పల్లె పాటల పెన్నిధి

  • 197 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చందలూరి నారాయణరావు

  • అద్దంకి

ప్రజల నిత్య జీవితంలోని మాటలనే తన జానపద గీతాలకు మూటలుగా మలచుకున్న ప్రతిభాశాలి సాత్పాడి ప్రభాకర్‌. ఆయన స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్‌. చిన్నప్పటి నుంచి సిద్దిపేటలో పెరిగిన ఆయన కళాశాల స్థాయినుంచి జానపద పాటలను పాడటంలో పట్టు పెంచుకున్నారు. 20 ఏళ్ల వయసు నాటికే ఊళ్లల్లోని జీవన విధానాలను స్వయంగా గమనించి పాటలు రాస్తూ, వాటికి బాణీలు కూర్చి వేదికలపై పాడుతూ గుర్తింపు పొందారు. అప్పటి సామాజిక పరిస్థితులు, పల్లె జనుల వెతలు, శ్రామిక జీవన విధానాలు సహా అన్నివర్గాలను జాగృతపరిచేలా చైతన్యగీతాల్ని తన గొంతునుంచి వినిపించారు. వాటిలో కొన్ని పాటలు ఆయన రాసినవి కాగా, చాలా భాగం సేకరించినవి. సిద్దిపేటకు చెందిన సుప్రసిద్ధ చిత్ర కళాకారుడు కాపు రాజయ్య ప్రోత్సాహంతో కాలికి గజ్జెకట్టి జనచేతనం కోసం గళం విప్పారు ప్రభాకర్‌. యువ కళాకారుల్ని తన బృందంలో చేర్చుకుని వారికి పాటలోని మాధుర్యాన్ని నూరిపోశారు. ఎం.ఏ, ఎంఫిల్‌ చదువుకున్న ప్రభాకర్‌ 1981 నాటికి ఆకాశవాణిలో బి-గ్రేడ్‌ కళాకారుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో జాతీయ స్థాయి జానపద ఉత్సవాలకు నెహ్రూ యువ కేంద్రం తరఫున వెళ్లి ప్రథమ బహుమతిని అందుకున్నారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నుంచి దిల్లీలోని ఆంధ్రాభవన్‌లో ఉగాది పురస్కారాన్ని పొందారు. రెండేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ కళాకారుడి పురస్కారం అందుకున్నారు. సుమారు వెయ్యివరకు ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతి, జానపద సాహిత్య కీర్తిని ఎల్లలు దాటించిన ఈ కళాకారుడి గొంతు ఈ జనవరి 18న శాశ్వతంగా మూగబోయింది.  

- తుమ్మల శ్రీనివాస్‌, సిద్దిపేట
 


వెనక్కి ...

మీ అభిప్రాయం