స్వభాషాభిమానమే జాతికి జీవగర్ర

  • 259 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పెనికలపాటి రమేశ్‌

  • గుంటూరు,
  • 8008554784
పెనికలపాటి రమేశ్‌

ఎనిమిది సదస్సులు... ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వంద మందికిపైగా సాహితీవేత్తలు... అమ్మభాషాభివృద్ధి మీద చర్చోపచర్చలు... జానపద కళాప్రదర్శనలు... విద్యార్థుల  ‘తెలుగు నడక’లు... ఇలా ఉత్సాహపూరిత  వాతావరణంలో మూడు రోజుల పాటు గుంటూరు జిల్లా తెనాలి మైమరిచిపోయింది. 
తెలుగు సాహితీవనానికి వసంత హరితాన్ని అద్దిన అక్షరక్షేత్రం తెనాలి.  మహామహు లైన ఎందరో రచయితలతో పేగుబంధం ముడివేసుకున్న గడ్డ ఇది. ఇక కళారంగంలోనైతే ఈ ప్రాంత జ్యోతిశిఖలు జగజ్జేయమానాలు. ఈ విశిష్ట వారసత్వాన్ని స్మరించుకుంటూ జనవరి 26, 27, 28 తేదీల్లో ‘తెలుగు సాహిత్య మహోత్సవం- 2018’కి ఆతిథ్యమిచ్చిందీ పట్టణం. ఆంధ్ర ప్రదేశ్‌ భాషా, సాంస్కృతిక శాఖ సహకారం తో తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ నిర్వహించిన ఈ వేడుకల్లో విస్తృతస్థాయి మేధోమథనాలు జరిగాయి.
      తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలోని బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ ప్రాంగణం ఈ సాహిత్య మహోత్సవానికి వేదికైంది. ఈ మూడు రోజుల్లో ‘బాల సాహిత్యం, మహిళా సాహిత్యం, మాండలికాలు, భాష- సమాజ వికాసం- పౌరబాధ్యత, భాషా వికాసంలో సాహితీ ప్రక్రియలు, తెనాలి సాహితీ- చారిత్రక- కళావైభవం, భాషా వికాసంలో ప్రసారమాధ్యమాల పాత్ర, భాషాభివృద్ధిలో ప్రభుత్వం పాత్ర’ల మీద సదస్సులు జరిగాయి. కె.శివారెడ్డి, నగ్నముని, ఇనాక్‌, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, అలపర్తి వెంకట సుబ్బారావు, రెడ్డి రాఘవయ్య, ఎండ్లూరి సుధాకర్‌,  దేవీప్రియ, వెన్నా వల్లభరావు, డా।। పాటిబండ్ల దక్షిణామూర్తి, గుమ్మా సాంబశివరావు, ఆచార్య చందు సుబ్బారావు, ఎస్‌.చెల్లప్ప, డా।। కె.వి.కృష్ణ కుమారి, సామల రమేష్‌ బాబు, చొక్కాపు వెంకటరమణ, డి.సుజాతాదేవి, దాసరి వెంకటరమణ తదితరులు వీటిలో భాగస్వాములయ్యారు. ప్రజాప్రతినిధులం దరూ మాతృభాష కోసం ముందడుగు వేయాలని వక్తలు ఆకాంక్షించారు.  పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో అన్యభాష పదాల వాడకం పెరిగిందని ఆక్షేపించారు. సామాజిక మాధ్యమాల మీద నియంత్రణ లేకపోవడంతో ఎదుటివారిని విమర్శించే క్రమంలో కట్టుతప్పి భాషకు మరింత నష్టం చేకూరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  పిల్లలు అయిదోతరగతి వరకు తెలుగులోనే చదువుకోవాలని, ఆ తర్వాత ఇంటర్‌ వరకు తెలుగును తప్పనిసరి పాఠ్యాంశం చేయాలని సూచించారు. 
విద్యార్థుల భాగస్వామ్యం
మహోత్సవాల తొలిరోజు ఉదయం ‘తెలుగు కోసం నడక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని రణరంగ చౌక్‌ నుంచి కళాక్షేత్రం వరకు నిర్వహించిన ఈ నడకలో భారీసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రసిద్ధ కవులు, సాహితీ మూర్తులు, తెలుగు జాతికి తరగని వన్నె తెచ్చిన మహనీయుల వేషధారణతో పిల్లలు ఆకట్టుకున్నారు. వందల మంది కళాకారులు జానపద కళారూపాలను ప్రదర్శించి, వాటి వైభవాన్ని నవతరానికి కళ్లకు కట్టారు. ప్రారంభ ఉత్సవాలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిÅగా విచ్చేశారు. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘తెలుగు పొలాలకు జలములొసంగి... తెలుగుజాతికి వెలుగునిచ్చిన కృష్ణవేణి తల్లీ నీకు నా నమస్సుమాంజలులు’’ అంటూ ప్రారంభించిన జస్టిస్‌ రమణ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న భాషా చైతన్యం తెలుగునాట కనపడట్లేదు. భాషాభిమానం, జాతీయాభిమానం లేకపోవడం ప్రమాదకరమని ఆయన చెప్పారు. స్వభాషాభిమానం లేని జాతి ముందుకు సాగదని మండలి బుద్ధప్రసాద్‌ కూడా హెచ్చరించారు. 
ప్రారంభ సమావేశంలో పాల్గొన్న సినీ పాటల రచయిత జొన్నవిత్తుల.. తెలుగు భాష మాధుర్యాన్ని గేయరూపంలో వివరించారు. ‘‘గుణింతాలలో కనబడు సంగీతవాద్యాలు/ అక్షరాలలో వినబడు అమృత మధుర నాదాలు/ తలకట్టే సన్నాయి/ దీర్ఘమే ఏక్తారా/ గుడీ కొమ్ము కుడిఎడమల తబలా/ కొమ్ము దీర్ఘమే వీణ/ వట్రసుడి తంబుర/ ఈత్వమే మ్యాండీలీను/ ఔత్వమే శాక్సాఫోను/ ఐత్వమే వేణువు/ విసర్గ శంఖం/ ఏత్వము వాయులీనము/ ఓత్వం జలతరంగిణి/ సున్నాయే ఘటము/ ఈ చిహ్నాలకు ప్రణామం’’ అంటూ సాగిన ఆయన ఆలాపనకు సభలో చప్పట్లవర్షం కురిసింది. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి అధ్యక్షులు గ్రంథి భవానీ ప్రసాద్‌, రాష్ట్ర ప్రభుత్వ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు డి.విజయ భాస్కర్‌ తదితరులూ ప్రసంగించారు. 
వెలిగిన స్ఫూర్తి జ్యోతులు
ఈ మహోత్సవాల్లో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ చేసిన శ్రీకృష్ణదేవరాయలు ఏకపాత్రాభినయం అందరినీ ఆకట్టుకుంది. కోకా విజయలక్ష్మి బృందసభ్యుల ‘తెలుగు ప్రశస్తి’ కళారూపం అలరించింది. గుంటూరు జిల్లాలోని తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆన్‌డ్యూటీ మీద ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రభుత్వం అనుమతించింది. కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి సదస్సుల్లో పాల్గొన్నారు. తమిళనాడులో ఆదాయపన్ను శాఖ కమిషనర్‌గా ఉన్న మోర్త శ్రీనివాసరావు లాంటి భాషాభిమానులూ ఈ వేడుకలకు హాజరయ్యారు.
      చివరి రోజు 25 మందితో యువ కవి సమ్మేళనం నిర్వహించారు. సాయంత్రం ముగింపు సభకు రాష్ట్ర సాంఘిక, గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌,   గొల్లపూడి మారుతీరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యులు పెద్ది రామారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. నవతరం అమ్మభాష వైపు దృష్టి మరల్చేలా చేయడంలో ఈ ఉత్సవాలు విజయవంతమయ్యాయి. అయితే.. వీటిలో శతాధిక వక్తలు చేసిన సూచనలు ఆచరణ రూపం దాల్చి, ఆమేరకు భాషాభివృద్ధి జరిగితేనే ఈ వేడుకలకు నిజమైన సార్థకత లభిస్తుంది. 


తెలంగాణలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలను చూసిన తర్వాత సాహిత్య, భాషాభివృద్ధికి మేలు చేసేలా ఓ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాను. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను కలసి ఆలోచనను పంచుకున్నాను. అలా ఈ ఉత్సవాలు కార్యరూపం దాల్చాయి. భాష లేకపోతే జాతి మనుగడ కష్టమనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో వీటిని నిర్వహించాం.

- ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 


తెలుగునాట కనీసం పదోతరగతి వరకు తెలుగును బోధించాలి. పద్యాలు, కవితలు నేర్చుకుంటే విద్యార్థుల్లో సృజనాత్మకశక్తి పెరుగుతుంది. తమిళ నాడులో మాతృభాష మీద మమకారం ఎక్కువ. అది వాళ్ల ఆచరణలోనూ కనిపిస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా సరే, అక్కడి మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలి. అఖిలభారత సర్వీసు అధికారిని కావడంతో ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర భాషలో నా విధులు నిర్వర్తించడానికి కృషి చేస్తుంటాను. వారానికోసారి పంచెకట్టుతో కార్యాలయానికి వెళ్తాను.

- మోర్త శ్రీనివాసరావు


ఉభయ తెలుగు రాష్ట్రాల భాషా, సాహిత్య వారసత్వాన్ని ఉభయులం కలసి కాపాడుకుందాం. తెలుగుజాతి మనది... రెండుగ వెలుగుజాతి మనది అని చాటుదాం. తెలంగాణలో 1 నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషా బోధనను తప్పనిసరి చేశాం. అదే విధంగా నవ్యాంధ్రలోనూ చేస్తారని ఆశిస్తున్నాను.

 - ఆచార్య ఎస్వీ సత్యనారాయణ


 


వెనక్కి ...

మీ అభిప్రాయం