాళ్లని లోపలకి తీసుకెళ్లమంది శాంత. ఆమె భయం పసిగట్టిన స్త్రీలు ‘‘జానకి తనయులకు చారెడు వరహాలు దిగదుడిచి శాంతా నీవు మాకందరికీ యియ్యవే’’ అన్నారు. ‘‘అడువుల తిరిగే నా తనయులకు అంగరక్షలెందుకు? శాంత తమ్ములకు తీయుడు’’ అంది సీత. శాంత వెంటనే ‘‘మా తమ్ములకేల? అక్కాచెల్లెళ్లు చక్కనివారు మీకే దిగదుడుచుతా’’నని జానకితో సరసమాడింది. ఈ వదినా ఆడబిడ్డల ప్రేమాప్యాయతలు ఎనలేనివి.  
      మన జానపద రామాయణ లతకు ఆద్యంతాలు లేవు. వాళ్ల దృష్టిలో సీతారాములు అవతార పురుషులు కాదు. తమ జీవితమే వారి జీవితం. తమ కష్టసుఖాలే వారి సుఖదుఃఖాలు. తమ ఆడబిడ్డ ఎలా ఉండాలని కోరుకుంటారో... ఆ ఉదాత్త లక్షణాలనే వాళ్లు శాంతకు ఆపాదించారు. ఆ పాత్రను అంత గొప్పగా మలిచారు. ఏదిఏమైనా మనవాళ్లు ‘అక్షరాలా’ శ్రీరామ సహోదరిని ఎలా చూసుకున్నారంటే...
శాంతను తోడుకవచ్చి గోవిందా
అంబారిలో ఉంచే గోవిందరామ
జయభేరి వేసిరి గోవిందా
జగమెల్ల మోగెను గోవిందరామ! 


వెనక్కి ...

మీ అభిప్రాయం