మర్చిపోలేని గురువు

  • 224 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చందలూరి నారాయణరావు

  • అద్దంకి

చలన చిత్ర పరిశ్రమలో ఖ్యాతి గడించిన ఎందరో నటులను తీర్చిదిద్దిన గురువు లక్ష్మీదేవి కనకాల. పదకొండేళ్ల వయసులో నాటక రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ప్రముఖ నాటకోద్యమ కర్త ఎ.ఆర్‌.కృష్ణ దగ్గర శిక్షణ పొందారు. ‘కన్యాశుల్కం’లో బుచ్చమ్మ పాత్ర పోషించారు. తర్వాత సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాలను వివాహమాడారు. భర్తతో కలిసి మద్రాసు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో నట శిక్షకురాలిగా పనిచేశారు. అక్కడే చిరంజీవి, రజనీకాంత్‌, రాజేంద్రప్రసాద్‌ లాంటి వారిని దిద్దితీర్చారు. అడయార్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో కూడా ఆమె శిక్షకురాలిగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాదులో దేవదాస్‌ కనకాల స్థాపించిన ఫిలిం ఇనిస్టిట్యూట్‌ ప్రధానాచార్యులుగా ఎంతో మందికి నటనలో మెలకువలు నేర్పించారు. ‘ప్రేమబంధం’, ‘ఒక ఊరి ప్రేమకథ’, ‘మాస్టారి కాపురం’, ‘పోలీస్‌ లాకప్‌’, ‘కొబ్బరి బోండాం’ తదితర చిత్రాల్లోనూ ఆమె నటించారు. సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించిన లక్ష్మీదేవి ఈ ఫిబ్రవరి 3న గుండెపోటుతో హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆమె కుమారుడు రాజీవ్‌ కనకాల, కుమార్తె శ్రీలక్షి కూడా నటులే. కోడలు సుమ వ్యాఖ్యాతగా రాణిస్తున్నారు. ‘‘పేరుకు ఆమె లక్ష్మీదేవి అయినా నా పాలిట సరస్వతీ దేవి. నటనలో ఆమె నేర్పిన మెలకువలే నన్ను ఈ స్థాయికి చేర్చాయి’’ అంటూ నటుడు చిరంజీవి తన గురువుకు నివాళి అర్పించారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం